మౌనం ఒక యుద్ధ నేరం

19 Jul, 2020 00:38 IST|Sakshi

‘‘చిన్నప్పుడు మా అమ్మ నాకో కథ చెప్పింది / ఇంటి ముందు కుంపట్లోనో వంటింట్లో దాలిలోనో ఉన్నట్లుగానే / ప్రతిమనిషి గుండెలో నిప్పు ఉంటుంది’’ అంటారు ప్రసిద్ధ కవి వరవరరావు. ‘నిప్పు–మనిషి కనుగొన్న న్యాయం’ అని నమ్మిన వ్యక్తి ఆచరణ ఎట్లా ఉంటుందో ‘వివి’ని చూస్తే తెలుస్తుంది. మనిషి మనిషి గుండెలో నిప్పు చల్లారకుండా తన హృదయం, మేధస్సు, శ్రమ, ప్రతిభలతో నిలువెత్తు జ్వాలై ఎగసినవాడు, ఈ రోజు భీమా కోరేగావ్‌ కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నవీ ముంబై జైలులో ఉన్నారు.

భారతదేశం గర్వించదగ్గ మేధావి, కవి, ఉపన్యాసకుడు, ప్రజాస్వామికవాది అయిన వరవరరావుని ఈ కేసులో ఇరికించి ఏడాదిన్నర దాటింది. పుణే నుంచి ముంబై తలోజా జైలుకి మార్చడం తప్ప కేసులో ఎటువంటి పురోగతి లేదు. నేరారోపణ ప్రక్రియ పూర్తి కాలేదు. కేసు విచారణకి రాలేదు. బెయిల్‌ పిటిషన్లు తిరస్కరిస్తూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. రాజకీయ ఖైదీల కేసులలో వారికి ఇవ్వాల్సిన సదుపాయాలు కూడా ఇవ్వడం లేదు. కూర్చునేందుకు కుర్చీ, పడుకోటానికి మంచం కూడా ఇవ్వకుండా శరీరాన్ని హింస పెడుతూనే ఉన్నారు. వయసును, కరోనా విపత్తును, ఖైదీలతో కిక్కిరిసిన జైళ్లను దృష్టిలో ఉంచుకొని వివి, తదితర భీమా కోరేగావ్‌ అండర్‌ ట్రైల్‌ ఖైదీలను సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి విడుదల చేయమని పౌర సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతూనే ఉంది.

మరీ ముఖ్యంగా నెలరోజుల నుండి అనారోగ్యానికి గురయిన వరవరరావుని విడుదల చేయమని ప్రపంచవ్యాప్తంగా విజ్ఞప్తులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అవేవీ పట్టించుకోకుండా పదే పదే బెయిల్‌ నిరాకరిస్తున్నారు, అత్యవసర వైద్య సదుపాయాలు కూడా అందించడం లేదు. శరీరంలో తగ్గుతున్న సోడియం నిల్వల స్థాయికి సరైన వైద్యం అందించకపోవడంతో తనవాళ్ళను గుర్తించలేని, పొంతన లేని మాటలు మాట్లాడే స్థితిలోకి ఆయనను తెచ్చింది ప్రభుత్వం. ఫాసిస్ట్‌ రాజ్యానికి మానవీయత కాదు కదా రాజ్యాంగ బద్ధత అనేది కూడా ఏ మాత్రం లేదని ఇటువంటి ఘటనలు నిరూపిస్తున్నాయి. 

