అత్యుత్సాహం ఖరీదు ఒక ప్రాణం

29 Nov, 2017 01:29 IST|Sakshi

జయలలిత అధికారంలో ఉండగా ఫుట్‌పాత్‌లపై హోర్డింగ్‌లను తొలగించినందుకు సామాజిక కార్యకర్త ట్రాఫిక్‌ రామస్వామిపై కేసు నమోదైంది. కోయంబత్తూర్‌లో హోర్డింగ్‌ల ఏర్పాటుపై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనుమతి తీసుకోలేదు. మున్సిపల్‌ మంత్రి ఎస్‌పీ వేలుమణి స్వయంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ హోర్డింగ్‌లను ఏర్పాటు చేయించడం గమనార్హం. ఆ ప్రాంతంలో వేలుమణి బలమైన నాయకుడు కూడా. హోర్డింగ్‌ ఏర్పాటుకు ఆదేశించిన వారిపై ఇంతవరకూ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీని గురించి విపక్ష డీఎంకే మాత్రమే నిరసన ప్రకటిస్తున్నది. తమిళనాడు సీఎం ఇంతవరకూ నోరు విప్పలేదు.

‘రఘును ఎవరు చంపారు?’ తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక రోడ్డు మీద ఈ ప్రశ్న రాశారు. మొన్న శుక్రవారం ఉదయం రఘుపతి అనే ముప్పయ్‌ సంవత్సరాల యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ప్రమాదానికి గురై మరణించిన చోటు సరిగ్గా అదే. కడుపు మంటతో, తీవ్ర నిరాశా నిస్పృహలకు గురైన ఇద్దరు అబ్బాయిలు చొరవ చేసి రోడ్డుకు అడ్డంగా ఆ అక్షరాలు రాశారు. ఇలాంటి దుర్ఘటన గురించి తమిళనాడు, కోయంబత్తూరు మరచి పోలేదని గుర్తు చేయడానికీ, దీని మీద సమాజంలో తగినంత కదలిక తెచ్చేందుకు ఆ అబ్బాయిలు ఇద్దరూ ఆ ప్రయత్నం చేశారు.

అన్నాడీఎంకే అత్యుత్సాహం
ముందు ఈ దుర్ఘటన గురించి తెలుసుకుందాం. అమెరికాలో ఉంటున్న రఘు భావి జీవిత భాగస్వామిని వెతుక్కుంటూ వచ్చాడు. ఇదే సందర్భంలో కోయంబత్తూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పళని అనే పుణ్యక్షేత్రానికి వెళ్లడానికి ఉదయాన్నే బయలుదేరాడు. మోటార్‌ బైక్‌ మీద మొదట బస్టాప్‌ దాకా వెళ్లాలని అనుకున్నాడు. అక్కడ నుంచి బస్సు మీద పళని వెళ్లాలని ఆయన ఆలోచన. అయితే ఒక లారీ రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా తప్పు దారిలో రఘు మీదకు దూసుకు వచ్చింది. దానిని తప్పించుకోవడానికి రఘు అనివార్యంగా ఎడమ వైపునకు బైకును తిప్పవలసి వచ్చింది. కానీ ఆ దిశలోనే భారీ హోర్డింగులు వేలాడదీయడం కోసం పాతిపెట్టిన కర్రలు ఉన్నాయి. ఆ వేకువ చీకటిలో అతడు వాటిని గమనించుకోలేదు. డిసెంబర్‌ 3వ తేదీన జరిగే అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎమ్జీ రామచంద్రన్‌ శత జయంతి ఉత్సవాలలో హోర్డింగులు తగిలించడం కోసం వారం ముందే ఆ కర్రలను ఆ పార్టీ కార్యకర్తలు పాతిపెట్టారు. పనివాడు పందిరి వేస్తే పిచ్చుకలు కూలగొట్టాయన్న సామెత చందంగా ఏ మాత్రం పటిష్టంగా లేని ఆ కర్రల ఏర్పాటు అక్కడి రోడ్డును నలభై శాతం ఆక్రమించింది. పైగా రోడ్డు ఆక్రమణ గురించి వాహన చోదకులను హెచ్చరించే రిఫ్లక్టర్స్‌ వంటి ఎలాంటి సాధనాలను అక్కడ ఏర్పాటు చేయలేదు. ఈ కర్రలకే రఘు గుద్దుకుని రోడ్డు మీద పడిపోయాడు. అతడి మీద నుంచి లారీ వెళ్లిపోయింది.

