అసలు సమస్య అసమర్థ మార్కెట్లే!

10 Oct, 2018 00:58 IST|Sakshi

విశ్లేషణ

రెండు దశాబ్దాలుగా ఇండియాలో వ్యవసాయోత్పత్తుల ధరలు మారకుండా స్తంభించిపోయాయని ఆర్థిక సహకారం, అభివృద్ధి సంఘం సర్వే వెల్లడించింది. ఆహార ద్రవ్యోల్బణం అదుపులో ఉండేలా చేయడానికి ఇన్నేళ్లుగా రైతులకు ఉద్దేశపూర్వకంగానే 15 శాతం తక్కువగా ధరలు చెల్లిస్తున్నారు. అయితే, అంతే స్థాయిలో వారికి మేలు చేయడానికి అవసరమైన సొమ్ము నేరుగా చెల్లించే పద్ధతి అమల్లో లేకపోవడంతో భారత రైతులు కష్టాల కొలిమిలో చిక్కుకుపోతున్నారు. ఓ పక్క ఉత్పత్తి ఖర్చులు పెరగడం, వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడం, ధరల్లో విపరీత మార్పులు రావడంతో అసమర్థ వ్యవసాయ మార్కెట్లకు భారత రైతు బలి అవుతున్నాడు.

దాదాపు 40 ఏళ్లుగా భారత రైతులు టమాటాలు పండిస్తూ పొందుతున్న సగటు ధర మారలేదు. 1978లో లభించిన ధరకూ 2018 ధరకూ పెద్దగా తేడా లేదు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇంకా టమాటా ధర స్పల్పంగా తగ్గినట్టే. పంట ఖర్చులు కూడా రాకపోవడంతో గత రెండేళ్లలో ఆగ్రహించిన రైతులు పండించిన టమాటాలను వీధుల్లో పారబోయడం మనం చూస్తున్నదే. 1980ల ఆరంభంలో సైతం రైతులు టమాటాలను పశువులకు దాణాగా పెట్టడం లేదా రోడ్లపై వదిలి రావడం నాకింకా గుర్తుంది. సరుకు రవాణా, వ్యాపారులు బహిరంగంగా పాల్గొనడంపై ఆంక్షలు ఉండటంతో దేశంలో నిజమైన జాతీయ మార్కెట్‌ లేదు. దీంతో వ్యవసాయోత్పత్తులకు దేశంలో సమర్థంగా పనిచేసే మార్కెట్‌ ఇంకా అవతరించలేదనే చెప్ప వచ్చు. కేవలం ఆరు శాతం రైతులకు కనీస మద్దతు లభిస్తుండగా, మిగి లిన 94 శాతం కర్షకులు మార్కెట్లపైనే ఆధారపడుతున్నారు. తక్కువ ధరలకే వ్యవసాయోత్పత్తులు దొరకడం మార్కెట్‌ సామర్థ్యానికి ప్రతి బింబం కాదు. ఈ విషయంలో మరింత అవగాహన కోసం అమెరికాలో ఈ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. అమెరికా మార్కెట్‌ ధరల విష యంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. అమెరికా వ్యవసాయోత్పత్తుల మార్కెట్లలో పోటీతత్వం ఎక్కువ. ఇక్కడ పెద్ద వ్యాపారులు, సంస్థలు సునాయాసంగా పనిచే యడం సర్వసాధారణం.

భవిష్యత్తులో క్రయవిక్రయాలకు సంబంధించి ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ధరలు రైతులకు అనుకూలంగా ఉంటాయి. అమెరికా రైతు మైక్‌ కాలిక్రాట్‌ తన బ్లాగ్‌లో వ్యాసం రాస్తూ, ‘‘44 ఏళ్ల క్రితం నా తండ్రి 1974 డిసెంబర్‌ 2న ఒక బుషల్‌ (25.4 కిలోలు) మొక్కజొన్నను 3.58 డాలర్లకు అమ్మాడు. 2018 జనవరిలో నేను రెండు సెంట్లు తగ్గించి 3.56 డాలర్లకు విక్రయించాను’’ అని వివరించాడు. కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌కు చెందిన రైతు ఫిలిప్‌ షా ఈ ఏడాది జనవరి ధరతో పోల్చితే మరో నాలుగు సెంట్లు తగ్గించి 2018 సెప్టెంబర్‌ 12న మొక్కజొన్నను 3.52 డాలర్లకు అమ్మానని ఓ ట్వీట్‌లో వెల్లడించారు. ‘‘1974లో మొక్కజొన్న పంట ప్రారంభించిన రైతు ఎవరైనా తాను రిటైరయ్యే సమయానికి కూడా పాత ధరకే అమ్ముకోక తప్పదు’’ అని మైక్‌ తన బ్లాగ్‌లో అభిప్రాయపడ్డాడు. ఈ మార్కెట్లు అంత సమర్థంగా పనిచేసేవైతే, వ్యవసాయోత్పత్తుల ధరలు ఇంత అడ్డగోలుగా చలనం లేకుండా ఉండకూడదు. మొక్కజొన్న పండించే రైతుకు దక్కాల్సిన ధర ఎంతో 44 ఏళ్లుగా ఈ మార్కెట్లు నిర్ణయించడంలో విఫలమయ్యాయని పైవివరాలు చెబుతున్నాయి.  అంటే ఇవి సమర్థ మార్కెట్లు కాదనే చెప్పాలి. పై అమెరికా రైతు చెప్పి నట్టు, ఇదే సమయంలో విత్తనాలు, భూమి, పరికరాలు, ఎరువులు, ఇంధనం ధరలు బాగా పెరుగుతున్నాయిగానీ ఉత్పత్తుల ధరలు మాత్రం మారలేదు. ఇంతకన్నా బాధాకరమైన అంశం ఏముంటుంది. 

