బడ్జెట్‌ కోటాలో రైతు వాటా ఎంత?

15 Nov, 2018 00:26 IST|Sakshi

విశ్లేషణ

రాష్ట్ర ప్రభుత్వాల రాబడిలో 90 శాతంపైగా వేతనాలు, పెన్షన్‌ చెల్లింపులు, చేసిన అప్పులకు వడ్డీ చెల్లింపులకు సరిపోతుండగా రైతుకు, వ్యవసాయానికి ప్రభుత్వం వెచ్చించే మొత్తం శూన్యమనే చెప్పాలి. ఖజానా వట్టిపోయాక సాంవత్సరిక బడ్జెట్‌ కేటాయింపులో రైతుల రుణ మాఫీలకూ, ధాన్యసేకరణ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద డబ్బు ఎక్కడ మిగిలి ఉన్నట్లు? దేశీయ ద్రవ్య నిర్వహణ విధానాలను రైతాంగ ఉద్యమాలు అర్థం చేసుకోనంతవరకు రాజకీయ పార్టీలు దాదాపుగా అవీ ఇవీ అనే తేడా లేకుండా తమ ఎన్నికల ప్రణాళికల్లో నిష్రయోజనకరమైన వాగ్దానాలను గుప్పిస్తూనే ఉంటాయి.

రాజకీయ పార్టీలు ఎన్నికల వాగ్దానాలను కురిపిస్తున్న తరుణంలో వ్యవసాయానికి అవసరమైన డబ్బు ఎక్కడికి వెళుతోందని గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ ఆర్థిక రాడార్‌ తెరపై రైతులు కనిపించే ఏకైక సమయం ఎన్నికల సమయంలో మాత్రమే. ఇది సర్వసాధారణమైపోయింది. గత ముప్పై ఏళ్లుగా నేను ఈ పరిస్థితిని గమనిస్తూనే ఉన్నాను. తమ తమ సిద్ధాం తాలు ఏవైనా, ఆలోచనా రీతులు ఏవైనా దేశ రాజ కీయ పార్టీలన్నీ దాదాపుగా ఇదే వైఖరిని అనుసరి స్తుండటం విచారకరం. దేశంలో మూడు వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ కూడా ఈ ధోరణినే కొనసాగిస్తున్నాయి. పైగా వ్యవసాయదారులను ఆకర్షించడానికి అన్ని రాజకీయ పార్టీలు పరస్పరం పోటీ పడుతున్నాయి. 

2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు డిమాండ్లు ప్రధానంగా అజెండాగా మారనున్నాయి. దేశంలో జరుగుతున్న ప్రతి రైతాంగ నిరసనకు ఇవే కేంద్రబిందువులుగా మారిపోయాయి. అవేమిటంటే ఒకటి, వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం,  రెండు, ప్రభుత్వం స్వయంగా వాగ్దానం చేసిన విధంగా కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పి)ను అమలు చేయడం, స్వామినాథన్‌ కమిషన్‌ ప్రతిపాదనల మేరకు వ్యవసాయ దిగుబడులపై 50 శాతం లాభాన్ని రైతులకు ప్రభుత్వమే అందించడం. ఈ మేరకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ వ్యవసాయ రుణాలను మొత్తంగా మాఫీ చేస్తామని వాగ్దానం చేస్తూ వస్తున్నాయి. కానీ వాస్తవానికి, వ్యవసాయ రుణాల్లో చిన్న భాగాన్ని మాత్రమే మాఫీ చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నది అనే దానితో నిమిత్తం లేకుండా ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహా రాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని మెజారిటీ రైతులు ప్రభుత్వ సహాయం అందని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పైగా ప్రస్తుతం ఎన్నికలకు సిద్ధమవుతున్న మూడు వ్యవసాయ ప్రధాన రాష్ట్రాల్లో వ్యవసాయ రుణాలను రద్దు చేస్తారనే ఆశ మాత్రంగా కూడా నాకు కనిపించడం లేదు.

