ప్రత్యేక హోదా ఏపీ జీవనాడి

11 Jun, 2019 04:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రెండో మాట

ఏపీ అభివృద్ధి ఎజెండా కేవలం ఎన్నికల ఫలితాలకు అతీతమైందని బీజేపీ నాయకత్వం గ్రహించి తీరాలి. ‘ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ఇక ముగిసిపోయిన అధ్యాయం’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్ష హోదా నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఓటమి తర్వాత కూడా ‘దండోరా’ వేస్తున్నారంటే ప్రధాని మోదీ, లేదా బీజేపీ నాయకత్వపు సంకుచిత ఆలోచనా ధోరణి స్పష్టాతిస్పష్టం. ‘ప్రత్యేక ప్రతిపత్తి’ని గురించిన ప్రతిపాదన సాధించేంతవరకు జగన్‌ నిరంతరం జాగరూకతతో ఆందోళన చేయడం అనివార్యమవుతుంది. కేంద్రం తక్షణం ‘జాతీయాభివృద్ధి మండలి’ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రత్యేక ప్రతిపత్తి వైఎస్‌ జగన్‌కు కాదు... అది ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి.

మన దేశంలో కులాలు, మతోన్మాదం ప్రజల మనస్సులపైన, ప్రజల నైతికతపైన చాలా విచిత్రమైన ప్రభావం కలిగిస్తున్నాయి. బహుళ సంఖ్యాక ప్రజలను బాధిస్తున్న దారిద్య్రాన్ని తదితర ఈతి బాధలను గురించి దేశంలో ఎవరూ ఆలోచించి బాధపడుతున్నట్లు తోచదు. నిజమే.. దారిద్య్రబాధల్లో ఉంటూ దుఃఖితులుగా ఉన్న వారికి వ్యక్తిగత స్థాయిలో కొందరు సాయపడటానికి ముందుకు వస్తూ ఉండ వచ్చు గాక. కానీ ఆ సహాయాన్ని అందించే దాతలు మాత్రం తమ సొంత కులంలోని వారికో లేదా సొంత మతస్థులలోని వారికి మాత్రమే సాయ పడుతున్నారని మరవరాదు. ఈ ధోరణి నిజమైన నైతిక ప్రమాణాలకు పరమ విరుద్ధమైన నీతి, ‘ఉల్టా’ నైతికత! దురదృష్టవశాత్తూ మన దేశంలో అమలు జరుగుతున్నదే ఈ ‘ఉల్టా’ నీతి!
– డా. బి. ఆర్‌. అంబేడ్కర్‌ ‘ఏది విమోచన మార్గం‘ (విచ్‌ వే టు ఎమాన్సిపేషన్‌) అస్పృశ్యులన్నపేరిట వేలాదిమంది దళితులు హాజరైన బహిరంగ సభలో మరాఠీలో చేసిన ప్రసంగం: ‘‘అంబేడ్కర్‌ స్పీక్స్‌’’ వాల్యూమ్‌ 1, పేజీ 182, ఎడిటర్‌ ప్రొఫెసర్‌ నరేంద్రయాదవ్‌ (2013)
‘‘దారిద్య్రం అనేది మానవుడు కల్పించిందే అయితే, అదే మానవుడు ఆ దారిద్య్రాన్ని రూపుమాపడమూ సాధ్యమే. ఈ ప్రాపంచిక దృక్పథమే నాకు జీవితపాఠమై నా కళ్లు తెరిపించింది.’’ 
– టిటో టోనీ, సుప్రసిద్ధ ఫిలిప్పీన్స్‌ సామాజిక కార్యకర్త, వందలాది గ్రామాల్లో పెనుమార్పులకు ఆద్యుడైన వాడు
(5–10–2017, రూరల్‌ ఇండియా కథనం)