అసలు అక్కడ ఆ కర్రలను అలా పాతిపెట్టడమే చట్ట విరుద్ధమైతే, ఈ దుర్ఘటన పట్ల అన్నాడీఎంకే స్పందించిన తీరు మరింత వికృతంగా ఉంది. రఘు మద్యపానం మత్తులో వాహనాన్ని నడుపుతున్నాడని నమ్మించడానికి వారు ప్రయత్నించారు. మరికొందరైతే రఘు మీద నుంచి లారీ దూసుకుపోవడంతోనే మరణించాడు తప్ప, హోర్డింగ్‌ కర్రలకు, ఆ దుర్ఘటనకు ఎలాంటి సంబంధం లేదని దబాయిస్తున్నారు. అయితే అది ఆరు లేన్ల రహదారి. అనివార్యంగా రఘు బైకు తిప్పిన ఎడమ వైపున హోర్డింగ్‌ లేకుంటే అతడు సులభంగా తనవైపు దూసుకొచ్చిన లారీని తప్పించుకునేవాడనే విషయాన్ని వారు విస్మరిస్తున్నారు.

న్యాయం వైపు నిలిచినందుకు శిక్ష
రఘు హెల్మెట్‌ పెట్టుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని మరికొందరు తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాదనలో కొంత హేతుబద్ధత ఉన్నా అన్నాడీఎంకే కార్యకర్తలు తమ తప్పిదాన్ని కప్పిపుచ్చలేరు. దారుణ ఘటనకు బాధ్యులను గుర్తించి, శిక్షించాల్సిన కార్పొరేషన్‌ అధికారులు చోద్యం చూస్తుంటే, తమ రాతలతో వ్యవస్థను నిలదీసిన యువకులనే పోలీసులు తీసుకుపోయి ప్రశ్నించడం గమనార్హం. ఆ అబ్బాయిలిద్దరికీ ఏమైనా రాజకీయ పార్టీలతో సంబంధం ఉందా అని ఆరా తీసిన పోలీసులకు అలాంటిదేమీ లేదనే సమాచారం లభించింది. రాజకీయ హంగామా కోసం బహిరంగ ప్రదేశాలను, రహదారులను ఆక్రమించి ప్రచార ఆర్భాటాలతో రెచ్చిపోవడం అన్నా డీఎంకేకు అలవాటేననే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. డిసెంబర్‌ 2015లో జనరల్‌ కౌన్సిల్‌ సమావేశాల సందర్భంగా చెన్నై నగరాన్ని ఆ పార్టీ హోర్డింగ్‌లతో ముంచెత్తింది. నగరంలోని పేవ్‌మెంట్స్‌ను సయితం ఆక్రమించుకున్నారు. పాదచారులకు ఇబ్బందికరంగా ఉన్న హోర్డింగ్‌లను తొలగించేందుకు ప్రయత్నించిన అరప్పోర్‌ ఇయకం(అవినీతిపై పోరాడే ఎన్‌జీవో) కార్యకర్తలను ఏఐఏడీఎంకే కార్యకర్తలు అడ్డుకుని దాడులకు దిగడం మీద అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఈ ఘటనలో దాడికి దిగిన పార్టీ కార్యకర్తలను విడిచిపెట్టి ముగ్గురు సామాజిక కార్యకర్తలను అరెస్ట్‌ చేసి చెన్నై సెంట్రల్‌ జైలుకు తరలించడం, పార్టీ కార్యకర్తలపై ఈగ వాలనీయకపోవడం విస్మయం కలిగించింది. ఇక జయలలిత అధికారంలో ఉండగా ఫుట్‌పాత్‌లపై హోర్డిం గ్‌లను తొలగించినందుకు సామాజిక కార్యకర్త ట్రాఫిక్‌ రామస్వామిపై కేసు నమోదైంది. కోయంబత్తూర్‌లో హోర్డింగ్‌ల ఏర్పాటుపై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనుమతి తీసుకోలేదు. మున్సిపల్‌ మంత్రి ఎస్‌పీ వేలుమణి స్వయంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ హోర్డింగ్‌లను ఏర్పాటు చేయించడం గమనార్హం. ఆ ప్రాంతంలో వేలుమణి బలమైన నాయకుడు కూడా.

