1969 : ఎ లవ్‌ స్టోరీ

4 Aug, 2019 00:35 IST|Sakshi

మనిషి చందమామను అందుకొని ఇప్పటికి యాభ య్యేళ్లయింది. ఆ వెన్నెల రాజును తాకాలన్నది ఏనాటి కోరిక? రామాయణ కాలం నుంచయితే మనకు తెలుసు. చందమామను తెచ్చి తన చేతికి ఇస్తే తప్ప అన్నం తినేది లేదని ఒకసారి బాలశ్రీరాముడు మారాం చేశాడట. పిన్నమ్మలూ, తల్లీ, తండ్రీ ఎంత బతిమాలినా వినలేదట. చివరకు సుమంతుడు అనే మంత్రి ఒక అద్దం తెచ్చి అందులో చంద్రబింబాన్ని రాముడికి చూపించాడట. చంద్రుడు తన చేతికి అందాడని రామచంద్రుడు సంబర పడ్డాడట. ఆనాటికే మనిషి మస్తిష్కంలో చంద్రుడిని చేరుకోవాలన్న కాంక్ష నాటుకొనిపోయింది. వేలయేళ్లు గడిచిన తర్వాత 1969 జూలై 20వ తారీకున ఆ కోరిక నెరవేరింది. నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ అనే అమెరికా వ్యోమగామి ఎడ్విన్‌ ఆల్డ్రిన్‌ అనే మరో సహచరునితో కలిసి చంద్రమండలం మీద కాలుమోపాడు. మరో సహచరుడు మైకేల్‌ కోలిన్స్‌ కక్ష్యలో తిరుగుతూ అపురూప దృశ్యాలను ఫొటోలు తీశాడు.

1969 ఒక మైలురాయిలాగా మానవ చరిత్రలో మిగిలిపోయింది. 1960వ దశకానికి ఒక అద్భుతమైన ముగింపు అరవై తొమ్మిది. అలజడితో, ఆలోచనతో, ఆవేశంతో ఎగసిపడిన అరవయ్యో దశకపు పెనుకెరటంపై మెరుపు నురగ అరవై తొమ్మిది. ఆ దశాబ్ది ప్రతినిధి అరవై తొమ్మిది. యాభయ్యేళ్లు గడిచిన సందర్భంగా 69 గురించి మాట్లాడుకోవడం అంటే ఆ మొత్తం దశాబ్ది పరిణామాల సమాహారాన్ని పరామర్శిం చడమే. అనంతకాల గమనంలో దశాబ్ది సమయం ఒక రెప్పపాటు మాత్రమే. కానీ, ఈ దశాబ్ది మాత్రం ఓ రెక్క విప్పిన రివల్యూషన్‌! అరవయ్యో దశకానికి సంబంధించి కొంతమంది సంప్రదాయవాదులకు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ దశాబ్ది ఉద్యమాల్లో పెడధోరణులున్నాయనీ, సాంఘిక కట్టుబాట్లను భ్రష్టుపట్టించే లక్షణాలున్నాయన్న విమర్శలు వచ్చాయి. నిజానికి, ఆ ఉద్యమాలు స్వాభావికంగానే ధిక్కార స్వరాలు. అసమానతల పునాదులపై ఏర్పడిన సాంఘిక కట్టుబాట్లపై ధిక్కారం.

