నిర్లక్ష్యానికి ఇరాన్‌ చెల్లిస్తున్న మూల్యం

4 Apr, 2020 00:43 IST|Sakshi

ఒకటిన్నర నెల క్రితం వారు తమను ఏ వైరస్‌ కూడా ఏమీ చేయలేదనుకున్నారు. తర్వాత వచ్చిపడిన కరోనా మృత్యుభయంతో వణికిపోయారు. ఇప్పుడు అరాజకత్వం, గందరగోళాలతో బెంబేలెత్తిపోతున్నారు. చైనాలో పుట్టిన వైరస్‌ చైనానే ముంచేస్తుంది తప్ప తమనేమీ చేయలేదులే అని భావించిన ఇరాన్‌ పరిస్థితి ఇదీ మరి. నెలరోజుల్లోపే గర్వాతిశయం నుంచి చిగురుటాకులా వణికిపోయే దశలో బిక్కుబిక్కుమంటోంది. తమకేమీ కాదన్న ధీమాతో ఉన్న ఇరాన్‌ తమ వాణిజ్య భాగస్వాములకు పెద్ద ఎత్తున మాస్కులను ఎగుమతి చేసింది కూడా. కానీ ఇప్పుడు అదే ఇరాన్‌.. కరోనా ధాటికి హడలిపోతోంది. దాదాపు డజనకు పైగా ప్రభుత్వ అధికారులు, ఎంపీలు వైరస్‌ బారినపడ్డారు. ఇరాన్‌ సుప్రీం నేత సీనియర్‌ సలహాదారు చనిపోయారు. ఇప్పుడు 3 లక్షలమంది మిలీషియా సభ్యులను ఇల్లిల్లూ తిప్పుతూ దేశంలోని ఇళ్లన్నింటినీ క్లీన్‌ చేయడానికి ఇరాన్‌ ఆరోగ్య శాఖ ప్రయత్నాలు చేస్తోంది. పైగా ముఖానికి మాస్క్‌ తొడగనివారికి, ఇతర ప్రజారోగ్య సాధన సామగ్రిని ఉపయోగించని వారికి మరణ శిక్ష తప్పదని దేశ ప్రధాన ప్రాసిక్యూటర్‌ హెచ్చరించారు కూడా.

తాజా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 10,39,922 లక్షలమందికి పైగా కరోనా వైరస్‌ బారిన పడ్డారు. మృతుల సంఖ్య 55,170కి చేరుకుంది. ప్రస్తుతం ఇరాన్‌లో 47,500 మంది కరోనా వైరస్‌ ప్రభావితులు కాగా 3,160 మందికి పైగా జనం మరణించారు. కానీ వైరస్‌ వ్యాప్తికి ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందకపోగా, కోవిడ్‌–19 బారిన పడిన రోగులు, మృతుల వివరాలపై నోరెత్తవద్దని ఇరాన్‌ భద్రతా బలగాలు డాక్టర్లను, నర్సులను హెచ్చరించాయి. అంతుబట్టని వ్యాధి కారణంగా వందలాదిమంది రోగులు రోజూ ఆసుపత్రులకు వస్తున్నారని నర్సులు, డాక్టర్లు చెబుతున్నా, మందులిచ్చి పంపేయమని అధికారులు చెప్పడంతో అప్పటికే వైరస్‌ సోకిన వారు సమాజంలో కలిసిపోవడం ప్రమాదాన్ని రెట్టింపు చేసింది. చివరకు ఫిబ్రవరి 19న ఇరాన్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే సమయానికి దేశంలో వైరస్‌ అదుపు తప్పిపోయింది.

వైరస్‌ను తాము అదుపు చేయబోతున్నట్లుగా మీడియాలో గుప్పిస్తున్న నియంత్రిత సమాచారం ఇప్పుడు అధికారులకే భీతి కలిగి స్తున్నట్లు కనిపిస్తోందని ఇరాన్‌ వైద్యులు టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూలలో చెబుతున్నారు. ఇప్పటికి కూడా సెక్యూరిటీ ఏజెంట్లు ప్రతి ఆసుపత్రి వద్ద నిఘా పెట్టి వైరస్‌ నివారణకు కావలసిన సామగ్రి కొరత, రోగుల సంఖ్య, వైరస్‌కు బలైన మృతుల సంఖ్యను వెల్లడించవద్దని ఆసుపత్రి సిబ్బందిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇరాన్‌ వాయవ్య ప్రాంతంలోని ఒక నగరం నుంచి ఒక నర్సు తన కుటుంబ సభ్యులకు పంపిన మెసేజ్‌ను తర్వాత న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించింది. కరోనా వ్యాధి సోకిన రోగుల వివరాలను బయటపెడితే అది జాతీయ భద్రతకు ప్రమాదకారి మాత్రమే కాకుండా ప్రజలను భీతావహులను చేస్తుందని భద్రతాబలగాలు తమను హెచ్చరించాయని, ఈ నేరానికి పాల్పడితే క్రమశిక్షణా కమిటీ కఠినచర్యలు తీసుకుంటుందని చెప్పినట్లు ఆ నర్సు తన మెసేజ్‌లో పేర్కొంది.
 