ఇటువంటి పరిస్థితిలో వివికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలటం మరీ ఆందోళన కలిగిస్తున్నది. తమ కస్టడీలో ఉన్న మనిషి ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యం – చట్టబద్ధం, నైతికం కాదు. కేసు విచారణ ముగిసి, తీర్పు రాకుండానే విడుదల చేయడం చట్టబద్ధం కాకపోవచ్చు. కానీ ఇపుడున్న విపత్తు పరిస్థితుల్లోనూ వయసు రీత్యానూ ఆయన బెయిలు మంజూరు విషయంలో కాలయాపన చేయడం మానవ హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. వరవరరావు ఆరోగ్యం విషయంలో ఇప్పటికైనా తగిన శ్రద్ధ తీసుకోవాలి.  ఎన్‌హెచ్‌ఆర్సీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం తక్షణం ఆయనను కోవిడ్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించి నిపుణుల పర్యవేక్షణలో స్వేచ్ఛాయుత వాతావరణంలో చికిత్స అందజేయాలి. వైద్యరంగం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కనుక మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆరోగ్యానికి సంబంధించి మెరుగైన వైద్య సేవలు అందించేలా సంబంధిత శాఖలను అప్రమత్తం చేయాలి. ప్రతి ఒక్క మనిషికి ఉన్నట్లుగానే వివికి కూడా ఆరోగ్యంగా, గౌరవంగా జీవించే హక్కు ఉన్నదని గుర్తించాలి. 

తెలంగాణ చారిత్రకత పట్ల ఎంతో గౌరవాన్ని ప్రకటించే ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, చరిత్రాత్మక వ్యక్తి అయిన వివిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కేసు తెలంగాణ పరిధిలోనిది కాకపోయినా వివి రక్షణ విషయంలో కలగజేసుకుని కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడడం ఇప్పుడు అవసరమైన సందర్భం. ఆరు దశాబ్దాల పాటు తెలుగు సాహిత్య, సామాజిక, రాజకీయ రంగాల్లో వివి వేసిన ముద్ర అనితరసాధ్యం. వివి విడుదలను కోరడం, దాని కోసం పోరాడడం అంటే అది ఒక వ్యక్తి కోసం చేసే పోరాటం కాదు. సుదీర్ఘ కాలం ప్రజాక్షేత్రంలో తమ జీవితాలను పణం పెట్టి, అసమాన త్యాగాలకు, సాహసాలకి సిద్ధపడినవారు, వ్యక్తులుగా కాక ప్రజల ఆశలకి, ఆశయాలకి ప్రతీకలుగా మారతారు. అటువంటి ప్రతీక అయిన వరవరరావుకి హాని తలపెట్టడం, అక్రమ నిర్బంధాలకి పాల్పడటం ద్వారా అటువంటి స్ఫూర్తిని దెబ్బతీయడం ఫాసిస్ట్‌ ప్రభుత్వాల లక్ష్యం.

అందుకే వివి తదితర రాజకీయ ఖైదీల విడుదల కోసం మైనార్టీ స్వరాలైనా సరే.. గట్టిగా నినదిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో అటు నాగపూర్‌ అండా సెల్‌లో అనేక తీవ్ర ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న మరొక కవి, మేధావి, అనువాదకుడు, అధ్యాపకుడు అయిన సాయిబాబా విషయంలో అత్యవసర ఆరోగ్యపర చర్యలు చేపట్టడం ఇపుడు చాలా అవసరం. కోవిడ్‌ హానికి అనువుగా ఉన్న నాగపూర్‌ జైలు వాతావరణం నుండి ఆయనను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలది. జైళ్లు పరివర్తన కేంద్రాలు అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చెప్పే మాట. అవి మనదేశ మానవ వనరుల విధ్వంస కేంద్రాలు కాకూడదు. వివి, సాయిబాబా తదితరుల క్షేమం పట్ల అంతర్జాతీయంగా వస్తున్న విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. ఇందుకోసం ఎవరికి చేతనైన స్థాయిలో వారు కృషి చేయాలి. వరవరరావు స్వయంగా చెప్పినట్లుగా –
‘‘నేరమే అధికారమై
ప్రజల్ని నేరస్తుల్ని చేసి వెంటాడుతుంటే 
ఊరక కూర్చున్న /నోరున్న ప్రతివాడూ నేరస్తుడే’’

కాత్యాయనీ విద్మహే, కె.ఎన్‌. మల్లీశ్వరి – ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక 

మరిన్ని వార్తలు