తప్ప(ప్పు)టడుగులు

19 Oct, 2017 01:10 IST|Sakshi

జీవన కాలమ్‌

నేటి విద్యా విధానం, విద్యా వ్యాపారులు, చదువులు తెలీని నాయకత్వం, వీపుల మీద గుదిబండల్ని మోపిన వ్యవస్థ– ‘రేపు’ని అంధకారం చేసి, అమాయకమైన కుర్రాళ్లకు ఉరితాళ్లను అందిస్తోంది.

ఈ మధ్య చదువుకునే విద్యార్థుల ఆత్మహత్యల గురించి వింటున్నాం. బాధపడేవాళ్లూ, అన్యాయం జరుగుతోందని ఆవేశపడేవాళ్లూ, ఇలా జరగనివ్వమని బల్లగుద్దే నాయకులూ, ఆయా విద్యా సంస్థల్ని మూసెయ్యాలని గొంతుచిం చుకునే కొందరు తెలివైన కుర్రకారూ– అదొక ముమ్మరం. కారణాలు నాకు తెలుసు, నా ఒక్కడికే తెలుసు. మా తరంలో సత్య నాదెళ్లలు లేరు. సుందర్‌ పిచ్చయ్‌లు లేరు. ఇందిరా నూయీ, శాంతను నారాయణ్, అజయ్‌ బంగాలు లేరు. మైకుల ముందు గొంతులు చించుకునే విద్యార్థి నాయకులు లేరు. ‘‘ఈ విద్యార్థుల్ని ఉద్ధరించేవారెవరని కాలేజీ, యూనివర్సిటీ కేంపస్‌లలోకి జొరబడి కుర్రాళ్ల ఆవేశాన్ని సొమ్ము చేసుకునే ‘కుహనా’ నాయకులు లేరు. వారి అవసరాలకు బలి అయ్యే విద్యార్థి ‘వెర్రి గొర్రెలు’ లేరు.

ముందు ఓ చిన్న కథ చెప్తాను. మహానటుడుచార్లీ చాప్లీన్‌ ‘కిడ్‌’ చిత్రం ఎడిటింగ్‌ చేసుకుంటుండగా ఆయన స్టూడియోకి– ఏడేళ్ల ‘చదరంగం’ వీరుడు వస్తాడని చెప్పారు. ప్రపంచంలో పెద్ద పెద్ద చదరంగం యోధుల్ని జయించాడు ఈ ఏడేళ్ల కుర్రాడు. ఆ సాయంకాలం 20 మంది చదరంగ ప్రముఖులతో ఒకేసారి ఆడతాడు. ఈ కుర్రాడికి నలుగురు సెక్రటరీలు. ఈ మార్బలంతో ఎడిటింగ్‌ స్టూడియోకి వచ్చాడు. అందరూ ఆ పసివాడిని మహానుభావుడిగా గౌరవిస్తూ దూరంగా నిలబడ్డారు. చాప్లిన్‌ పక్కకి వచ్చి ఎడిటింగ్‌ను గమనిస్తున్నాడు ‘ఏడేళ్ల’ కుర్రాడు. చాప్లిన్‌ అతన్ని చదరంగం గురించి అడగలేదు. ప్రపంచ ప్రఖ్యాత కీర్తి గురించి మాట్లాడలేదు.

కుర్రాడి దగ్గర వొంగి ‘‘నీకు ‘పీచ్‌’ పళ్లు ఇష్టమేనా?’’ అన్నాడు. కుర్రాడు బిత్తరపోయాడు. కానీ అతనిలో పసితనం మేలుకొంది. ‘‘ఓహ్‌!’’ అన్నాడు. ‘‘అయితే ఎవరికీ చెప్పకు. ఈ గుమ్మం వేపు వెళ్లు. పెరట్లో ‘పీచ్‌’ చెట్టుంది. ఎక్కి పళ్లు కోసుకో. నాకూ తీసుకురా’’ అన్నాడు చాప్లిన్‌. ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు ఆ క్షణంలో ఏడేళ్ల పసివాడు అయిపోయాడు. మరో 15 నిమిషాల్లో ఆనందంతో ముఖం వెలి గిపోతూ ఉండగా చేతినిండా పళ్లతో వచ్చాడు. పది చదరంగం షీల్డులు ఆ ఆనందాన్ని ఇచ్చి ఉండవు. పది పీచ్‌ పళ్లు ఇచ్చాయి. సాయంకాలం ప్రదర్శనకు వెళ్లాడు చాప్లిన్‌. 20 మంది చాంపియన్‌లనూ అవలీలగా ఓడించాడు కుర్రాడు. ఆత్మకథలో చాప్లిన్‌ రాస్తాడు: ‘ఆ కుర్రాడిని చూస్తే జాలేసింది. అతని ప్రతిభ అతని పసితనాన్ని బలితీసుకుంటోంది’ అని. ఇక్కడితో ఈ కాలమ్‌ని ఆపవచ్చు. ఇంతే చికిత్స.

