7 Feb, 2019 00:43 IST|Sakshi

జీవన కాలమ్‌

సాధారణంగా నేను వివాదాల జోలికి పోను. అది నా ప్రమే యమూ, స్వభావమూ కాదు. కానీ మొన్న పొరుగు దేశంలోని ఓ దౌర్భాగ్యుడు– తినడానికి తిండి కూడా సరిగా లేని దేశంలో బోర విరు చుకు తిరుగుతున్న ఓ దౌర్జన్యకారుడు మసూద్‌ అజర్‌– అంటాడు కదా: ఇండియాలో రామ మందిరం నిర్మిస్తే దేశం మంటల్లో భగ్గుమం టుందని. అనడానికి ఎవడు వీడు? ఏమిటి వీడి గుండె ధైర్యం? ఈ మాటలకి కడుపు మండి ఈ నాలుగు మాటలూ. 

ఈ దేశం ముస్లిం సోదరులను శతాబ్దాలుగా అక్కున చేర్చుకుంది. రాజకీయ రంగంలో, కళారంగంలో, ఆఖరికి ఆధ్యాత్మిక రంగంలోనూ వారు మనకు ఆప్తులు. ఇటు వేంకటేశ్వరునికీ, అటు భద్రాద్రి రామునికీ ముస్లిం భక్తుల కథలు మనకు తెలుసు. మనకు ముగ్గురు రాష్ట్రపతులు ముస్లింలు. ఉపరాష్ట్రపతులు ముస్లింలు. 

ఈ హెచ్చరికకు రెచ్చి, ఈ దేశంలో ముస్లింలంతా ఏకమయి– ‘మీరు పక్కకు తప్పుకోండి బాబూ. మేం రామమందిరాన్ని నిర్మిస్తాం’ అని ముందుకు రారేం? 

షియా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ వసీం రిజ్వీ రామ మందిర నిర్మాణానికి మాకు అభ్యంతరం లేదన్నారు. గవర్నమెంటు పూనుకోకపోతే నాలుగు నెలల్లో రామమందిర నిర్మాణానికి పూనుకుంటా మన్నారు ఆరెస్సెస్‌ అధ్యక్షులు మోహన్‌ భగవత్‌గారు. పద్మభూషణ్‌ బాబా రామ్‌దేవ్‌– అయో ధ్యలో వివాదాస్పద స్థలానికి పక్కన ఉన్న చోట రామమందిరం నిర్మించడానికి ఏం పోయేకాలం? అని వాక్రుచ్చారు. 

అలనాడు కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని ఆనుకుని మసీదు వెలిసినప్పుడు, మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన గది గోడని ఆనుకుని మసీదు వెలసినప్పుడు హిందువులు గొంతులు ఎత్తలేదేం? సామరస్యం కారణమా? అలనాటి పాలకుల పట్ల భయమా? తాటస్థ్యమా? నిర్వేదమా? మరి ఇలాంటివేవీ గత 77 సంవత్సరాలుగా ముస్లిం సోదరులు చూపలేదేం? వారి ఓట్లకు రాజకీయ పార్టీల కక్కుర్తి కారణమా? 

విజయ్‌సింగ్‌ ఆలేఫ్‌ ఈ మధ్య రాసిన "Ayodhya: City of Faith, City of dis- cord'' అనే పుస్తకాన్ని సమీక్షిస్తూ వచ్చిన వ్యాసంలో మొదటి వాక్యాలు ఉటంకిస్తాను: ‘రాజకీయ ప్రయోజనాలకు మతాన్ని దుర్విని యోగం చేస్తే, ఏ దేశానికీ ఫలితాలు సామర స్యంగా ఉండవు. వ్యవస్థల మతపరమైన వివా దాలను న్యాయసమ్మతంగా, సామరస్యంతో, సత్వరంగా పరిష్కరించలేకపోవడానికీ ఇదే కారణం’. 


ఇంతకీ పాకిస్తాన్‌లో ‘వాగిన’ దౌర్జన్యకారుడికి– ఇద్దరు సీనియర్‌ ముస్లిం నాయకులు స్పందించి: ‘నువ్వు నోర్మూయవయ్యా. ఇది మా దేశం సమస్య. మేం చూసుకుంటాం’ అంటే ఎంత గంభీరంగా ఉంటుంది? అంత Objective nobility మన సోదర ముస్లిం నాయకులకి ఉందా?
 
అవకాశవాదం అటకెక్కితే సంకల్ప బలానికి ‘చేవ’ కుదురుతుంది. ఇన్ని సంవత్సరాల అయోధ్య వివాదం హిందువుల నిస్సహాయతకు మాత్రమే నిదర్శనం కాదు. తమలో ఒకరుగా, తమలో వారుగా భావించే ముస్లిం సోదరుల ‘చిన్న’ మనసుకి కూడా నిదర్శనం. 

దేశంలో అక్కడక్కడా మత విధ్వంసాలు ఉంటాయి. ఇలాంటి ఉన్నత లక్ష్యాలకు అవి అడ్డు పడకూడదు. పక్కవాడు ‘ఉసి’కొల్పడం అందుకు మన మౌనం మన మానసిక ‘సంకుచితతత్వాని’కి నిదర్శనమనిపిస్తుంది. పెద్దల మనస్సుల్లోనూ ఇంకా ‘చీకటి’ గదులున్నాయనిపిస్తుంది. 

ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీకి మతం పెట్టుబడి. అందుకని మిగతా పార్టీలు వారి ఆలోచనలకు కలసిరావు. సరే. మరి రాముడు ఈ దేశానికే ఆరాధ్య దైవం కదా? అయినా రాజకీయ రంగంలో ఆయన పరపతి చెల్లదా? 

దీనికి పరిష్కారం– దమ్మున్న వ్యవస్థ. గుండెబలం ఉన్న నాయకత్వం. నిజానికి ఆనాటి మెజారిటీ హిందువులను విస్మరించి – కాశీ, మధుర దేవాలయాల పొరుగున మసీదుల నిర్మాణమే ఇందుకు తార్కాణం.
 
ఇప్పుడు కేంద్రం సుప్రీం కోర్టుని ఆశ్రయిం చింది. ‘అయ్యా– అయోధ్యలో ‘వివాదం’ లేని  67.39 ఎకరాల స్థలాన్ని మాకు అప్పగించండి’– అని. కాంగ్రెస్‌ భయం అప్పగిస్తుందని కాదు. తీరా అప్పగిస్తే తమ ‘పరపతి’ మాటేమిటని. ‘ఇప్పుడు ఇలా సుప్రీంకోర్టుని ఆశ్రయించడంలో మర్మమేమిట’ని కాంగ్రెస్‌ కత్తి దూసింది. కాంగ్రెస్‌ భయం తీరా సుప్రీంకోర్టు తలూపుతూ ఉందేమోనని! 

ఇక్కడ తగాదా ‘రాముడు’ కాదు– ఓట్లు. ఇదీ మన దరిద్రం. ఇందుకే ఈ సమస్య ఇన్నాళ్లు మురిగింది. ఇంకా మురుగుతుంది.


గొల్లపూడి మారుతీరావు
 

మరిన్ని వార్తలు