ఊపిరాడని యూరప్‌!

29 Mar, 2020 00:38 IST|Sakshi

ఇప్పుడు ప్రపంచాన్ని వెన్నాడుతున్న భూతం– కరోనా వైరస్‌ అన్ని ఖండాలతోపాటు యూరప్‌ను కూడా వణికిస్తోంది. అయితే ఈ ఖండంలోని అన్ని దేశాల్లోనూ కేసుల సంఖ్య ఒకేలా లేదు. మరణాల సంఖ్యలోనూ ఎన్నో వ్యత్యాసాలు. ఈ గణాంకాలు అందరిలోనూ సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఇందులో కావాలని తగ్గించి చూపుతున్న దేశాలెన్ని.. పట్టించుకోవడంలో జాప్యం చేసి లెక్క సరిగా చూసుకోని దేశాలెన్ని.. నిర్లక్ష్యంతో ప్రాణా లమీదకు తెచ్చుకున్న దేశాలెన్ని అన్న అనుమా నాలు తలెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఆరు లక్షలు దాటిపోగా... మరణాల సంఖ్య 30,000కు చేరువవుతోంది. 1,37,329 మంది పూర్తిగా కోలుకోగలిగారు.

యూరప్‌ దేశాలన్నీ రాగల ఉత్పాతాన్ని తల్చుకుని తల్లడిల్లిపోతున్నాయి. ఇటలీలో మృత్యుదేవత వికటాట్టహాసం చేస్తోంది. అక్కడ 86,500 కేసులుం డగా, 9,134 మంది మరణించారు. స్పెయిన్‌ లోనూ దాని తీవ్రత ఎక్కువే. మూడో వారానికి చేరుతుండగా ఆ జబ్బు ‘వదల బొమ్మాళి’ అంటూ దాన్ని పీడిస్తోంది. అక్కడ 72,248 కేసులు బయ టపడ్డాయి. అక్కడ 5,690 మంది మరణించారు. ఫ్రాన్స్‌లో ఆలస్యంగా ప్రకటించిన లాక్‌ డౌన్‌ను జనం సక్రమంగా పాటించకపోవడం వల్ల ఆ దేశం చెల్లించుకోవాల్సిన మూల్యం ఎక్కువే కావొచ్చునంటున్నారు. అక్కడ 32,964 కేసులు బయ టపడితే, 1,995 మంది మరణించారు.

అయితే ఎప్పటికప్పుడు కొత్త కేసులు వస్తూనే వున్నాయి. జర్మనీలో కేసులు జాస్తిగా వున్నాయి. అక్కడ 53,340 మంది ఈ జబ్బుబారిన పడ్డారు. ఈ సంఖ్య చూసి అందరికందరూ బెంబేలెత్తుతు న్నారు. కానీ మరణాలు చూస్తే ఇప్పటికీ 400 దాటలేదు. అందుకు ఊరటపడాలా లేక సరైన లెక్కలు రావడం లేదనుకోవాలా అన్న శంకలు తప్పడం లేదు. బ్రిటన్‌లో ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్, ఆరోగ్యమంత్రి మట్‌హన్‌ కాక్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. వీరికన్నా ముందే ప్రిన్స్‌ చార్లెస్‌ కరోనా బారినపడ్డారు. అక్కడ కూడా కరోనా తన ప్రతాపాన్ని చూపుతోంది. 

ఈ మహమ్మారి బయటపడింది ఇటీవలే కావడం వల్ల తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపైనగానీ, కేసుల్ని ఆరా తీయడంలో, వ్యాధి గ్రస్తుల్ని నిర్ధారించడంలో అనుసరించదగిన విధా నాలపైగానీ అంతర్జాతీయ ప్రమాణాలు ఇంకా సంపూర్ణంగా రూపుదిద్దుకోలేదన్నదే నిపుణులి స్తున్న జవాబు. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితిని ఎప్ప టికప్పుడు మదింపు వేస్తూ, వేర్వేరు దేశాల ఆచరణ ఎలావుందో చూస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు, సలహాలు ఇస్తోంది. కరోనాలో అందరికన్నా ముందే నిండా మునిగి, ఇప్పుడి ప్పుడే తేరుకున్న చైనా వైపు ప్రపంచమంతా ఆశగా చూస్తోంది.

ఇప్పటికే ఆ జబ్బుతో నానా యాతనలు పడుతున్న దేశాల్లో కొన్ని అమల్లోకి తీసుకొచ్చిన వ్యవస్థల వల్ల మెరుగైన ఫలితాలు కన బడటంతో వాటిని ఆచరించడానికి అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఒకడుగు ముందుకేస్తున్న దేశాలు.. చేయగలిగినంత చేసి చేతులెత్తేస్తున్న దేశాలు.. ఇప్పటికీ సక్రమంగా పద్ధతులు పాటిం చని దేశాలు.. ఇలా రకరకాలుగా వుంటున్నాయి. అసలు దేశాల్లోనే వివిధ రాష్ట్రాల మధ్య ఎంతో వ్యత్యాసం వుంటోంది. ఇలాంటి సమయంలో ఒక దేశం డేటాను మరో దేశం డేటాతో పోల్చి భరో సాతో వుండటం లేదా బెంబేలెత్తిపోవడం సరి కాదని నిపుణులు చెబుతున్న మాట. 

కరోనా జబ్బు లక్షణాల గురించి ఇప్పు డిప్పుడే స్పష్టత వస్తున్నా, కొన్ని ఇతర జబ్బులకు కూడా ఇంచుమించు అవే లక్షణాలు ఉండటం వల్ల జనం ఈ మహమ్మారిని పోల్చుకోలేకపోతు న్నారు. అందుకే తీవ్రమయ్యాకగానీ డాక్టర్లను ఆశ్ర యించడం లేదు.  కనుకనే ఇప్పుడు కనబడుతున్న కేసుల్ని బట్టి ఏం కాలేదన్న భరోసా మంచిది కాదని యూరప్‌ దేశాల ప్రభుత్వాలు ఇప్పు డిప్పుడే తెలుసుకుంటున్నాయి. ఫ్రాన్స్‌లో యువ తను రోడ్ల మీదకు రాకుండా ఆపడం అక్కడి ప్రభుత్వానికి ఎంతో కష్టమైంది. ఇటలీవాసులు కూడా మొదట్లో ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఎవరిని పరీక్షించాలి, ఏ దశలో చికిత్స మొదలె ట్టాలి, పరీక్షలకు అనుసరించాల్సిన శాస్త్రీయమైన ప్రోటోకాల్‌ ఏమిటి అన్న అంశాల్లో ఇంకా స్పష్టత ఏర్పడలేదు.

ఈ తేడాలవల్లే దేశాల మధ్య గణాం కాల్లో వ్యత్యాసాలు కనబడుతున్నాయని నిపుణులంటున్నారు. ‘మా దగ్గర ఫ్లూ లక్షణం కనబడితే అనుమాని స్తున్నాం. కరోనా రోగికి తెలిసిగానీ, తెలియకగానీ సన్నిహితంగా మెలిగిన వారందరినీ కూడా పరీక్ష లకు పంపుతున్నాం. యూరప్‌లోనే కాదు.. ప్రపం చంలో ఏ దేశమూ ఇలా చేయడం లేదు. అందుకే మా దగ్గర కరోనా కేసుల సంఖ్య అధికంగా కనబడుతోంది’ అని జర్మనీ ఆరోగ్య శాఖ సంజా యిషీ ఇస్తోంది. అందులో కొంతవరకూ నిజ ముంది. ఇంతవరకూ రోజుకు 1,60,000 కరోనా పరీక్షలు చేయగల సామర్థ్యం దానికుండేది. దాన్ని 4 లక్షల పరీక్షలకు పెంచబోతోంది. చాలా దేశాలు అసలు పరీక్షలపై దృష్టి పెట్టడం లేదన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫిర్యాదు. పరీక్షల సంగతలా వుంచితే యూరప్‌ దేశాల్లో అనేకం లాక్‌డౌన్‌ల విషయంలో ఇంకా ఉదాసీనంగానే వుంటున్నా యని ఆందోళన పడుతోంది. ఇదే వరస కొనసాగితే ఆ ఖండంలో రెండున్నర లక్షలమంది మరణించే ప్రమాదం వుందని హెచ్చరిస్తోంది.

అందుబాటులోని గణాంకాల ఆధారంగా వ్యాధుల వ్యాప్తిపై అంచనాలు వేసే బ్రిటన్‌ నిపుణుడు టిల్డెస్లీ ఒక మాట అంటున్నారు. ఎవ రికి వారు తమకు కలిగే ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేసుకుని, ప్రభుత్వాలిచ్చిన సూచనలు పాటించడం లేదని, వారిలో ఏమేరకు భయం కలిగించగలమన్న దాన్నిబట్టి ఈ విలయాన్ని కనిష్ట స్థాయికి పరిమితం చేయొచ్చునని ఆయన సలహా ఇస్తున్నారు. ఎవరికి వారు తమను ఈ వ్యాధి కబళిస్తుందన్న భయంతో వున్నప్పుడే దాన్ని ఆపగలమని చెబుతున్నారు. సామాన్య జనం కంటే ముందు ప్రభుత్వాలు ఈ సంగతి తెలుసుకోవాలి. అది యూరప్‌ అయినా, ఆసియా అయినా... మరో ఖండమైనా ఈ సూత్రాలే వర్తిస్తాయి. 

మరిన్ని వార్తలు