ఇక రెండో డిమాండు విషయానికి వద్దాం. వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై స్వామినాధన్‌ కమిషన్‌ నిర్దేశించిన ఫార్ములాను సంపూర్ణంగా అమలు చేయవలసిన అవసరం కచ్చితంగా ఉంది. ఆవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలను ఉన్నపళాన పెంచినప్పటికీ అది మన రైతాంగంలోని అతి చిన్న భాగానికి మాత్రమే లబ్ధి చేకూరుస్తుంది. శాంతకుమార్‌ నేతృత్వంలో ఏర్పడిన అత్యున్నత అధికారిక కమిటీ ప్రకారం, 6 శాతం రైతులు మాత్రమే ఆహార సేకరణ ధరల వల్ల లబ్ధిని పొందగలుగుతున్నారు. మరో మాటలో చెప్పాలంటే, ప్రస్తుతం డిమాండు చేస్తున్న కనీస మద్దతు ధర, దిగుబడిపై 50 శాతం లాభాన్ని అమలు చేసినప్పటికీ, ఇప్పటికే ధాన్య సేకరణ ధరలను పొందుతున్న కొద్దిమంది రైతులు మాత్రమే లబ్ధి పొందే పరిస్థితి ఉంది. మరి అటు మార్కెట్‌ చేయదగిన అదనపు ఉత్పత్తులు పెద్దగా లేని లేక మౌలిక వసతులు లేమి కారణంగా ధాన్య సేకరణ కార్యకలాపాలకు దూరమైపోయిన 94 శాతం మంది రైతుల విషయం ఏమిటి? ఉదాహరణకు, ఒక్క మధ్యప్రదేశ్‌లోనే 94 లక్షల వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి. 2017లో గోధుమపంట సీజన్‌లో 10.5 లక్షల రైతులు మాత్రమే తమ ఉత్పత్తులను ధాన్య సేకరణ ధరల వద్ద అమ్ముకోగలిగారు. ఇక మిగిలిన 83 లక్షల వ్యవసాయ కుటుంబాల మాట ఏమిటి?

స్వామినాధన్‌ కమిషన్‌ నివేదించిన ధరల ఫార్ములాను యథాతథంగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉండగా, రైతులు మండీలకు తరలిస్తున్న తమ ఉత్పత్తులన్నింటినీ అధికారికంగా ప్రభుత్వమే సేకరించే పరిస్థితి ఏర్పడనంతవరకు, పంటలకు అధిక ధరలను ప్రకటించినప్పటికీ పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ రాష్ట్రాల ప్రభుత్వాలు తగినన్ని ధాన్య సేకరణ వసతులను కల్పించడంలో విఫలమవడమే కాకుండా సమస్య పరిష్కారం విషయంలో చేతులెత్తేశాయి. ఇది రైతులను మరింతగా మండించింది. కొత్తగా అమల్లోకి వచ్చిన ప్రధానమంత్రి ఆశా పథకంలో కూడా, మార్కెట్‌కు వచ్చిన అదనపు వ్యవసాయ ఉత్పత్తులలో 25 శాతాన్ని మాత్రమే సేకరించగలనని ప్రభుత్వ స్థాయిలో తేల్చి చెప్పారు. మరి మిగిలిన 75 శాతం దిగుబడుల మాటేమిటి? మార్కెట్లో తన దిగుబడులను తక్కువ ధరకు అమ్ముకోవలసి వచ్చినప్పుడు రైతులు పొందే పెను నష్టాన్ని ఎవరు భరిస్తారు?

వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై జరుగుతున్న చర్చ రైతాంగం చేస్తున్న రెండు ప్రధాన డిమాండ్లకు మించి ముందుకెళ్లాల్సి ఉంది. వ్యవసాయదారులు కాస్త ఊపిరి తీసుకోవడానికి అవకాశమివ్వని దేశీయ ఆర్థిక రూపకల్పన గురించి అర్థం చేసుకునే ప్రయత్నాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. దీన్ని ఇంకాస్త స్పష్టంగా వివరించాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించిన వెంటనే, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తూ, రైతు రుణాలను మాఫీ చేయదలుస్తున్న రాష్ట్రాలు తమ సొంత ఆర్థిక వనరులను వెదుక్కోవలసి ఉంటుందని కరాఖండీగా చెప్పేశారు. వాస్తవానికి 2014 నుంచి 2018 మధ్య కాలంలో కేవలం నాలుగేళ్లలో ఇదే ప్రభుత్వం రూ. 3.16 లక్షల కోట్లకు పైగా కార్పొరేట్‌ రంగానికి చెందిన మొండి బకాయిలను లెక్కలోకి రాకుండా కొట్టిపడేసింది. కార్పొరేట్‌ రంగం అవకతవకల భారాన్ని భరించాల్సిందిగా అరుణ్‌ జైట్లీ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్నీ ఎన్నడూ కోరిన పాపాన పోలేదు.

అటు పరిశ్రమలూ, ఇటు రైతులూ అదే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుం టున్నప్పుడు, పరిశ్రమల మొండి బకాయిలు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా ఎందుకు మారలేదు అనే ప్రశ్నను వ్యవసాయ రంగ నేతలు సంధించాల్సి ఉంది. పరిశ్రమల విషయంలో సూచించినట్లుగా భారతీయ రిజర్వ్‌ బ్యాంకు రైతుల రుణాలను కూడా మొత్తంగా రద్దు చేయాల్సిందని జాతీయ బ్యాంకులను ఎందుకు ఆదేశించలేదు? ఆ భారాన్ని మాత్రమే రాష్ట్రాల ప్రభుత్వాలమీదికి నెట్టడం దేనికి? ఈ సమస్య మొత్తానికి కేంద్ర బిందువు ద్రవ్యపరమైన బాధ్యత – బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎమ్‌) చట్టం–2003లో దాగి ఉంది. స్థూల ప్రభుత్వ దేశీయ ఉత్పత్తులపై (జిఎస్‌డీపీ) ఒక సంవత్సరంలో తీసుకునే రుణ పరిమితిని ఈ చట్టం 3 శాతానికి కుదిం చివేసింది. ఒకసారి బడ్జెట్‌ నిబంధనలకేసి దృష్టి సారిస్తే, వ్యవసాయానికి కేటాయిస్తున్న డబ్బు చాలా తక్కువ స్థాయిలో ఉందని బోధపడుతుంది. ఈ విషయంలో కాస్త వివరించనివ్వండి. ఛత్తీస్‌గఢ్‌లో సవరించిన బడ్జెటరీ అంచనాల ప్రకారం రాష్ట్ర సొంత రాబడిలో 93 శాతం వరకు వేతనాలు, పెన్షన్‌ చెల్లిం పులు, వడ్డీ చెల్లింపులకే సరిపోతోంది. ఒక్క వేతనాలు, పెన్షన్‌లు మాత్రమే బడ్జెట్‌లో అధికభాగాన్ని హరించివేస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఇది 87 శాతం కాగా, రాజస్తాన్‌లో ఇది 116 శాతానికి పెరి గిపోయింది. ప్రభుత్వ వేతనాలు, పెన్షన్ల భారం ఇంత భారీగా ప్రభుత్వాలపై పడుతున్నప్పుడు రైతులతో సహా తక్కిన జనాభాకు కేటాయించదగిన వనరులు శూన్యం మాత్రమే. పైగా ఈ వేతనాలు, పింఛన్‌లు కేంద్ర ప్రభుత్వానివి కావు. వాస్తవానికి ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలూ మొత్త జనాభాలో అతి కొద్ది భాగంగా ఉన్న ఉద్యోగులను, పింఛనుదారులను సంతృప్తి పరిచేందుకు అహరహం శ్రమిస్తున్నాయి. ఉదాహరణకు మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో 2017–18లో అంచనా వేసిన మొత్తం జనాభా 8.1 కోట్లు కాగా ఆ రాష్ట్రంలో 7.5 లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరిలో 4.5 లక్షలమంది శాశ్వత ఉద్యోగులు.ఈ మొత్తం వ్యవహారాన్ని పట్టి చూస్తే అర్థమవుతున్నది ఒకటే. రైతుల రుణ మాఫీలకూ, ధాన్యసేకరణ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద డబ్బు ఎక్కడ మిగిలి ఉన్నట్లు?

దేశీయ ద్రవ్య నిర్వహణ విధానాలను వ్యవసాయదారుల ఉద్యమాలు అర్థం చేసుకోనంత వరకు రాజకీయ పార్టీలు వీరు వారూ అనే తేడా లేకుండా తమ తమ ఎన్నికల ప్రణాళికల్లో నిష్ప్రయోజనకరమైన వాగ్దానాలను గుప్పిస్తూనే ఉంటాయి. ప్రతి రాజకీయ పార్టీనుంచి రైతులు కోరవలసిన వివరాలు ఏమిటంటే, వ్యవసాయ రంగానికి ఆ పార్టీలు చేస్తున్న వాగ్దానాల అమలుకు తగిన వనరులను ఎక్కడినుంచి తీసుకొస్తాయన్నదే. దీనికి రైతులు చేయవలసిన మొదటి పని ద్రవ్యపరమైన బాధ్యత – బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎమ్‌) చట్టం–2003కి సవరణ తీసుకురావాలని డిమాండ్‌ చేయడం, దాంతోపాటుగా రాష్ట్ర రైతుల ఆదాయ కమిషన్‌ను ఏర్పర్చాల్సిందిగా ప్రభుత్వాలను డిమాండ్‌ చేయడం మాత్రమే. పైగా ప్రతి రైతు కుటుంబానికీ నెలకు రూ.18,000 కోట్ల ఆదాయాన్ని కల్పించాలన్నది తప్పనిసరి నిబంధనగా ఉండాలి. ఇది ప్రతి జిల్లాలోనూ సగటున రైతుల ఆదాయాన్ని వివరించేలా చేస్తుంది, తర్వాత కనీసంగా హామీ పడిన ఆదాయంలో వస్తున్న అంతరాన్ని నగదు బదలాయింపు ద్వారా పూరించేలా వీలు కలిగిస్తుంది.

దేవిందర్‌శర్మ
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు

మరిన్ని వార్తలు