అమెరికాలోనూ 1960 నుంచీ వాస్తవ ధరలు తగ్గాయా?
అమెరికా వ్యవసాయ శాఖ ప్రధాన ఆర్థికవేత్త రాబర్ట్‌ జొహాన్సన్‌ 2018 వ్యవసాయ ఆర్థిక, విదేశీ వాణిజ్య వేదిక సమావేశంలో ప్రసంగిస్తూ, ‘‘ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే వాస్తవ వ్యవసాయోత్పత్తుల ధరలు 1960 నుంచీ బాగా తగ్గిపోయాయి. అమెరికాలో ఇలాగే జరుగు తోంది. మీరు విన్నది నిజమే. రైతుకు న్యాయమైన ధర మార్కెట్‌లో చెల్లించలేకపోవడంతో ఏటా ప్రతి రైతుకూ అమెరికా ప్రభుత్వం సబ్సిడీ కింద 50 వేల డాలర్లు అందిస్తోంది,’’అని వివరించారు. రెండు దశాబ్దా లుగా ఇండియాలో వ్యవసాయోత్పత్తుల ధరలు మారకుండా స్తంభించి పోయాయని ఇటీవల ఆర్థిక సహకారం, అభివృద్ధి సంఘం(ఓఈసీడీ) సర్వే వెల్లడించింది. ఆహార ద్రవ్యోల్బణం అదుపులో ఉండేలా చేయ డానికి ఇన్నేళ్లుగా రైతులకు ఉద్దేశపూర్వకంగానే 15 శాతం తక్కువగా ధరలు చెల్లిస్తున్నారు. అయితే, అంతే స్థాయిలో వారికి మేలు చేయడానికి అవసరమైన సొమ్ము నేరుగా చెల్లించే పద్ధతి అమల్లో లేకపోవడంతో భారత రైతులు కష్టాల కొలిమిలో చిక్కుకుపోతున్నారు. ఓ పక్క ఉత్పత్తి ఖర్చులు పెరగడం, వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గి పోవడం, ధరల్లో విపరీత మార్పులు రావడంతో సమర్థంగా పనిచేయని వ్యవసాయ మార్కెట్లకు భారత రైతు బలి అవుతున్నాడు.

అయితే, అనవసర ఆంక్షలు తొలగించి వ్యవసాయ మార్కెట్లను మరింత సరళతరం చేయడం ద్వారానే రైతులకు సరైన ధరలు దక్కేలా చూడవచ్చనే భావన సర్వత్రా వ్యక్తమౌతోంది. అప్పుడే వ్యవసాయదారులకు గిట్టుబాటు ధరలు లభ్యమౌతాయనేది అందరికీ ఆమోదయోగ్యమైన అభిప్రాయం. అయితే, స్వేచ్ఛ విపణికి పేరుపొందిన అమెరికాలోని మార్కెట్లలో సైతం వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోయే స్థాయిలో వ్యవసాయోత్పత్తుల ధరలు పెరగడం లేదు. ఈ విషయం ఎవరూ బహిరంగంగా అంగీకరిం చకపోవడం విశేషం. ఖరీఫ్‌ పంట కోతల కాలం మొదలైంది. ఫలితంగా మూంగ్‌ పెసలు, మినుములు, వేరుశనగలు, సజ్జలు, జొన్నల ధరలు ఇప్పటికే మార్కెట్లలో కనీస మద్దతు ధర కన్నా తక్కువ పలుకుతు న్నాయి. పెసల ధరల విషయమే తీసుకుందాం. క్వింటాలు పెసల కనీస మద్దతు ధర రూ. 6,975 కాగా, మధ్యప్రదేశ్‌లోని పప్పు ధాన్యాల మార్కె ట్లలో కిందటి వారం ధరలు కేవలం రూ.3,900–4,400 మధ్య ఊగిస లాడాయి. మహారాష్ట్రలో క్వింటాలు పెసలకు లభించే గరిష్ట ధర రూ. 4,900. ఇక మినుముల విషయానికి వస్తే, కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 5,600 ఉండగా, మహారాష్ట్ర వ్యవసాయోత్పత్తుల మండీల్లో రైతులకు లభించే ధర క్వింటాలుకు రూ. 3,900 నుంచి రూ. 4,200 మధ్యనే ఉంటోంది. పప్పు ధాన్యాల క్రయవిక్రయాల సీజన్‌ ఆరంభంలోనే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది. మరి మార్కెట్‌కు ఈ పప్పుధాన్యాల రవాణా అత్యధిక స్థాయికి చేరుకున్నప్పుడు వీటి ధరలు ఎంతగా క్షీణించిపోతాయో ఊహించుకోవచ్చు. గడచిన రెండేళ్ల అనుభ వాలను బట్టి చూస్తే, దేశవ్యాప్తంగా వ్యవసాయోత్పత్తుల మార్కెట్లలో పప్పు ధాన్యాల ధరలు 20 నుంచి 40 శాతం వరకూ పడిపోయాయి. ఈ లెక్కన ఈ సంవత్సరం పప్పుధాన్యాల ధరలు పెరుగుతాయని అంచనా వేయడం అత్యాశే అవుతుంది.