సంకుచిత భావనలపై ధిక్కారం. వివక్షపై ధిక్కారం! ఈ ఉద్యమాల మరో ముఖ్య లక్షణం విశ్వ మానవ సౌభ్రాతృత్వం. రెండో ప్రపంచ యుద్ధకాలంలో, ఆ తర్వాత కాలంలో పుట్టి పెరిగిన తరం ప్రధానంగా ఈ ధిక్కార స్వరాన్ని వినిపించింది. అంతర్లీనంగా ఆర్థిక కారణాలు వున్నప్పటికీ, మితిమీరిన జాతీయ దురహంకారమే రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ఐదుకోట్ల మంది ప్రాణాలు బలితీసుకున్న మహా మహమ్మారి ఈ యుద్ధం. అందుకే యుద్ధాన్ని ఈ తరం అసహ్యించుకుంది. జాత్యహంకారాన్ని ఈసడించు కుంది. వియత్నాంపై అమెరికా చేస్తున్న దురాక్రమణ యుద్ధానికి వ్యతిరేకంగా లక్షలాదిమంది అమెరికా విద్యా ర్థులే వీధుల్లోకి వచ్చారు. తమ నేలపై అంగుళం ఖాళీ వద లకుండా అగ్రరాజ్యం బాంబులతో తూట్లు పొడుస్తుంటే, ఆ చిన్నారి దేశం తలవంచకుండా ప్రతిఘటిస్తున్న తీరును యావత్తు ప్రపంచం ఆశ్చర్యచకితమై చూసింది. అమెరికా చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా సకల దేశాల్లోని ప్రజలు – ముఖ్యంగా యువకులు నిరసన ప్రదర్శనలు చేశారు. యుద్ధ వ్యతిరేక సందేశాన్ని అమెరికా యువతరం కూడా అందుకుంది. వియత్నాం నుంచి అమెరికా సేనలు తప్పు కోవాలని కోరుతూ తీసిన ఊరేగింపుల్లో లక్షల సంఖ్యలో విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. అమెరికా సైనికుల కుటుంబాలు కూడా ఈ నిరసనల్లో పాల్గొనడం విశేషం.

చేగువేరా ఒక కమ్యూనిస్టు విప్లవకారుడు, పుట్టింది అర్జెంటీనాలో. చదివింది వైద్యశాస్త్రం. ‘బాటిస్టా’ ప్రభుత్వా నికి వ్యతిరేకంగా క్యూబా విప్లవకారులు కాస్ట్రో నాయ కత్వంలో సాగిస్తున్న పోరాటంలో పాల్గొన్నాడు. విప్లవ ప్రభుత్వంలో కొంతకాలం మంత్రిగా చేశాడు. కానీ ఒక చిన్న దేశంలో సోషలిస్టు ప్రభుత్వం ఏర్పడితే, దానిని, సామ్రాజ్యవాదం బతకనివ్వదని చే భావించాడు. ఏక కాలంలో అనేక దేశాల్లో విప్లవ పోరాటాలు జరగాలని, పెద్దసంఖ్యలో సోషలిస్టు వ్యవస్థలు ఏర్పడాలనీ, అప్పుడే అవి మనగలుగుతాయని చే ఆలోచన. వెంటనే క్యూబాలో మంత్రిపదవి వదిలేశాడు. మొదట కాంగోలో కొన్ని ప్రయ త్నాలు చేశాడు. తర్వాత బొలీవియాకు చేరుకున్నాడు. అక్కడ సీఐఏ ఏజెంట్లు గువేరాను చంపించారు.

చేగువేరా ఒక ధిక్కారస్వరమే కాదు, ఒక ధిక్కార సంస్కృతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ కూడా. పొడవైన వేలాడే జుట్టు, నక్షత్రం మార్కు ఎర్రటోపీ, గడ్డం, మీసాలు, హవాయి చుట్ట.. దేశదేశాల్లోని యువతరం అనుకరించిన రూపం అది. ఆయన చనిపోయి యాభయ్యేళ్లు దాటినా, ఆయన బొమ్మ వున్న టీ–షర్టులకు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బోలెడు డిమాండ్‌ వుంది. ఆయనకొక దేశం లేదు. ఆయనొక విశ్వమానవ సందేశం. ఇరవయ్యో శతాబ్దపు అమెరికన్‌ ధ్రువతార మార్టిన్‌ లూథర్‌కింగ్‌ జూనియర్‌. న్లలజాతీ యుల పట్ల దుర్మార్గమైన వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన పౌరహక్కుల పోరాటం ప్రధాన ఘట్టాలన్నీ అర వయ్యో దశకంలోనే చోటుచేసుకున్నాయి. భారత జాతిపిత మహాత్మాగాంధీ నుంచి సహాయ నిరాకరణ, అహింసా యుత పోరాట రూపాలను కింగ్‌ అరువు తెచ్చుకున్నారు. ఆయన చేసిన ‘ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌...’ అనే ప్రసిద్ధ ప్రసంగం సమతావాద వేదం లాంటిది. మార్టిన్‌ లూథర్‌ చేసిన గాంధేయ పోరాటాలకు తలవొగ్గి లిండన్‌ జాన్సన్‌ ప్రభుత్వం ఆ దశాబ్దిలోనే కొన్ని పౌరహక్కుల చట్టాలను చేయాల్సి వచ్చింది. చివరకు ఒక దురహంకారి

