అర్థం చేసుకోకపోతే అనర్థమే

19 Apr, 2018 00:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విశ్లేషణ

నీటి పారుదల సౌకర్యం పరిమితంగా ఉండడంతో పాటు, తక్కువ దిగుబడి వల్ల కూడా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మరొక అభిప్రాయం ఉంది. దీనిని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కూడా అంగీకరిస్తున్నాయి. కానీ ఈ వాదాన్ని నమ్మడం ఎంతవరకు న్యాయం? పంజాబ్‌ను తీసుకోండి. ఆ రాష్ట్రం గోధుమ, వరి, మొక్కజొన్న పంటల దిగుబడిలో ప్రముఖ స్థానంలో ఉంది. కానీ అక్కడ  రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ వార్తలు వెలువడని రోజులు చాలా తక్కువ.

నిరాశా నిస్పృహలలో కూరుకుపోయిన రైతులు తాము పండించిన టొమేటో, బంగాళదుంప, ఉల్లి వంటి పంటలను వీధులలోకి తెచ్చి పార బోస్తున్న విషాదకర దృశ్యాలను మనం ఈ మధ్య చూస్తున్నాం. గడచిన రెండేళ్ల కాలం నుంచి ఇందుకు సంబంధించిన వార్తా కథనాలు పత్రికలలో చాలా కనిపిస్తున్నాయి. కొన్ని వీడియోలు కూడా వైరల్‌ అయినాయి. అలాగే తన పొలంలోని క్యాలీఫ్లవర్‌ మొక్కలను ఆ రైతే నిరాక్షిణ్యంగా తుడిచి పెడుతున్న దృశ్యాల వీడియో కూడా అందులో ఉంది. పండించిన టొమేటో లను టన్నుల కొద్దీ నిరాశతో నదులలోకి, జాతీయ రహదారుల మీద పార బోస్తున్న దృశ్యాలు కూడా దర్శనమిస్తున్నాయి. దిగుబడి ఖర్చులతో పాటు, రవాణా ఖర్చులు కూడా రైతులు దక్కించుకోలేకపోతున్నారన్నది రూఢి అయిన వాస్తవం. ఇలాంటి వేదన నేపథ్యంలో తాము కష్టించి పండించిన పంటను వారే ధ్వంసం చేసుకుంటున్నారంటే ఆ పరిణామాన్ని, అందులోని క్షోభని మనం అర్థం చేసుకోవలసిందే. ఇంకా చెప్పాలంటే న్యాయమైన ఆదా యాన్ని సంపాదించుకునే హక్కును రైతులకు లేకుండా చేస్తున్నారు. 

జాతీయ నేరాల నమోదు సంస్థ రైతుల బలవన్మరణాల గురించి తాజాగా కొన్ని గణాంకాలను వెల్లడించింది. వీటినే పార్లమెంట్‌కు సమర్పిం చారు కూడా. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరను పొందలేకపోతున్నామన్న రైతుల ఆవేదనే నేటి వ్యవసాయ సంక్షోభానికి అసలు కారణమని ఆ గణాంకాల ద్వారా అర్థమవుతున్నది. 2015 సంవత్సరంలో 12,602 బలవన్మరణాలు నమోదు కాగా, 2016 సంవత్సరంలో 11,370 మరణాలు నమోదయ్యాయి. వీటిలో భూమిలేని వ్యవసాయ కార్మికుల బల వన్మరణాలను కూడా చేర్చారు. రైతుల దుర్మరణాల సంఖ్యను తగ్గించి చూప డానికి ప్రయత్నం జరిగినప్పటికీ రాష్ట్రాలలో ఆ మరణాల సంఖ్య పెరిగిన మాట వాస్తవం. నీటి సదుపాయం అందుబాటులో ఉండి, చాలా శాతం భూమి సాగులో ఉన్న రాష్ట్రాలు కూడా ఇందులో ఉన్నాయి. మొదటి బలవన్మ రణాల సంఖ్యను తక్కువగా చూపించడం గురించి పరిశీలిద్దాం.

గణాంకాలలో వాస్తవమెంత?
పంజాబ్‌ రాష్ట్రంలో మొత్తం బలవన్మరణాల సంఖ్య 217 (2016 సంవత్స రంలో) అని నమోదు చేశారు. పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం (లూధియానా), పంజాబీ విశ్వవిద్యాలయం (పాటియాలా), గురు నానక్‌ దేవ్‌ విశ్వవిద్యాలయం (అమృత్‌సర్‌) సభ్యులు ఇంటింటికీ తిరిగి రైతుల బలవన్మరణాల వివరాలను నమోదు చేశారు. వీరు నమోదు చేసిన బలవ న్మరణాల సంఖ్యలో జాతీయ నేరాల నమోదు సంస్థ ఇచ్చిన ఆ సంఖ్య మూడో వంతు మాత్రమే. విశ్వవిద్యాలయాల సర్వే వివరాల ప్రకారం గడచిన 17 సంవత్సరాలలో, అంటే 2000 సంవత్సరం నుంచి 16,600 మంది రైతులు, వ్యవసాయ కూలీలు బలవన్మరణం చెందారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ మూడు విశ్వవిద్యాలయాలు అధికారికంగా ఇచ్చిన లెక్కల ప్రకారం ఏటా సగటున 1,000 మంది బలవన్మరణం పాలయ్యారు. కానీ జాతీయ నేరాల నమోదు సంస్థ 271 బలవన్మరణాలుగా లెక్క చెప్పింది. నా ఉద్దేశం ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన పరిశోధకులు కూడా ఇలాంటి వ్యత్యాసాలనే నమోదు చేసి ఉంటారు. 

మళ్లీ రైతులలో పెరిగిపోతున్న ఆదాయ అభద్రత అంశం దగ్గరకి వద్దాం. పంజాబ్, హరియాణా, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో రైతుల బలవన్మరణాల రేటు గణనీయంగా పెరిగిపోయింది. అయితే దేశంలో 60 శాతం పంట భూమి నీటి పారుదల సౌకర్యానికి నోచుకోలేదు కాబట్టి, భారతదేశంలో రైతుల బలవన్మరణాలు పెరిగాయన్న అవగాహనను పైన చెప్పుకున్న వాస్తవం పూర్తిగా ఖండిస్తుంది. రుతుపవనాలలో ఏమాత్రం హెచ్చుతగ్గులు కనిపించినా, అది పంటల మీద ప్రభావం చూపించడం వల్ల ఆత్మహత్యలు పెరుగుతాయి. వ్యవసాయ సంక్షోభం ఎప్పుడు వచ్చినా అందుకు కారణం దేశంలో నీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేనిఫలితమేనని అంటూ ఉంటారు. అయితే ఇంతకు మించిన కారణాలు కూడా వ్యవసాయ సంక్షోభా నికి కారణమవుతున్నాయని నేను అంటాను.

వ్యవసాయ రంగ సంక్షోభానికి చాలా కారణాలు మళ్లీ మళ్లీ చెప్పుకుం టూనే ఉంటాం. కానీ రైతులకు మార్కెట్లు లాభయదాయకమైన ఆదాయాన్ని ఇవ్వకపోవడమే సంక్షోభానికి మూలకారణమన్న ముగింపునకే వస్తాం. ఆహారపు గిన్నెలు అనదగిన పంజాబ్, హరియాణా రాష్ట్రాలనే తీసుకోండి! పంజాబ్‌లో 98 శాతం భూమికి నీటి పారుదల సౌకర్యానికి నోచుకుని ఉంది. ఆ రాష్ట్రంలో 2016లో సంభవించిన రైతు మరణాలు 271 అని జాతీయ నేరాల నమోదు సంస్థ పేర్కొన్నది. 2015లో సంభవించిన మరణాలు 124. అంటే 112 శాతం మరణాలు పెరిగాయి. హరియాణాలో కూడా 82 శాతం భూమి సేద్యానికి అనుకూలంగా ఉండి, నీటి పారుదల సౌకర్యంతో ఉంది. ఇక్కడ రైతుల బలవన్మరణాలు 54 శాతం పెరిగాయి. 2015 సంవత్సరంలో 162 బలవన్మరణాలు నమోదు కాగా, 2016లో అవి 250కి చేరుకున్నాయి. నీటి పారుదల సౌకర్యాలు లేకపోవడమే వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కార ణమైతే, నీటి పారుదల సౌకర్యం ఇతోధికంగా ఉన్న పంజాబ్, హరి యాణా వంటి రాష్ట్రాలు రైతుల బలవన్మరణాలకు ఎందుకు కేంద్రాలుగా మారాయన్నది నాకు అర్థంకాని విషయం. మహారాష్ట్రలో రైతాంగ సంక్షోభా నికి మూలం తక్కువ స్థాయి నీటి పారుదల సౌకర్యమేనని నిపుణులు చెబు తుండగా నేను చాలాసార్లు విన్నాను. విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాలు రైతుల ఆత్మహత్యలకు జాతీయ రాజధాని అనదగ్గ స్థాయికి చేరుకున్నాయి. నిజమే, మహారాష్ట్రలో కేవలం 18 శాతం భూమికే నీటి పారుదల సౌకర్యం ఉండడం వల్లనే రైతాంగ సంక్షోభానికి దారి తీసిందని నిపుణులు, ఆర్థికవేత్తలు ఒక నిర్ణయానికి రావడం ఆశ్చర్యం కాదు. కానీ పంజాబ్‌తో మహారాష్ట్రను పోల్చి చూసుకున్నప్పుడు ఆర్థికవేత్తలు, నిపుణులు అలాంటి నిర్ణయానికి ఎలా రాగ లుగుతున్నారని నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. పైగా పంజాబ్‌లో ప్రతి ఏటా రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.

పొంతనలేని సూత్రీకరణలు
నీటి పారుదల సౌకర్యం పరిమితంగా ఉండడంతో పాటు, తక్కువ దిగుబడి వల్ల కూడా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మరొక అభిప్రాయం ఉంది. దీనిని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, ఆఖరికి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కూడా అంగీకరిస్తున్నాయి. కానీ ఈ వాదాన్ని నమ్మడం ఎంతవరకు న్యాయం? ఇది వాస్తవమేనా? పంజాబ్‌ను తీసుకోండి. ఆ రాష్ట్రం గోధుమ, వరి, మొక్కజొన్న పంటల దిగుబడిలో ప్రపంచంలోనే ప్రముఖ స్థానంలో ఉంది. కానీ అక్కడ ఒకరు, ఇద్దరు, ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ వార్తలు వెలువడని రోజులు చాలా తక్కువ. హరియాణా కూడా అంతే. అక్కడ కూడా పంట దిగుబడి ఎక్కువే. పంజాబ్‌ తరువాత రెండో స్థానంలో ఈ రాష్ట్రం ఉంటుంది. అయితే అక్కడ కూడా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. కాబట్టి ఒక విషయం సుస్పష్టం. సమస్య ఒక చోట ఉంది. దాని పరిష్కారం గురించి మనం మరో చోట ఎక్కడో వెతుకుతున్నాం. సాగు విస్తరణకు నీటి పారుదల సౌకర్యం పెరగాలని నేను కోరుకుంటాను. అలాగే పంట దిగుబడి పెంచాలని కూడా అభిప్రాయపడతాను. అయితే రైతాంగ నికర ఆదాయం పెరుగుదల అంశం కూడా దీనికి జోడించవలసి ఉంటుంది. నాకు తెలిసి, మన విధాన నిర్ణయాలు ఆహార నిల్వల ఉత్పత్తిలో పెరుగుదలను నమోదు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ రైతు చేతికి రావలసిన లాభదాయకమైన ఆదాయం గురించి ఆలోచించడం లేదు. ఇదే వాస్తవంగా రైతాంగ సంక్షోభానికి దారి తీస్తున్నది. ఏటా ప్రభుత్వం 23 పంటలకు ప్రకటించే కనీస మద్దతు ధర వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా నిర్ణయమవుతుంది. కానీ చాలా సార్లు ఈ కనీస మద్దతు ధర రైతు దిగుబడి వ్యయం కంటే చాలా తక్కు వగా ఉంటుంది. తను నష్టాలను పండిస్తున్నానని ఏ రైతు పంట వేసేటప్పుడు భావించడు. ఇదేం పెద్ద వింత కాదు. 

వ్యవసాయ ఆదాయం పెంపు భారత దేశ ఆర్థిక ఎజెండాలో ఏనాడూ అధిక ప్రాధాన్యానికి నోచుకోలేదు. ఆఖరికి కనీస మద్దతు ధర సంగతే తీసు కోండి. దేశంలో ఆరు శాతం రైతాంగం మాత్రమే తమ పంటలను ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు విక్రయించుకోగలుగుతున్నారు. మిగిలిన 94 శాతం రైతులు దోపిడీ మార్కెట్‌ల మీదే ఆధారపడి ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు కావస్తున్నది. ఇప్పుడు కూడా దేశంలోని 17 రాష్ట్రాలలో ఒక రైతు కుటుంబానికి ఏటా దక్కే సగటు ఆదాయం సంవత్సరానికి రూ. 20,000. ఇది 2016 ఆర్థిక సర్వే చెప్పిన వాస్తవం. అంటే తీవ్రమైన ఈ వ్యవసాయ సంక్షోభానికి మూలం ఇక్కడే ఉంది. 2016 నాటి జాతీయ నేరాల నమోదు సంస్థ చెప్పిన వాస్తవాలను ఇది తిరుగు లేకుండా నిరూపిస్తున్నది.
 


దేవిందర్‌శర్మ

వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
hunger55@gmail.com

మరిన్ని వార్తలు