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ యువజన పార్టీ అధి నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత తొలి ప్రసంగంలో తన పాలనారథానికి, రథికులకు విధా నపరమైన దశా, దిశా నిర్దేశం చేశారు. సుమారు 14 మాసాలపాటు సుదీర్ఘ రాష్ట్ర పాదయాత్ర సందర్భంగా ఆయన రూపొందించి, కోట్లాది మంది ప్రజలతో ముఖాముఖిగా సమస్యలను శ్రద్ధతో విన్న అనుభ వంతో ఆచరణలోకి తాను తేనున్న నవరత్నాల సంక్షేమపథకానికి వెంటనే శ్రీకారం చుట్టడం రాష్ట్రచరిత్రలోనే కాదు, స్వాతంత్య్రానంతర భారత దేశ మంత్రివర్గాల ఆచరణ చరిత్రలోనే ఒక అపురూప పరిణా మంగా భావించాలి. ఉమ్మడి రాష్ట్రాన్ని అర్ధంతరంగా చీల్చడానికి, ముఖ్యమంత్రి పదవి కోసం వెంపర్లాడిన చంద్రబాబు అనర్థదాయక పాలనా వారసత్వాన్ని ప్రజాబాహుళ్యం అండదండలతో పాతిపెట్టి జగన్‌ ప్రజాపక్షపాతిగా రూపొందారు. ఇందుకు ప్రధాన కారణం  గతిం చిన రాచరిక పాలనల్లో కొనసాగుతూ వచ్చిన కుల, వర్గ, వర్ణ, మత వివక్షలకు దూరంగా కేవలం సకలమతాల ‘సారమతి’గా జగన్‌ తనకు తాను సంస్కరించుకున్న ఫలితంగా బైబిల్‌–ఖురాన్‌–భగవద్గీతల సారాన్ని రంగరించుకుని నూతన దృక్పథానికి అంకురార్పణ చేశారు. ఇది పాలకులకే కాదు, పాలితులయిన విభిన్న స్రవంతులకు చెందిన ప్రజలకూ పాఠమే! 

జడత్వంలో మగ్గుతున్న తెలుగు సమాజాన్ని మన్నుతిన్న పింజే రులా పడి ఉండక కొంతైనా చైతన్యం పొందడానికి జగన్‌ ప్రయత్నం, ప్రణాళిక ఉషోదయం ముందు తొలికోడి కూతలాంటి మేలుకొలుపుగా భావించాలి! అలాంటి మేలుకొలుపులకు ఆద్యులు దేశ చరిత్రలోనూ, రాష్ట్రాల చరిత్రల్లోనూ, కొన్ని రాచరిక పాలనా వ్యవస్థల్లో కూడా లేక పోలేదు. అలాగే జగన్‌ మనస్సులో నైలునది పొత్తిళ్లలో ఎదిగిన ఈజిప్టు, నదీ సంగమాల మధ్యన రూపుదిద్దుకున్న మెసపటోమియా నాగరికతల వైభవ ప్రాభవాలు మొదలవకపోవు. ఆ సంస్కృతిలోనే కృష్ణా, గోదావరి, పెన్నా నదీతీరాలలో తెలుగు మాగాణాలు సుక్షేత్రాలుగా అవతరించడా నికి ఎలా దోహదం చేశాయో ఆయన మనస్సులో ఆలోచనలను కుదిపి ఉండవచ్చు. క్రీ.పూ 594 నాటి ఏ«థెన్సులో ధనికులకు పేదలకు మధ్య జాంబవంతుడి అంగలతో పంగలతో పెరిగిపోయిన అసమానతలు, దారిద్య్రం గురించిన చరిత్ర వైఎస్‌ జగన్‌కు తెలియకపోదు. ఆ క్రమంలో ధనిక వర్గ శక్తులు తమ తమ ఆస్తిపాస్తులకు ఎదురైన సవాళ్లను కర్క శంగా ఎదుర్కొనడంలో ఎన్నివేలమంది పేదల్ని, వారి జీవితాలను నాశ నం చేశారో కూడా జగన్‌కి తెలుసు. ఈ దుర్మార్గాలకు, దుర్మార్గులకు కోర్టులు కూడా వత్తాసు పలికి అవినీతికి వత్తాసు పలికి సామాన్య పేద, మధ్యతరగతి ప్రజలను ఎలా నట్టేట ముంచడానికి వెరవలేదో ప్లూటార్క్‌ మహాశయుడు రోమన్‌ చరిత్రలో భావితరాలకు గుణపాఠంగా లిఖించిన సంగతీ జగన్‌కు గుర్తుండే ఉండాలి. 

