పిల్లల్ని చెరబట్టందే చదువు చెప్పలేమా?

27 Feb, 2020 00:38 IST|Sakshi

ఒకరు వీపు విమానం మోత మోగిస్తారు, ఒకరు ఒళ్లు హూనం అయ్యేలా బాదుతారు. ఒకరు బెత్తం విరిగేదాకా కొట్టి చేతులు విరగ్గొడ తారు, మరొకరు వెంటాడుతూ విద్యార్థి భవనం నుండి దూకి ప్రాణాలు కోల్పోయినా మా తప్పు కాదు తప్పంతా చచ్చిన విద్యార్థిదే అని నిస్సిగ్గుగా చెబుతారు. ఓ టీచ రమ్మ పిల్లల్ని తనకున్న పశువులను కట్టేసే అపార అను భవంతో స్కూల్లోనే పిల్లల్ని తాళ్లతో కట్టేస్తారు. ఇదేమంటే తాను పని చేసుకుంటుంటే పిల్లలు అల్లరి చేస్తున్నారని అంటారు. తన పని ఇంటిపని బడిలో చేసుకోవడం కాదని పాఠశాలకి వచ్చినప్పుడు పాఠాలు చెప్పాలనే జ్ఞానం లేకుండా మాట్లాడుతారు. మరోసారి వారు మా బడికి పోనీటైల్‌ వేసుకొస్తే శిగ తరుగుతామని అన్న ఆ పెద్ద సారువారు అన్నంత పనీ తన టీచర్లతో చేయించారు. నిత్యం ఎక్కడోచోట సారీ ఎన్నోచోట్ల పిల్లల్ని చెరబట్టందే పాఠాలు చెప్పలేమని సిద్ధాంతీకరించిన మన చండా మార్కుల వార సులైన కొందరు పంతుళ్లు, పంతులమ్మలకు పిల్లల్ని కొట్టి, తిట్టి నానా హింసలకు గురి చేయందే నిద్రపట్టదు. ఇలా పిల్లలకు బాల్యమన్నది లేకుండా ఆ మధుర స్మృతులు సైతం మదిలోకి రాకుండా చేస్తున్నారు.

పిల్లల మీద జరుగుతున్న ఈ ఘోరాలను ఆపాలని ఎవరికీ మనసురాదు. అవి అసలు ఘోరాల కిందకే లెక్కకు రావ న్నట్టు అధికార గణం గణిస్తుంది. ఈ ఘోరాల్లో కొన్ని ఘట నలు మహారాజశ్రీ మన పోలీసు వారి దగ్గరికి వస్తే అటూ, ఇటూ పుస్తకాలు తిరగేసి న్యాయ సలహాదారుల అభి ప్రాయం సేకరించి చివరకు ఓ చిన్న కేసుతో సరిపెట్టి, ఫైలును పక్కనపెట్టేసి.. ఇదెక్కడి పిల్ల కాకుల గోల మా చిన్నప్పుడు మమ్మల్ని మాత్రం తన్నంది బుద్ధి వచ్చిందా అని సూత్రీకరిస్తున్నారు. పిల్లల్ని శారీరక, మానసిక హింసకు గురి చేయరాదని బాలల హక్కుల చట్టాలలో రాసి ఉన్నా.. అవి చదివే తీరిక, అమలు చేసే కోరికా ఏ అధికారికీ లేదన్నది నిజం. ఈ చట్టాలన్నీ తెలిసి వాటిని తు.చ. తప్పకుండా పాటించాల్సిన విద్యాశాఖ అధికార గణం తు.చ. ఇవేమీ పాడు చట్టాలు ‘దొరకొడుకునైననూ తొడ పాశములుబెట్టి, బుగ్గలు నలు పంది బుద్ధి రాదు’ అన్న పాత, పాడుబడిన పద్యాలు వల్లెవేసుకొని.. చదువు చెప్పినవాడు చావబాదడం నేరమా? ఛీ ఇవేం చట్టాలు అని ఆ చట్టాలను హేళన చేయడం తప్ప పిల్లలపై పంతుళ్ల, పంతులమ్మల దౌర్జన్యాలు జరిగినప్పుడు చర్యలు చేపట్టాలన్న ఇంగిత జ్ఞానాన్ని మరిచిపోతున్నారు. పిల్లల్ని చీల్చి చెండాడిన చండా మార్కులకే వంతపాడుతూ, వత్తాసు పలుకుతున్నారు. ఇటు పోలీసు, అటు విద్యా శాఖ అధికారుల తీరు ప్రైవేటు పాఠశాలలకూ, పిల్లల్ని హింసించే గురువర్యులకు కొంగు బంగారంగా మారుతోంది.

