నిశ్శబ్ద విప్లవ వీరులు

6 Sep, 2018 01:11 IST|Sakshi

జీవన కాలమ్‌ 

మనం తెల్లారిలేస్తే రాబ్రీ దేవి, ఆమె ముద్దుల తనయుడు తేజస్వీ యాదవ్‌ జైలుకి వెళ్తారా లేదా? విజయ్‌ మాల్యాని మన దేశానికి ఎప్పుడు తీసుకు వస్తారు. – ఇలాంటి ఆలోచ నలతో సతమతమవుతూ ఉంటాం. ఇవి మనకి సంబం ధించిన, మన  జీవితాలను ప్రభావితం చేసే సమస్యలు కావు. అయినా ఆలోచించడం మనల్ని కృంగదీసే వ్యస నం. కానీ మరొకపక్క నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. కొత్త యోధులు– ప్రమేయం లేని వీరులు ఈ సమా జాన్ని, దేశాన్నీ ప్రభావితం చెయ్యబోతున్నారు.

ఆ అమ్మాయి – స్వప్నా బర్మన్‌ – రెండు కాళ్లకీ ఆరేసి వేళ్లు. బెంగాలులో అతిపేద కుటుంబంలో పుట్టింది. ఆ పిల్ల తండ్రి రిక్షా లాగుతాడు. తల్లి తేయాకు తోటల్లో రోజుకూలీ. వాళ్లు ఒక రేకుల షెడ్డులో బతుకుతారు. దైనందిన జీవినమే వారి సమస్య. కానీ ఫొటోలో ఆ పిల్ల నవ్వు – దైనందిన సమస్యల్ని లెక్కచేయని, ఆకాశంలోకి మోర సారించే ఓ యోధురాలి ‘విశ్వాసా’నికి ప్రతీక.

మొన్నటి ఆసియా క్రీడల పోటీలలో– హెప్ల థాన్‌ అనే క్రీడ ఒకటుంది. ఇది కొన్ని రకాల క్రీడల సమగ్ర రూపం– 100 మీటర్ల హార్డిల్స్, హైజంప్, ఇనుప గోళాన్ని విసిరే ‘షాట్‌ పుట్‌’, లాంగ్‌ జంప్, జావలిన్, 800 మీటర్ల హార్డిల్స్‌– ఇలాగ. వీటన్నిం టినీ కలిపితే– హెప్లథాన్‌. క్రీడ అన్నివిధాలా కడుపు నిండిన వ్యక్తి వినోదం. కానీ బయటి ప్రపంచపు వికారాలకు దూరంగా, పేదరికంలో, శారీరక అవలక్షణా లతో మగ్గే ఓ అమ్మాయి కాలివేళ్లతో సరైన జోళ్లు లేక నరకయాతన పడుతోంది. మంచి జోళ్లు కొనుక్కునే ఆస్కారం లేదు. అవకాశం లేదు. అయినా ఈ ప్రతికూల లక్షణాలతో, పగిలిన దవడకి బాండేజీతో ఈ క్రీడమీద ఆధిపత్యాన్ని సాధించింది. దేశీయ స్థాయిలో ఆ క్రీడలో పాల్గొని ఆసియా క్రీడలలో స్వర్ణ పతకాన్ని సాధించి– ఈ దేశ పతాకాన్ని అంతర్జాతీయంగా ఎగురవేసింది. ఆమె చిరు నవ్వులో పేదరికం లేదు. ఆకలి లేదు. అవసరాలు లేవు. ప్రపంచాన్ని జయించే విజయోత్సాహం ఉంది. ఈ విజయం తర్వాత దేశం మేలుకొంది. ఆమె కాళ్లకు సరిపోయే జోళ్లను తయారు చేయించి ఇవ్వడానికి తమిళనాడులో ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకు వచ్చింది.

