అబద్ధం చెప్పడం

5 Apr, 2018 01:03 IST|Sakshi

జీవన కాలమ్‌

అబద్ధానికి విశాలం ఎక్కువ. ధైర్యం ఎక్కువ. అబద్ధం చెప్పేవాడిని ప్రత్యేకంగా గమనించండి. ఎప్పుడూ చేతిలో పది కిలోల బంగారమున్నట్టు ప్రకాశిస్తూ ఉంటాడు. కుచేలుడిలాగా, నడుం వంగి బొత్తిగా కుంచించుకుపోయి ఉండడు.

మనం చేసే పనుల్లోకెల్లా అబద్ధం చెప్పడం చాలా కష్టతరమైన పని. అబద్ధానికి ముందు కావలసినంత పరి శ్రమ కావాలి. ఫలానా అబద్ధం వల్ల కథ అడ్డం తిరిగితే తప్పిం చుకునే దారులో, సమర్థిం చుకునే మార్గాలో అప్పటికప్పుడు కరతలామలకంగా సిద్ధంగా ఉండాలి. అబద్ధం చెప్పడంలో సూపర్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ ప్రముఖ నటుడు, నా అనుంగు మిత్రుడు, మహానటుడు కె. వేంకటేశ్వరరావుకి ఇస్తాను. ‘‘ఏరా! మొన్న నాకోసం లీలా మహల్‌ జంక్షన్‌ దగ్గర కలుస్తాను అన్నావు? రాలేదేం?’’ అన్నామనుకోండి. రాలేకపోవడానికి వెయ్యి కారణాలు చెప్పవచ్చు. కానీ చెప్పడు. ‘లీలా మహల్‌ జంక్షన్‌ దగ్గర ఏ వేపు నిలబడ్డావు?’

‘సోడా కొట్టు దగ్గర’ అంటే ‘అదీ.. నేను లేడీస్‌ గేటు దగ్గర ఒక్క అరగంట పైగా నిలబడి వెళ్లిపోయా’ నంటాడు. వాడిని ఏడిపించాలని ‘అవునవును. ఈ చారల చొక్కాతో ఓ మనిషిని చూశాను. నువ్వనుకోలేదు’ అన్నామనుకోండి. తను అబద్ధం ఆడి దొరికిపోనందుకు సిగ్గుపడాలి కదా? పడడు. ‘మరి నన్ను పలుకరించలేదేం’ అని ఎదుటి ప్రశ్న వేస్తాడు. రెండు అబద్ధాల మధ్య నిజం ఎక్కడో చచ్చిపోయి, నిజాన్ని పెట్టుబడిగా పెట్టిన మన ఆవేశం నీరు కారిపోతుంది.

అబద్ధానికి చాలా ఒరిజినాలిటీ కావాలి. గొప్ప సమయస్ఫూర్తి కావాలి. తను చెప్తున్నది అబద్ధమని ఎదుటివాడికి అర్థమవుతుందని తెలిసినా ‘సిగ్గులేని తనం’ కావాలి. ఒక్క ఉదాహరణ. ‘నిన్న పొద్దుట ఎక్కడరా? ఎంత వెతికినా దొరకలేదు?’ ‘ఎక్కడ బ్రదర్‌ ఏకామ్రేశ్వరరావుగారు చంపేశారు’ ‘ఎవరు? ఉపముఖ్యమంత్రిగారే! ఏమిటి విశేషాలు?’ ‘వచ్చే కేబినెట్‌లో విద్యామంత్రిని ఎవరిని పెట్టాలని నా సలహా కోసం కబురు పంపించాడు’.. ‘అదేమిట్రా? ఆయన మొన్న టంగుటూరు ఫ్లై ఓవర్‌ దగ్గర యాక్సిడెంట్‌లో పోయారు కదా? వెంటనే సమాధానం వస్తుంది. 

‘అదే నీతో చిక్కు. నేను చెప్పేది 1997 మంత్రి గురించి...’ ‘ఆయనెప్పుడూ మంత్రి కాలేదు కదా?’ ‘అందుకే రాజకీయాలు తెలీని వారితో మాట్లాడటం కష్టం. ఆయనే విద్యామంత్రని కనీసం 20 రోజులు మా సర్కిల్సులో అనుకునేవాళ్లం. అతను మీ అందరికీ ఏకామ్రేశ్వరరావు. మాకు మాత్రం విద్యేశ్వరరావు’. అబద్ధానికి విశాలం ఎక్కువ. ధైర్యం ఎక్కువ. అబద్ధం చెప్పేవాడిని ప్రత్యేకంగా గమనించండి. ఎప్పుడూ చేతిలో పది కిలోల బంగారమున్నట్టు ప్రకాశిస్తూ ఉంటాడు. కుచేలుడిలాగా మూలుగుతూ, నడుం వంగి బొత్తిగా కుంచించుకుపోయి ఉండడు.

