పార్లమెంటులో ధనుష్కోటి

26 Jul, 2018 02:19 IST|Sakshi

జీవన కాలమ్‌ 

ఈ మధ్య పార్లమెంటులో జరిగిన అవిశ్వాస తీర్మాన ఘట్టం చాలా కారణాలకు మనదేశంలో చరిత్ర. ఈ రాజకీయ విశ్లేషకులు ఎంతసేపూ పక్కదారుల్లో పోతారు కానీ అసలు విషయాన్ని వదిలేస్తారు. మొదట విషయాలు మొదట చెప్పుకుందాం. రాహుల్‌ గాంధీ పార్లమెంటులో కన్ను కొట్టారు. నా మట్టుకు ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఆ పని చేస్తున్నప్పుడు ఆయన ముఖంలో అంత తేజస్సును నేను చూడలేదు. బహుశా ఆయన కన్నుకొట్టినప్పుడు వారి ప్రత్యేకమైన సౌందర్యం బయట పడుతుందేమో విశ్లేషకులు పరిశీలించాలి. మహానుభావులు ఏ వివేకానందో, మహాత్ముని వంటివారో దేశానికి సందేశం ఇస్తున్నప్పుడు వారి ముఖాలు తేజస్సుతో వెలిగిపోవడం మనం చూస్తాం. కానీ రాహుల్‌ గాంధీగారిలో కుర్రతనం ఇంకా పోలేదనడానికి ఇది నిదర్శనం. తీరా అనుకున్న నాటకం ఇప్పటికి రసకందాయంలో పడింది అనడం ఈ కన్ను కొట్టాడానికి నిదర్శనమా? 

త్యాగరాజస్వామి  ఒక కీర్తనలో ‘కోటినదులు ధనుష్కోటిలో నుండగ ఏటికి తిరిగెదవే మనసా’అని ప్రశ్నించారు. ఈ దేశంలో గంగ, యమున, కావేరి, గోదావరి – ఇలా వేర్వేరు నదులలో స్నానం అక్కరలేదు. కోటి నదుల సంగమం – ధనుష్కోటి– అన్నారు. రాహుల్‌ గాంధీ.. ఆ మధ్య ప్రధాని మోదీ ప్రపంచంలో అందరు నాయకుల్ని కావలించుకోవడం మీద విమర్శ చేశారు. మోదీగారి పని అనుచితంగా ఉన్నదంటూనే– తానూ అలాంటి పని చేయాలనే కోరిక వారి మనస్సులో ఉన్నదేమో. మరి పార్లమెంటులో ప్రధాని ధనుష్కోటి లాంటివారు. ఒక్కసారి వారిని కావలించుకుంటే అందరినీ కావలించుకున్నంత ఫలితం.

దీనిని మర్యాద భంగంగా స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ గారు భావించరాదని నా ఉద్దేశం. నిజానికి ఇలాగే పార్లమెంటులో చాలామంది నాయకులకు మోదీగారి విషయంలో రకరకాల తీరని కోరికలుండవచ్చు. వాటిని బయటపెట్టడం ఎలాగో తెలీక మదనపడుతూ ఉండవచ్చు. ఉదాహరణకి శరద్‌ యాదవ్‌కి మోదీ గెడ్డం గోకాలనిపించవచ్చు.  లాలూకి మోదీ కడుపులో పొడిచి పలుకరించాలని కోరిక ఉండవచ్చు. ఢిగ్గీ రాజాకి మోదీ బుగ్గలు పుణకాలని, గురుమీత్‌ సింగ్‌ అహుజాకి వీపుమీద తట్టాలని, శివప్రసాద్‌కి వారి జుత్తు సవరించాలని ఇలా వీరికి మార్గదర్శకమైన ఘనత రాహుల్‌ గాంధీది.

ఈ చర్యని పురస్కరించుకుని మిగతా నాయకులకి కూడా అవకాశాన్ని కల్పించాలని నాకనిపిస్తుంది. పార్లమెంటు సమావేశానికి ముందు మోదీని హాలు మధ్యలో నిలిపి ఆయా నాయకుల కోరికలు సాధికారికంగా జరిపిం చాలని స్పీకర్‌గారికి నా వినతి. మొన్న రాహుల్‌ గాంధీ తన ఔదార్యం చూపారు. ‘‘మీరు నన్ను పప్పు అని పిలవండి. కోపం తెచ్చుకోండి. తిట్టండి. కొట్టండి. మీమీద నాకు కోపం లేదు. రాదు’’ అంటూనే సరాసరి మోదీ సీటు దగ్గరికి చరచరా నడిచి వచ్చారు. పార్లమెంటులో ఎవరికీ ఈ చర్యకి కారణమేమిటో అర్థం కాలేదు. నా మట్టుకు ఈ మధ్యకాలంలో అంత మనస్ఫూర్తిగా కావలించుకున్న సందర్భాన్ని చూడలేదు.

అయితే ఇందులో ఏ పాత్రికేయుడూ గుర్తించని ఒక సంఘటన ఉంది. తీరా ఎవరూ ఊహించని రీతిలో రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీని వాటేసుకున్నాక, మోదీ కూడా చూస్తున్న మనందరిలాగే ఒక్క క్షణం బిత్తరపోయినా వెంటనే తేరుకుని, వెళ్లిపోతున్న రాహుల్‌ గాంధీని వెనక్కి పిలిచారు. రాహుల్‌ వెళ్లగానే మోదీ తన భుజం తట్టారు. ఆ చిన్న వ్యవధిలో మోదీ చెప్పిన మాటలు ఏమై ఉంటాయి? ఇదీ విశ్లేషకులు పట్టుకోవలసిన అంశం.

నా అనుభవాన్ని పురస్కరించుకుని నాలుగయిదు ఊహాగానాలు చేస్తున్నాను. ‘‘వెకిలి వేషాలు వద్దు పప్పూ.. దేశం చూస్తోంది.’’

‘‘శభాష్‌! రాజకీయాల్లో మీ అమ్మనీ, నాన్ననీ, మామ్మనీ మరిపించావయ్యా’’ ‘‘ఈ చర్చ మాటల సభ. డ్రామా స్టేజీ కాదు బాబు’’
‘‘పార్లమెంటుని పది జనపత్‌ స్థాయికి ఈడ్వకు బాబు, నేను కాంగ్రెస్‌ చెక్కభజనకారుడిని కాదు’’ 
ఇలాంటి మాటేదో అని ఉంటారని నా ఉద్దేశం. పార్లమెంటుని పక్కింటి పున్నయ్యతోనో, వెనకింటి వెంకయ్యతోనో ’రచ్చబండ పిచ్చాపాటీ’ చేయబోయిన కన్నుకొట్టే ’చంటివాడికి’ అంత తక్కువ వ్యవధిలో అనుకోకుండా భుజం తట్టి పాఠం చెప్పడం అనూహ్యమైన విషయం. అపభ్రంశానికి సమయస్ఫూర్తి సరైన ఠంకం. నాటకానికి వాస్తవం ఎప్పుడూ చుక్కెదురు.


- గొల్లపూడి మారుతీరావు
 

మరిన్ని వార్తలు