అంత దూకుడెందుకు బాబూ?

11 Sep, 2019 00:40 IST|Sakshi

మే 23న రాష్ట్రమంతటా ఎన్నికలు జరిగాయి. ఫలితాలు రాష్ట్ర ప్రజలందరూ కలగన్నట్లే వచ్చాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత అత్యధిక స్థానాల్లో వైసీపీ విజయ కేతనం ఎగరేసింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలుపు కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. వాడని అస్త్రాలూ లేవు. జనసేన పార్టీ కూడా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా తెలుగుదేశం విజయానికి కృషి చేయడం అందరికీ తెలిసిందే. మోదీ గారిని ఎంత ఎక్కువ తిడితే అంత పేరు ప్రఖ్యాతులు జాతీయ స్థాయిలో వస్తాయని కూడా చంద్రబాబు కలలు కని కుదేలుపడ్డాడు.

మే 30న ఆంధ్రప్రదేశ్‌ రెండవ ముఖ్యమంత్రిగా అతిపిన్న వయస్కుడైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత సాదాసీదాగా ప్రమాణ స్వీకారం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ చిరుదరహాసంతో, మొక్కవోని విశ్వాసంతో, నవరత్నాలకు జీవం పోస్తూ జగన్‌ ప్రయాణం సాగిపోతూనే ఉంది. సెప్టెంబర్‌ 6వ తారీఖు నాటికి ఆయన పాలన 100 రోజులు పూర్తి చేసుకుంటున్నది. ఆయనకు అభినందనలు తెల్పుతూ ఆశీస్సులు, చేయూత అందిద్దాం.

ఇక ఈ మూడు నెలల కాలంలో చంద్రబాబు తన విజ్ఞతను పూర్తిగా కోల్పోయారు. ఎన్నికల ముందు జగన్‌ గూర్చి ఎన్నెన్ని మాటలన్నాడో. అవినీతిపరుడని ఎంతగా గొంతు చించుకొన్నాడో. చివరికి పులివెందుల పేరును కూడా దూషించాడు. తన మాటలు, అబద్ధాలతో, అస హ్యం వేసే ప్రవర్తనతో రాష్ట్రంలోని ప్రజలందర్నీ జగన్‌వైపు తిరిగేలా చేయగలిగాడు. జగన్‌ విజయం చంద్రబాబు కలలో కూడా ఊహించనిది. ఏం చేస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకు ఎవరైనా తలవంచక తప్పదు. 

చంద్రబాబులో ఆవేశం, అసహనం, ఆగ్రహం ఎక్కువయ్యాయి. తానేం చేస్తున్నాడో తనకైనా అర్థమౌతున్నదో లేదో. అదేంటో చంద్రబాబు తమ పార్టీ ఎందుకు ఓడిపోయిందో, ప్రజలెందుకు చీదరించుకొన్నారో ఆత్మ విశ్లేషణ, ఆత్మ పరిశోధన చేసుకోకుండా అప్పుడే తిరిగి ఎన్నికలొచ్చేస్తున్నట్లు జగన్‌పై దూకుడుగా వెళ్తున్నాడు. బాబుకు ఇంత దూకుడు అవసరం లేదని ఆ పార్టీ పెద్దలే మాట్లాడుకొంటున్నారు. చంద్రబాబు అభద్రతా భావంతో, అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నాడు.

ఆనాడు శృతిమించి మోదీని విమర్శించడం. ఆయనేమో అత్యధిక మెజారిటీతో గద్దెనెక్కడం. తననేం చేస్తాడో ఏమో అన్న భయం ఒకవైపు. అందుకే తన ఆంతరంగికులైన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని మోదీ ఇంటికి పంపించేశాడు. ఇది జగమెరిగిన సత్యం. మరోవైపు బీజేపీతో దోస్తీకైనా సిద్ధమే కానీ తన ఎమ్మెల్యేల్ని పోగొట్టుకోవడం మాత్రం చంద్రబాబుకు సుతరామూ ఇష్టం లేదు. ఎందుకంటే తన సంఖ్య కుదించుకుపోయి పదికి పడిపోతే తనకున్న ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవాల్సి వస్తుంది. 

2014లో చంద్రబాబు అధికారానికొచ్చినా జగన్‌ మీలాగా విమర్శలు చేశారా? చివరికి 23 మంది వైసీపీ శాసనసభ్యుల్ని కొంటే జగన్‌ పల్లెత్తుమాట అన్నాడా? జగన్‌ పాదయాత్ర సమయంలో ఆ 23 మంది నియోజక వర్గాలకెళ్లినప్పుడు కూడా వాళ్లను పేరుపెట్టి విమర్శించలేదు. జగన్‌ ప్రమాణ స్వీకారానికి హుందాగా వెళ్లక, దానిని కూడా మీరు రాజకీయం చేశారు. మీ పలుకులు పయ్యావుల కేశవ్‌ నోటవిని ప్రజలు నవ్వుకొన్నారు.

అదే విధంగా శాసనసభ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ప్రమాణ స్వీకారానికి కూడా తోడుగా వెళ్లక దానిని కూడా రాజకీయం చేసి నవ్వులపాలైంది మీరు కాదా? 14న గవర్నర్‌ ప్రసంగం నుండి అసెంబ్లీ ముగిసేవరకు చంద్రబాబు తీరు ఆక్షేపణీయం. ప్రతిరోజూ తన శాసససభ్యులతో కలిసి వైసీపీ గిల్లికజ్జాలు పెట్టుకోవడం బాధాకరం. ఎన్ని అబద్ధాలు ఆడారు, ఎన్నిసార్లు మాట మార్చారు? 20వ తారీఖు నుండి టీడీపీ కార్యకర్తలపై దాడులంటూ అవాస్తవాల కొత్తరాగం అందుకొన్నారు. మళ్లీ పచ్చమీడియా మీతో గొంతుకలిపింది. 