హైకోర్టు ఆదేశాలు గాలికి!
హోర్డింగ్‌ ఏర్పాటుకు ఆదేశించిన వారిపై ఇంతవరకూ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీని గురించి విపక్ష డీఎంకే మాత్రమే నిరసన ప్రకటిస్తున్నది. రాజకీయ పక్షాలు రాచరిక వ్యవస్థను తలపించేలా అహంభావపూరితంగా వ్యవహరించరాదని డీఎంకే స్పష్టం చేసింది. అయినా ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంలు ఈ దారుణోదంతం గురించి ఇప్పటివరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. జీవించి ఉన్న వ్యక్తుల కటౌట్లు ఏర్పాటు చేయరాదని నెల కిందట మద్రాస్‌ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే పళనిస్వామి, పన్నీర్‌సెల్వంల నిలువెత్తు కటౌట్ల స్థానంలో వారి రూపాలను ముద్రించిన పెద్ద పెద్ద బెలూన్లు ఆకాశమంతా దర్శనమిచ్చాయి.

మంత్రికి వంత పాడుతున్న పోలీసులు
రఘు దుర్మరణం పాలైన కొద్దిరోజుల్లోనే తేని జిల్లాలోనూ ఇటువంటి భారీ హోర్డింగ్‌లు దర్శనమిచ్చాయి. ‘అడ్డంకిగా, ప్రమాదకరంగా’ ఉండే హోర్డింగులను ఏర్పాటు చేయడంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా ఉల్లంఘిస్తున్నదని తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఎం.కె. స్టాలిన్‌ ఆరోపించారు. ఇటీవలకాలంలోనే రాజకీయాలలోకి వచ్చినట్టు ప్రకటించిన ప్రముఖ చలనచిత్ర నటుడు కమల్‌హసన్‌ కూడా ఈ దుర్ఘటన గురించి ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ ట్వీట్‌ చేశారు. ‘ఏ ప్రభుత్వమైనా సరే, జీవితాలను బలితీసుకుని అధికారాన్ని, కీర్తిని నిలబెట్టుకోవా లని అనుకుంటే, అలాంటి ప్రభుత్వం పతనం కాక తప్పదు’ అని కమల్‌హసన్‌ హెచ్చరించారు. కానీ ఈ విమర్శలు ఏవీ కూడా ప్రభుత్వంలో ఎలాంటి మార్పును తీసుకురాలేదు. మున్సిపల్‌ పరిపాలనా వ్యవహారాల మంత్రి వేలుమణి కోయంబత్తూరులో రోడ్డు మీద పాతిన కర్రల వ్యవహారం చట్టవిరుద్ధమేమీ కాదని నిస్సంకోచంగా చెప్పారు. ఇందుకు సంబంధించి విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఎదురుదాడికి కూడా దిగారు.

కోయంబత్తూరు పోలీసులు కూడా మంత్రి వాదం వైపు మొగ్గు చూపుతున్నారు. లారీ వచ్చి డీకొనడం వల్లనే ఆ ప్రవాస భారతీయ ఇంజనీర్‌ మరణించాడని వారు కూడా చెప్పారు. పాలకవర్గం ధోరణి కేవలం ప్రజలపట్ల సానుభూతిరాహిత్యం, జవాబుదారీతనం లోపించిన వైనాన్నే ప్రతిబింబిస్తున్నది. ఒక నిర్లక్ష్యం ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య వివాదంగా మిగిలిపోవడం ఆశ్చర్యకరం. రఘు విషాదం మీద ప్రజలలో నిరసన పెల్లుబుకుతోంది. ఈ విషాదం గురించి ప్రచారం చేసేందుకు, బాధ్యులపై చర్యలు చేపట్టేందుకు ఒత్తిడి పెంచేలా ఛేంజ్‌.ఓఆర్‌జీలో పిటిషన్‌లపై ఉద్యమ స్ఫూర్తితో సంతకాలు జరుగుతున్నాయి. ఈ తరహా దారుణ ఘటనలకు చరమగీతం పాడాలని, రఘు వంటి అమాయకుల ప్రాణాలను ఇక తమిళనాడు త్యాగం చేయబోదనే గట్టి సందేశం బలంగా వినిపించాలనే ఆకాంక్ష తమిళనాడు రాష్ట్రమం తటా వ్యక్తమవుతోంది.


- టీఎస్‌ సుధీర్‌

వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు

మరిన్ని వార్తలు