ఓట్ల కోసం ‘కోటా’లో పాగా!

11 Jan, 2019 01:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోటా రాజకీయాల చరిత్రలో కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టిన రాజకీయ వేత్త పి.వి. నరసింహారావు. రిజర్వేషన్ల ఫలాలు అందుకొని బాగుపడిన పైతరగతిని కోటానుంచి తప్పించాలనే క్రీమీలేయర్‌ విధానం మొదటిది.  అన్ని వర్గాల్లో (కులాలు మతాలతో సహా) పదిశాతం ఆర్థికంగా వెనుకబడిన వారికి కోటాను వర్తింపజేయడం రెండోది. కొన్ని వర్గాలు ప్రతిఘటించినా క్రీమీలేయర్‌ మార్పు నిలబడింది. రెండోదీ విలువైనదే అని ఈరోజు పరిణామాలు సూచిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం అన్ని సాంకేతిక లోపాల్ని సవరించి రాజ్యాంగాన్ని రెండురోజుల్లో మార్చేసింది. 

ప్రభుత్వ సర్వీసులలో (ప్రయివేటు సర్వీసులలో కాదు), అన్ని విద్యా సంస్థల (ప్రయివేటు సంస్థలతో సహా, మైనారిటీ కాకుండా) ప్రవేశాలలోఇదివరకు రిజర్వేషన్‌ పొందని వర్గాలలో పది శాతం ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఇచ్చే వీలు కల్పిస్తూ భారత సంవిధానం ఆర్టికల్స్‌ 15, 16 లను సవరించే 124వ రాజ్యాంగ సవరణ జరిగిపోయింది. కాంగ్రెస్‌ సహా అన్ని ప్రతిపక్షాలు ఇదేమిటో పూర్తిగా అర్థం చేసుకునే లోగానే సవరణ బిల్లు పాస్‌ అయిపోయి బైట పడింది. రిజర్వేషన్‌ వ్యతిరేకులు కూడా వ్యతిరేకించడానికి వీల్లేకుండా పాలసీని హఠాత్తుగా ప్రకటించారు.  కులాధార రిజర్వేషన్లను ఇవ్వడానికి వీల్లే దని కూడా అనేక ధర్మాసనాలు వివరించాయి.

ఫలానా కులంలో పుట్టిన వారు ఆర్థికంగా విద్యా సామాజిక పరంగా కూడా వెనుకబడి ఉంటే ఆ కులాన్ని వెనుకబడిన కులంగా పరిగణించడంలో తప్పులేదని, కులాన్ని అప్పుడు ఒక వర్గంగా గుర్తించవచ్చని న్యాయస్థానాలు వివరించాయి. ఓట్ల కోసం కోటాను రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయనే విమర్శలు, నిందలు ఎన్ని ఉన్నా,  సంవిధాన రూపకల్పనా సమయంలో షెడ్యూల్డు కులాలు, తెగలకు ప్రాతినిధ్యం కల్పించాలని ప్రతి పాదించిన వారికి అధికార కాంక్షతోకూడిన రాజకీయ స్వార్థాన్ని అంటకట్టడం న్యాయం కాదు.  ఈ సందర్భంలో మిత్రుడు అరుణ్‌ పెండ్యాల కోటా విధానాలు ఏ విధంగా పుట్టాయి, అవి ఏరూపం తీసుకున్నాయి, చివరకు ఏ విధంగా పరిణమించాయి.

 పోనీ, ఆశించినట్టు ఏమైనా ఓట్లు తెచ్చి గెలిపించాయా? అని ఆలోచించారు. ఆ పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంలో మొరార్జీ దేశాయ్‌ ప్రధానమంత్రిగా ఉన్నకాలంలో ఆయనపైన సోషలిస్టు వర్గాలు కోటా కోసం ఒత్తిడి తెచ్చాయి. మొరార్జీ 1979 జనవరి ఒకటో తేదీన ఇతర వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల గురించి మండల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కానీ 1980 జనవరిలో అంటే కమిషన్‌ ఏర్పాటయిన ఏడాది తరువాత అంతర్గత విభేదాలతో ఆ ప్రభుత్వం కూలిపోయింది. మండల్‌ కమిషన్‌ 1980 డిసెంబర్‌ 31న నివేదిక ఇచ్చింది. ఓ దశాబ్దం తరువాత ఈ నివేదికకు ప్రాణం పోసిన ఘనుడు వి.పి. సింగ్‌. 1990 దశకం మొదట్లో చాలా బలహీనమైన సంకీర్ణప్రభుత్వానికి ఆయన అధినేతగా ఉన్నారు.

రాజకీయంగా బలపడడానికి ఉపయోగపడుతుందన్న పేరాశతో మండల్‌ కమిషన్‌ నివేదికను ఆమోదించారు. రాజ్యాంగ సవరణ చట్టాలు తేలేదు కాని, పరిపాలనాపరమైన ఉత్తర్వులతో కోటాను అమలుచేయాలని, అప్పటికి ఉన్న ఓటు కోటలను బద్దలు కొట్టాలని అనుకున్నారు. కానీ జనం వీధినపడ్డారు. యువకులు ప్రాణాలు బలితీసుకున్నారు. మండల్‌ మంటల ఆందోళనలతో దేశం దద్దరిల్లింది. కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైనాయి. సరిగ్గా ఆ దశలోనే మండల్‌కు పోటీగా బీజేపీ మత కమండలంతో రంగంలో ప్రవేశించింది. బాబ్రీ మసీదు స్థానంలో భవ్యమైన శ్రీరామ మందిర నిర్మాణమే తక్షణ కర్తవ్యమంటూ రథయాత్రకు బయలుదేరారు లాల్‌కృష్ణ అడ్వాణీ  మహాశయుడు.

 మండలానికి కమండలానికి జరిగిన పోటీలో కమండలం బయటపడి మండలం మరుగున పడింది.  మండల్‌ ప్రయత్నాలన్నీ హిందువులను చీల్చడానికి వాడుకుంటున్నవేనని సమస్తిపూర్‌ సభలో 23.10. 1990న అడ్వాణీ ప్రకటించారు. ‘మీరు శ్రీరామ మందిరం ఉద్యమం పేరుతో రథం వేసుకుని బిహార్‌లో ప్రవేశిస్తే మేం రానివ్వం, అరెస్టుచేస్తాం’ అని నాటి బీహార్‌ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రకటించారు. అదేవిధంగా అడ్వాణీ అరెస్టయ్యారు. వెంటనే వీపీ సింగ్‌ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించడం, ఆయన పదకొండు నెలల పాలన అంతటితో అంతరించడం తెలిసిందే.
 
తరువాత మరో మైనారిటీ సంకీర్ణాన్ని సమర్థవంతంగా అయిదేళ్లు నడిపి సంకీర్ణంలోనూ స్థిరత్వం, సుపాలన సాధ్యమే అని నిరూపించిన పీవీ నరసింహారావు మరొక పాలనా ఉత్తర్వు ద్వారా అగ్రవర్ణాల పేదలకు ఇచ్చిన పదిశాతం కోటా ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాని క్రీమీలేయర్‌ సంస్కరణను ఆమోదించడం విశేషం. కోటా సాయంతో మళ్లీ అధికారానికి రావాలని ప్రవేశపెట్టిన ఈ పదిశాతం రిజర్వేషన్ల యత్నం ఎంత వరకు ఫలిస్తుందనేది ప్రశ్న. కేవలం ఆర్థిక ప్రాతిపదిక ఆధారంగా కోటాను సుప్రీంకోర్టు ఆమోదిస్తుందా?

వ్యాసకర్త కేంద్ర మాజీ సమాచార కమిషనర్‌
మాడభూషి శ్రీధర్‌

professorsridhar@gmail.com
 

మరిన్ని వార్తలు