-

జీఎస్టీతో చేనేతపై భారీ దెబ్బ

2 Jan, 2019 03:46 IST|Sakshi

సందర్భం

దశాబ్దాలుగా అస్తవ్యస్థ విధానాల వల్ల కునారిల్లిపోతూ వస్తున్న చేనేతరంగం తాజాగా జీఎస్టీ పన్నుల భారంతో కుదేలవుతోంది. ఒకవైపు మిల్లు రంగం ఉత్పత్తి ఖర్చు తగ్గి, వస్త్రా ల ధరలు తగ్గి చేనేత వస్త్రాల కొనుగోలు పడిపోతున్నది. మరోవైపు ఇన్ని ఏండ్లుగా చేనేత మీద లేని పన్ను భారం ఇప్పుడు జీఎస్టీ రూపంలో పడుతోంది. కత్తిమ నూలు ఉత్పత్తికి, పాలియెస్టర్‌ వస్త్ర పరిశ్రమకు జీఎస్టీ వల్ల పూర్తిగా ప్రయోజనం సాధ్యపడుతుండగా, సహజ నూలు మీద మాత్రం పన్నులు కట్టాల్సి వస్తుంది. 

క్లుప్తంగా, జీఎస్టీ వల్ల చేనేత మీద భారం పెరుగు తుంది. జీఎస్టీలో సహజ నూలుకు, చేనేత వస్త్రాలకు మినహాయింపు ఇవ్వకపోతే, చేనేత ఉపాధి పూర్తిగా తగ్గుతుంది. వస్త్ర దిగుమతులు పెరుగుతాయి. పర్యావరణ విధ్వంసం పెరుగుతుంది. దేశీయ జౌళి పరిశ్రమ ప్రమా దంలో పడుతుంది. జీఎస్టీ పైన విస్తత చర్చలు చెయ్యా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న, సన్నకారు రైతులు మరియు చేనేత కార్మిక కుటుంబాల సమస్యలు మరియు పరిష్కారాలు ఇందులో మిళితంచేసి ఒక సమగ్ర విధానం రూపకల్పన చెయ్యాలి.

దేశీయ జౌళి రంగంలోని అన్ని ఉప రంగాల ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీఎస్టీ వలన భారత జౌళి రంగం స్వరూపం మారిపోతున్నది. చిన్న ఉత్పత్తిదారులు కనుమరుగు అవుతున్నారు. రెండవ దశలో దిగుమతులు మరియు విదేశీ ఉత్పత్తులు పెరిగిపోతాయి. ఈ రెండు దశల క్రమంలో సహజ నూలు ఉత్పత్తులు 60 శాతం దేశ ప్రజలకు అందుబాటులో ఉండవు. 

ఒక చేనేత కుటుంబం నెలకు ఒక వార్పూ లేదా రెండు వార్పులు నేస్తారు. వీరు జీఎస్టీలో ప్రధానమైన ఇన్‌ఫుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పరిధిలోకి రారు. వీరు ముడి సరుకులకు (నూలు, రంగులు, రసాయనాలు తదితర) పన్ను కడతారు. వీరి దగ్గర నేసిన వస్త్రాలు తీసుకునే షావు కారు, కాని కమీషన్‌ ఏజెంట్‌ కాని, కూడా ఈ పరిధిలోకి రారు. అతి పెద్ద షావుకారు రావచ్చు. సాలీనా, రూ.20 లక్షల వ్యాపారం చేసేవాళ్ళే జీఎస్టీలో నమోదు చేసు కోవాలి. చేనేత కుటుంబాలు, చేనేత ఉత్పత్తిలో అనేక రకా ల ఇతర పనులు చేసేవాళ్ళు  జీఎస్టీలోకి రారు. కానీ, పన్ను ల పరిధిలోకి వస్తారు. షావుకారు నమోదు కాని వారి దగ్గ ర కొంటున్నాడు కనుక తానే పన్ను ప్రభుత్వానికి కట్టాలి. వే బిల్లులు లేకుండా సరుకుల రవాణా జరుగకూడదు. వస్త్ర ప్రదర్శనకు తెచ్చిన అన్ని వస్త్రాలకు ‘జీఎస్టీ’ నిబంధనలు వర్తిస్తాయి. వీటన్నింటి వలన  నమోదు కాలేని చేనేత కుటుంబాల ఉత్పత్తి తీసుకోవటానికి షావుకారు ఇబ్బంది పడుతున్నారు.

ఒక చేనేత కుటుంబం 1  చీరె షావుకారు దగ్గరకు తీసుకుపోతే, దాని విలువ ఒక్కటి రూ.2,500 అనుకుంటే, షావుకారు మొత్తం రూ.2,500 మీద 5 శాతం పన్ను కట్టవలసిందే– ముడి సరుకుల మీద కట్టిన పన్ను తీసివేయలేదు కనుక. షావుకారు దగ్గర కొనుక్కునే హోల్‌ సేల్‌ వ్యాపారి సాధారణంగా ఉద్దరకు తీసుకుపోతారు. దీని వలన షావుకారు కట్టే పన్ను తిరిగి రావాలంటే కనీసం 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. అప్పటివరకు, షావుకారు పెట్టుబడి ధనం ఆగిపోతుంది. ఆ విధంగా రెండు వైపులా పెట్టుబడి అవసరం పెరుగుతుంది. దీని వలన తన వ్యాపార సామర్థ్యం తగ్గిపోతుంది. పని ఇవ్వలేడు. ఇక జీఎస్టీ అధికారుల ఒత్తిడి ఉండనే ఉం టుంది. ఈ తల నొప్పి ఎందుకు అని, నమోదు కాని చేనేత కుటుంబం దగ్గర వస్త్రాలు తీసుకోకపోవటమే ఉత్తమమైన మార్గంగా కనిపిస్తున్నది.

జీఎస్టీ (వస్తు సేవల పన్ను) వలన చేనేత మీద తీవ్ర ప్రభావం కనపడుతున్నది. చేనేత ఉత్పత్తికి అత్యంత ఆవశ్యకమైన చిలపల నూలు ఒక కిలోకు 2016–17లో రూ.240.90 ఉండగా, 2017–18లో రూ.245.92కు పెరి గి, నవంబర్‌ 2018 నాటికి రూ.270.76 కు చేరుకుంది. ముడి ఉన్ని నూలు ఒక కిలోకు 2016–17లో రూ.750.40 ఉండగా, 2017–18లో రూ.807.72కు పెరిగి, నవంబర్‌ 2018 నాటికి రూ.1,165.09కు చేరుకుంది. చేనేత ఎగుమతుల మీద కూడా ఈ దుష్ప్రభావం కనపడు తున్నది.

2018–19లో గత ఏడాది తో పోలిస్తే చేనేత ఉత్ప త్తుల ఎగుమతులు 7 శాతం తగ్గాయి. ప్రత్యేకంగా.. ముడి సరుకుల ధరల పెరుగుదల కనిపిస్తున్నది. సహజ నూలు ధరలలో పెరుగుదల కనిపిస్తున్నది. ఉద్దర/అప్పుల మీద ఉత్పత్తి జరుగుతున్నది. జీఎస్టీ వలన 25 శాతం పెట్టుబడి ఆగిపోతుంది. పన్ను ‘అలవాటు’ లేకపోవటంతో కూడా తీవ్ర ఇబ్బందులూ ఏర్పడుతున్నాయి. చేనేత వస్త్రాల ధరల పెరుగుదల 7.7 నుంచి 100 శాతం పెరగడంతో కొనే వారు తగ్గిపోతున్నారు.  మార్కెట్‌ డిమాండ్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. డిమాండులో 2.5 నుంచి 15 శాతం వరకు తగ్గుదల కనిపిస్తున్నది. సామాన్యులకు అందని స్థాయిలో నూలు, చేనేత వస్త్రాల ధరలు అయి నాయి. కొనుగోళ్ళు తగ్గిపోతున్నాయి. 

చేనేత రిజర్వేషన్‌ చట్టం అమలు పూర్తిగా ఆగి పోయింది. వస్త్ర ప్రదర్శనలో పాల్గొనడం కష్టంగా మా రింది. ఉత్పత్తి ఖర్చు పెరుగుతున్నది. జీఎస్టీలో ఉన్న సమ స్యల వల్ల పెట్టుబడి ధనం తగ్గిపోతున్నది. బ్యాంకులు ఎప్పటినుంచో అప్పులు ఇవ్వడం లేదు.  జీఎస్టీ అమలుకోసం ఖర్చుల భారం పడుతోంది. ప్రతి నెల పన్ను కట్టడం, దానికోసం కంప్యూ టర్‌ రిటర్న్‌ చేయడం, దాని కోసం ఒక వ్యక్తిని నియ మించటం. ఇవన్నీ వెరసి ఖర్చులు పెరుగుతున్నాయి. రవాణాలో వే బిల్లులకు, నమోదు అయిన వాహనం మాత్రమే వాడవలసి రావటం కూడా సమస్యలను పెంచు తున్నాయి.

వస్త్ర ప్రదర్శనలలో తీసుకు వచ్చిన మొత్తం సరుకుకు కూడా జీఎస్టీ ప్రామాణికంగా ఉండవలసి రావటం ఒక సమస్య. స్థూలంగా, వస్త్ర ఉత్పత్తిని, వినియోగాన్ని పూర్తి స్థాయిలో, సంపూర్ణంగా మార్చే నూతన ట్యాక్స్‌ పద్ధతి వల్ల ఉన్న ఉపాధి కోల్పోయి, వినియోగంలో స్వావలంబన కోల్పోయి, స్వతంత్ర జౌళి రంగం ఉనికి కోల్పోయి, విదేశీ ఉత్పత్తుల మీద ఆధారపడే దిశగా భారత వస్త్ర పరిశ్రమ పయనిస్తున్నది. అందుకే, చేనేతపై జీఎస్టి పన్ను గురించి ప్రభుత్వం పునరాలోచించి, విస్తృత చర్చలు జరిపి, అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక ఆమోదయోగ్యమైన విధానం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


వ్యాసకర్త: డి.నరసింహారెడ్డి, ఆర్థిక రంగ నిపుణులు 90102 05742

మరిన్ని వార్తలు