రిజర్వేషన్లు అంతిమ లక్ష్యం కాదు

9 Jan, 2019 01:56 IST|Sakshi

అగ్రవర్ణ పేదలకు విద్యా, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం విశేషం. లోక్‌సభ సమావేశాల చివరిలో, రాజ్యసభ సమావేశాల్ని కొంత పొడిగించి మరీ ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లుని చట్టంగా మార్చాలని తలపోస్తున్నారు. పార్లమెంటు ప్రభుత్వ నిర్ణయాన్ని, రాజ్యాంగ సవరణపై ఎలా స్పందిస్తుందో చూడాలి. రాజ్యాం గంలో రిజర్వేషన్‌ హక్కు సామాజిక వివక్ష, అణచివేత  నేపధ్యం ప్రాతిపదికన ఇవ్వబడింది కానీ పేదరికం ప్రాతిపదికన కాదు. వెనకబడిన వర్గాలకు కూడా ఆ వెసులుబాటు సామాజికపరమైన, విద్యాపరమైన వెనుకబాటు ముఖ్య ప్రాతిపదికన తప్పితే ఆర్ధికపరమైన ప్రాతిపదికన లభించలేదు.

అందుకనే అగ్రవర్ణ పేదలకు ఆ రక్షణ కల్పించాలంటే ముందుగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15,16ల్లో ఆర్థికాంశం కూడా అర్హతగా చేర్చి సవరణ చెయ్యాలి. తరువాత అవరోధం సుప్రీం తీర్పు. గతంలో మండల్‌ కేసులో సుప్రీం తీర్పుననుసరించి రిజర్వేషన్లు మొత్తం ఏభై శాతం దాటకూడదు. ఇప్పుడీ చట్టం అమలైతే యాభై శాతం దాటిపోతుంది. ఇక పేదరికం ప్రాతిపదికగా అర్హత ఎలా నిర్ణయిస్తారు? ఒకే స్థాయి ఆదాయం కలిగిన ఇద్దరు వేర్వేరు వర్ణాల అభ్యర్థులు సమానమైన మార్కులతో పోటీ పడితే అందులో ఎవర్ని ఏ ప్రాతిపాదికన సెలెక్ట్‌ చేస్తారు? ఒక జిల్లాలో పదిహేను ఎకరాలున్నా, మరొక జిల్లాలో అరెకరం ఉండడం మంచి ఆర్ధిక స్థితి అయినప్పుడు, ఎకరాల లెక్క బట్టీ ఫలానా జిల్లా వాసిని అర్హుడని తేల్చడం న్యాయమౌతుందా? నకిలీ కులధృవ పత్రాలు సంపాదించి అడ్డదారిన ఫలాలు పొందడమే సులువైనప్పుడు, తప్పుడు ఆదాయం పత్రాలు సంపాదించడం కష్టమా!

ఊళ్ళో పేద కన్నా పెద్దనే ఆలా ఫలితం పొందితే అడ్డుకోగలరా? రానురానూ ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. లక్షలాది ఉద్యోగాలు బ్యాక్‌లాగ్‌ ఉంటున్నాయి. విద్యలో కూడా ప్రయివేట్‌ సంస్థలే రాజ్యమేలుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో అందరి జీవితాలూ మెరుగవ్వడానికి, ఆర్ధికంగా ఎదగడానికి, ఎదిగే అవకాశాలు లభించడానికి, జరగాల్సిన కృషి చాలానే ఉంది. పేదరిక నిర్మూలన, సమగ్ర సామాజిక అభివృద్ధి అన్న పెద్ద లక్ష్యాల సాధన దిశగా రిజర్వేషన్‌ కల్పన అన్నది చిన్న అడుగు. అంతే తప్ప దానికదే లక్ష్యం కాదు. 
చిలకా శంకర్, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు