అకాల ఆత్మహత్యలు

25 Oct, 2018 01:08 IST|Sakshi

జీవన కాలమ్‌

ఈమధ్య 14 ఏళ్ల కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నట్టు పేపర్లో వార్త. ఏమిటిది? చక్కగా ఆడుతూ, పాడుతూ తిరగాల్సిన వయస్సు. ‘చావు’ అన్నమాటే దగ్గరకు రానక్కరలేని వయస్సు. ఏమయింది? ప్రముఖ సోషియాల జిస్టు ఆల్విన్‌ టాఫ్లర్‌ ఈ జబ్బుకి ఒక పేరు పెట్టాడు– ఫ్యూచర్‌ షాక్‌ అని. రేపటి పరిణామాలు ఇవాళే దూసుకు మీద పడిపోతూ– వాటి అవగాహన కుది రేలోగా కొత్త పరిణామాలు దూసుకువస్తూ– రేపు నేటిని దోచుకుంటున్న విపరీత పరిణామం పర్య వసానమిది అని.

నా చిన్నతనంలో కంప్యూటర్‌ లేదు. మొబైల్‌ లేదు. చేతిలో సినిమా లేదు. ఇన్ని హోటళ్లు లేవు. ఇన్ని జబ్బులు లేవు. ఇన్ని పత్రికలు లేవు. ఇంతగా ‘అవినీతి’ వితరణ లేదు. ఇన్ని మానభంగాలు లేవు. నాయకులలో ఇంత లుచ్చాతనం లేదు. యాసిడ్‌ చావులు లేవు. అన్నీ ఒక్కసారి మీదపడితే? పసి మనసులకు ‘రేపు’ అంధకారంగా కనిపిస్తే? తల్లిదండ్రులు ఆఫీసుల్లో మాయమవుతున్నారు. పిల్లలు ఏం కావాలో వాళ్లు ఉగ్గుపాలలో ఉండగానే వీళ్లు నిర్ణయించేస్తున్నారు. ఆ ‘కావాల్సిన’ అర్హతలకి ధరకట్టే విద్యాసంస్థలు లేచాయి. వాళ్లకి 10 ఫస్టు క్లాసులు, 56 సెకండ్‌ క్లాసులే తెలుసు. సంజీవరా వు, విజయలక్ష్మి తెలియదు.

తెలియదని కుర్రా డికి తెలుసు. చదువుకి అమ్ముడుపోయిన కుర్రాడు హాస్టల్‌ గదులకి బందీ అవుతున్నాడు. తల్లిదండ్రులు పెట్టుబ డికి తగ్గట్టు ఆశించిన, విద్యాలయాలు తమ పేపరు ప్రకటనలకి తగ్గట్టు ఎదురుచూసిన రిజల్టు రాకపోతే? నేటి కుర్రాళ్లకి ఆటలు తెలీవు. గోళీకాయలాట, గోటీ బిల్ల తెలీదు. ఆటలో కిందపడి దెబ్బలు తగిలించు కోవడం తెలీదు. తల్లిదండ్రులతో సహజీవనం తెలీదు. ఓటమి అనే అదృష్టం తెలీదు. ఫరవాలేదని ఓదార్చే ‘పెద్దరికం’ తెలీదు. తాము ఆశించిన డిగ్రీకి పెద్దల పెట్టుబడి తమ చదువని మాత్రం తెలుసు.

నా చిన్నతనంలో ఆదివారాలు– చిరస్మరణీ యాలు. పొద్దుట్నించీ మా నాన్నగారిని దువ్వేవా డిని– మూడు అణాల కోసం. బులిపించి బులిపించి ఇచ్చేవారు. అక్కడినుంచి విశాఖపట్నం బీచ్‌లో మినర్వా టాకీసుకి పరుగు– నాడియా– జాన్‌కీవాస్‌ చిత్రం చూడటానికి. మా నాన్నగారికి తెలుసు– నేను అడుగుతానని. కానీ ఆ డబ్బుని నేను ‘సంపాదించు కోవాలి’. అదీ ముఖ్యం. ‘ప్రయత్నం’ ఫలితాన్ని అలంకరిస్తుంది. సినిమా ఏమిటని ఆయన ఒకనాడూ అడగలేదు. నాకు సినిమా మైకం అయింది. 57 సంవ త్సరాలు అది నాకు ఆరాధ్యమయింది.