మన వర్తమానాన్ని గజిబిజి చేసే కుళ్లు నాయ కత్వంతో తలమునకలవుతున్న ఈనాటి వ్యవస్థలో సాహసాన్నీ, ఆశనీ, విశ్వాసాన్నీ నింపే గొప్ప యోధులు వీరు. ఇంకా కింది దశలకు వెళ్తాను. 15 ఏళ్ల కిందటి కథ. మా ఇంట్లో ఓ వంట మనిషి. భర్త తాగుబోతు. ఇద్దరు ఆడపిల్లలు. తాగుబోతు భర్తని దూరంగా తగిలేసింది. ఈ ఇంటికి వంటకి వచ్చినప్పుడు– ఏడె నిమిదేళ్ల ఈ ఇద్దరు పిల్లల్నీ అల్లరి చెయ్యకుండా– ఇంటి బయట గోడ దగ్గర కూర్చోపెట్టేది. వారికి వారి పేదరికం తెలుసు. తమ పరిమితి తెలుసు. బుద్ధిగా కూర్చొనేవారు. మా ఆవిడ ఎప్పుడైనా ఏదైనా ఇస్తే తినేవారు. మా మనుమ రాళ్ల బట్టలు ఇస్తే వేసుకునే వారు. పలకరిస్తే పలికే వారు. లేకపోతే కుంచించుకపోయి– తమ ఉనికి మరొకరిని బాధించకుండా ఆ గోడకి ఒదిగిపోయేవారు. తల్లి పని పూర్తయ్యాక– నిశ్శబ్దంగా చెయ్యి పుచ్చుకు నడిచిపోయేవారు. ఏమవుతారు ఈ పిల్లలు? చదువుకుంటారా? వీళ్లూ వంటలు చేస్తారా? అది హీనమైన పనేం కాదు. అయినా రెండో తరానికి వార   సత్వంగా ఇచ్చే పనేనా? ఎప్పుడైనా మనస్సులో కదిలేది. 15 ఏళ్ల తరువాత వీళ్లిద్దరూ పోస్టు గ్రాడ్యు యేట్లయ్యారు. బియ్యే తరువాత కాలేజీ వీళ్లని పిలిచి స్కాలర్‌షిప్పు లిచ్చింది.

40 ఏళ్ల కిందటిమాట. మరొక పేద ఇల్లాలు. ఒక మహా కర్ణాటక విద్వాంసుని దూరపు బంధువు. మేం మద్రాసులో ఉన్న రోజుల్లో మా ఇంటికి వచ్చేది. మా ఆవిడకి వంటలో తోడుగా నిలిచేది. జీతానికి కాదు. బియ్యం నూకలు ఇస్తే కొంగున కట్టుకువెళ్లి పిల్లలకు వండిపెట్టేది. ఒక్కోసారి అక్షింతలు పోగుచేసి, కడిగి వండి– అందరికీ వేర్వేరుగా వడ్డిస్తే సరిపోదని ఒక కంచంలో అన్నం కలిపి పిల్లల నోటికి అందించేది. ఆ పిల్లలు సౌందర్యవంతులు. తర్వాతి కాలంలో ఓ పారి శ్రామికవేత్త ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి మేం వెళ్లాం. ఇప్పుడామె కోటీశ్వరురాలు. కుర్రాడు పెన్నుల కంపెనీలో ఆఫీసరు. ఎప్పుడూ ఓ పెన్నుల పార్శిలు పట్టుకుని నన్ను కలుస్తాడు– ‘మీరు మాకు అన్నం పెట్టారు మామయ్యగారూ’ అంటూ.

పేదరికం రెండో పార్శ్వమిది. ఒకరు ఆత్మ గౌర వంతో మంచి జీతానికి నిచ్చెనలు వేస్తూ సమా జాన్ని ఆరోగ్యవంతంగా నిలుపుతున్నారు. మరొకరు దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలుపుతున్నారు. వీరు ఉల్ఫా నాయ కులు కారు. ఇది దేశాన్ని కొల్లగొట్టే అవకాశవాదుల కథ కాదు. స్వప్నా బర్మన్‌ కథ ఈ దేశానికి విజయపతాక. కళ్లు మిరుమిట్లు గొలిపే నిశ్శబ్ద విప్లవానికి సంకేతం. బంగారు కాంతులతో మెరిసే తూర్పు.

గొల్లపూడి మారుతీరావు
 

>
మరిన్ని వార్తలు