చంద్రబాబు అరాచక పాలన ఫలితంగా రుణ బాధలలో కూరుకు పోయిన ఆంధ్రప్రదేశ్‌ వేగాతివేగంగా బయట పడేందుకు యువనేత జగన్‌వైపు మోరలెత్తుకుని చూస్తోంది. ఇందుకు, అగమ్య గోచరంగా తెలుగు ప్రజల్ని విభజించి సరైన రాజధానిని, దానికి మౌలిక సదుపా యాలను సమకూర్చగల శక్తిగా పునాది బలంలేని రాజధానిని ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజల నెత్తిపైన ఆకస్మికంగా రుద్ది, ‘మీ చావు మీరు చావండ’ని అర్ధంతరంగా వదిలేసిన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చేదోడు కాగలిగేది –ప్రత్యేక ప్రతిపత్తి ‘హోదా’ మాత్రమేగానీ కేవలం ‘వాదోడు’ కాదు. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి హోదా లేదా ‘ప్రత్యేక తరహా ప్రతిపత్తి’ ప్రతి పాదన ఎందుకు తలెత్తవలసి వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కృత్రిమ పద్ధతుల్లో విభజించినందుకు.. అందుకు కారకులు కాంగ్రెస్, బీజేపీ నాయకులు. చట్టం చేయకుండా బిల్లు రూపంలో (కాంగ్రెస్‌) నాటకం ఆడి, చట్టం కాకుండా శాసనవేదిక తలుపులు మూసి ‘చీకట్లో చిందులాట’తో కాంగ్రెస్‌ ‘తూ.నా. బోర్డు’ చెప్పగా, ఇక ‘మేం అధికారం లోకి ఎలాగూ వస్తున్నాం కాబట్టి ప్రత్యేక ప్రతిపత్తి మేమిస్తాం’ అన్న మిష పైన బీజేపీ వ్యవహరించి ‘దుస్తులు దులుపుకుంది’. నాటి రాజ్యసభలో బీజేపీ నాయకులు అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడు కాంగ్రెస్‌ సభ్యు లతో కలిసి సంతోషంగా చేతులూపుకుంటూ ఆడిన నాటకాన్ని తెలుగు ప్రజలు మరచిపోరు, మరచిపోరాదు. 

తీరా జరిగిందేమిటి? కాంగ్రెస్‌ నుంచి తనకు అధికారాన్ని బీజేపీ గుంజుకున్నదేగానీ, విడగొట్టిన ఏపీకి మాత్రం బాబు చాటున దాగి, అతనితో పరస్పరం లాలూచీ ‘ప్రత్యేక ప్రతిపత్తి’ని ‘ప్రత్యేక ప్యాకేజీ’గా మార్చి ప్రత్యేక ప్రతిపత్తికే ఇప్పటికీ ఎగనామం పెడుతూనే వచ్చారు. నిన్నగాక మొన్న (9–6–19) తిరుపతి సభలో కూడా మోదీ ఎంతసేపూ ‘ఏపీలో నూతన ప్రభుత్వం అభివృద్ధిని సా«ధించాలన్న’ నోటిమాటతోనే సరిపెట్టారు, లేదా ‘జగన్‌ అభివృద్ధి సాధించాలి’ అన్న పదాల చాటున దాగుతూ ‘కేంద్రం అండగా ఉంటుందన్న’ తడిలేని ‘పొడి పొడి’ మాట లేగానీ 2014 నాటి విభజన చట్ట నిబంధనలను సహితం పాటిస్తామన్న మాట మోదీ నోట రాలేదు. ఇంతకూ మోదీ నాన్పుడు ధోరణి వెనుక బీజేపీకి ఒక స్పష్టమైన లక్ష్యం ఉన్నట్టు స్పష్టం అవుతోంది. జగన్‌ నిరం తర పోరాటం ద్వారా డిమాండ్‌ చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ విభజిత రాష్ట్రానికి ‘ప్రత్యేక ప్రతిపత్తి’ని మరి ఐదేళ్లపాటు వాయిదా వేస్తూ జగన్‌ ప్రభు త్వాన్ని సంక్షోభంలోకి నెట్టి ప్రజలలో వ్యతిరేకత పెరగడం కోసం ‘గుంట కాడ నక్కల’ మాదిరిగా ఎదురుచూస్తూ మళ్లీ ఎన్నికల సంతర్పణ నాటికి, రాష్ట్రంలో స్థానభ్రష్టత పొందిన బీజేపీకి ఎలాగోలా ప్రాణం పోయాలన్న తపన ఆ పార్టీ నాయకత్వానికి ఉందనిపిస్తోంది.

కేంద్ర 5వ ఆర్థిక సంఘం ‘ప్రత్యేక తరహా ప్రతిపత్తి’ (స్పెషల్‌ క్యాటగిరీ స్టేటస్‌)ని ముందు మూడు రాష్ట్రాలకు (అస్సాం, నాగాలాండ్, జమ్ము–కశ్మీర్‌లు) కల్పించి తరువాత మరో ఎనిమిది రాష్ట్రాలకు విస్తరిం చింది. అలా వాటి సంఖ్య మొత్తం 11 రాష్ట్రాలకు పెరిగింది. అయితే, ఆ తర్వాత ‘ప్రత్యేక ప్రతిపత్తి’ని మాత్రం ఐదు సూత్రాలపై ఆధారపడి అస్సాం, నాగాలాండ్, జమ్మూ–కశ్మీర్‌లకు మంజూరు చేశారు. నిజానికి ఇవన్నీ కృత్రిమ విభజన ద్వారా ఏర్పడిన రాష్ట్రాలే, పన్ను రాయితీలకు, రాష్ట్ర ఆదాయం హెచ్చుతగ్గుల నిష్పత్తిపైన ఆధారపడి ప్రత్యేక ప్రతిపత్తిని అనుభవిస్తున్నవే. అయితే ఇక్కడ ఎంత మాత్రం విస్మరిం^è కూడని అంశం ఏదంటే– ఆంధ్రప్రదేశ్‌ విభజన, స్థిరమైన రాజధాని లేని విభజన ద్వారా, ఐదేళ్ల తర్వాత కూడా కోలుకోలేని స్థితిలో ఉన్న రాష్ట్రమనీ, అందుకే ప్రత్యేక ప్యాకేజీ కాకుండా, ‘ప్రత్యేక ప్రతిపత్తి’ గల రాష్ట్రంగానే పారిశ్రామిక, విద్యా, ఆరోగ్యరంగాల సత్వర ఆర్థికాభివృద్ధికి అవసర మని గుర్తించాలి.

ఏపీ అభివృద్ధి ఎజెండా కేవలం ఎన్నికల ఫలితాలకు అతీతమైందని బీజేపీ నాయకత్వం గ్రహించి తీరాలి. ‘ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ఇక ముగిసిపోయిన అధ్యాయం’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్ష హోదా నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఓటమి తర్వాత కూడా ‘దండోరా’ వేస్తున్నారంటే ప్రధాని మోదీ, లేదా బీజేపీ నాయకత్వపు సంకుచిత ఆలోచనా ధోరణి స్పష్టాతిస్పష్టం. ‘ప్రత్యేక ప్రతిపత్తి’ని గురించిన ప్రతిపాదన సాధించేంత వరకు జగన్‌ నిరంతరం జాగరూకతతో ఆందో ళన చేయడం అనివార్యమవుతుంది. తక్షణం ‘జాతీయాభివృద్ధి మండలి’ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ప్రత్యేక ప్రతిపత్తి వైఎస్‌ జగన్‌కు కాదు, ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి. ఇంతకూ చంద్రబాబును ఇంతకాలంగా అంట కాగుతూ వచ్చిన బీజేపీ అగ్రేసర నాయకత్వం బాబు బహిర్గత అక్ర మాలపై, అవినీతిపై సమగ్ర విచారణ జరిపి, శిక్షాపాత్రుణ్ణి చేయడానికి ఎందుకు వెనుకాడుతుందో, రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాలి. ‘పరోపదేశ పాండిత్యం’ ఇక చెల్లదుగాక చెల్లదు!!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in 

మరిన్ని వార్తలు