పేరుకు బడిపంతులు చేతల్లో బానిస

11 May, 2018 02:56 IST|Sakshi

దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్ధలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వేల పాఠశాలలు, కళాశాలలకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్న ప్రభుత్వాలు. అందులో ఎవరు చదువు చెబుతున్నారు. వారి అర్హతలు ఏమిటి, వారికి ఇస్తున్న వేతనాలు ఏమిటి, వారి జీవన ప్రమాణాలు ఏమిటని ప్రశ్నించే వ్యవస్థ లేకపోవడం విషాదకరం. ఈ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. విద్యా సంవత్సరం ముగిసిం దంటే చాలు ఉన్న ఉపాధ్యాయులు వచ్చే సంవత్సరం కొనసాగుతారో లేదో తెలియని దుస్థితి.

కొత్త విద్యాసంవత్సరం ఉద్యోగంలో కొనసాగాలంటే విధిగా 50 మంది విద్యార్థులను తాను పని చేస్తున్న పాఠశాలల్లో అడ్మిషన్లు చేయించాలి. అలా చేయకపోతే ఉద్యోగం ఊడినట్లే లెక్క. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీల కంటే ప్రైవేట్‌ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల జీవితాలు దుర్భరమైన పరిస్ధితుల్లో ఉన్నాయి. విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుంచి 12 నెలల ఫీజులు యాజమాన్యం వసూలు చేస్తున్నారు. కానీ అక్కడే పని చేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం 10 నెలలే వేతనాలు ఇస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్‌ కార్పొరేట్‌ రంగంలో వేలాది పాఠశాలలు, వందలాది ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో లక్షలాదిమంది అధ్యాపక, అధ్యాపకేతర పనిలో ఉన్నారు. వీరిని సరుకుగా మార్చి వేల కోట్లు లాభాలు చేకూర్చే వ్యాపారంగా మార్చారు. భావి భవిష్యత్‌ నిర్మాతలను తయారు చేసే గురువులకు కడుపులు పస్తు పెడితే ఏ అలోచనతో వారు విద్యార్థులకు చదువు చెబుతారో కూడా అర్ధం చేసుకోని స్థాయికి వ్యవస్థ దిగజారింది.ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో పని చేస్తున్న లక్షల మంది బోధన, భోధనేతర సిబ్బందిని ప్రభుత్వాలు ఆదుకోవాలి. వీరిలో 70 శాతానికి పైగా ఈఎస్‌ఐ, పీఎఫ్‌ విధానం అమలు కావటం లేదు. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లు హెల్త్‌ కార్డులను ఇవ్వాలి. అప్పుడే సమస్యలకు పరిష్కారం ఉంటుంది.
– ఎస్‌. నూర్‌మహమ్మద్‌
మొబైల్‌ : 94900 98057
 

>
మరిన్ని వార్తలు