అసలు సమస్య అసమర్థ మార్కెట్లే!
రైతులను అప్పుల విష వలయం నుంచి కాపాడటంలో వ్యవసాయ మార్కెట్లు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి అన్నదాత ఆయ్‌ సంరక్షణ్‌ అభియాన్‌ (ప్రధానమంత్రి రైతుల ఆదాయ పరిరక్షణ పథకం–పీఎం ఆశా) ప్రారంభించడం అంటే రైతులకు అవస రాలు తీర్చేస్థాయిలో కనీస ఆదాయం సమకూర్చాలన్న వాస్తవాన్ని గుర్తించనట్టు లెక్క. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికి, ఇతర రంగాలకు ఆదాయంలో ఉన్న వ్యత్యాసాలను తగ్గించడానికి కీలక చర్యగా ఈ పథకాన్ని పరిగణించవచ్చు. రైతులకు తగినంత ఆదాయం వచ్చేలా చూడటం నేటి తక్షణావసరంగా ప్రభుత్వం గుర్తించింది.  ప్రధానమంత్రి అన్నదాత ఆయ్‌ సంరక్షణ్‌ అభియాన్‌ (పీఎం–ఆశా) పథకంలో భాగంగా వాస్తవానికి ప్రభుత్వం మూడు పథకాలను అమలు చేస్తుంది. ప్రస్తుత వ్యవసాయ కనీస మద్దతు ధరల పథకాన్ని కొనసా గిస్తుంది. అలాగే, మధ్యప్రదేశ్‌ ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేసిన వ్యవసాయోత్పత్తుల ధరల లోటు చెల్లింపుల పథకాన్ని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తారు. మూడో పథకం కింద వ్యవసాయో త్పత్తుల సేకరణ రంగంలోకి ప్రైవేటు వ్యాపారులను, సంస్థలను ప్రయో గాత్మకంగా అనుమతిస్తారు. ఇది నూనె గింజల రంగంతో మొదలవు తుంది. ఈ పథకం అమలును అత్యంత క్షుణ్ణంగా పరిశీలించి, అంచనా వేయాల్సి ఉంటుంది.

రైతుల సమస్యలను ప్రభుత్వాలు అమలు చేస్తున్న కనీస మద్దతు ధరలే పరిష్కరించి, వారిని ఒడ్డున పడేయలేవని గత అనుభవాలే చెబుతున్నాయి. వ్యవసాయోత్పత్తులకు ప్రభుత్వం అధిక కనీస మద్దతు ధర ప్రకటించినా (ఇది రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నదాని కన్నా తక్కువగా ఉన్నాగాని) మార్కెట్‌లో అమ్ముకునే వీలున్న మొత్తం సరుకులో 25 శాతం కొనుగోలు చేస్తామన్న సర్కారీ వాగ్దానం అమలు చేయడం అంత తేలిక కాదు. తగినన్ని పంటల మార్కెట్‌ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయగలిగినప్పుడే ఇది సాధ్యమౌతుంది. ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక్కటి చొప్పున 42,000 వ్యవసాయోత్ప త్తుల మార్కెట్‌ కమిటీ(ఏపీఎంసీ) మండీల(మార్కెట్లు) అవసరం ఉండగా, భారతదేశంలో కేవలం 7,600 మండీలు మాత్రమే ఉన్నాయి. ఈ ఏపీఎంసీల నిర్వహణలోని మార్కెట్లను విపరీతంగా విస్తరించాల్సిన అవసరం ఓ పక్క ఉండగా, పంట ఉత్పత్తుల ధరలకు మద్దతు ఇవ్వ డానికి తగినంత ఆర్థిక ఏర్పాట్లు అత్యంత కీలకం. కనీస మద్దతు ధరల కోసం వచ్చే రెండు సంవత్సరాల కోసం  కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ. 15,053 కోట్లు ఏమాత్రం చాలదు. 2008లో సంక్షోభంలో చిక్కు కున్న భారత కార్పొరేట్‌ రంగాన్ని కాపాడటానికి రూ.1,86,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కల్పించారు. దీన్నింకా ఉపసంహరించలేదు. అలాంటప్పుడు, వ్యవసాయోత్పత్తుల సేకరణకు తగినంత మద్దతు ధరలతో అలాంటి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదో అర్థంకావడం లేదు.


దేవిందర్‌శర్మ 
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

మరిన్ని వార్తలు