కోడి–సినీమా జీవనాడి

28 Feb, 2019 02:15 IST|Sakshi

జీవన కాలమ్‌

కోడి రామకృష్ణతో నా జ్ఞాపకాలు బహుశా అనితర సాధ్యమైనవి. కోడి నా దగ్గరికి వచ్చేనాటికి (1981) హైస్కూలు ఎగ్గొట్టి వచ్చిన కుర్రాడిలాగ ఉండేవాడు (ఫొటో). ‘ఇతనా కొత్త దర్శకుడు!’ అని మనసు కాస్సేపు శంకించిన మాట వాస్తవం. చాలా మొహ మాటస్తుడు. ఎప్పుడూ ఎవరినీ నొప్పించని మన స్తత్వం. అలాంటి ఆలోచన వస్తే తనే అక్కడి నుంచి తొలగిపోతాడు.

ఆ రోజుల్లో నాకు బోలెడంత తీరిక. కొన్ని నెలలపాటు పొద్దున్నే వచ్చి రాత్రి నేను అమృతం సేవించి భోజనం చేసేదాకా కూర్చునేవాడు. ఏం చేసేవాడు? ఏదో చేసేవాడు– పిల్లలతో కబుర్లు చెప్తూనో, మరేదో. నా పనిపాటల్లో నవ్వుతూ పాలు పంచుకునేవాడు.

నాకు కడప బదిలీ అయితే ఎన్నోసార్లు నాతో వచ్చాడు. నేను రేడియోలో ఆఫీసర్ని. ప్రతీ ఆదివారం చెన్నైలో బొంబాయి మైలు ఎక్కి సెకెండు క్లాసు కంపార్టుమెంటులో ఇద్దరం గుమ్మందగ్గర బయటికి కాళ్లు జాపుకు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి.

నాతో అప్పుడప్పుడు కథా చర్చ. జరపకపోతే అడిగేవాడు కాదు. నన్ను ఇబ్బంది పెట్టని ఒక్క కారణంగానే– సరదాగా– అలవోకగా– ఆడుతూ పాడుతూ రెండు కథలు రెడీ చేశాం. కథ ఎవరివో ఒప్పించాలని కాదు. మేం ఒప్పుకోవాలని. (ఆ రెండు కథలూ చరిత్ర. రెండో కథ– ‘ఇంట్లో రామయ్య– వీధిలో కృష్ణయ్య’ 500 రోజులు నడిస్తే– ‘తరంగిణి’ తేలికగా సంవత్సరం నడిచింది) రెండో కథ, మొదటి కథ కావడానికి కారణం– ‘తరంగిణి’ చేయడానికి దర్శకుడి వెన్ను ముదరాలని భావించాం కనుక.

రామకృష్ణ మెదడు పాదరసం. అతని గురువు గారి దగ్గర పుణికి పుచ్చుకున్న గొప్ప లక్షణం– నటుడికి ప్రత్యేకతనివ్వగల పాత్రీకరణ పుష్టి. ఇది చాలామంది దర్శకులకి లేదు. ప్రయత్నించినా రాదు. ఇందులో నిష్ణాతుల పేర్లు రెండు చాలు– సత్యజిత్‌ రే, మణిరత్నం. మొదటి చిత్రం రిలీజు నాటికే అతను స్టార్‌ డైరెక్టర్‌. నేను స్టార్‌ని. మరెందరో కొత్త నటు లకి– టైలర్‌ కృష్ణ, అశోక్‌ కుమార్‌ లాంటి వారికి ప్రాణం పోశాడు.
కొత్త ఆలోచన వస్తే చుట్టూ అమోఘంగా అల్లు కునే అందమైన సాలెగూడు అతని మెదడు. కెమెరా ముందు నటుడి దమ్ముని గుర్తుపడితే– రామకృష్ణ గోమతేశ్వరుడయిపోతాడు. పూచిక పుల్లని పవిత్ర మైన దర్బని చేస్తాడు.

కాగా, వ్యక్తిగా రామకృష్ణ బ్రతక నేర్చినవాడు. చాలామందికి తెలియదు. అతనికి ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ ఉంది. లేకపోతే అతని ప్రతిభకీ, తొలి నాళ్లలో అతనికి వచ్చిన అవకాశాలకీ ఆకాశంలో ఉండవలసినవాడు. తన పరిధిలో ‘తను’ ముఖ్యం. దానిని సంపాదించుకోడు. ఆ ‘పరిధి’ని తన హక్కుగా చేసుకుంటాడు. అదీ అతని Creative Volcano.
అతను దర్శకుడిగా స్థిరపడటానికి బేషరతుగా నా వాటాని పుంజుకుంటూనే నేను నటుడిగా స్థిరపడ టానికి అతని వాటాని బంగారు పళ్లెంలో పెట్టి సమ ర్పిస్తాను. తన చుట్టూ ఎప్పుడూ ముసురుకునే నా కొడుకుల్లో శ్రీనివాస్‌ని దర్శకత్వ విభాగంలోకి లాగి నవాడు కోడి. మొదటి రోజుల్లో ‘వాసూ గారూ’ అనే వాడు ఆ కుర్రాడిని. నేను కోప్పడితే పద్ధతి మార్చు కున్నాడు. అతని శిష్యుడు గురువుగారికంటే పాతికేళ్లు ముందే వెళ్లిపోయాడు.

అందమైన ఆలోచనకి వెండితెరమీద రేంజ్‌ని ఇవ్వగల పనివాడు. నేను రాసిన డైలాగుల్ని నాకంటే బాగా అలంకరించుకున్న దర్శకుడు. కానీ ప్రతిభని ఏనాడూ తలకెత్తుకోడు. నేనూ, మా ఆవిడన్నా భక్తి. ‘ఇంట్లో రామయ్య...’కి 30 పైగా సెన్సార్‌ కట్స్‌ వస్తే జ్వరంతో తేనాంపేటలో చిన్న గదిలో దుప్పటి కప్పుకు పడుకున్న అతన్ని నేనూ మా ఆవిడా వెళ్లి లేపి ధైర్యం చెప్పాం.
ఏం సినీమా అది! అప్పటికి పది సినీమాలు తీసినంతగా దర్శకుడిలో ‘పదును’ సంధించిన ఇట్ఛ్చ్టజీఠ్ఛి Vౌ ఛ్చిnౌ అది. అందులో లేచిన పెద్ద లావా సెల– ‘దటీజ్‌ సుబ్బారావ్‌!’
రాత్రిళ్లు షూటింగులూ, అకాల భోజనాలతో ఆరోగ్యాన్ని ఎక్కువగా దుబారా చేసుకున్నవాడు. మరికొంతకాలం ఉంటే తెలుగు చలన చిత్ర రంగంలో సమగ్రమైన దర్శకత్వ ప్రతిభకి, తనదైన బాణీకి విలాసంగా నిలిచేవాడు.

చిన్నవాడు. అతనికి నేను నివాళి అర్పించేరోజు వస్తుందని అనుకోలేదు. పదికాలాలపాటు ఉండవల సినవాడు. పదికాలాలు నిలిచే మౌలిక కృషికి తోట మాలి.
మృత్యువుకి ఓ దుర్మార్గం ఉంది. మన్నికయిన ప్రతిభకి అర్ధంతరంగా ముగింపురాసి చేతులు దులు పుకుంటుంది. మృత్యువుకి లొంగకపోతే రామకృష్ణ తెలుగు సినీమాకి కొండంత ఉపకారం చేయగల దక్షత, దమ్ము ఉన్నవాడు.

వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు