జనం ఆమోదిస్తేనే పాపులారిటీ

14 Mar, 2018 00:57 IST|Sakshi

కొమ్మినేని శ్రీనివాసరావుతో గొల్లపూడి మారుతీరావు

సినిమా నటుల పాపులారిటీ జనం ఆమోదిస్తే వచ్చిందే తప్ప ఆ నటుల వ్యక్తిగత గొప్పతనంతో రాలేదని సీనియర్‌ నటులు, ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు అన్నారు. ఆడియన్స్‌ ఆమోదిస్తే వచ్చిన పాపులారిటీని మిగతా రంగాల్లోకి యధాతథంగా అనువదించడానికో, తర్జుమా చేయడానికో ప్రయత్నిస్తే ప్రయోజనం లేదన్నారు. నటుడి పాపులారిటీ మదుపుగా మారాలంటే రాజకీయాల్లో వారేం చేయగలరనేదే కీలకమవుతుందన్నారు. రాజకీయనేతలకు ఉండాల్సిన బ్యాలెన్స్‌ విషయంలో కళాకారులకు ఇబ్బంది ఎదురవుతుందని, మహానటుడు ఎన్టీఆర్‌ కూడా అక్కడే దెబ్బతిని ఉండొచ్చని అంటున్న గొల్లపూడి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...

మీ ముక్కుసూటితనంతో మీకు ఇబ్బందులు కలగలేదా? 
ఆలిండియా రేడియోలో ఆఫీసర్‌గా ఎదిగాను. టైమ్‌ అంటే ఎంత వాల్యూ నో నాకు వృత్తే తెలిపింది. ఫలానా గంటకు, ఫలానా నిమిషానికి సౌండ్‌ రికార్డింగ్‌ అంటే ఆపడానికి లేదు. కానీ సినిమా ఫీల్డులో ఎవరైనా పరిచయం కొద్ది జోకులేసినా భరించేవాడిని కాదు. ఎందుకంటే నేను గౌరవాన్ని ఆస్వాదించేవాడిని. కెమెరా ముందు నిల్చోగానే నేను ఒక స్టార్‌ని అనే ఫీలింగ్‌ వచ్చేసేది. అందుకే ఎవరైనా తేడాగా వ్యవహరిస్తే సహించేవాడిని కాదు. నా ముక్కుసూటితనంతో కొంత నష్టపోయి ఉంటాను. 

ఎన్టీఆర్‌ మరణం, ఆ సందర్భంపై మీ స్పందన?
ఆయన వ్యక్తిగత జీవితం, దాని ప్రతిఫలనాలు, కుటుంబంలో వచ్చిన విభేదాలు ఇవేవీ నాకు తెలీవు. కానీ ఆయన అలాంటి పరిస్థితుల్లో గద్దె దిగడం చూస్తే ఆయన మ్యాన్‌ ఆఫ్‌ ఈగో. ఈగో ఇన్‌ది రైట్‌ సెన్స్‌. నటుడిగా మకుటం లేని మహారాజు. నడిస్తే మహారాజులాగే నడిచేవాడు. 

అల్లుడి నుంచే అలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎన్టీఆర్‌ ఊహించి ఉంటారా? 
నిజంగా ఈ విషయంపై నాకు అవగాహన లేదు. కానీ ఒక విషయం చెప్పగలను. ఆయన రాజకీయాల్లో పెరిగిన వ్యక్తి కాదు. ప్రధానంగా ఆయన నటుడు. గొప్ప కళాకారుడు. వ్యక్తిగతమైన డిగ్నిటీని రాజకీయం కోసం వదులుకునే వ్యక్తి కాదాయన. తనకు ఒక అడ్వాంటేజ్, మరొక డిసడ్వాంటేజ్‌ కూడా ఉండేది. అంత పెద్ద మెజారిటీ వచ్చినప్పుడు వారు చేసే పనులపై వారే పరిమితి విధించుకోవాలి. లేకుంటే వారిని ఎవరూ కరెక్ట్‌ చేయలేరు. ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక రాజీవ్‌ గాంధీ.. ఎవరూ ఊహించలేని మ్యాడ్‌ మెజారిటీ సంపాదించిన నేతలు వీరు. కానీ రామారావు తాననుకున్న మంచిపనులన్నీ చేశారు. కళాకారుడు రాజకీయాల్లోకి ప్రవేశించడం వల్ల రాజకీయాలకు ప్రయోజనం కలుగుతుందేమో కానీ, రాజకీయనేతకు ఉండాల్సిన బ్యాలెన్స్‌ కళాకారుడికి ఒక్కొక్కప్పుడు ఇబ్బంది అవుతుందా అనిపిస్తుంటుది. 

చిరంజీవి ఇంకా చాలామంది నటులు రాజకీయాల్లోకి వచ్చినా, ఎన్టీఆర్‌లాగా పాపులర్‌ కాలేకపోయారెందుకు?
వీళ్లది డిఫరెంట్‌ ప్లేన్‌ అంటాను. చిరంజీవి పాపులారిటీ మామూలిది కాదు. ఆయన సినిమాల్లోనే నేను ఎక్కువగా నటించాను. నాకు మంచిమిత్రుడు. కానీ, ఎన్టీఆర్‌కి జై అన్నట్లుగా ఏఎన్నార్‌కి జై అనరు. ఆయన పాపులారిటీ వేరు. ఆడియెన్స్‌ కూడా వేరు. ఇదే వీరికీ వర్తిస్తుంది.

ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ రజనీకాంత్, కమల్‌ హసన్‌ కూడా రాజకీయాల్లేకి వచ్చేశారు కదా?
పవన్‌కల్యాణ్, రజనీకాంత్, కమల్‌ హసన్‌ రాజకీయాల్లోకి వచ్చారు కానీ వారు ఏం చేయగలరో ఇప్పటికి మన ఊహకు అందదు. చేయగలిగితే మంచిదే. సరైన ఆలోచన ఉన్నవారు ఇవ్వాళ రాజకీయాల్లోకి రావాలి. అంతవరకే మనం కోరుకోగలం. ఒక వ్యక్తి వైయక్తిక ప్రజాదరణను ఒక సగటు మనిషి ఎలా జడ్జ్‌ చేయగలరు? అతడి పాపులారిటీ ఒక నటుడి పాపులారిటీగా మదుపుగా మారగలదా. ఇప్పుడు తానేం చెబుతున్నాడో అది సరిపోతుందా, ఆ మాత్రం ఇంకో రాజకీయ నేత కూడా చెప్పవచ్చు కదా. 

రాజకీయాల్లోకి నటులు ఎందుకిలా ప్రవేశిస్తున్నారు?
ఇవాళ ఉన్న మాధ్యమాల్లో అతి పాపులర్‌ మాధ్యమం సినిమా. నేను గొప్ప రచన చేస్తే మీరో మరొకరో చదువుకుని ఆనందిస్తారు. ఒక మంచి సినిమాలో నటిస్తే కోట్లమంది చూసి ఆనందిస్తారు. ఆ పాపులారిటీ, ఆ కీర్తి ఆడియన్స్‌ ఆమోదిస్తే వచ్చిన పాపులారిటీ. దాన్ని మిగతా ఏరియాల్లోకి అనువదించడానికో, తర్జుమా చేయడానికో కొందరు ప్రయత్నిస్తారు. 

సినిమారంగంలో పెడధోరణులు, వదంతులు, విమర్శలపై మీ అభిప్రాయం? 
ఇవన్నీ వేరువేరు కోణాలు. ఉదాహరణకు మీరు కోటు వేసుకుంటే అందంగా ఉన్నారు. అదే సమయంలో మన సంస్కృతికి దూరంగా ఉన్నారు. మీరు కోటేసుకుంటే ఇక్కడ మనిషిగా కని పించటంలేదు. ఇవన్నీ ఒకే అంశంపై మూడు నాలుగు కోణాలు. ఇటీవల రాంగోపాల్‌ వర్మ వ్యాఖ్యలపై మహిళలు తిరగబడ్డారు. అది కూడా ఒక ధోరణి. యాంగిల్‌. 

తెలుగు సమాజానికి మీరిచ్చే సందేశం?
మనం ఎంత గొప్ప పనులు చేసినా, ఎంత పురోగతి సాధించినా, ఎన్ని తెలివి తేటలతో కొత్త ప్రయోగాలు చేయగలిగినా, సంప్రదాయ వైభవం అనే పునాదిని కాపాడుకుంటూ వెళ్లగలిగితే ఆ మేరకు మన విజయాలు, పురోగతి ఎక్కువ ఉపయోగపడతాయని నా ఫీలింగ్‌. అమ్మని అమ్మగారూ అని పిలవడం, నీ భార్యను చక్కగా గౌరవించడం, మీ పిల్లలు మిమ్మల్ని చూడగానే కాళ్లకు నమస్కరించడం వీటికీ సంప్రదాయానికి ఏమీ సంబంధం లేదు. ఇవ్వాళ మార్వాడీలను చూస్తుంటే రోడ్డు మీద వెళుతూ కూడా నమస్కారం పెడతారు. మిమ్మల్ని చూడగచ్చాడ్రా మళ్లీ వీడు అనుకోవడానికి, చూడగానే నమస్కారం పెట్టడానికీ ఎంత తేడా ఉంది. మనిషిని చూడగానే నమస్కరించడం అనే భావన ఎంత గొప్పదో కదా.

(ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో...)
https://goo.gl/QWReC9
https://goo.gl/8HTHP2

మరిన్ని వార్తలు