ఉల్కలు– ఉరుములు

7 Mar, 2019 02:59 IST|Sakshi

జీవన కాలమ్‌

ప్రజాభిమానాన్ని చూరగొనడానికి సుదీర్ఘ పరిశ్రమ, ప్రతిభ, కొండొకచో చిన్న అదృష్టం కలిసి రావాలంటారు. అయితే ఇవేవీ అక్కరలేని అడ్డుతోవ ఒకటుంది. నిర్భయ దుర్ఘటన, బాబ్రీ మసీద్‌ కూల్చివేత, అణు పరీక్ష ఇలాంటివి. అయితే కొన్ని ప్రచారాలు ఎప్పుడు, ఎందుకు వస్తాయో తెలియదు. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆశ్చర్యమూ, షాకూ కలుగుతుంది. ఈ మధ్య సినీరంగంలో ఈ అడ్డుతోవల సంఘటనలు, ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇవి అనూహ్యం, ఆశ్చర్యకరం, ఇంకా చెప్పాలంటే విచిత్రం, విలక్షణం. ఈ మధ్య ఒమార్‌ లులు అనే దర్శకుడు ‘‘ఒరు ఆధార్‌ లవ్‌’’ అనే మలయాళ సినిమాను నిర్మించాడు. ఇది పామర భాషలో ‘విరగదీసే’ చిత్రం కాదు. అయితే అందులో ప్రియా వారియర్‌ అనే కొత్త అమ్మాయి నటించింది.

ఒకానొక సీన్‌లో ఆ పిల్ల సరదాగా దూరపు క్లాసు బెంచీలో కూర్చున్న కుర్రాడిని చూసి కన్నుకొట్టింది. కుర్రాడు నవ్వాడు. రెండు వేళ్లు బిగించి రివాల్వర్‌లాగా కాల్చింది. కుర్రాడు గాయపడినట్టు తలవొంచాడు. అంతే, మిన్నువిరిగి మీద పడింది. ఇదేం కొత్త విన్యాసం కాదు. కానీ ఈమె కన్నుకొట్టడాన్ని దేశం ఉర్రూతలూగి అందుకుంది. ప్రచార సాధనాలన్నీ ఒళ్లు విరుచుకుని ఈ దృశ్యాన్ని ప్రచారం చేశాయి. దేశం పిచ్చెక్కిపోయింది. ఈ పాపులారిటీ ఎంతవరకూ పోయిందంటే – దేశంలోని ఇస్లాం వర్గాలు అలా ఓ ఆడపిల్ల బరితెగించడం సంప్రదాయ విరుద్ధమని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి! ఎక్కడ చిన్న మలయాళ సినిమా? ఎక్కడ ఊసుపోని సంఘటన. సుప్రీంకోర్టు ఆశ్చర్య పోయింది. చివరకు ‘‘పోవయ్యా. ఇదేదో చిన్నపిల్లల ఆట’’ అని కేసుని కొట్టి వేసింది.

కొన్నేళ్ల కిందట– కొందరు కుర్రాళ్లు కలిసి ఓ సినిమా తీశారు. ప్రముఖ సినీ హీరో రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ ఇందులో హీరో. సినిమా పెద్ద ఊడబొడిచింది కాదు. కానీ ఆడుతూ పాడుతూ కుర్రాళ్లందరూ కలిసి – అనురుద్‌ రవి శంకర్‌ అనే కుర్రాడి ‘‘కొలవరి డీ’’ అనే పాటను రికార్డు చేశారు. అంతే, ఆ పాట కార్చిచ్చులాగా– భాషలకతీతంగా దేశంలో గంగవెర్రులెత్తించింది. ఎంత వెర్రి! బహుశా ఈ ‘కొలవరి’ నిర్మాతలే ఆశ్చర్యపోయి ఉంటారు.

ఈమధ్య మా పెద్దబ్బాయి నన్ను లాక్కెళ్లి ధియేటర్‌లో  కూర్చోపెట్టాడు. సినిమా పేరు ‘‘96’’. 1996లో కొందరు ఓ కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఇందులో ఆడా మగా–రకరకాల మనస్తత్వాల పిల్లలు. ఓ పదేళ్ల తర్వాత ఈ గుంపు మళ్లీ కలుసుకోవాలనుకున్నారు. కలుసుకోవడమే  సినిమా. ఇందులో ఓ అమ్మాయిపట్ల మక్కువ ఉన్నా మనసిప్పలేని మొహమాటస్తుడు హీరో. ఆ పిల్ల ఇప్పుడు పెళ్లి చేసుకుని, ఓ కూతుర్ని కని సింగపూర్‌లో  భర్తతో కాపురం చేస్తోంది. అందరూ కలిశారు. ఇందులో ఓ అమ్మాయి గర్భవతి. నలుగురూ రకరకాలుగా జీవితాల్లో సెటిల్‌ అయినవారు. ఈ సింగపూర్‌ అమ్మాయి వచ్చింది. మొహమాటస్తుడయిన కుర్రాడూ వచ్చాడు.

తెల్లవారితే మళ్లీ అందరూ విడిపోతారు. ఈ కుర్రాడికీ, ఆ అమ్మాయికీ  ఇప్పుడు తమతమ మనస్సులు తెలిశాయి. నిజానికి రాత్రంతా ఏకాంతంగా గడిపారు. కబుర్లు చెప్పుకున్నారు. కలిసి జీవించలేక పోయిన అసంతృప్తి ఇద్దరిలో–ప్రేక్షకులకీ తెలుస్తోంది. అదొక  nostalgic pain. అయితే  ఏకాంతంలో కూడా వారిద్దరూ సభ్యతను పాటించారు. తమ తమ దూరాల్ని ఎరిగి ప్రవర్తించారు. ఒక్కసారయినా ఏకాంతంలో తొందరపడతారా? అయినా ఒకరినొకరు కనీసం ముట్టుకోలేదు. తెల్లవారింది. ఆమెకు వీడ్కోలు చెప్పాడు హీరో. ఇద్దరి మనస్సుల్లోనూ – వాస్తవం కాని ‘కల’ అలాగే ఉండి పోయింది! ఇంతే కథ.

ఇదిపెద్ద పెద్ద చిత్రాల్ని తలదన్నేసింది. హీరో కర్మాగారంలో ‘కళాసీ’లాగ ఉంటాడు. అమ్మాయి ఒప్పులకుప్ప. స్టార్‌. హీరో ఈసినిమాతో పెద్ద స్టార్‌ అయిపోయాడు. మొన్న ఒక సభలో ప్రేక్షకులు గింగుర్లెత్తి –‘మీరెలాగూ సినీమాలో ఒకరి నొకరు ఆలింగనం చేసుకోలేదు. ఇప్పుడు మా కళ్ల ముందు చేసుకోం ‘‘అని కేకలేశారు! ఆ దృశ్యానికి ప్రేక్షకుల గగ్గోలు! ప్రజా సందోహంలో ‘పాపులారిటీ’కి అర్థాలు మారిపోయాయి. అయితే – చాప్లిన్‌ పాపులారిటీకి కన్నుకొట్టిన కుర్రదాని పాపులారిటీకి, కొలవరికీ  ‘కొల బద్దలు’ మారాయి. ఉరకలెత్తించే ఉత్తేజాలు కనిపించని ఆధునిక జీవితంలో ఈ చిన్న చిన్న ‘మెరు పుల్ని’ జనసందోహం ఏరుకుంటోందా? లక్షలాది ప్రజల సమష్టి ఆనందానికి ఇది విచిత్రమయిన కుదింపా? సినిమా హృదయాల్ని కదిలించే ఆనందానికి విడాకులిచ్చి– ఇప్పుడిప్పుడు పాపులారిటీకి నరాల్ని  నమ్ముకుంటోంది.


- గొల్లపూడి మారుతీరావు

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు