పూసలతల్లికి స్థిరజీవితమొద్దా?

10 Apr, 2018 02:03 IST|Sakshi

సందర్భం

సమాజాన్ని సౌందర్యాత్మకంగా తీర్చిదిద్దుతున్న జీవితాలు మాత్రం విషాదంగా ఉన్నాయి. తరతరాలుగా అలంకృత వస్తువులను విక్రయిస్తున్న పూసల తల్లుల బతుకు చిత్రం మారటమే నూతన రాష్ట్రంలో జరగాల్సింది.

గంపలో పెట్టుకున్న వస్తువులు వారి వ్యాపారం. ‘గంప’ తరతరాలుగా వాళ్లకు తిండిబెట్టే జీవనాధారం. ‘గంప’ నెత్తిన పెట్టుకుని ఊరూరా తిరుగుతూ సరుకులను అమ్ముకుంటూ వచ్చిన నాలుగురాళ్లతో తరతరాలుగా కుటుంబాలను గడుపుతున్న వాళ్లు పూసల కులస్తులు. ఆడవాళ్ల అలంకార సాధనమైన చేతులకు గాజులు వేస్తూ ఆ తల్లులు ఇప్పటికీ గంపను నెత్తిన మోస్తూ సంచారం చేస్తూ కుటుం బాలను సాకుతున్నారు. మాతృస్వామిక వ్యవస్థను కొనసాగిస్తూ కుటుంబాలను పోషిస్తూ ఇప్పటికీ మిగిలి వున్న ఏకైక కులం పూసలకులం. సంచారంచేస్తూ ఊరూరా తిరుగుతున్న ఆ తల్లులు ఇంటిని దిద్దే ఇల్లాళ్లే కాదు, ఇంటిని నడిపించే ఆర్థిక రథసారథులు.

తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో ఈ పూసల తల్లులు సామూహికంగా వందల సంఖ్యలో గంపలను నెత్తిన పెట్టుకుని ర్యాలీలు చేశారు. తెలంగాణలో ఈ కుల స్తులు 70 వేలకు పైచిలుకు ఉంటారు. ఈ కులస్తుల ఆకాంక్షలకు అనుగుణంగానే తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూసల కులస్తుల బాధలు తీర్చేందుకు ఆలోచనలు సారించారు. ఎంబీసీలు, సంచారజాతుల వారితో అనేకసార్లు సమావేశమై పూసల కులస్తులను సొంతకాళ్లపై నిలబెట్టే కసరత్తు మొదలు పెట్టారు. 

పూసల తల్లులు ఆడవారి అలంకృత సామానులు విక్రయిస్తారు. ఒక రకంగా వందల ఏళ్లుగా సంచారం చేస్తూ ఆడవారికి మరింత అందానిచ్చే నడుస్తున్న బ్యూటీపార్లర్‌లు పూసలవాళ్లు. గాజుల అమ్మకమే వీరి ప్రధానవృత్తి. గంపలో గాజులతో పాటు తాళాలు, అలంకృత సామాన్లు కూడా విక్రయిస్తారు. సమాజాన్ని సౌందర్యాత్మకంగా తీర్చిదిద్దుతున్న ఈ పూసల కులస్తుల జీవితాలు మాత్రం విషాదంగా ఉన్నాయి.  చేతి నిండా గాజులు వేసి ఇంటిల్లిపాదిని ఆనందంలో ముంచే ఆ పూసల తల్లి మాత్రం సంచారంచేస్తూ చిట్లిన గాజులుగా జీవిస్తున్నారు. తరతరాలుగా అలం కృత వస్తువులను విక్రయిస్తున్న పూసల తల్లుల బతుకు చిత్రం మారటమే జరగాల్సింది. 

ఊరూరా తిరిగి గాజులు అమ్మకానికి పెట్టుబడి కోసం వీళ్లు వడ్డీవ్యాపారస్తులను ఆశ్రయిస్తారు. వీళ్ల సంపాదన మొత్తం తిరిగి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. కేసీఆర్‌ ఈ విషయానికి విరుగుళ్లు కనిపెట్టారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకు ప్రభుత్వం సహాయం చేసే విధంగా ప«థక రచన చేశారు. ఒక లక్షరూపాయల రుణమిస్తే అందులో 20 శాతం మాత్రమే లబ్ధిదారులు కట్టాలి. మిగతా రుణమంతా ప్రభుత్వమే సాయం చేస్తుంది. ఒకవేళ ఆ 20శాతం కూడా కట్టలేని స్థితి ఉన్నవాళ్లకు మాత్రం బ్యాంకులు సాయం చేస్తాయి. వాళ్లు వ్యాపారం చేసుకుంటూ ఆ 20 శాతం రుణమాఫీ చేసుకోవాల్సి ఉంటుంది.