నిజం నీరసమయినది. అది వన్‌ వే ట్రాఫిక్‌. నిజాయితీపరుడిని నిద్రలో లేపినా ఒక్కటే చెప్పగలడు– దిక్కుమాలిన నిజం. అబద్ధం అక్షయపాత్ర. సత్య హరి శ్చంద్రుడిలాంటి వెర్రిబాగులవారు ఈ దేశంలో బొత్తిగా కనిపించరు. నా జీవితంలో అబద్ధం బాధపెట్టినట్టు, తలుచుకున్నప్పుడల్లా, డబ్బు కంటే సులువుగా మోసపోయినందుకూ ఇప్పటికీ విలవిలలాడతాను. రేడియోలో పనిచేస్తున్న రోజులు. సినీమా ధర్మమాంటూ కొన్ని వేలు అదనంగా దాచుకున్నాను. ఎందుకు? వెస్పా కొనుక్కోవాలని. మా ఆఫీసుకి ఓ తమిళ ఆఫీసరులాంటి వ్యక్తి వచ్చేవాడు. ఎప్పుడూ పెద్ద కబుర్లు చెప్పేవాడు. 

అతని వెస్పా పచ్చగా నిగనిగలాడుతూ కనిపించేది. అది నా కల. తెలిసి ‘ఓస్‌! అదెంతపని ఆరు నెలలు తిరగకుండా– చవకలో కొనిపిస్తాను’ అన్నాడు. అతని మాటలు, చెప్పే ధోరణీ అరచేతిలో వైకుంఠాన్ని చూపుతున్నట్టుగా ఉండేవి. ఒకసారి కన్‌సైన్‌మెంట్‌ వచ్చింది. దాన్ని చూపించడానికీ నాకిష్టపడలేదు. ‘చూడగానే నవనవలాడే అమ్మాయిని మీకు అప్పజెప్తాను’ అన్నాడు. ఎట్టకేలకు మరో కన్‌సైన్‌మెంట్‌ వచ్చింది. తనే ఎగిరి గంతేశాడు. మా ఆవిడకీ నాకూ కరచరణాలు ఆడలేదు.. అన్నీ గోడౌన్‌లోకి వచ్చాక మిమ్మల్నిద్దరినీ తీసికెళ్తానన్నాడు. ఒక మధ్యాహ్నం ఉన్నట్టుండి ఫోన్‌ చేశాడు. ‘ఈసారి రెండు రకాల ఆకుపచ్చలు కలిపాడు సార్‌! బాడీ చిలక పచ్చ. హాండిల్‌బార్‌లో చిన్న రంగు కలిపాడు’ అన్నాడు. ఫోన్‌లో వెనుక వెస్పాల శబ్దాలు వినిపిస్తున్నాయి. 

‘చూడ్డానికి వచ్చేదా?’ అన్నాను. నవ్వాడు. ‘వద్దు సార్‌ రాతకోతలన్నీ పూర్తి చేయించేశాను. రేప్పొద్దుట మీ ఇంటి ముందుం టుంది. సంతకాలు అక్కడే. నేను రాలేను. ఓ మనిషిని పంపుతున్నాను. నుదుటిమీద కాల్చిన మచ్చ. పేరు రామానుజం. అతనికి 4,220 ఇవ్వండి. రూపాయి ఎక్కువ వద్దు. వెంటనే పంపండి. ఎవరీ రామానుజం? ఆలోచన కూడా రాలేదు. అరగంటలో రామానుజం రావడం, డబ్బు ఇవ్వడం జరిగిపోయింది. ఆ రాత్రి మా ఇద్దరికీ నిద్దుర లేదు. ఆ ఉదయమే కాదు. ఆరు నెలలైనా వెస్పా ఛాయ లేదు కదా.. ఈ ఆర్ముగం అయిపు లేదు.

అసలు ఎవరు ఈ రామానుజం? ఏం కంపెనీలో ఉద్యోగి? డబ్బు పుచ్చుకున్నది ఎవరు? రుజువేమిటి? ఆకర్షణని అద్భుతంగా మలచిన గొప్ప సంఘటన ఇది. తర్వాత 4,220 రూపాయలు చూడలేదు. ఆకుపచ్చ వెస్పా చూడలేదు. అబద్ధం అద్భుతమైన ఆభరణం. అది రాణించినట్టు నిజం రాణించదు. ప్రతీ రోజూ ఎన్ని అద్భుతాలు మన మధ్య రాణిస్తున్నాయో పేపరు తెరిస్తే చాలు. అబద్ధం నీడ. నిజం గొడుగు. అబద్ధం అలంకరణ. నిజం నిస్తేజమైన వాస్తవం. అబద్ధం కల. నిజం నిద్ర.

- గొల్లపూడి మారుతీరావు

మరిన్ని వార్తలు