ప్రమాణాలు పెంచని ‘సంక్షేమం’

29 Jan, 2019 01:29 IST|Sakshi

అభిప్రాయం

స్వాతంత్య్రం సిద్ధించి 72 సంవత్సరాలు గడుస్తున్నది. ఈమధ్యే డెబ్భైయ్యవ గణతంత్ర దినోత్సవాన్ని జరు పుకున్నాం. పంచవర్ష ప్రణాళికలు, ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం, సామా జిక న్యాయం వంటి అంశాలకు తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ హయాంలో ప్రాధాన్యతనిచ్చారు. అనంతరం 1969లో రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ తదితర సాహసోపేత నిర్ణయాలు అమల్లోకొచ్చాయి. ‘గరీబీ హఠావో’ నినాదం ఇచ్చి పేదరికాన్ని నిర్మూలిస్తామని, పేదవాళ్లను ఉద్ధరిస్తామని పాలకులు హామీ ఇచ్చారు. 1975లో 20 సూత్రాల పథకంతోపాటు సంక్షేమ పథకాలకు అంకురార్పణ జరిగింది. సామూహిక వ్యవసాయ బావులు, సాగునీటి ప్రాజెక్టులు, విత్తనశుద్ధి, ఆధునాతన వ్యవసాయ యంత్రాలు, గ్రామీణ కుటీర పరిశ్రమలు తదితరాలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. 

కానీ, 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో స్వార్థానికి హద్దులు, అవధులు లేకుండాపోయాయి. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణల మూలంగా డబ్బు ప్రాధాన్యం పెరిగింది. అది లేకపోతే బతుక్కే భరోసా లేదనే భావన విస్తరించింది. మరోపక్క పేదరికం య«థాతథంగా ఉంది. అందుకే 1983 తర్వాత మరింత ఆకర్షణీయ పథకాలను ప్రవేశపెట్టారు. బియ్యం రూ. 2కి ఇవ్వడంతో మొదలుపెట్టి ఇప్పుడు కిలో రూపాయికే అందిస్తున్నారు. బడ్జెట్‌ వస్తుంటే పన్నుల వడ్డన, ఎన్నికలొస్తుంటే వరాల జల్లు తప్పవనే నానుడి గత 30 ఏళ్లుగా పెరిగిపోయింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నేతృత్వంలో రూపొందిన రాజ్యాంగం 21 ఏళ్లు నిండినవారికి ఓటు హక్కు ప్రసాదించగా, అది నేడు 18 సంవత్సరాలకు తగ్గింది. కానీ ఓటు హక్కు అర్ధమే మారిపోయింది. ప్రజల్ని పరాన్నజీవులుగా మార్చి, వారిని తమకు అనుకూలంగా మార్చుకోవడమే ధ్యేయంగా పాలకులు పనిచేస్తున్నారు. వ్యక్తిగత లబ్ధికి ప్రాధాన్యతను పెంచారు.
 
 టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకొచ్చిన వెంటనే లక్ష రూపాయల మేర రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. అందుకు రూ. 17,000 కోట్లు వెచ్చించారు. ఈసారి కూడా అదే స్థాయిలో రుణమాఫీ అమలు చేస్తామంటున్నారు. అందుకు రూ. 24,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. నాలుగేళ్ల తర్వాత కూడా రుణమాఫీ మొత్తం పెరిగిందంటే కారణాలేమిటో అధ్యయనం చేయాలి. రైతును పటిష్టం చేసేందుకు డబ్బులు ఇవ్వడమే మార్గం కాదు. వారికి సకాలంలో విత్తనాలు, ఎరువులు, రుణ సదుపాయం కల్పించడం ముఖ్యం. నీటి సదుపాయం, విద్యుత్, సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, పంటలు దాచుకునేందుకు శీతల గిడ్డంగులు, సాగు దిగుబడులకు గిట్టుబాటు ధరలు, మార్కెట్‌ సౌకర్యాలు కల్పిస్తే రుణమాఫీ అవసరం లేదు.  రూ. 10,000 కోట్ల సంక్షేమ పథకాల బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. మౌలిక సమస్యల్ని తీర్చకుండా సంక్షేమం పేరుతో ఏమేమో చేసినా ఫలితం ఉండదు. అంతిమంగా ఆ పథకాల వల్ల బడుగు జీవుల జీవన ప్రమాణాలు పెరగవు.   

వ్యాసకర్త సీపీఐ తెలంగాణ కార్యదర్శి
చాడ వెంకటరెడ్డి 

మరిన్ని వార్తలు