చంద్రబాబు తన మకాం హైదరాబాద్‌ నుండి ఉన్నఫళంగా విజయవాడకు మార్చడానికి గల కారణాలు అందరికీ తెలిసిందే. కానీ ఆయనకు విజయవాడలోని కృష్ణానది కరకట్టపై లింగమనేని అక్రమంగా నిర్మించిన గెస్ట్‌హౌస్‌ అప్పనంగా దొరికింది. కాస్త పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తి అయినా అలా అక్రమంగా నిర్మించిన గెస్ట్‌హౌస్‌లో దిగరు. ఎన్నికల ముందు దేవినేని ఉమ అది అక్రమ కట్టడమని, అధికారానికి వచ్చిన వెంటనే దానిని కూలదోస్తామని ఆర్భాటం చేసి గెలుపొందారు. ఏం చేద్దాం. ఆ అక్రమ కట్టడమే తమ నాయకుడికి నెలవవుతుందని ఊహించే ఉండడు పాపం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిఉండి ఆ అక్రమ నివాసంలో ఉంటూ, తన పార్టీ కార్యకర్తల్ని, అధికారుల్ని కలిసేందుకు దానికి అనుగుణంగా ‘ప్రజావేదిక’ అంటూ మరో హాల్‌ను 7 కోట్ల రూపాయలతో నిర్మించుకోవడం మరో విడ్డూరం. 

జూన్‌ 26న ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంపై రివ్యూచేసి రూ. 2,636 కోట్లు అదనంగా చెల్లించడం జరిగిందని తేలిస్తే మీరెందుకు అంతగా బాధపడ్డారు. చంద్రబాబు వందిమాగదులైతే ఇక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాదని ఎంతగా గొంతులు చించుకొన్నారు. ఏదో కొంత ప్రభుత్వ ఖజానాకు తిరిగి రాబట్టాలని జగన్‌గారు ప్రయత్నిస్తే మీరు చేసిన వ్యాఖ్యలను ఎవరూ హర్షించ లేదు. ఆ సంస్థలతో మీకున్న అనుబంధాన్ని అజ్ఞానంతో మీరే బయటపెట్టుకున్నారు. మీరున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌కు ప్రభుత్వం అక్రమ కట్టడం అని నోటీసులిస్తే మీరెందుకు అంతగా అంగలార్చారు. కన్నీళ్లు పెట్టుకొన్నారు. మాలాంటి వారికి ఇప్పటికీ అర్థం కానిది ఒక్కటే. అది నిజంగా మీ సొంతమైందా? లేక ప్రభుత్వానిదా. ఎవరికైనా సందేహం ఎందుకొస్తున్నదంటే అద్దెకున్న మీరే ప్రతిసారీ ఎందుకు రియాక్ట్‌ అవుతున్నారు. 

జూలై 1 నుండి మీ పచ్చ పత్రికలు మరింత నగ్నంగా మారి టీడీపీ కార్యకర్తలపై హత్యలు అంటూ బ్యానర్‌ ఐటమ్స్‌ వండి వడ్డించసాగారు. ట్విట్టర్‌ను వేదికగా జగన్‌ ప్రభుత్వాన్ని విమర్శించడంలో తండ్రీకొడుకులు విజృం భించారు. చంద్రబాబుకైతే ట్విట్టర్‌ రుచి బాగా వంటబట్టింది. జూలై 11 నుండి దాదాపు 20 రోజులపాటు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు వేడివేడిగా జరిగాయి. మంద తక్కువైనా, అరుపుల్లో చంద్రబాబు కనుసైగల మేర టీడీపీ శాసనసభ్యులంతా బాగానే నటించారు. 12వ తారీఖు నాటి సమావేశంలో అయితే జగన్‌ కూడా ఒక నిమిషం గాడితప్పేలా రెచ్చగొట్టారు. సున్నా శాతం వడ్డీ రుణాల గూర్చి మీకే పూర్తిగా అవగాహన లేనట్లు ప్రవర్తించారు.

17వ తారీఖున కరకట్టపై జరిగిన అక్రమ కట్టడాల చర్చపై మీరు అసత్యాలు మాట్లాడినారు. ఒక స్థాయికి చేరుకున్న వ్యక్తి ఓ అద్దింటి ఓనర్‌ను కాపాడుతూ మాట్లాడటం చాలా విడ్డూరం అనిపించింది. అదే విధంగా ప్రైవేటు విద్యుత్‌ సంస్థల వ్యవహారంలో కూడా 25 సంవత్సరాల పాటు అగ్రిమెంటు చేసుకోవడం మీ పార్టీ ప్రతిష్టకు భంగం కల్గించింది. అధికారం కోల్పోయిన మీకెందుకు అంతటి కుతి. కొత్త ప్రభుత్వం ఏం చేసుకొంటే మీకెందుకు? అయినా ప్రజల పక్షాన నిలవాల్సిన మీరు లింగమనేనిపట్ల, ప్రైవేటు విద్యుత్‌ కొనుగోలుదారులకు, నవయుగ సంస్థకు అండగా నిలబడటం ఎంతవరకు సబబు. ఆలోచిస్తే మీకైనా ఇవి ఛీ అనిపించే క్షణాలు.  చంద్రబాబూ... కాస్త దూకుడు తగ్గించి జగన్‌ను కొంతకాలం ప్రశాంతంగా పాలించనీయండి. ఈలోగా సైకిల్‌కు రిపేర్లు చేసుకోండి.  

-డాక్టర్‌ విజయ కుమార్, మాజీ సీపీఆర్వో
 

మరిన్ని వార్తలు