ప్రదక్షిణం

21 Feb, 2019 00:56 IST|Sakshi

జీవన కాలమ్‌

పుల్వామా సంఘటనకి ప్రపంచం నిర్ఘాంతపో యింది. దేశం ఆవేశంతో ఉడికిపోయింది. ఉద్రేకంతో ఎదురుదెబ్బ తీయాలని పిడికిలి బిగించింది. హింసా కాండలో కన్నుమూసిన 40 మంది వీరుల అంత్యక్రియ లను చూసి 24 గంటలలో కోట్లాదిమంది కన్నీరు కార్చారు. ఆవేశం కార్యసాధకుడి ఆయుధం కాదు. ప్రతీ కారం పళ్లు కొరకదు. ఒకే ఒకమాట– అదే మొదటి మాట– మోదీగారన్నారు ‘ప్రాణాలర్పించిన వీరుల త్యాగం ఊరికే పోదు’ అని. ఈ వాక్యాన్ని ఒక చానల్‌ పదేపదే ప్రకటించింది. ఏం చేస్తారు? ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? చేశాక కానీ దేశానికి తెలియదు. చెయ్యడం పాకిస్తాన్‌కి తెలియదు.

నేను నటుడిని. కెమెరా ముందు సంవత్సరాల తరబడి నిలబడినవాడిని. కెమెరా నటనను పట్టుకుంటుంది. మరొకటి కూడా పట్టుకుంటుంది. నటుడి తాదాత్మ్యాన్నీ, మానసిక స్థితినీ, అంతరాంతరాల్లో పాత్రపట్ల అతని నిజాయితీని పట్టుకుంటుంది. ఇది దాచినా దాగని నిజం. ఈ నిజం ఒకప్పుడు తుపా కీలాగా పేలుతుంది. గుండెల్ని పిండి చేస్తుంది. నేను గతంలో చేసిన కొన్ని పాత్రల్ని చూసినప్పుడు ‘ఈ సన్నివేశంలో ఈ ఉద్రేకం ఇంత పండిందేమిటి’ అని ఆశ్చర్యం కలుగుతుంది. దీనికి ఇంగ్లిష్‌లో ఒక పేరుంది– body language. ఒక వ్యక్తి ‘జీవుని వేదన’. ఇది మరీ పెద్దమాట కనుక– మొహమాట పడుతూ ఉటంకిస్తున్నాను. ఇది ప్రయత్నించినా నటుడు సంధించలేడు. కానీ అతని నిజాయితీ, తాదాత్మ్యం అతను ప్రయత్నించకపోయినా విద్యుత్తు లాగా విస్ఫోటనమవుతుంది.

40 మంది వీరుల మృతదేహాలు ఢిల్లీ చేరాయి. అధికారగణం, మూడు సైనిక దళాల నాయకులు, ప్రతిపక్ష నాయకులు– త్రివర్ణ పతాకాలు చుట్టిన యువ సైనికుల దేహాల ముందు నిలబడ్డారు. అది అతి హృదయవిదారకమైన దృశ్యం. ఎంతటి వాడి కయినా గుండె చెరువు అవుతుంది. వందల కెమెరాలు ఆ దృశ్యాన్ని చూపుతున్నాయి. ఒక్కరే– ఒకే ఒక్కరు– ఆ మూడ్‌లో లేరు. ఆయన పేరు రాహుల్‌ గాంధీ. ఆయన మొబైల్‌ ఫోన్‌ సవరించు కుంటున్నారు.దేశమంతా ఆ దృశ్యాన్ని చూస్తోంది. ఎదురుగా అతి గంభీరంగా, నిశ్చలంగా ఆవేశాన్ని పూరించిన ముఖంతో ఒకాయన నిలబడి ఉన్నారు– మోదీ. Last post మోగింది. మహా వీరులకు జరిపే అంతిమ సైనిక వందనమది. ప్రయత్నించినా కళ్లు వర్షించ కుండా ఆగని సందర్భమది. ఆ సందర్భంలో మోదీ ‘ప్రతీకార వాంఛ’, ‘కోపం’, ‘నిస్సహాయత’ నిప్పు అక్కర లేకుండా కార్చిచ్చుని లేపగలదు.

సైనిక మర్యాద అయిపోయింది. ఇక ఆ మృతదేహాలు వారి వారి జన్మస్థలాలకు ప్రయాణం చేస్తాయి. అక్కడ వారికి నివాళి అర్పించే– ఆత్మీ యుల, ఆవేశపరుల సమూహాలు ఎదురుచూస్తు న్నాయి. ఈ యువకులతో ఆఖరి ప్రమేయమది. ప్రధాని ‘మర్యాద’ ఓ క్షణం ముందు ముగి సింది. కానీ మోదీ ఆవేశం, ఆ యువవీరులతో పంచుకునే ఆఖరి సందేశం ముగియలేదు. మోదీ వెనక్కి వెళ్లలేదు. వందనంతో వైదొలగలేదు. ఆ 40 మంది చుట్టూ ప్రదక్షిణం.. గంభీరంగా ప్రదక్షిణ చేశారు. పేరు పేరునా ‘శపథం’ చేశారా? ఆఖరి సందేశం ఇచ్చారా? మూగగా ఆక్రోశించారా? ఎదురుగా ఉన్న ప్రముఖుల సమూహం నివ్వెర పోయింది. అందరూ నిశ్శబ్దంగా నిలిచిపోయారు. మోదీ 40 మందినీ పేరు పేరునా పలుకరించే ఆఖరి ప్రదక్షిణ చూస్తూనే టీవీ ముందు నేను భోరుమ న్నాను– పసివాడిలాగా ఏడ్చాను. తన ఆత్మీయుల్ని నష్టపోయిన ఓ కుటుంబ నాయకుని ఆక్రందనకి– కార్యరూపమది. ఈ చర్యకి ప్రోద్బలమూ లేదు. ప్రయత్నమూ లేదు. ప్రయ త్నించి ఎవరూ చేయలేరు.జీవుని అంతరాంతరాళాలలో వేదనకి– ఆకస్మి కమైన, మాటలకు అందని కార్యరూపమది. దాని పేరే– body language.

సైనిక వందనం తర్వాత అవనత శిరస్కుడై ప్రధాని అక్కడ నిలిచిపోయాడు.ఈ కాలమ్‌ ప్రధానమంత్రి గురించి కాదు. నరేంద్ర మోదీ గురించి కాదు. నాలుగైదు సంవత్స రాల బిడ్డలున్న పాతికేళ్ల కుర్రాళ్లు, ఇంకా పసుపు ఆరిపోని తాళిబొట్లున్న భార్యలు ఇళ్లల్లో ఎదురు చూస్తుండగా దౌర్జన్యకారుల దౌష్ట్యానికి శరీరాలు గుర్తు పట్టలేనంత ఛిద్రంకాగా, మరికొన్ని గంటల్లో వారి అవశేషాలు మంటల్లో ఆహుతి కానుండగా– గుండెలు మండే ఆవేశంతో ఓ పెద్ద దిక్కు వారికి అంతిమ సందేశాన్ని, నివాళిని, ఊరటని, హామీని, మరొక్కసారి గుండెనిండా కర్తవ్య దీక్షని పూరిం చుకునే వ్యక్తిగత క్షణమది. జీవుని వేదన తోసుకు రాగా– ఓ అగ్ని పర్వతం, ఓ మానవత్వపు మమ కారం ఆ 40 మంది సమక్షంలో గుండెల్ని పూరించు కుంది. వారి రక్త తర్పణానికి కృతజ్ఞత తెలిపింది. ఆ జ్ఞాపకాన్ని తాను ముందు జరపబోయే చర్యకి మన స్సులో నిక్షిప్తం చేసుకుందా?ఆ క్షణం ఓ ఆర్ద్రమైన విషాదానికి ముగింపు. ఓ నిర్నిద్రమైన ఆవేశ దీక్షకి ప్రారంభం. ఆ క్షణంలో అతను ప్రధాని కాదు– అవును. He is larger than life.


గొల్లపూడి మారుతీరావు 

మరిన్ని వార్తలు