పార్టీలే సమర్థ నేతల కార్ఖానాలు

16 Jun, 2018 01:39 IST|Sakshi

విశ్లేషణ

భారత రాజకీయాలను రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ తొలి నుంచీ ప్రభావితం చేస్తూనే ఉన్నది. సంఘ నిర్మాత, వ్యవస్థాపక అధ్యక్షులు అయిన డాక్టర్‌ కేశవ బలీరామ్‌ హెడ్గేవార్‌ స్వయంగా కాంగ్రెస్‌ కార్యకర్త. గాంధీజీ పిలుపుమేరకు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళి వచ్చారు. డాక్టర్జీ తరువాత ఆరెస్సెస్‌ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన గురూజీ హయాంలో జనసంఘ్‌ ప్రారంభమైన నేపథ్యంలో రాజకీయాల పట్ల ఆసక్తి కల ఆరెస్సెస్‌ కార్యకర్తలు జనసంఘ్‌లో ఎక్కువగా చేరసాగారు. అప్పటికే వివిధ పార్టీల్లో ఉన్న సంఘ కార్యకర్తలు  కొందరు ఆయా పార్టీల్లోనే కొనసాగుతుండేవారు.  

1975 నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలోను, అనంతరం 77లో జనతాపార్టీ ఏర్పడినప్పుడు కూడా సంఘ కార్యకర్తలే ప్రధాన పాత్ర పోషించారు. కొందరి వ్యూహాలకు జనతా పార్టీ బలైపోతున్నప్పుడు భావసారూప్యం కల వారిని కలుపుకుని జనసంఘ్‌ కార్యకర్తలు 1980లో భారతీయ జనతా పార్టీని ఏర్పరచుకున్నారు. పాతికేళ్ళ ప్రస్థానంలో బీజేపీ పలు ఉత్థాన పతనాలను చవిచూసిరది. 2014 ఎన్నికల్లో  లోక్‌సభలో 274 స్థానాలతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరచగల పార్టీగా అవతరించినా, ఎన్నికలకు ముందు కుదిరిన పొత్తులను మన్నించి, నరేంద్రమోదీ నాయకత్వంలో యన్‌డిఎ ప్రభుత్వాన్ని ఏర్పరచింది. ఈ ఎన్నికలలో సీపీఐ, సీపీఎంలు 1, 2 సీట్లకు పరిమితం కాగా 44 సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్‌కు అధికారికంగా ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. గుర్తింపు పొందిన ప్రతిపక్షం లేకుండానే స్వతంత్ర భారత తొలి లోక్‌సభ ఏర్పడింది. ఆ పరిస్థితిని అధిగమించడానికి వామపక్షీయులతో సహా విపక్షాలు అన్నీ కలిసి నాటి జనసంఘ్‌ నేత డా‘‘ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ తమ తరఫున విపక్ష నేతగా వ్యవహరించాలని అంగీకారానికి వచ్చాయి. దానితో ఆయన ప్రధాని నెహ్రూకు దీటైన విపక్ష నేతగా గుర్తింపు పొందారు. ఇవాళ పెద్ద విపక్షమైన కాంగ్రెస్‌లో అంతటి సమర్థులు ఎవరూ మిగిలిన విపక్షాలకు కనిపించడం లేదు. ఎవరో ఒకరి తోక పట్టుకుని గట్టెక్కాలని కాంగ్రెస్‌ సైతం చూస్తోం దని కర్ణాటక పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. విపక్షాలను ఒక్కతాటిపై నడిపించి, ప్రజావిశ్వాసం చూరగొనగల సమర్థ నేతకోసం నేటి విపక్షాలు చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నాయి. సమర్థనేత  లేక అవస్థలు పడుతున్న విపక్షాలకు సార్వత్రిక ఎన్నికల సమయం తరుముకొస్తూం డటం పులిమీద పుట్రలా ఉంది. 

వరుడు కావలెను, వధువు కావలెను అని ప్రకటనలు లేకుండానే పెండ్లి సంబంధాలు వెతికినట్లు భారత రాజకీయాల్లో విపక్షాలకు సమర్థుడైన ప్రధాని అభ్యర్థికోసం అన్వేషణ మొదలైంది. ఈ పరిస్థితి విపక్షాలకన్నా మీడియాలోని మోదీ వ్యతిరేకులను, స్వయం ప్రకటిత మేధావులను మరింత కలవరపెడుతోంది. పిల్లి మెళ్లో గంట కట్టే మొనగాడి కోసం ఎదురుచూసే ఎలుకల్లా కలవెలపడిపోతున్న వీరి దృష్టికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హటాత్తుగా ఆశాదీపంలా సాక్షాత్కరించారు. జూన్‌7న నాగపూర్‌లో జరిగిన ఆరెస్సెస్‌ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారనే వార్తను అందిపుచ్చుకుని చెలరేగిపోయారు. ప్రణబ్‌ ముఖర్జీ క్రియాశీల రాజకీయాల్లోకి తిరిగి రానున్నారని, ఆయన రెండో రాజకీయ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తారని, ఎవరికి తోచినట్లు వారు ఊహాగానాల హోరెత్తించారు. విపక్షాలు మోదీకి వ్యతిరేకంగా కూటమి కట్టినా నాయకత్వ సమస్య తప్పని పరిస్థితుల్లో ప్రణబ్‌దా అందరికీ ఆమోదయోగ్య నాయకుడు కాగలరని జోస్యం చెప్పేశారు. 

ఆరెస్సెస్‌ ఏటా నిర్వహించే కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిం చడం ఆనవాయితీగా వస్తోందన్న సత్యాన్ని ఈ విశ్లేషకులు విస్మరించారు. సంఘ్‌ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్‌ వారిలో గాని, ఆరెస్సెస్సేతరుల్లో గాని, అత్యున్నత పదవులు చేపట్టిన వారిలో గాని ముఖర్జీ మొదటి వారు కాదు. మహాత్మా గాంధీ, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్, జేపీగా ప్రసిద్ధులైన జయప్రకాశ్‌ నారాయణ్, పారిశ్రామిక దిగ్గజం అజీమ్‌ ప్రేమ్‌ జీ, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం తదితరులు వేర్వేరు సందర్భాల్లో సంఘ్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారేం చెప్పినా వినయంతో స్వీకరించడానికి సిద్ధపడే సంఘం వారిని ఆహ్వానించింది. వారు కూడా తమకు తోచిన సూచనలు చేస్తూ వారి అభిప్రాయాలను ప్రకటించి వెళ్ళారు. దేశ ప్రజల సమష్టి కృషితోనే జాతి పురోగతి సాధ్యమన్న ఆరెస్సెస్‌ ఆలోచనతో వారెవ్వరూ విభేదించలేదు.
తాము తమ దేశమాత సంతానమనే ఆరాధనా భావనే దేశ ప్రజల్లో జాతీయతను ప్రోది చేస్తుందన్న ప్రపంచ దేశాల భావననే సంఘం కూడా విశ్వసిస్తోరది. జాతీయత కుల, మత, భాషా సంబంధం కాదని సంఘ్‌ ప్రకటించింది. వైవిధ్యత ప్రకృతి సహజమని సంఘ్‌ భావన. నూటముప్పది కోట్ల జనాభా కలిగిన భారత్‌లో విభిన్న మతాలు, కులాలు, తెగలున్నాయి. ప్రతి పౌరుడూ భారతీయ సాంస్కృతిక విలువలను గౌరవించడం తప్పనిసరి అని సంఘం భావి స్తున్నది.

వ్యక్తిగతమైన భక్తివిశ్వాసాలు, ఆరాధన విధానాల్లో ఎన్ని వైవిధ్యాలున్నా పౌరులుగా దేశ ప్రజ లందరూ భరతమాత సంతానంగా భావించాలని ఆరెస్సెస్‌ కోరుతున్నది. ‘మతం రీత్యా నేను ముస్లిమును, జాతి రీత్యా నేను హిందువును’ అన్న  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వర్గీయ మహమ్మద్‌ కరీం చాగ్లా ప్రకటన జాతీయత విషయంలో దేశ ప్రజలకు దారిదీపం కావాలి. హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు అంతా జాతి రీత్యా ఒకటే అని సంఘం భావిస్తోంది. ప్రణబ్‌ ముఖర్జీ కూడా ఇంచుమించు ఇలాంటి భావాలనే సంఘ్‌ వేదిక నుంచి దేశప్రజలకు ఉద్బోధించారు. సంఘ్‌ చరిత్ర ఆయనకు తెలియనిది కాదు. 1948లో తొలిసారి సంఘాన్ని నిషేధించి, దేశవ్యాపితంగా కార్యకర్తలను కటకటాల్లో నిర్బంధించింది నెహ్రూ ప్రభుత్వం. నిషేధం ఎత్తేశాక జైలు నుంచి బయటకు వస్తూన్న  నాటి సర్‌ సంఘ్‌ చాలక్‌ గురూజీని మీ ప్రతిక్రియ ఎలా ఉండబోతోంది? అని విలేఖరులు ప్రశ్నించారు. ‘నాలుకా మనదే, పళ్ళూ  మనవే, ఆహారం నమిలేప్పుడు ఒకోసారి తమ కింద పడ్డ నాలుకను పళ్ళు గాయపరుస్తాయి. అంతమాత్రాన పళ్ళూడగొట్టుకుం టామా! అని గురూజీ బదులిచ్చారు. 

దేశంలోని రాజకీయ పక్షాలు ఆరెస్సెస్‌తో ఏకీభవించకపోయినా, సంఘంలో చేరకపోయినా దేశ ప్రజల్లో ఐక్యతా భావన నిర్మాణం చేయగల జాతీయ దృక్పథాన్ని, దేశ ప్రజలకు దాన్ని గాఢంగా అలవర్చడంలో సంఘ్‌ అనుసరిస్తున్న మెళకువలను అర్థం చేసుకుని ఆచరించగలిగితే, వైవిధ్యభరితమైన మన దేశాన్ని నడిపించగల నాయకుల కోసం బయట వెతకాల్సిన పనిలేదు! దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు కూడా సమర్థవంతమైన నేతలను తయారు చేసే కార్ఖానాలవుతాయి!

పి.వేణుగోపాల్‌ రెడ్డి
వ్యాసకర్త చైర్మన్, ఏకలవ్య ఫౌండేషన్‌
మొబైల్‌ : 94904 70064

మరిన్ని వార్తలు