అయితే ఇలా వైరస్‌ ప్రభావిత రోగుల విషయంలో గోప్యత పాటించడం, ఏమీ జరగలేదని భ్రమించడం, మభ్యపెట్టడం వల్ల ఇరాన్‌ ప్రభుత్వ పరువు ప్రతిష్టలు మసకబారతాయని, ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం నశిస్తుందని, వైరస్‌ నివారణకు తీసుకోవలసిన అత్యంత ఆచరణాత్మక వాస్తవిక చర్యలు వెనకపట్టు పడతాయని ఇరాన్‌ వైద్యులు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిని జాతీయ భద్రతా సమస్యగా మార్చడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య బృందాలపై మరింత ఒత్తిడి పెట్టడమే కాకుండా పుకార్లు వ్యాపించి ప్రజలు భయాందోళనలకు గురికాక తప్పదని ఇరాన్‌కు చెందిన వైద్యుడు టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఇలా వాస్తవాలు మాట్లాడుతున్న వారు తమ పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని అభ్యర్థించారు.
 
వాయవ్య ఇరాన్‌లోని గోలెస్తాన్‌ ప్రావిన్స్‌లో వందలమందికి వైరస్‌ సోకినట్లు సమాచారం. కానీ వ్యాధిసోకిన వారి గురించి ప్రకటించడానికి నిరాకరిస్తున్న టెహ్రాన్‌ ప్రభుత్వ వైఖరిపై ఆ దేశ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి మీడియా సమావేశంలోనే తీవ్ర నిస్పృహను ప్రదర్శించారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే  వెయ్యిమందికి పైగా రోగులకు కరోనా సోకిందని కానీ ఎంతమందికి పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలిందో తాము బయటకు చెప్పలేనందున, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తమకు అవసరమైన వైద్య సామగ్రిని పంపబోమని చెబుతున్నట్లు ఆ అధికారి తెలిపారు. వేచి ఉండమని చివరివరకూ చెబుతూ ఉన్నట్లుండి ఇప్పుడు మాత్రం తమను కరోనా కీలక కేంద్ర ప్రాంతంలో ఉన్నారంటూ హెచ్చరిస్తున్నారని ఆ అధికారి వాపోయారు.

కరోనా వైరస్‌ కలిగించే రాజకీయ ప్రభావం గురించి ఇరాన్‌ ప్రభుత్వం చాలా తక్కువగా అంచనా వేసుకుం టోందని లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న పరిశోధక విద్యార్థి సనమ్‌ వకీల్‌ ఆరోపించారు. మొదట్లో తమ ప్రజారోగ్య వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని చెప్పారు. క్వారంటైన్‌ ఎందుకు అని హేళన చేశారు. ఇరాన్‌ ప్రపంచానికే నమూనా అని గొప్పలు చెప్పుకున్నారు. వారంరోజుల్లోపే ఇరాన్‌లో ప్రజాజీవితం సాధారణ స్థితికి చేరుకుంటుందని దేశాధ్యక్షుడు హసన్‌ రౌహానీయే ప్రకటించారు. కానీ రాజకీయ నాయకత్వం ఊహించలేనంత ప్రమాద స్థితికి ఇరాన్‌ ప్రస్తుతం చేరుకుందని సనమ్‌ వకీల్‌ విమర్శించారు.

పైగా ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ అయిన ఇరాన్‌ మసీదుల్లో భారీ ఎత్తున ప్రజలు గుమికూడటంపై నిషేధం విధించకపోవడం వల్లే వైరస్‌ విస్తరించిందని, ఇది ప్రభుత్వం స్వయంగా చేసిన నేరపూరితమైన చర్య అని ఇరాన్‌పై అధ్యయనం చేస్తున్న జార్జి వాషింగ్టన్‌ యూనివర్సిటీ డాక్టర్, చరిత్రకారుడు అమీర్‌ అఫ్కామీ పేర్కొన్నారు. ప్రజాభద్రత కంటే ప్రభుత్వ, మత ప్రతిష్టను ముందుపీటిన పెట్టడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇరాన్‌లో ప్రస్తుత అస్తవ్యస్తతకు రాజకీయ నాయకత్వమే పూర్తి బాధ్యత వహించాలని అమీర్‌ విమర్శించారు. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ చరిత్రలోనే ఇదొక అసమర్థ నాయకత్వమని నిందించారు. వూహాన్‌లో వైరస్‌ విస్తరించినప్పుడు ఇతర దేశాలు మాస్కులతో సహా వైద్య సామగ్రిని పెద్ద ఎత్తున నిల్వ చేసుకుంటూండగా ఇరాన్‌ మాత్రం తనకేమీ కాదనే భ్రమల్లో ఉండిపోయి చైనాకు భారీస్థాయిలో మాస్కులను పంపిం చిందని, ఇప్పుడు ఇరాన్‌లోనే మాస్కులకు కరువొచ్చిందని డాక్టర్‌ అప్కామి విమర్శించారు. కరోనా వైరస్‌ గురించి భ్రమల్లో ఉండటం, వాస్తవాలను తొక్కిపెట్టడం వల్ల జరిగే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఇరాన్‌ ఒక ప్రత్యక్ష సాక్ష్యం.

-ఫర్నాజ్‌ ఫాషిహి, డేవిడ్‌ డి కర్కి పాట్రిక్‌
న్యూయార్క్‌ టైమ్స్‌ కరస్పాండెంట్లు 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు