కొత్త నియోజకవర్గం

3 May, 2018 01:15 IST|Sakshi

జీవన కాలమ్‌

ఈ ప్రభుత్వం చట్టమయితే చేసింది కానీ– ఏదీ? దమ్ముంటే ఒక్క కుర్రాడిని ఉరి తీయమనండి. రాజీవ్‌ గాంధీని మారణ హోమం చేసిన నేరస్థురాలికి 22 సంవత్సరాల తర్వాత కూడా విమోచన లేదు.

మా నమశ్శివాయని ఈ కాలమ్‌ పాతికేళ్లుగా చదువుతున్నవారయితే గానీ ఎరగరు. కొంచెం ముక్కుమీద గుద్దినట్టు మాట్లాడేమనిషి. మనిషి కాస్త ఖండితంగా చెప్తాడు. ఎదుటివాడు ఏమనుకుంటాడో ఆలోచించడు. ఇప్పుడు ఇది చూడండి. ముందు మనదేశంలో రేపుల కథల నమూనాలు చూద్దాం. ఇది ఒక పత్రిక మొదటి పేజీ కథ. బీహార్‌ జహానాబాద్‌లో కేవలం నలుగురు యువకులు ఒకమ్మాయిపై అత్యాచారం చేశారు. ఇందులో మరో నలుగురయిదుగురు యువకులు కూడా చేయి కలిపారని ఈ వీరులు చెప్పారు. శ్రీనగర్‌ కథువా జిల్లాలో 8 ఏళ్ల అమ్మాయిని కొందరు అత్యాచారం చేసి చంపేశారు. ఒడిశా కేంద్రపానికా పోలీసు స్టేషన్‌ పరిధిలో ఒక సొంత మేనమామ నాలుగేళ్ల అమ్మాయిని అత్యాచారం చేశాడు.

ఉత్తరప్రదేశ్‌ కనుజ్‌ ప్రధాన్‌ జిల్లాలో ఇద్దరు ప్రబుద్ధులు ఒక అమ్మాయిని రేప్‌ చేస్తుండగా మరో ఇద్దరు శృంగార పురుషులు వీడియో తీసి నలుగురికీ పంచారట. ఒడిశా లోని జగన్నాథపూర్‌లో కేవలం 6 ఏళ్ల ఆడపిల్ల అత్యాచారానికి గురై 8 రోజులు ప్రాణాల కోసం పోరాడి చచ్చిపోయింది. జమ్ములో ముగ్గురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు 24 ఏళ్ల స్త్రీపై అత్యాచారం జరిపి, వీడియో తీసి, ఈ విషయాన్ని బయటపెడితే వీడియోను అందరికీ పంచుతామని హెచ్చరించారట. అన్నిటికన్నా విడ్డూరం– ఇలా రేప్‌ చేసిన నేరస్తుల్ని శిక్షించే చట్టాన్ని రాష్ట్రపతి అమలు జరిపే ’రోజున’ కేవలం 110 రేప్‌లు మాత్రమే జరిగాయట. ఉత్తరప్రదేశ్‌ ఇందులో మళ్లీ అగ్రస్థానం.

మన నెల్లూరులో చెన్నూరు గ్రామంలో ఓ ఆరేళ్ల అమ్మాయిపై ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ మైనర్‌ కుర్రాడు అత్యాచారం చేశాడట. బీహార్‌లోని ఉన్నావ్‌లో ఓ 9 ఏళ్ల అమ్మాయిని ముజాఫర్‌పూర్‌లో అయిదుగురు అత్యాచారం చేశారు. ఒడిశాలో నయాఘర్‌ జిల్లాలో దేవరాజ బారిక్‌ అనే వ్యక్తి ఒక మహిళపై రెండు నెలలుగా అత్యాచారం సల్పుతుండగా ఆ అవమానం భరించలేక ఆమె నిన్న ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి కేసులు 11,12,628 ఉన్నాయని నిన్న సుప్రీం కోర్టు ప్రకటించింది. వీటిలో మళ్లీ అగ్రస్థానం ఉత్తరప్రదేశ్‌–30,883 కేసులు. తర్వాతి స్థానం చెప్పి ముగిస్తాను: మహారాష్ట్రలో 16,099 కేసులు.

ఇంత చెప్పాక వీరినందరినీ ఉరి తీయడం సబబు కాదంటాడు మా నమశ్శివాయ. ఈ ప్రభుత్వం చట్టమయితే చేసింది కానీ– ఏదీ? దమ్ముంటే ఒక్క కుర్రాడిని ఉరి తీయమనండి. రాజీవ్‌ గాంధీని మారణ హోమం చేసిన నేరస్థురాలికి 22 సంవత్సరాల తర్వాతే విమోచన లేదు. మనకి మానవ హక్కుల చట్టాలున్నాయి. మానవతావాదులున్నారు. మతాలున్నాయి. రైళ్లు తగులబెట్టే కులాలున్నాయి. రైళ్లని ఆపే ప్రాంతాలున్నాయి. జాతులున్నాయి. వర్గాలున్నాయి. చిట్టచివరిగా పార్టీలున్నా యి. నిన్న జైలు శిక్షపడితేనేంగాక – ఆసారాం బాపూలున్నారు. వీరందరూ ఊరుకుంటారా? చచ్చిపోయిన ఆ రేళ్ల బిడ్డ మరణం కంటే చావవలసిన 15 ఏళ్ల కుర్రాడి భ విష్యత్తుని గురించి జెండాలు పట్టుకుని బయలుదేరరా?

దేశం పేరు ఇప్పుడు గుర్తులేదు గానీ– ఆ దేశంలో ఒకడు బజారులో పరిగెత్తుతున్నాడు. పోలీసులు వెంట తరుముతున్నారు. ఆ కుర్రాడు కిందపడ్డాడు. కదులుతున్న అతని తలమీద తుపాకీ ఉంచి కాల్చాడు పోలీసు. కుర్రాడు చచ్చిపోయాడు. ఎందుకయినా మంచిదని మరొకసారి కాల్చాడు. బజారులో వందలాది మంది ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. మరి కనిపించని వెనుకవారి మాట? ఆ దృశ్యాన్ని ఒక క్రేన్‌కి కట్టి ఊరేగించారు. భయంకరం.

అక్కడ మానవ హక్కుల సంఘం లేదా? మానవ సంఘాలు లేవా? మతప్రముఖులు లేరా? ఒక్కటి మాత్రం ఆ తర్వాత లేదు. రేప్‌.
ఈ దేశంలో ఒక కుర్రాడిని ఉరితీయమనండి. పేపర్లు విరగబడతాయి. ఇంకా మన అభిమాన హీరో సల్మాన్‌ ఖాన్‌ నల్లజింక కేసే 20 ఏళ్లుగా నడుస్తోంది. ఇంకా దానికి దిక్కులేదు. మరి రాష్ట్రపతి గారి చట్టం ప్రకారం–ఒక అత్యాచారానికి నలుగురిని వేసుకున్నా 4 లక్షల ఓట్లు వృ«థా. కనుక వీరిని ఒక వర్గంగా గుర్తించి ’రేప్‌లS నియోజకవర్గం’ అనో ఇంకా దమ్ముంటే ’రేపటి నియోజకవర్గం’ అనో గుర్తించాలంటాడు మా నమశ్శివాయ. అందువల్ల మనకి కొందరయినా మంత్రులు మిగులుతారు, మత గురువులు మిగులుతారు. స్థానిక నాయకులు మిగులుతారు. జైళ్లు ఖాళీ అవుతాయి. దేశం ’రేపుయుతం’గా ఉంటుంది.
మరి ఈ నియోజకవర్గం ఏ పార్టీని సమర్థించాలా అన్నది అప్పుడే కొందరి మనసుల్లో కదిలిన మీమాంస. అయ్యా, ముందు అత్యాచారాలు విరివిగా జరగనివ్వండి. 2019 దగ్గర పడనివ్వండి. రేపు సంగతి తర్వాత చూద్దాం. ఏమయినా మా నమశ్శివాయ గట్టి పిండం. 

గొల్లపూడి మారుతీరావు 

మరిన్ని వార్తలు