యూనివర్సిటీకి రోజూ బస్సుకి అయిదణాలు. మా నాన్నగారి జీతం ఆ రోజుల్లో 30 రూపాయలు. నా టర్మ్‌ జీతం 30. ఏ రోజూ ఆయన అదనపు సొమ్ము ఇవ్వలేదు. నాకు అడగటం తెలీదు. ఏ రోజూ యూనివర్సిటీ క్యాంటీన్‌లో కాఫీ తాగలేదు. నేను పేదవాడిని కాదు. కానీ ‘పరిమితి’కి అలవాటుపడిన గంభీరమైన జీవికకు ఒదిగినవాడిని. అవసరాల్ని కుదించుకోవడం పరోక్షంగా అలవాటు అయింది.

ఓసారి మా నాన్నగారి ఆఫీసు ప్యూన్‌ సైకిలు తొక్కబోయి కిందపడి మోకాలు చెక్కుకుపోగా– ఇంట్లో చెప్పకుండా నిద్రపోయాను. నిద్రలో నొప్పితో మూలిగే నా కాలికి మా నాన్నగారు మందు రహ స్యంగా రాయడం లీలగా జ్ఞాపకం. సైకిలు తొక్కి నందుకు నిలదీయలేదు. ఒక ప్రయత్నంలో నన్ను ‘ఫెయిల్‌’ అవనిచ్చారు. అదీ మెలిక. తమ ఫెయి ల్యూర్‌ని పెద్దలు అంగీకరించడం ఈ కాలం కుర్ర కారుకి తెలీదు.

మా నాన్నగారితో కూరల బజారుకి వెళ్లేవాడిని. ఏ రోజూ నన్ను కూరలు ఎంపిక చెయ్యనివ్వలేదు. సినీ నటుడినై– పరపతి గడించాక, డ్రైవరుతో విశాఖ బజారులో నిలిచి–అందరూ నిర్ఘాంతపోయి చూస్తుం డగా బెండకాయలు ముచికలు విరిచి ఏరడం సరదా. అది నా ఖరీదైన వినోదం. అతి సామాన్యమైన అను భవాలకు జరీ అంచు తొడిగిన సందర్భాలివి.

ఈ కాలం పిల్లలకి ఓటమి తెలీదు. అవసరాల కుదింపులో ఒద్దిక తెలీదు. హితవు చెప్పే పెద్దల ఉనికి తెలీదు. మాస్టర్లని గౌరవించడం తెలీదు. కన్నెత్తి చూసే ఆదర్శ నాయకత్వం తెలీదు. కష్టంలో హితవు చెప్పే నాథుడి గురించి తెలీదు. పెద్దల ఉనికిని నష్ట పోయిన అబ్బాయీ అమ్మాయీ కలయికకి ‘ప్రేమ’ అని దొంగపేరు పెట్టుకోవడం తెలుసు. అమ్మాయి దూరమైతే పరిస్థితిని అంగీకరించడం తెలీదు. యాసిడ్‌ పోయడం తెలుసు.

మనసారా కంటతడి పెట్టే అవకాశం లేదు. చేసిన తప్పుని రహస్యంగా నయినా అంగీకరించే ‘పెద్దరికం’ తెలీదు. అపజ యాన్ని అంగీకరింపజేసే ‘హితవు’ తెలీదు. టీచర్లకి విద్యార్థులతో సయోధ్య తెలీదు. పరిస్థితి ఎక్కడన్నా పట్టాలు తప్పితే? ఒక్కటే ఉంది. ఆత్మహత్య.

ఈ మధ్య సర్వే ప్రకారం– బెంగళూరు, చెన్నై, ముంబైలలో 59 శాతం మంది ఎలా ఆత్మహత్య చేసు కోవాలో మార్గాలు వెతుకుతున్నారట. ఇంకా దారు ణం 47 శాతంమంది ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తు న్నారట. ఒక్కడు– ఒక్కడంటే ఒక్కడు– పత్రికకి ఎక్కుతున్నాడు. అంతే.

వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు
 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు