చెరగని ఈ ముద్రలు వెండితెరకెక్కవా?

21 Dec, 2019 01:46 IST|Sakshi

విశ్లేషణ

మొఘల్‌ సామ్రాజ్యం చివరి రాణి బేగం జీనత్‌ మహల్, భర్త స్వాతంత్య్రోద్యమంలో జైలు కెళితే ఖుదాఫీజ్‌ చెప్పిన జులైకా బేగం, సరోజినీ నాయుడు, కమలాదేవి ఛటోపాధ్యాయ, అరుణా అసఫాలీ, మృదులా సారాబాయి, ముత్తులక్ష్మీ రెడ్డి, ఎమ్‌ఎస్‌ సుబ్బులక్ష్మి వంటి భారతీయ ధీరమహిళల జీవితచరిత్రలను భారతీయ చిత్రపరిశ్రమ వెండితెరపై ఇంతవరకు ఎందుకు చిత్రించలేకపోయింది? భారతీయ పురాణాల చిత్రణపై మనకు పట్టు ఉంది కానీ చరిత్ర చిత్రీకరణలో తడబడుతుంటాం. వీరోచిత కార్యాలకు పట్టం కడతాం కానీ వాస్తవ జీవిత చిత్రణ మనకు సమస్యాత్మకమే. బ్రిటిష్‌ నాటకరంగంలో, సినిమాల్లో విశిష్ట నటి జూడి డెంచ్‌ వంటివారు భారతీయ చిత్ర రంగంమీదికి ఇంకా రాలేదు. ఆమెను పోలిన నట విదుషీమణులు భవిష్యత్తులోనైనా మన దేశంలో పుట్టుకొస్తారని, పసలేని వీరోచిత కృత్యాలను తోసిపడేస్తారని ఆశిద్దాం.

బేగం జీనత్‌ మహల్‌ అత్యద్భుతమైన జీవితం ఇంతవరకు వెండితెరపై ఎందుకు కనిపించలేదు? చిట్టచివరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జాఫర్‌ అవశేష రాజ్యాన్ని పాలించిన  చివరి భారతీయ రాణి ఈమె. ఆత్మగౌరవం, ఒంటరితనంతో, దర్పం, భయాందోళనల మిశ్రమ స్థితిలో ఎర్రకోటలోని పరిమిత పరిస్థితుల్లో జీవితం కోసం తపనపడిన ధీర వనిత ఈమె. దృఢచిత్తం ఉన్నప్పటికీ అదృష్టానికి నోచుకోని బేగం జీనత్‌ తన ఏకైక పుత్రుడు మీర్జా జావన్‌ బక్త్‌ని సింహాసనంపై కూర్చుండబెట్టడానికి తన రాణి హోదాను, దర్బారును ఎంతగానో ఉపయోగించి కూడా విఫలమైంది.

షా జాఫర్‌ మునుపటి భార్యలకు పుట్టిన ఇద్దరు కుమారులకంటే తన కుమారుడికి ఆమె ఎంతో ప్రాధాన్యత నిచ్చింది. తన కుమారుడిని గద్దెనెక్కించడానికి ఆమె విఫల ప్రయత్నాలు చేసింది. అతడికి భవిష్యత్‌ సింహాసనం కట్టబెట్టడం కోసం 1857లో చెలరేగిన సిపాయి తిరుగుబాట్లకు దూరంగా ఉంచింది. తన భర్తను దురదృష్టం కోరల నుంచి బయటపడేయటానికి చేయగలిగినంతా చేసింది కానీ నిష్ఫలమే అయింది. సింహాసనం కోల్పోయి ప్రవాస శిక్షకు గురైన భర్త షా జాఫర్‌తోపాటు ఆమె రంగూన్‌కి పయనమైంది. ఎర్రకోట నుంచి బేగం జీనత్‌ మహల్‌ నిష్క్రమిం చడం బాధాకరమైన ఘటన. రంగూన్‌లోనే చనిపోయిన తన భర్త సమాధి పక్కనే నాలుగేళ్ల తర్వాత ఆమెని కూడా సమాధి చేశారు. 

మన కాలంలో బేగం జీనత్‌ మహల్‌కు సరిసమానమైన వ్యక్తిత్వం కలిగిన మరొక ధీరవనిత జులైకా బేగం గురించి కూడా భారతీయ సినిమా చిత్రించకపోవడం శోచనీయం. ఈమె మౌలానా ఆజాద్‌ అని మనందరికీ తెలిసిన అబుల్‌ కలామ్‌ గులాం మొహియుద్దీన్‌ భార్య. విద్యాధికుడైన తిరుగుబాటుదారు, లౌకికవాద పునీతుడు అయిన మౌలానా ఆజాద్‌ పుస్తకాలూ పోరాటాలే ప్రపంచంగా జీవించిన వారు. 13 ఏళ్ల ప్రాయంలో ఆయన్ని పెళ్లాడిన జులైకా బేగం తన భర్త స్వాతంత్య్ర పోరాటంలో మునిగి తేలుతున్న సమయంలో కలకత్తాలో గడిపారు. ముస్లిం లీగ్‌ తన లక్ష్యం పాకిస్తాన్‌ ఏర్పాటేనని ప్రకటించిన తర్వాత అవిభక్త హిందూస్తాన్‌ కోసం మౌలానా పోరాడుతూ వచ్చారు. 1942లో గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాత్మకమైన పోరాటంలోకి దిగినప్పుడు కలకత్తాలో తన గృహంలో ఉండిన ఆజాద్‌.. బొంబాయిలో క్విట్‌ ఇండియా కోసం పిలుపుని చ్చిన వెంటనే ఇంటిని వదిలి వెళ్లారు. 

‘మరి కుటుంబం గురించి ఆలోచించు’ అని ఆమె అడిగి ఉంటారా? మనకు తెలిసినంతవరకు జులైకా బేగం వెళ్లిపోతున్న మౌలానాను అనుసరించి ఇంటి గేటు దాటి అక్కడే నిలబడి నిశ్శ బ్దంగా చూస్తూ, కారెక్కుతున్న భర్తకు ఖుదాఫీజ్‌ చెప్పారు. క్విట్‌ ఇండియా తీర్మానం ఆమోదించగానే తనను కూడా అరెస్టు చేస్తారన్న విషయం ఆజాద్‌కు బహుశా తెలిసి ఉంటుంది. అలాగే నెహ్రూ, పటేల్, కృపలానీ తదితర కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతోపాటు ఆజాద్‌ కూడా మూడేళ్లపాటు అహ్మద్‌ నగర్‌ పోర్ట్‌ జైలులో గడిపారు. ప్రచురితమవుతాయా లేదా అని కూడా తెలీని పరిస్థితుల్లో తన జైలు గదిలోని రెండు ఊరపిచ్చుకల ప్రేమ జీవితాన్ని చూస్తూ, పరిశీలిస్తూ ఆయన ఉత్తరాల్లో రాస్తూ వచ్చారు. సుదీర్ఘ కారాగార ఏకాంత జీవితంలో ఇద్దరు దంపతుల మధ్య సాన్నిహిత్యం మరింత బలోపేతమవుతుంది. తన భర్త ఖైదీగా ఉండగానే జులైకా కలకత్తాలో మరణిం చారు. అక్కడే ఆమెను సమాధి చేశారు. 

విద్యావంతుల కుటుంబంలో పుట్టి బ్రిటన్‌లో చదువుకుని సంగీత సాహిత్యాల్లో ప్రావీణ్యత పొందిన సరోజినీ నాయుడిపైనా మనదేశంలో ఎలాంటి సినిమా తీయలేదు. తన ప్రవృత్తికి భిన్నమైన హైదరాబాద్‌ నివాసి, శస్త్రవైద్యుడు గోవిందరాజులు నాయుడిని పెళ్లాడి అయిదుగురు బిడ్డలకు తల్లి అయిన సరోజిని నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుపొందారు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షురాలయ్యారు. అమెరికన్‌ రచయిత కేథరీన్‌ మేయో రాసిన ‘మదర్‌ ఇండియా’ దేశంపై కలిగిస్తున్న ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఆమె అమెరికాకు కూడా వెళ్లారు. దండి సత్యాగ్రహ సమయంలో పోలీసు చర్యను ధైర్యంగా ఎదుర్కొన్నారు.

రాజ్యాంగ సభలో సేవలందించారు. యునైటెడ్‌ ప్రావిన్స్‌ ప్రథమ గవర్నర్‌ అయ్యారు. తర్వాత అచిరకాలంలోనే స్వల్ప అస్వస్థతకు గురై మరణించారు. అంతిమ క్షణాల్లోనూ ఆమె తనకు సేవలందిస్తున్న నర్సును పాటపాడి వినిపించమన్నారు. అలాగే 20వ శతాబ్ది స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న కమలాదేవి ఛటోపాధ్యాయ, అరుణా అసఫాలీ, మృదులా సారాబాయి వంటి ధీరవనితలపై కూడా ఇంతవరకు ఎవరూ సినిమా తీయలేదు. వీరిలో మొదటివారు సోషలిస్టు, రెండోవారు కమ్యూనిస్టు, మూడో వ్యక్తి వ్యష్టివాదిగా ప్రసిద్ధులు. మృదులా సారాబాయి దేశ విభజన సమయంలో అపహరించబడి, త్యజించబడిన అనేకమంది మహిళలను కాపాడారు.

అలాగే తదనంతర కాలంలో ముత్తులక్ష్మీ రెడ్డిగా పేరొందిన చంద్ర నారాయణ స్వామి ముత్తులక్ష్మిపై కూడా ఇంతవరకూ ఎవరూ సినిమా తీయలేదు. పుదుక్కోటై సంస్థానంలో దేవదాసీ కమ్యూనిటీలో పుట్టిన ముత్తులక్ష్మి చదువుకోవడానికి పెద్ద పోరాటమే చేశారు. తర్వాత పురుషుల కాలేజీలో సీటు సాధించిన తొలి విద్యార్థినిగా చరిత్రకెక్కారు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో తొలి మహిళా హౌస్‌ సర్జన్‌ అయ్యారు. తర్వాత బ్రిటిష్‌ ఇండియాలో తొలి శాసనసభ్యురాలిగా ఎన్నికై దేవదాసీ వ్యవస్థ రద్దుకు కృషిచేశారు. అలాగే దేవదాసీ తల్లికి పుట్టిన ప్రతిభావంతురాలైన కుమార్తెగా మదురైలో పెరిగిన ఎమ్‌ఎస్‌ సుబ్బులక్ష్మిపై కూడా ఇంతవరకు ఎవరూ సినిమా తీయలేదు. అనంతర కాలంలో సంగీత విద్మన్మణిగా అద్భుత ప్రావీ ణ్యత సాధించిన ఈమె స్వరాలు వెండితెరపై ఆవిష్కృతమయ్యాయి కానీ ఆమె జీవితం గురించిన అద్భుత సినిమా ఇంకా వెలువడలేదు.

ఇలాంటి భారతీయ ధీరవనితల జీవితాలు ఇంతవరకు సినిమా రూపంలోకి ఎందుకు రాలేదు? ఎందుకంటే భారతదేశంలో పురాణాల గురించి మనకు బాగా తెలుసు కానీ చరిత్ర చిత్రణలో తడబడుతుంటాం. మానసిక సంక్షోభాలు, బుద్ధిజీవులకు చెందిన వ్యత్యాసాలను, డైలమాల చిత్రీకరణ మనకు సాధ్యం కాదు. వీరోచిత కార్యాలకు మనం పట్టం కడతాం కానీ వాస్తవ జీవిత చిత్రణ మనకు సమస్యాత్మకంగానే ఉంటోంది. మరొక కారణం ఉంది. మన కాలంలో కొంతమంది అతిగొప్ప నటీమణులను చూశాం. కానీ వ్యక్తిత్వ చిత్రణలను పండించే వారిని దొరకబుచ్చుకోవడం చాలా కష్టం. చారిత్రక హీరోయిన్‌ పాత్రల్లో ధరించేటటువంటి భారతీయ జూడి డెంచ్‌లు ఇంకా రంగంమీదికి రావడం లేదు. జూడి డెంచ్‌ బ్రిటన్‌ థియేటర్‌ నటి, వెండితెర నటి. ప్రస్తుతం ఆమె వయస్సు 85 ఏళ్లు.

వర్జిన్‌ మేరీలో మేరీగా, హామ్లెట్‌లో ఒఫెలియాలా, రోమియో అండ్‌ జూలియట్‌లో జూలియట్‌లా, మాక్‌బెత్‌లో లేడీ మాక్‌బెత్‌లా, షేక్‌స్పియర్‌ ఇన్‌ లవ్‌లో క్వీన్‌ ఎలిజిబెత్‌లా, ది డచెస్‌ ఆఫ్‌ మాల్ఫిలో డచెస్‌లా, మిస్టర్‌ బ్రౌన్‌ టెలి ప్లేలో క్వీన్‌ విక్టోరియాలా, ఐరిస్‌లో ఐరిస్‌ మర్దోక్‌లా, జేమ్స్‌ బాండ్‌ సీరీస్‌లో ‘ఎమ్‌’ పాత్రధారిణిలా ఆమె విశిష్ట పాత్రలు పోషించారు. సమకాలీన, టెక్నో స్పై చిత్రాల్లో డెంచ్‌ పాత్ర ఒక్కమాటలో చెప్పాలంటే అద్భుతం.

జీరబోయిన ఆమె స్వరమే ఆమె సిగ్నేచర్‌గా మారిపోయింది. అయితే జ్వలించిపోయే ఆమె నేత్రాలు సకలభావాలను పలుకుతాయి. ఒక గొప్ప షాట్‌లో ఆమెను చంపబోతున్న హంతకుడు చేతిలో తుపాకితో ఆమెకు ఎదురు నిలబడతాడు. సరిగ్గా తుపాకి ట్రిగ్గర్‌ నొక్కుతుండగా డెంచ్‌ అతడికేసి తీక్షణంగా చూస్తుంది. మరుక్షణంలో ఆమె సురక్షితంగా ఒక డెస్క్‌ వెనుక పడిపోతుంది. సెకన్ల తేడాతో టెర్రరిస్టు తన తుపాకిని గురి పెట్టడం, ఆమె ఏమాత్రం లక్ష్యపెట్టకుండా అతడికేసి తీక్షణంగా చూడటం ఎంత ప్రతిభావంతంగా షాట్‌గా మల్చారంటే క్రెడిట్‌ మొత్తం ఆమెకు, దర్శకుడికి మాత్రమే దక్కుతుంది. 

మన గొప్ప నటీమణులలో జూడి డెంచ్‌ ఒకరై ఉండినట్లయితే, మన జీనత్‌ మహల్, జులైకా, సరోజినీ నాయుడు, కమలాదేవి తదితర భారతీయ ధీరవనితల పాత్రలన్నీ ఆమె పోషించి ఉండేది. కానీ మనం నిరాశచెందాల్సిన పనిలేదు. కానీ మనం కోల్పోయిన జాతి రత్నాలను మనం తిరిగి ఆవిష్కరించడానికి మరొక తరం గడిచిపోవాల్సి ఉంటుంది కాబోలు. 85 ఏళ్ల ప్రాయంలో జూడీ డెంచ్‌ జన్మ దినోత్సవాన్ని ఈ డిసెంబర్‌ 9న జరుపుకున్న తరుణంలో, ఆమెను పోలిన నట విదుషీమణులు భవిష్యత్తులోనైనా మన దేశంలో పుట్టుకొస్తారని, కళా, సంస్కృతీ సౌందర్యాన్ని చూడని మన క్షుద్ర సినీ జీవుల బుర్రలేని వీరోచిత కృత్యాలను ఈ భవిష్యత్‌ తారలు తోసిపడేస్తారని మనసారా ఆశిస్తూ సంబరాలు చేసుకుందాం.
వ్యాసకర్త : గోపాలకృష్ణ గాంధీ, మాజీ ఐఏఎస్‌ అధికారి, దౌత్యవేత్త, మాజీ గవర్నర్‌

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా