సంపంగి పువ్వులు

19 Jul, 2018 01:57 IST|Sakshi

జీవన కాలమ్‌
అర్హత అరటి చెట్టులాంటిది. అరటి చెట్టు శరీర మంతా మనిషికి ఉపకారం చేస్తుంది– కాయ, పండు, ఆకు, దూట, ఆఖరికి దొప్ప కూడా. ఆర్జన వారకాంత లాంటిది. సంపంగి పువ్వు. మత్తెక్కిస్తుంది. మరులు గొలుపుతుంది. ఇంకా లేక పోతే ఎలాగ అనిపిస్తుంది. అనిపించేలోగానే ఇంకా లేకుండా పోతుంది. అర్హత పెద్దమనిషి. నమ్మకంగా సేవ చేస్తుంది. ఆర్జన పెద్ద ఆకర్షణ. నమ్మకంగా దాన్ని పట్టుకు వేలాడాలని పిస్తుంది.

రాజకీయ నాయకులకు ‘వాస్తు’ మీద అపారమైన నమ్మకం. కారణం– వారి పదవులు ‘ఆర్జన’. లాల్‌ బహదూర్‌ శాస్త్రి వాస్తు గురించి ఆలోచించినట్టు మనమెవరమూ వినలేదు, అలాగే అబ్దుల్‌ కలాం. వాస్తు మాత్రమే కాదు. నేటి రాజకీయ నాయకులు చాలామందికి చాలా విషయాలమీద అపనమ్మకం. ఉదాహరణకి కర్ణాటక పబ్లిక్‌ వర్క్స్‌ మంత్రి రేవన్న మంత్రిగా ఉన్నంతవరకూ బెంగుళూరు బంగళాలో నిద్రపోరాదని జ్యోతిష్యుడు హెచ్చరించాడు. అందు వల్ల ఆయనేం చేస్తాడు? రోజూ 7 గంటలు– 370 కిలోమీటర్లు ప్రయాణం చేసి తన సొంతవూరు హోలె నరసిపురా ఇంట్లో పడుకుని నగరానికి వస్తాడు.

ఒకప్పుడు జయలలిత అమ్మగారి నమ్మకాలు ఊహించలేనివి. ప్రతీ రోజూ–రోజుకో రంగు చీరె. సోమవారమయితే–ఆకుపచ్చ–ఇలాగ ఇక ఆఫీసులో ఆమె కుర్చీ ఎప్పుడూ తూర్పు వైపు ఉండాలి. రోజూ బీచ్‌లో కణ్ణగి విగ్రహం ముందునుంచి వెళ్లడం ఆమెకు బొత్తిగా నచ్చేది కాదు. దాన్ని ఏవో కార ణాలకి తీయించేశారు. రాజకీయ దుమారం రేగింది. దరిమిలాను అది డీఎంకే ఆఫీసుకి చేరింది. ఈ వ్యవ హారం బయటపడి–మరో విగ్రహాన్ని పెట్టక తప్పింది కాదు.

అన్నగారు తన రోజుల్లో పాత రోజుల్నాటి సెక్రటేరియట్‌ ప్రవేశ ద్వారం గుండా వెళ్లడం మంచిది కాదని ఎవరో వాస్తు నిపుణులు చెప్పారట. తదాదిగా వారి పరిపాలనంతా ఇంటి దగ్గర నుంచే సాగింది. ట్యాంక్‌బండ్‌ వైపు ద్వారం తెరిచాక సెక్ర టేరియట్‌కి వచ్చారంటారు. మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుగారు అందరికన్నా ఎతైన భవనంలో ఉండాలని వాస్తు. అందుకని కొత్త కాంప్లెక్స్‌లో ఐదు ఫ్లోర్లు, ఆరు ప్రత్యేకమైన బ్లాకులు ఉన్న భవనాలు సిద్ధమవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రులకు ఒక నమ్మకం ఉంది. పదవిలో ఉండగా నోయిడాకి వస్తే ఆ పదవి పోతుందని. అఖిలేష్‌ యాదవ్‌ పదవిలో ఉండగా ఆ వేపు కూడా చూడలేదట. ఒక్క వ్యాపారి నమూనా. విశాఖపట్నంలో కోట్ల వ్యాపారి. తిరుగులేదు. కానీ తొలి రోజుల్లో ముఖ ద్వారం వాస్తు ప్రకారం చాలా నాసిరకం అని శాస్త్ర జ్ఞులు తేల్చారు. మరి ఎలాగ? ఆ భవనానికి ఈశా న్యం మూల ఓ చిన్న గుమ్మం ఉంది. అది ఆ భవ నంలో పక్క సందులోకి పోతుంది. అయితే అది వాస్తు ప్రకారం మహత్తరమైన ప్రవేశ ద్వారం. ఇప్ప టికీ దుకాణాన్ని మొదట ఆ గుమ్మాన్ని తెరిచి లోనికి వెళ్లాకనే పెద్ద తలుపులు తెరుస్తారు.

చిలుకూరు బాలాజీ గుడి ప్రధాన అర్చకులు రంగరాజన్‌గారు ఓ సరదా అయిన కథ చెప్పారు. ఓ హైదరాబాద్‌ రాజకీయ నాయకుడు ఆయన్ని కలిసి తన ఇంటిముందున్న మర్రి చెట్టువల్ల తనకి పదవి రావడం లేదని దాన్ని కొట్టించమని కోరారట. రంగ రాజన్‌గారు నవ్వి ‘అయ్యా.. చెట్టు తీసేయడం కాదు. రోజూ చెట్టుకి పూజ చెయ్యండి. పదవి వస్తుంది’ అన్నారట. మరో నాలుగు నెలలకి ఆయనకి నిజం గానే పదవి వచ్చింది. చెట్టుకి పూజలందాయి. భారతదేశం తరువాత అంత భారతీయత కనిపించే మరొక దేశం నేపాల్‌.

నా మట్టుకు– భారత దేశం కన్నా భారతీయత పాలు నేపాల్‌లోనే ఎక్కు వేమో? నేపాల్‌ దేశమంతా ఒకప్పుడు చిన్న చిన్న రాజుల సామ్రాజ్యాలు. ప్రతీ రాజూ దైవభక్తుడే. అక్కడే ఆశ్చర్యకరమైన విషయం చూశాను. ప్రతీ రాజు కోటలోనూ– ఆయన పడక గదిలో కళ్లు విప్ప గానే కనిపించేటట్టు– ఎదురుగా– భారదేశంలో ఉన్న అన్ని గొప్ప దేవాలయాల నమూనాలు దర్శనమి స్తాయి. కాశీ, కేదార్, పూరీ, జగన్నాథ్, తిరుమల ఆల యం–ఇలాగ. ఈ ఏర్పాటుకి రెండు పార్శా్వలున్నా యేమో! ఒకటి: భక్తి. దానితో మనకి తగాదా లేదు. రెండు: వాస్తు. ఎన్నో చిన్న చిన్న కోటలు– నమూనా దేవాలయాలు చూశాను. ఆశ్చర్యం– నూటికి నూరు పాళ్లూ నమూనాలు!

సంపంగి పువ్వులు గుబాళిస్తాయి. మరో ఆలో చన లేకుండా చేస్తాయి. అవి లేకపోతే బతికేదెలా అని పిస్తాయి. కానీ వాటి జీవితం అంతంతమాత్రం అని మనకి తెలుసు. ఎక్కువ కాలం నిలవకపోవచ్చునని తెలుసు. కనుకనే కృత్రిమమైన దన్ను కావాలి. పరో క్షంగా ప్రాణం పోసి బతికించుకోవాలని తాప త్రయం. అందుకే రోజుకి 7 గంటల ప్రయాణం.

గొల్లపూడి మారుతీరావు

మరిన్ని వార్తలు