కాల్పులకు నేలకొరిగిన మార్టిన్‌ లూథర్‌కింగ్‌ జూనియర్‌ రెపరెపలాడే పౌరహక్కుల పతాకం. ఆ పతాకానికి ఎల్లలు లేవు. స్త్రీవాద ఉద్యమాలు శిరమెత్తింది కూడా ఈ దశాబ్ద కాలంలోనే. ఉద్యోగాల్లో స్త్రీల పట్ల కొనసాగుతున్న వివక్షపై అమెరికా మహిళా లోకంలో తీవ్ర అసంతృప్తి పేరుకుని వున్న సమయంలో బెట్టీఫ్రీడన్‌ రాసిన ‘ది ఫెమినైన్‌ మిస్టిక్‌’ అనే పుస్తకం 1963లో వెలువడి ప్రకంపనలు సృష్టించింది. అంతకుముందే ఫ్రెంచి ఫెమినిస్ట్‌ సిమోన్‌ ది బోవా రాసిన ‘ది సెకండ్‌ సెక్స్‌’ను మించిన సంచలనం సృష్టించిన రచన ఇది. ఆకాలంలో చెలరేగిన మహిళా ఉద్యమాల పర్యవసా నంగా ఉద్యోగాల్లో కొనసాగుతున్న లింగవివక్ష 1964లో అంతమైంది. రాజకీయ, సామాజిక రంగాలతోపాటు సాంస్కృతిక రంగంలోకి కూడా ధిక్కార సంస్కృతి ప్రవే శించింది.

సంగీతంలోనూ, జీవనశైలిలోనూ అది ప్రభావం చూపింది. ఈకాలంలో ప్రపంచాన్ని బ్రిటన్‌ దేశపు ‘ది బీటిల్స్‌’ బ్యాండ్‌ ఉర్రూతలూగించింది. పాప్‌ సంగీతానికి కళాత్మకతను అద్దిన ‘బీటిల్స్‌’ దేశదేశాల సంగీత రీతులను తనలో మిళితం చేసుకుంది. అందులో భారతీయ సంగీత ఛాయలు కూడా వున్నాయి. ఈ గాయకులు కొంతకాలం పాటు రుషికేశ్‌లోని ఒక ఆశ్రమంలో వుండి యోగా, ధ్యానం కూడా కూడా నేర్చుకున్నారట. అక్కడే దాదాపు ముప్ఫై పాటల వరకు స్వరపరచారని చెపుతారు. అమెరికా సామా జిక వ్యవస్థలోని అసమానతలపై వైముఖ్యం, అప్పటి సంఘ కట్టుబాట్లపై నిరసన, వియత్నాంపై అమెరికా యుద్ధం పట్ల వ్యతిరేకత, ఇలాంటివన్నీ కలిసి అప్పటి యువతవరంలో హిప్పీ స్టయిల్‌ పేరుతో ఒక ధిక్కార సంస్కృతి ప్రవేశించింది. అనతికాలంలోనే ఈ సంస్కృతి చాలా దేశాల్లోకి ప్రవేశించింది. భుజాల దాకా వేలాడే తైల సంస్కారం లేని జుట్టు, గడ్డం, మీసాలు, బెల్‌బాటమ్‌ ప్యాంట్లు, ముదురు రంగుల పెద్ద కాలర్‌ షర్టులు.. ఒక విచిత్ర వేషధారణ వుండేది. స్వేచ్ఛ, సమానత్వం పునాది గానే ఈ ధిక్కార జీవనశైలి పుట్టినప్పటికీ, విచ్చలవిడితనం, మాదకద్రవ్యాల అలవాటు వల్ల ప్రధాన జీవన స్రసంతి అభిశంసనకు గురై, కొంతకాలం తర్వాత అంతరించి పోయింది. 

అరవయ్యో దశకపు ఉద్యమ కెరటాలు అమెరికాతో పాటు దాదాపు మొత్తం ప్రపంచాన్ని తాకాయి. యూరప్‌లో నయితే ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, పోలండ్, యుగోస్లేవియా దేశాలను విద్యార్థి ఉద్యమాలు అట్టుడికించాయి. ఫ్రాన్స్‌లో విద్యార్థులకు ట్రేడ్‌ యూనియన్లు కూడా జతకలవడంతో 1968లో చార్లెస్‌ డీగాల్‌ ప్రభుత్వం దాదాపుగా పతనం అంచులకు చేరుకుంది. ఐరోపా దేశాలకు వలసలుగా వున్న ఆఫ్రికా దేశాల్లో 32 దేశాలు ఈ దశాబ్దంలో స్వతంత్ర రాజ్యాలుగా అవతరించాయి. ఈ మహత్తర పరిణామం వెనుక ఐరోపా దేశాల్లోని అంతర్గత ఉద్యమాల పాత్రను విస్మరించలేము. మావోజెడాంగ్‌ నాయకత్వంలోని చైనాలో సాంస్కృతిక విప్లవం నడిచిన కాలం కూడా ఇదే. అది వికటించడం ఒక విషాదం.

ప్రపంచమంతటా అప్పుడు వీచిన గాలుల ప్రభావం భారత్‌పై కూడా వుంది. ఇందిరా గాంధీ ప్రభుత్వం పూర్వపు సంస్థానాధీశులకు ఇచ్చే రాజ భరణాలను రద్దుచేసి, బ్యాంకులను జాతీయం చేసింది 1969లోనే. పర్యవసానంగా బ్యాంకులు సామాన్యులకు కొంత చేరువై బర్రెలు, గొర్రెలు కొనుక్కునేందుకు రుణా లిచ్చాయి. బొలీవియాలో చేగువేరా హత్యకు గురైన సంవ త్సరమే భారతదేశంలో చారుమజుందార్‌ నాయకత్వంలో నక్సల్బరీ అలజడి ప్రారంభమవడం కాకతాళీయమైనా, ఆ వేడి యాభయ్యేళ్లు దాటినా ఇంకా చల్లారక పోవడం విశేషం.1960వ దశకం పరిణామాల్లో కొన్ని పెడధోరణులు వున్నప్పటికీ, ఆ దశాబ్దం ఎలుగెత్తి చాటిన స్వేచ్ఛ, సమా నత్వం, సోదరభావం అనే భావనలు సర్వకాలాలకూ, సకల మానవులకూ శిరోధార్యాలు.

ఆలోచనలకు సంకెళ్లు లేని, భావాలకు సరిహద్దులు లేని, సంగీతానికి భాషాభేదం లేని, జీవనశైలికి జాతీయ దురహంకారం లేని ఒక వసుధైక కుటుంబాన్ని కలలుగన్న 1969 (60వ దశకం ముగింపు)కి స్వర్ణోత్సవ శుభాకాంక్షలు చెబుతూ... భయంతో, ఆందో ళనలతో కూడిన చిన్న ఉపసంహారం – జాతీయవాదం ముదిరితే తీవ్ర జాతీయవాదం, అది ముదిరితే జాతీయ దురహంకారం. గతంలో జరిగిన ప్రపంచ యుద్ధాలకు జాతీయ దురహంకారమే ప్రధాన కారణం. తీవ్ర జాతీ యవాదం దిశగా ప్రపంచ దేశాలు అడుగులు వేస్తున్న దృశ్యం కనబడుతున్నది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇండియా... ఇంకా అనేక దేశాలు ఈ దిశలోనే అడుగులు వేస్తున్నాయి. ఈ అడుగుల వడి పెరిగితే, ఇక మెదళ్లపై నిఘా వేసి, హృదయాలకు సంకెళ్లు వేసే పీడ రోజులు దగ్గరపడినట్లే.  


వ్యాసకర్త: వర్ధెల్లి మురళి 
ఈ-మెయిల్: ​​​​​​muralivardelli@yahoo.co.in

మరిన్ని వార్తలు