మా చిన్నతనంలో మేం చొక్కాలు చింపుకుని దొంగాటలు ఆడేవాళ్లం. వినాయక చవితికి ఇళ్లముందు పల్లేరుకాయలు జల్లి తిట్లు తినేవాళ్లం. శ్రీరామనవమి సంబరాలు చూసి నిద్రని ఆపుకోలేక వీధి అరుగుల మీద నిద్రపోతే ఏ తెల్లవారుఝామునో అమ్మ లోపలికి తీసుకెళ్లేది. పుట్టినప్పటినుంచీ– రెండేళ్ల పసివాడికి యూని ఫారం మెడమీద పుస్తకాల గుదిబండ. చదువురాని పల్లెల్లో తల్లిదండ్రులకి తమ కొడుకులు అమెరికాకి ఎదగాలనే యావ. వాళ్లకి ఆ ఆశలు చూపి డబ్బు దండుకునే భయంకరమైన విద్యా వ్యాపారులు. మార్కులు బాగా వస్తే పేపర్లనిండా ఫొటోలు, టీవీల్లో ఇంటర్వ్యూలు. అమెరికాలో ఉద్యోగాలు, చదువుల్లో 99 శాతం మార్కులకు హామీలిచ్చే పోటీ వ్యాపార సంస్థలు.

చదువు తప్ప మరో ధ్యాస లేకుండా, జీవితంపట్ల ఏ రుచీ ఎరుగకుండా, ఆటపాటలకు నోచుకోకుండా పుస్తకాలకు బందీలయిన నిస్సహాయులైన కుర్రాళ్లు. ఎంతమంది ఈ కాలం కుర్రాళ్లకి బిళ్లాగోణీ తెలుసు? ‘నన్ను ముట్టుకోకు నామాల కాకి’ ఆట తెలుసు? తాము కోరుకున్న ప్రశ్నలు పరీక్షల్లో రాకపోతే పరీక్షల్ని బహిష్కరించే ధర్నాలు, బాగా చదువుకోమంటే టీచర్ని క్లాసులో పది కత్తిపోట్లు పొడిచే సాహసాలు, చదువుకునే కుర్రాళ్లు ఎన్ని వెర్రి తలలు వేయవచ్చునో భూతద్దంలో చూపుతూ, పాఠాలు చెప్పే సినీమాలు– ఈ దేశంలో అవ్యవస్థకి పరాకాష్ట. ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల వివరాలు గమనించండి. యాజమాన్యం మారాలని మైకు ముందు గొంతు చించుకునే గడుసైన విద్యార్థులు ఈ లిస్టులోకి రారు. కానీ వీరి విశృంఖలత్వానికి బలి అయి, నిజమైన ‘రేపు’ కోసం పొట్ట పట్టుకున్న కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలై ఉంటారు.

నేటి తరం కుర్రాళ్లు– చిన్నతనంలోనే పెద్దరికానికి యావని తమ నెత్తిన రుద్దగా, చిన్నతనాన్ని నష్టపోయిన ‘చదరంగపు’ చాంపియన్‌ లాంటి వాళ్లు. పది పదిహేను ఏళ్ల కిందట ధర్నాలు చేసే పేర్లలో సత్య నాదెళ్ల పేరు వినలేదేం? సుందర్‌ పిచ్చయ్‌ పేరు వినలేదేం? ఇందిరా నూయీ, సంజయ్‌ ఝా పేరు లేదేం?నేటి విద్యా విధానం, విద్యా వ్యాపారులు, చదువులు తెలీని నాయకత్వం, వీపుల మీద గుదిబండల్ని మోపిన వ్యవస్థ– వీళ్ల ‘రేపు’ని అంధకారం చేసి, అమాయకమైన కుర్రాళ్లకు ఉరితాళ్లను అందిస్తోంది.

- గొల్లపూడి మారుతీరావు

మరిన్ని వార్తలు