గంప నెత్తిన పెట్టుకుని పొద్దు పొడవకముందే దళిత, బీసీ వాడలకు పోయి వాళ్లను నిద్రలేపి సబ్బులు, పౌడర్లు, గాజులు, దినుసులు, పొగాకు, తాళాలు, జ్వరం వస్తే ఇచ్చే మందుగోలీలు విక్రయిస్తారు. దళిత, బీసీ వాడలకు ముందే ఎందుకు వెళతారంటే వాళ్లు పొద్దున్నే వ్యవసాయపనులకు, కూలీ పనులకు వెళతారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పేదలకు మొదట సబ్బు, పౌడర్లను పరిచయం చేసింది పూసల తల్లులే. వీళ్లు బుట్టలు, గంపలు నెత్తిన పెట్టుకుని రోజులపాటు సంచారం చేస్తూ తిరుగుతారు. అంగళ్లు, జాతరలు జరిగినప్పుడు నెలల తరబడి సంచారం చేయటం వల్లనే వీరి పిల్లలు చదువులో వెనుకబడ్డారు. 

సిరాజుల్‌ హుస్సేన్‌ రాసిన డొమోనియన్‌లో కులాలు, తెగలు, వాల్యుంలో పూసల కులస్తుల పుట్టు పూర్వోత్తరాలు రాశారు. వీళ్లు ‘‘చెంచు’’ తెగకు చెందినవారు. పూసలవాళ్లు అడవులను వదిలారు. గ్రామాలలోకి వచ్చారు. కానీ ఆదిమ ఆచారాలను మాత్రం విడువలేదు. వీళ్లునివసించే ప్రదేశాలను గూడెం, మిట్ట అంటారు. ఊరిపెద్దను మిట్టగాడు అని పిలుస్తారు. ఇతని ఆజ్ఞలను అమలు చేసేవారిని ‘‘కొండిగాడు’’ అంటారని సిరాజుల్‌ హుస్సేన్‌ రాశారు. వీళ్లకు మరుగుభాష కూడా ఉంది. ఈ మరుగు భాష తెలిసిన వారిని పరదేశి గాండ్లు అంటారు. వీళ్ల కులం వాళ్లు కలుసుకున్నప్పుడు ‘‘అడిమేన్‌ దాసోహం’’ అని ప్రత్యేక భాషలో నమస్కారం అని చెప్పుకుంటారు. వీళ్లు గ్రామాల్లో తిరిగి స్వేచ్ఛగా వస్తువులను అమ్ముకోవటానికి నిజాం రహదారి పత్రాలు ఇచ్చేవారు.

 సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా బాగా వెనుకబడివున్న వీరి కులంలో చదువుకున్న వారి సంఖ్య తక్కువగా ఉన్నది. సివిల్‌ సర్వీస్, గ్రూప్‌ వన్‌ ఉద్యోగులు ఈ కులం నుంచి కనిపించరు. ఈ పూసల వారి జీవన విధానాన్ని తెలి యజేస్తూ గతంలో ‘‘మేము మనుషులమే’’, ‘‘మైనర్‌బాబు’’ వంటి సినిమాలు తీశారు.రాష్ట్ర ప్రభుత్వం పూసల కులస్తులకు చేసే సహాయ పథకానికి ‘పూసలతల్లి’’ పథకంగా పెట్టాలని సీఎం కేసీఆర్‌ని కోరుతూ బీసీ కమిషన్‌కు విన్నవిం చారు. పూసల కులాలకు ఆ కులంలో మహిళలే ప్రధాన జీవన ఆధారం కాబట్టి వారికి అందించే ఆర్థిక సహాయం పథకం పేరు ‘‘పూసలతల్లి’’ అని పెట్టాలని వీరు కోరుకుంటున్నారు.


జూలూరు గౌరీశంకర్‌ 
వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు
మొబైల్‌ : 94401 69896 

మరిన్ని వార్తలు