ఓ అజ్ఞాత విజ్ఞాని

3 Jan, 2019 01:08 IST|Sakshi

చెన్నైలో లజ్‌ సెంటర్‌ నుంచి ఎల్డామ్స్‌ రోడ్డు వేవు నడుస్తున్నప్పుడు దారిలో చాలా ప్రసిద్ధ్దమైన అడ్రసులు. ఇంగ్లీషువారికాలంలోనే  కోర్టుల్లో వారినే తన ఆంగ్లభాషా వైశిష్ట్యంతో అబ్బుర పరిచిన  రైట్‌ ఆనరబుల్‌ శ్రీనివాస శాస్త్రి హాలు తగుల్తుంది. అది దాటగానే అమృతాంజనం ఆఫీసు, పక్కన ఆంధ్రదేశ చరిత్రలో భాగమయిన శ్రీభాగ్‌ ఒడంబడిక జరిగిన శ్రీ భాగ్‌ బంగళా, తర్వాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి   పార్కు. అయితే అటు వెళ్లేటప్పుడు ఇవేవీ గుర్తుకురావు. శాస్త్రిహాలుకి  ముందుగా రోడ్డు పక్క రోడ్డుమీదే గుట్టగా పోసిన కొన్ని లక్షల పాతపుస్తకాల దుకాణం కనిపిస్తుంది.

దీనికి గది, తాళాలు, పుస్తకాలకి రక్షణా ఏమీలేదు. ఆరుబయట– రోడ్డుమీదే పరిచిన దుకాణం. ఎండా, వానా, తుఫాన్, గాలి దుమారం ఏది వచ్చినా తట్టుకుంటూ గత అయిదు దశాబ్దాలుగా నడుస్తున్న  సెకండ్‌ హ్యాండ్‌ దుకాణం. పుస్తకాలమీద  పెద్ద టార్పాలిన్‌ కప్పి ఉంటుంది. ఆ గుట్ట ముందు – తపస్సు చేస్తున్నట్టు ఓ ముసలాయన కూర్చుంటాడు. అతని పేరు ఆళ్వార్‌. వొంటిమీద షర్టు లేదు. ఆయన పెరియార్‌ రామస్వామి నాయకర్‌ భక్తుడు. అందుకని తర్వాతి రోజుల్లో ఆయనలాగ గెడ్డం పెంచాలి. నగరంలో వేలాది మేధావులకు, విద్యార్థులకు, రచయితలకు ఆ గుట్ట ఆటపట్టు. ఎప్పుడూ ఆ గుట్ట చుట్టూ ఖరీదయిన దుస్తులు వేసుకున్న వారూ, మే«ధావులూ పుస్తకాలు తిరగేస్తూ కనిపిస్తారు.

రోజర్స్‌ థెసారెస్‌ , పాపిలియాన్, షేక్సి ్పయర్‌ సమగ్ర రచన  సర్వస్వం, థామస్‌ హార్డీ రచనలు –ఇలా వేటి గురించయినా చెప్పగలడు. ఇంకా వైద్యం, ఇంజనీరింగ్, అకౌంటెన్సీ ఇన్ఫర్మేషన్‌  టెక్నాలజీ – ఈ విభాగాలలో ఎన్నో అరుదయిన  పుస్తకాలు దొరుకు తాయి .ముద్రణలో లేని పుస్తకమా? ఇదొక్కటే అడ్రసు. కస్టమర్లు తప్పిపోయిన పాతమిత్రుడిని కలిసినట్టు పుస్తకాలను కరుచుకువెళ్లడం అక్కడ తరచుగా కనిపించే దృశ్యం. విశేషమేమిటంటే ఐయ్యేయస్‌ çపరీక్షలకి వెళ్ళే గ్రాడ్యుయేట్లు  మధుర, తిరుచ్చి వంటి సుదూరమయిన ప్రాంతాలనుంచి అరుదయిన  పుస్తకాలకి ఇక్కడికి వస్తారు. 

ఈ 50 సంవత్సరాలలో ఆ పుస్తకాల గుట్టకి తరచు వచ్చే కొందరు మహానుభావుల  పేర్లు – సుప్రసిద్ధులైన భారతీ దాసన్‌ ఆయన కస్టమర్‌. పుళమై పిత్తన్, ముత్తులింగం వంటి కవులు వతనుగా వచ్చే వారు. ఫిలిం ఇండస్ట్రీ నుంచీ సెంథిల్, గౌండర్‌ మణి, ఎస్‌. వి. శేఖర్, చో రామస్వామి ఆయన సోదరుడు అంబి తరచు వచ్చేవారు. హీరో జయశంకర్‌ ఇక్కడ కూర్చుని టీ తాగి వెళ్లేవాడు కొన్ని రోజులు –ఇతను మైసూరు మహారాజా సామరాజ  వొడయార్‌కీ, అప్పటి ముఖ్యమంత్రులు రామస్వామి రెడ్డియార్, అన్నాదురైకి పుస్తకాలు ఇచ్చి వచ్చేవాడు. 

ఇతని అసలు పేరు ఆర్‌. కె. నమ్మాళ్వార్‌. కాని అందరికీ అతను ఆళ్వార్‌. ఆళ్వార్‌ షాపు లజ్‌ దగ్గర పెద్ద బండగుర్తు. ఎప్పుడో 60 ఏళ్ల కిందట కడుపు పట్టుకుని విల్లుపురం దగ్గర  వానియం పాలయం నుంచి చెన్నైలో దిగాడు ఆళ్వారు. 1950లో ఇక్కడ ఈ దుకాణానికి ప్రారంభోత్సవం చేశాడు. అప్పటి ముఖ్యమంత్రి –‘‘ఇక్కడ వ్యాపారం చేసుకోవయ్యా’’ అని అనుమతి ఇచ్చారు. ఆ మాట ఇనుపకవచంలాగా సంవత్సరాల తరబడి పోలీసుల బారిన పడకుండా కాపాడింది. రోడ్డుపక్క ఈ పుస్తకాల గుట్ట పోలీçసులకి కన్నెర్రే, ఈ మధ్య ఎవరో పోలీసులమంటూ వచ్చి కొన్ని వేల పుస్తకాలే పట్టుకుపోయారు. మళ్ళీ తిరిగి ఇస్తే ఒట్టు.  ఈ పుస్తకాల వ్యాపారానికి ముందు ఆళ్వార్‌ నెప్ట్యూన్‌ స్టూడియోలో లైట్‌ బోయ్‌గా పనిచేశాడు. కొన్ని సినిమాల్లో నటించాడు – మనోహర, స్వర్గవాసల్, తిలివిషం మొదలైనవి.

మరి ఈ లక్షల పుస్తకాలు ఆళ్వార్‌కి ఎలా చేరుతా యి? కనీసం 10 మంది ఇంటింటికీ తిరిగి పుస్తకాలను కొని తీసుకు వస్తారు. రమణన్‌ అనే అతను 17 ఏళ్లుగా ఈ పని చేస్తున్నాడు. అతనికిప్పుడు 73 సంవత్సరాలు. ధనరాజ్‌ అనే కుర్రాడు పాతికేళ్లుగా ఈ పని చేస్తున్నాడు.

ఇతని వ్యక్తిగత జీవితం ఇంకా ఆçసక్తికరం. వెనుక ఇంట్లో పని చేసే పనిమనిషి– ‘మేరీ’ని ఆళ్వార్‌ పెళ్లి చేసుకున్నాడు. ప్రేమా? అని మేరీని అడిగితే  సిగ్గుపడింది. విచిత్రమేమిటంటే ఈ మతాతీత వివాహం పెద్దలు చేసినది! మేరీకి ఎప్పుడు పెళ్లయిందో గుర్తు లేదు. ఆ మాటకు వస్తే తన  వయస్సు ఎంతో  తెలీదు! వాళ్లకి నలుగురమ్మాయిలు. ఒక అమ్మాయికి పెళ్లి చేశారు. 

‘‘నేను విజ్ఞానాన్ని పంచుతానని అందరూ అంటారు. ఆ మాట ప్రభుత్వం అనుకుని నా వ్యాపారం సాగనిస్తే మేలు’’ అంటాడు ఆళ్వార్‌. ఈ మధ్య చాలాసార్లు అటువేపు వెళ్లాను. ఇప్పుడక్కడ పుస్తకాల గుట్టలేదు. ఆళ్వార్‌ లేడు. ఏమయింది? 

వారం రోజుల కిందట – తన 95వ యేట – ఆళ్వార్‌ కన్నుమూశాడు.


వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా