బాధ్యత– మానవత

13 Sep, 2018 01:49 IST|Sakshi
గొల్లపూడి మారుతీరావు

జీవన కాలమ్‌

బయట వర్షం పడుతోంది. ఓ 80 ఏళ్ల ముసలాయన కార్పొరేషన్‌ ఆఫీసుకి పన్ను చెల్లించడానికి వచ్చాడు. వరసలో వచ్చిన ఆయన దగ్గర గుమాస్తా పైకం తీసుకుని రసీదు అతని ముఖం మీద పారేశాడు. అంతవరకూ గుమాస్తా రైటే. కాని బయట వర్షం, వచ్చినాయన వృద్ధాప్యం ఎరిగి ఆ రసీదును మడతపెట్టి ఆ ముసలాయన సంచీలో పెట్టాడనుకోండి. అది బాధ్యత కాదు. పది కాలాల పాటు మిగిలే మాన వత్వం. మన దేశంలో బాధ్యత ముసుగులో డబ్బు చేసుకునే కింది తరగతి ఉద్యోగుల హవా సాగుతోంది. మొహం మీద పారేసే రసీదుకీ, మడత పెట్టిన రసీదుకీ ఓ జీవితకాలం ‘సంస్కారం’ ప్రమేయం ఉంది. 41 సంవత్సరాల క్రితం 37 ఏళ్ల గంగా దేవి ఉత్తరప్రదేశ్‌ మీర్జాపూర్‌లో తన ఆస్తి విషయంలో కోర్టుకి వెళ్లింది. మేజిస్ట్రేటు తీర్పు సుముఖంగా తెచ్చుకుంది. ఇందుకు కోర్టు ఖర్చు 312 రూపా యలు కట్టింది.

గుమాస్తా డబ్బు కట్టించుకుని రసీదు ఇవ్వడం మరిచిపోయాడు. కోర్టు కాగితాల ప్రకారం డబ్బు చెల్లించని ఆమె ఆస్తి కేసుల్లో పడింది. ఎన్నాళ్లు? 41 సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు ‘డబ్బు కట్టాను బాబోయ్‌!’ అంటూ కోర్టుల వెంట తిరిగింది. 11 మంది న్యాయమూర్తులు ఆమె నిజాయితీని శంకిస్తూ ఆమె వినతిని తోసిపుచ్చారు. ఇప్పుడావిడకి 81 ఏళ్లు. ఈ మధ్య లవ్లీ జైస్వాల్‌ అనే ఓ జడ్జీగారు ఆమె మాటకి విలువనిచ్చి కాగితాలు వెదికించారు. ఆమె డబ్బు కట్టిన రుజువులు దొరికాయి. ఇప్పుడా గుమాస్తా ఏమయ్యాడు? 41 ఏళ్ల ఆమె గుంజాటనకి ఎవరు సమాధానం చెబుతారు? ఓ గుమాస్తా అలసత్వానికి మూల్యం 41 సంవత్సరాల నరకయాతన. 

నా జీవితంలో మరిచిపోలేని సంఘటన రేడియోకి సంబంధించి ఒకటుంది. 1931 ప్రాంతంలో అంటే నేను పుట్టక ముందు ఒకాయన ఏటుకూరి బలరామమూర్తిగారి ప్రెస్సులో పనిచేసేవాడు. ఆయన ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు మల్లంపల్లి సోమశేఖర శర్మగారి తమ్ముడు ఉమామహేశ్వర రావుగారు. రేడియోలో ఆఫీసరు ఆచంట జానకీరాం గారు ఓ రోజు బలరామయ్యగారి దగ్గరకు వెళ్లినప్పుడు ‘‘చక్కగా తెలుగు రాసే మనిషిని చూసిపెట్ట వయ్యా’’ అని అడిగారట. తన దగ్గర ఉన్న ఉమామహేశ్వరరావుగారిని చూపించారు. అయితే ఆయన్ని పంపిస్తే తన పని? అందుకని ఒక పూట తన దగ్గర , మరోపూట రేడియోలో పనిచేసే ఒప్పందాన్ని ఇద్దరూ కుదుర్చుకున్నారు. ఆ విధంగా ఉమామహేశ్వరరావుగారు రేడియోలో చేరిన దరిమిలా అనౌన్సరయ్యారు.

అనౌన్సరన్న మాటేగాని మద్రాసు రేడియో చరిత్రలో ఆయన తలలో నాలిక అయ్యారు. (ఆ రోజుల్లో తమిళ కార్యక్రమాలు లేవు) నేను పుట్టి, పెరిగి, రేడియోలో ఉద్యోగాన్ని సంపాదించుకుని మద్రాసు రేడియోకి, ఆయనకి ఆఫీసరుగా వచ్చాను. అప్పటికే ఉమామహేశ్వరరావుగారికి కళ్లు మసకలు కమ్మి చూపుపోయింది. ‘చేతిలో డబ్బుల్లేక కళ్లు పోగొట్టుకున్నాను మారుతీ రావుగారూ’ అనే వారాయన. అప్పటికి ఆయన రిటైరయ్యే రోజు వచ్చింది. ఆ రోజు ఆయన బేల అయిపోయారు. దాదాపు 40 ఏళ్ల రేడియో జీవితం ముగియబోతోంది. పిచ్చివాడిలాగ ఆఫీసంతా తిరిగారు. ఆ రోజు ఆఫీసుకి వస్తూ బజారులో పంచెల చాపు కొన్నాను. నాలుగున్నరకి కాంటీన్‌లో ఆయనతో టీ తాగాను. ఎన్ని జ్ఞాపకాలు? ఎందరు ప్రముఖులతో ఎన్ని గొప్ప కార్యక్రమాలకు పౌరోహిత్యం? కదిపితే భోరుమనేట్టు ఉన్నారు. ఐదు గంటలకి నా స్కూటరు ఎక్కించుకుని దివాన్‌ బహదూర్‌ రామయ్యంగార్‌ రోడ్డు (పూనమల్లి)లోని ఆయనింటికి తీసుకొచ్చాను. అక్కడ బట్టలు చేతికిచ్చాను. అక్కడ ఆయన దుఃఖం కట్టుతెగింది. ‘నన్ను మారుతీరావుగారు ఇంటికి తెచ్చి బట్టలు పెట్టారే’ అంటూ భార్యతో భోరుమన్నారు. 

‘‘ఇవాళ దాకా మీరు అనౌన్సరు. రేపట్నించి కాజువల్‌ ఆర్టిస్టు. మీరు ఆఫీసుకు రావాలి. కాంట్రాక్టు ఇస్తున్నాను. ఇటీజెనార్డర్‌’’ అని స్కూటరెక్కాను. అలా ఎన్నాళ్లు? మరో 40 ఏళ్లు జీవించి నూరేళ్ల జీవిగా నిష్క్రమించారు. నా జీవితంలో పచ్చని జ్ఞాపకాలలో ఇదొకటి. తర్వాత మిత్రులు మల్లాది సచ్చిదానందమూర్తిగారితో చెప్పి వారికి సత్కారం ఏర్పాటు చేశాను. మూర్తిగారు వదాన్యులు. అప్పటి నుంచి ఆయన పోయేదాకా నెలకి వెయ్యి రూపాయలు పంపారు. 

ఓ గుమాస్తా గంగాదేవికి రసీదు ఇవ్వడం మరిచిపోయిన కారణంగా ఆమె 41 సంవత్సరాలు, 11 కోర్టులు పట్టుకు తిరగడం భయంకరమైన నేరం. ఉద్యోగి బాధ్యతకు కప్పదాటు. ఉద్యోగాన్ని తు.చ. తప్పకుండా చేస్తే ‘నన్ను ముట్టుకోకు నామాల కాకి’ అని బతకొచ్చు. ఓ చిన్న Gesture ఏ రూలు బుక్కులో ఉండదు. కాని మనిషిని ఎత్తున నిలుపుతుంది. ఆస్తి రసీదు బాధ్యత. దాని మడత మాన వత్వం.

- గొల్లపూడి మారుతీరావు

మరిన్ని వార్తలు