మహమ్మారిని మించిన అమానుషత్వం

5 Mar, 2020 00:37 IST|Sakshi

కరోనా లేదా కోవిడ్‌19 వైరస్‌ మహమ్మారిని మించిన మహమ్మారి ప్రస్తుతం మనదేశాన్ని పట్టి పీడిస్తోంది. ప్రాణాంతకమైన వైరస్‌ బారిన పడ్డ బాధితుడిని, తన కుటుంబాన్ని, పిల్లలను, వారి చిరునామాలను కూడా బజారుకు లాగి తమాషా చూసే పైశాచికానందానికి సోషల్‌ మీడియా చిరునామాగా అవుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రస్తుతం భారత్‌కూ చేరుకున్నట్లే. ఢిల్లీలో, హైదరాబాద్‌లో, రాజస్తాన్‌లో, ఆంధ్రప్రదేశ్‌లో తదితర ప్రాంతాల్లో కరోనా వైరస్‌ లక్షణాలు పొడసూపుతున్న వైనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పరుగులు పెట్టిస్తోంది. మెడికల్‌ ఎమర్జెన్సీని విధించకపోయినా ప్రభుత్వాలు మాత్రం యుద్ధ ప్రాతిపదికపై అవసరమైన చర్యలు తీసుకుంటూ శరవేగంగా స్పందిస్తున్నాయి. కానీ సోషల్‌ మీడియా  వ్యాధిగ్రస్తులను ఏకాంత శిబిరాల్లో ఉంచి చికిత్స చేయిస్తున్న వారిని వెంటాడుతున్నాయి. ప్రత్యేకంగా వాట్సాప్‌ ద్వారా వ్యాపిస్తున్న ఈ కొత్త రకం అంటువ్యాధికి కొత్త పేరు కూడా పెట్టారు. 

ఇటలీ నుంచి తూర్పుఢిల్లీకి తిరిగివచ్చిన ఒక వ్యక్తిని కోవిడ్‌–19 వైరస్‌ సోకిందన్న అనుమానంతో వైద్య బృందం క్వారంటైన్‌ చేసింది. అతడికి వైరస్‌ నిజంగా సోకిందా లేదా అని ఇంకా నిర్ధారణ కూడా కాకముందే వాట్సాప్‌ గ్రూపుల్లో ఈ వార్త మెరుపులాగా పాకిపోయింది. పరీక్షలు చేయించుకుంటున్న వ్యక్తి పేరు, ఫొటోను పోస్ట్‌ చేయడం, షేర్‌ చేయడంతో ఈ ఉన్మాదం ఆగిపోలేదు. అతడి భార్య, ఇద్దరు చిన్నారి పిల్లల ఫొటోలు కూడా బయటపెట్టేశారు. పైగా ఆ కుటుంబం చిరునామా, అతడు పనిచేసే ఆఫీసు, పిల్లలు చదువుకుంటున్న స్కూల్‌ పేర్లను కూడా వాట్సాప్‌ గ్రూపుల్లో పెట్టిన ఉన్మాదులు తమ పైశాచికానందాన్ని సిగ్గులేకుండా ప్రదర్శిం చారు. కరోనా వైరస్‌ భారతదేశాన్ని తాకిందన్న వార్త వినగానే.. మనలోని వికార, వికృత మనస్తత్వాలన్నీ  సోషల్‌ మీడియాలో ప్రదర్శితమవుతున్నాయి. మనం హీనమానవులమనే కాదు, మనది ఎంత అల్పప్రమాణాలతో కూడిన సమాజం అని కూడా ప్రపంచానికి చూపించుకుంటున్నాం. మొబైల్‌ ఫోన్‌ అనే అత్యాధునిక కమ్యూనికేషన్‌ సాధనాన్ని వాడే అర్హత కూడా మనకు లేదని నిరూపించుకుంటున్నాం.

పైగా, ఒంటరిగా వైద్య శిబిరంలో ఉంటున్న ఆ వ్యక్తికి ఒక్క రోజులోపే 700 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. అతడి కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితం తల్లకిందులైపోయింది. నిజంగా వ్యాధి సోకిందో లేదో కూడా తెలీని స్థితిలో ఉన్న ఆ కరోనా బాధితులు వాట్సాప్‌ గ్రూపుల పుణ్యమా అని జాతీయ విలన్లుగా మారిపోయారు. వారికి సహాయం చేయడం, సానుభూతి చూపడం అలా ఉంచి, పూర్వం రోమ్‌ నగరంలో మాగ్జిమస్‌ క్రీడా మైదానంలో నిస్సహాయులైన బానిసలపైకి సింహాలను ఉసిగొల్పిన దృశ్యాన్ని చూస్తూ రక్తదాహంతో, వెర్రి ఆనందంతో గంతులేస్తూ గడిపిన నాటి రోమన్లకుమల్లే, కరోనా బాధితుడి వార్తను ప్రచారంలో ఉంచిన సోషల్‌ మీడియా గ్రూపులు ఉన్మాదానందంతో మునిగిపోయాయి.

వ్యాధిగ్రస్తుల పట్ల, బాధిత కుటుంబాల పట్ల కాసింత కనికరం కూడా చూపకుండా వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రదర్శితమవుతున్నఈ కొత్తరకం పైశాచిక ఉన్మాదానికి ష్కడెన్‌ఫ్రూయిడ్‌ (టఛిజ్చిఛ్ఛీnజట్ఛuఛ్ఛీ) అని కూడా పేరుపెట్టారు. భారతీయ నేపథ్యంలో ఇలా వ్యాధిగ్రస్తుల కుటుంబాలను అవమానించడం అనేది మన చుట్టూ ఉన్న పరిసరాలపై మనం ఆధిపత్యం చలాయించగలమన్న ఆత్మాధిక్య భావనలోంచే పుట్టుకొస్తున్నట్లుంది. సాటి మనిషి కష్టాన్ని చూడకుండా, ఆ ఘటనకు సంబంధించిన వార్తను ఇలా సోషల్‌ మీడియాలో గంగవెర్రులెత్తించడం భారత్‌లోనే ఎందుకు తీవ్రస్థాయిలో జరుగుతోంది అంటే, దానికి కారణం ప్రజలను విభజించే రాజకీయాలు, ఉనికికోసం ఓ యుద్ధ ప్రపంచంలో మనం జీవిస్తున్నందుకే కాబోలు. ఇటీవలి ఢిల్లీ అల్లర్ల ఘటనలో కూడా బాధితులు తమ వారైతే వారిపట్ల అపార సానుభూతిని ప్రదర్శించడం, బాధితులు తమకు చెందనివారైతే వారిపై పుకార్లు వ్యాప్తి చెందించడం మన కాలపు సహజ ధోరణిగా మారిపోయిందనిపిస్తోంది.
ఇతరులు బాధల్లో ఉండటాన్ని చూస్తే సంతోషం కలగడం, ఇతరులను మనమే బాధించడం మరింత సంతోషాన్ని కలిగించడం అనేది అమానుషత్వానికి పరాకాష్ట అని పెద్దలు ఏనాడో చెప్పారు. హంతక అంటువ్యాధి బారినపడి విషాదంలో మునిగిన బాధిత కుటుంబాలకు సాయపడటం మాని వాళ్లనే హృదయరాహిత్యంతో లక్ష్యంగా చేసుకుని వేధిం చడం సాగించే సమాజాన్ని ఎవరూ సమర్థించలేరు. మన చేతిలో అమరిన అత్యద్భుతమైన సాంకేతిక శక్తిని అమాయకులను, నిస్సహాయులను గాయపర్చడానికి ఉపయోగించడమే మనలోని అమానుషత్వానికి పరాకాష్ట. వ్యాధి ప్రవేశించిన శరీరం కంటే ఒక జాతి సామూహిక మనోచింతనలోకి దూరిన వ్యాధిగ్రస్తత మరింతగా భయపెడుతుంది.
– కె. రాజశేఖరరాజ
 

మరిన్ని వార్తలు