పిల్లలు చచ్చిపోయినా సరే చదువు నేర్పి తీరాల్సిందే అనే వైఖరి పాటిస్తుంటేనే పాఠశాలలంటేనే పిల్లలకు పై ప్రాణాలు పైనే పోయి చదవడం కన్నా చాకిరీ చేసుకోవడమే మిన్న అని పిల్లలు బాల కార్మికులుగా మారిపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం వారింకా పిన్నవారే కదా.. వారికి ఓటు హక్కు వస్తేనే కదా మన అవసరం అని అనుకుంటున్నారు. కానీ అక్షరాస్యత పెరగాలంటే బాల కార్మిక వ్యవస్థ సమూ లంగా పోవాలంటే, బడి అంటే భయం కాదు ప్రేమ కలిగిం చాలి. చదువు అంటే కష్టం కాదు, ఇష్టం అనిపించాలని.. పిల్లల చదువు సాగి అక్షరాస్యత పెరగాలంటే కొందరు రాకాసి పంతుళ్లు, పంతులమ్మల కోరలు పీకాల్సిందేనని ఆలోచించడం లేదు. గురువులు ఎన్ని అకృత్యాలు చేసినా వారివద్ద ఓట్లున్నాయి, పిల్లలు ఎన్ని బాధలు పడుతున్నా ఓట్లు లేని వెధవలు అనే భావనతో కొందరు నాయకుల ప్రవర్తన వల్ల పిల్లల్ని పట్టించుకునే నాథుడే లేడు. పిల్లల్ని రాచిరంపాన పెట్టడంతో తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా అక్షరాస్యత శాతం పడిపోయింది.

పిల్లలు బడుల్లో ఇష్టంగా చదవాలంటే వారిని కష్ట పెట్టకుండా చదివించే గురువులు కావాలి. కానీ, నేను గురువును నాకు మర్యాద, గౌరవం కావాలంటే, గురువులు గౌరవంగా, మర్యాదగా ప్రవర్తించంది వారికి ఆ రెండూ దొర కవు. వారు గౌరవంగా ప్రవర్తిస్తేనే ఎదుటివారి నుండి గౌరవం దొరుకు తుంది. ఇక మన విద్యా వ్యవస్థ బాగుప డాలంటే.. వాహనం నడిపే వారికి వాహనం నడుపగలరని లైసెన్స్‌ ఇస్తున్న మనం చదువు చెప్పేవారు చెప్పగలరని ఎలాంటి ధృవీకరణ పత్రం ఇవ్వడం లేదు, బతుకుదెరువు దొరకని వాడు బడి పంతులుగా మనగలుగుతున్నాడు. చదువు చెప్పే ప్రతి వారికి ప్రభుత్వం తరఫున పరీక్ష నిర్వ హించి సర్టిఫికెట్లు ఇవ్వాలి. పిల్లలకు ఎండాకాలం, సంక్రాంతి, దసరా సెల వులు ఇస్తే ఆ సమయాల్లో టీచర్లం దరికీ చదువు చెప్పే మెలకువలపై ఎప్పటికప్పుడు తర్ఫీదు ఇవ్వడంతోపాటు పిల్లల హక్కుల గురించి వివరించాలి. పిల్లల్ని ఎవరైనా గురువులు తిట్టినా, కొట్టినా నాన్‌బెయిల బుల్‌ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి కస్టడీకి పంపించాలి. పిల్లలపై దౌర్జన్యాలు పంతుళ్లు చేసినప్పుడు వారిని శాశ్వ తంగా చదువుచెప్పే అర్హత కోల్పోయేలా చర్యలు చేపట్టాలి.

పాఠశాలల్లో పిల్లలపై జరిగే హింసకు సంబంధించి ఫిర్యాదు వచ్చినప్పుడు పిల్లల్ని హింసించిన గురువుతో పాటు యాజమాన్యాన్ని బాధ్యులను చేయాలి. పిల్లల్ని తీవ్రంగా కొట్టినా, వారి చావుకు కారణమైనా, పిల్లల ప్రాణా లకు ముప్పు వాటిల్లేలా భద్రత లోపించినా ఆ పాఠ శాలల గుర్తింపు శాశ్వతంగా రద్దు చేయాలి. ప్రతి టీచర్‌ కచ్చితంగా మానసిక విశ్లేషణ పరీక్షలో, చదువు చెప్పడానికి అర్హత సాధించినప్పుడే ఉపాధ్యాయ వృత్తి చేపట్టేలా చర్యలు తీసు కోవాలి. ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యం ఇష్టాను సారంగా జీతాలు ఇవ్వడం కాకుండా ప్రభుత్వ పాఠశాలల అధ్యాపకులతో సరిసమానంగా ప్రైవేటు టీచర్ల వేతనాలు ఉండేలా చర్యలు చేపట్టాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ పిల్లల్ని మానసికంగా, శారీరకంగా హింసకు గురిచేసే వారిని ఉపే క్షించకూడదు. అలాగే ప్రతి పాఠశాలలో పిల్లలు ఫిర్యాదు చేయడానికి వీలుగా బాక్సులను ఏర్పాటుచేసి ఆ ఫిర్యాదు లను వారానికి ఒకసారి ఎంఈఓ స్థాయి అధికారి మాత్రమే తెరచి చూసి ఆ ఫిర్యాదులపై చర్యలు చేపట్టేలా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ చదువులు చెప్పే పాఠశాలల్లో మానసిక, శారీరక దండనలు సమూలంగా నిర్మూలించినప్పుడే మనం నాగరికులమని చెప్పుకోవచ్చు. లేదా అనాగరికులుగా మిగిలి పోక తప్పదు. అక్షరాస్యత ఏనాటికీ వంద శాతానికి చేరదు.
వ్యాసకర్త: అచ్యుతరావు, గౌరవ అధ్యక్షులు, బాలల హక్కుల సంఘం మొబైల్‌ : 93910 24242 

మరిన్ని వార్తలు