ఇంతగా సాష్టాంగపడాలా?

10 Sep, 2019 01:06 IST|Sakshi

సందర్భం

ప్రస్తుతం ప్రపంచంలో నడుస్తోన్న వాణిజ్య యుద్ధాలు అందరికీ తెలిసినవే. వీటిని ఆరంభించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌. ఆయన ప్రధాన టార్గెట్‌ చైనాతో అమెరికాకున్న భారీ వాణిజ్య లోటును తగ్గించుకోవడం. కానీ, చైనాతోపాటు మెక్సికో, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలూ, భారత్‌తో సహా ప్రపంచంలోని పలు ప్రాంతాలూ, దేశాలూ ఇవాళ ట్రంప్‌ వాణిజ్య యుద్ధ పరిధిలో ఉన్నాయి. అమెరికా ఇన్నేళ్లుగా ప్రపంచంలో ప్రధాన వినియోగదారు, దిగుమతిదారుగా ఉంది. అమెరికా నుంచి ప్రపంచ దేశాలకు జరిగే ఎగుమతులు ఆయుధాల అమ్మకం వంటి వాటికే పరిమితం. అంటే అమెరికా చేసే ఎగుమతులకన్నా, ఇతర దేశాల నుంచి అది చేసుకునే దిగుమతులు అనేక రెట్లు అధికం.

తన కరెన్సీ డాలర్‌కు ఉన్న పలుకుబడితో, బలంతో అమెరికా ఈ వ్యవస్థను ఇన్నాళ్లూ కొనసాగించగలిగింది. కానీ, 2008 ప్రపంచ ఆర్ధిక, ఫైనాన్స్‌ సంక్షోభం  అమెరికా అంతర్జాతీయ ఆధిపత్యానికీ, అస్తిత్వానికే ముప్పు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే 2016లో అమెరికా అధ్యక్షుడైన ట్రంప్‌ కొద్ది కాలానికే ఇతర దేశాల సరుకులపై భారీ సుంకాలు అనే ఆయుధంతో విరుచుకుపడ్డాడు. వాషింగ్‌మెషీన్‌లు మొదలుకొని ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాల పెంపుతో తన వాణిజ్య యుద్ధం మొదలుపెట్టాడు. తద్వారా, ఈ సరుకులు అమెరికాలో ఖరీదైనవిగా మారి, ప్రత్యామ్నాయంగా వాటి ఉత్పత్తి అమెరికాలోనే జరుగుతుందనీ, దాని వలన అమెరికాలో ఉపాధి కల్పన కూడా పెరుగుతుందనేది ట్రంప్‌ వాదన. అలాగే విదేశాలకు తరలిపోయిన అమెరికా పరిశ్రమలు తిరిగి అమెరికాకు వచ్చేస్తాయన్నది కూడా ఆయన ఆశ. 

ఈ ఆలోచనలతోనే గత కొంతకాలంగా ఆయన చైనాతో భారీ స్థాయి వాణిజ్య యుద్ధానికి దిగాడు. ఈ క్రమంలో చైనా కూడా అమెరికా సరుకులపై దిగుమతి సుంకాలను పెంచేసింది. అలాగే మెక్సికో, యూరోపియన్‌ యూనియన్‌తో కూడా ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి దిగాడు. భారత్, టర్కీ వంటి దేశాలకు 1970లలో కల్పించిన ‘‘జనరలైజ్డ్‌ సిస్టం ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌’’ అనే ఎగుమతుల వెసులుబాటును (అమెరికాకు ‘సున్నా’ శాతం సుంకాలతో ఎగుమతులు చేసుకొనే అవకాశం)  రద్దు చేశాడు. ఈ రకంగా నయానా, భయానా అమెరికా దేశాన్ని తిరిగి ప్రపంచ నంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టాలనేది ట్రంప్‌ ప్రయత్నం.

కాగా, ప్రపంచంలోని అతి పెద్ద వినియోగ మార్కెట్‌గా ఉన్న అమెరికాలోకి వచ్చే విదేశీ సరుకులపై టారిఫ్‌ల (సుంకాలు) పెంపు యుద్ధం ప్రకటించినా ఇప్పటికీ అమెరికా వాణిజ్యలోటు అనేక దేశాలతో పెరిగిపోతూనే ఉంది. ట్రంప్‌ ప్రధాన టార్గెట్‌ అయిన చైనా దేశం ఎగుమతులు, వాణిజ్య యుద్ధం మొదలైన అనంతరం 2018లో అమెరికాకు ఒక శాతం మేర పెరిగాయి. కాగా, ట్రంప్‌ ఆశలకు భిన్నంగా చైనాకు అమెరికా ఎగుమతులు మాత్రం 21% అంటే 33 బిలియన్ల డాలర్ల మేరన పడిపోయాయి. ఫలితంగా, ట్రంప్‌ వ్యూహం బెడిసికొట్టి  చైనాతో అమెరికా వాణిజ్య లోటు మరింత పెరిగింది. అలాగే  అమెరికాకు అధికంగా ఎగుమతులు చేసే దేశాలలో మరొకటైన మెక్సికోతో సహా ప్రపంచంలోని మిగతా అనేక దేశాలతో కూడా అమెరికాకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. 

కాగా, ట్రంప్‌ బెదిరింపులు, హూంకరింపులు ప్రపంచంలోని వేళ్ళ మీద లెక్కించగల కొద్ది దేశాలను మాత్రం అదరగొట్టాయి. వాటిలో దక్షిణ కొరియాతో పాటుగా, భారత్‌ కూడా ఉండటం గమనార్హం. వాణిజ్య యుద్ధాల ముందరి నుంచే (2017 నుంచి) అమెరికాతో భారత్‌కు ఉన్న వాణిజ్య మిగులును తగ్గించుకునే ‘‘కృషి’’ లో మన ప్రభుత్వం నిమగ్నం అయింది. ఆయుధాలు, ఇంధన దిగుమతుల ద్వారా అమెరికాను మెప్పించే పనిలో మన పాలకులు బిజీ అయ్యారు. సరుకుల దిగుమతులలో భారత్‌తో అమెరికా వాణిజ్యలోటు, 2017లోని 22.9 బిలియన్ల డాలర్ల నుంచి, 2018లో 21.3 బిలియన్ల డాలర్లకు తగ్గింది. అంటే, మన దేశంతో అమెరికా వాణిజ్య లోటు 2017–18 కాలంలో 7% మేరన (1.6 బిలియన్లు) తగ్గింది. ఈ మధ్యన ఫ్రాన్స్‌లో ట్రంప్‌ను కలిసిన సందర్భంలో మోదీ అమెరికాకు భారత్‌తో ఉన్న వాణిజ్యలోటు తగ్గింపునకు సాయపడతానంటూ సెలవిచ్చారు. అమెరికా నుంచి భారత్‌కు 4 బిలియన్ల మేరన చమురుతోపాటు అదనపు దిగుమతులు జరిపేందుకు అంతా సిద్ధమైందంటూ మోదీ, ట్రంప్‌కు చెప్పారు.

మరోవైపున అమెరికా ఆంక్షలకు తలవొగ్గి, మనం, మన చిరకాల మిత్రదేశం ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులు తగ్గించేసుకున్నాం. మనకు అవసరం ఉన్నా లేకపోయినా, అమెరికా నుంచి మనం చేసుకునే దిగుమతులు పెంచుకుంటూ పోతున్నాం. అమెరికా మాత్రం టారిఫ్‌ల పెంపుతో, మనకు గతం నుంచి ఇచ్చిన వాణిజ్య రాయితీల రద్దుతో తమదేశంలోకి ఎగుమతి అయ్యే మన సరుకులకు అడ్డుకట్ట వేస్తోంది. మన సాఫ్ట్‌వేర్‌ నిపుణుల వంటివారికి ఇచ్చే హెచ్‌1 వీసాల సంఖ్యను కుదించివేస్తోంది. ఇతర దేశాల చేతులు మెలిపెట్టి, మెడపై కత్తి పెట్టి అమెరికా సాగిస్తోన్న ఈ దాష్టీకానికి లొంగిపోవటం.. 24 /7 రోజులూ దేశభక్తి మంత్రం పఠించే మోదీ ప్రభుత్వ నిజస్వరూపానికి నిదర్శనమేమో  ఆలోచించాలి...!!


వ్యాసకర్త: డి. పాపారావు, ఆర్థికరంగ విశ్లేషకులు
మొబైల్‌ : 98661 79615

మరిన్ని వార్తలు