ఎంతెంత దూరం?

20 Dec, 2017 01:09 IST|Sakshi

ప్రతి చర్యకి సమానమైన, వ్యతిరిక్తమైన ప్రతిచర్య ఉంటుంది అన్నది న్యూటన్‌ గతి సిద్ధాంతాలలో మూడవది. ఒక ఎత్తు నుంచి బంతిని నేలకి కొడితే అది అంతకన్నా ఎంతో ఎక్కువ ఎత్తుకి ఎగురుతుంది కదా! అప్పుడు రెండు సమానం ఎట్లా అవుతాయి అని మొదటిసారి తరగతిలో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం గురించి ఒక చిన్నారికి సందేహం కలగటం సహజం. బంతిని నేల మీద విసిరినప్పుడు అన్నిమార్లూ ఒకే ఎత్తుకి వెడుతోందా? లేదే? ఎందుకని అన్నది అర్థమైతే సిద్ధాంతం అర్థమవుతుంది. తేడా ఎంత బలంగా కొట్టారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. దూరం, బలం రెండింటి మొత్తాన్ని తీసుకుంటే ఎంత ఎత్తు వెళ్లింది అన్నది సరిగ్గా సమానంగా ఉంటుంది.

ఇది మానవ సంబంధాలకూ వర్తిస్తుంది. ‘నువ్వీ మధ్య నాతో సరిగా మాట్లాడటం లేదు.’ ‘ఫోన్‌ చెయ్యటం లేదు.’ ‘మా ఇంటికి అసలే రావటం లేదు.’ ఇటువంటి దెప్పిపొడుపులు అయినవాళ్ళ మధ్య తరచుగా వింటూ ఉంటాం. ‘పోనీ నువ్వే ఫోన్‌ చెయ్యచ్చుగా.’ ‘నువ్వే రావచ్చుగా’ అంటూ సమాధానాలు చెప్పరు. పైగా ‘ఈ ఊరికా ఊరెంత  దూరమో ఆ ఊరికీ ఈ ఊరంతే దూరం’ అని సమర్థించుకుంటారు. 

‘వన్‌ వే ట్రాఫిక్‌లు వచ్చాక ఆ రూల్‌ పని చేయదు’ అని వింటున్న కుర్రదో, కుర్రాడో అంటే తెల్ల మొహం వేస్తారు పెద్దవాళ్ళు. వన్‌ వేలు మాత్రమే కాదు డివైడర్లు వచ్చాక అది చాలా పెద్ద విషయమే అయ్యింది కదా! మీటర్‌ మీద వచ్చే ఆటోకి ఒక చోటుకి వెళ్ళటానికైనా, రావటానికైనా దానికి చాలా తేడా ఉంటుంది. ఏమంటే డివైడర్లు అంటారు. జాగ్రత్తగా గమనిస్తే, డివైడర్‌ కారణంగా కొంచెం దూరం ఎక్కువైనా రద్దీ తక్కువై, దాని వల్ల ఇంధనం బాగా పొదుపవుతుంది. వాహనం మీద ఒత్తిడి తగ్గి దాని ఆయువు పెరుగుతుంది. ఈ ఉపయోగాలని దృష్టిలో ఉంచుకుంటే స్వంత వాహనదారులు చికాకు పడరు. మానవ సంబంధాల విషయంలో కూడా అంతే. 

ఉదాహరణకు తల్లితో కూతురికి పోటీ ఏమిటి? ‘‘నా ఇంటికి నువ్వెన్ని సార్లు వచ్చావో నీ ఇంటికి నేనూ అన్నేసార్లు వస్తాను’’ అని కూతురు అనటం సమంజసంగా అనిపిస్తుందా? గురువుతో అదే మాట శిష్యుడు అనవచ్చా? ఈ మాటని వృద్ధాశ్రమంలో ఉన్న తండ్రి కొడుకుతో అంటే?... ఏ ఇద్దరి మధ్యనైనా ఉండే సంబంధం ఇరుపక్షాల నుంచి సమానమే అయినా వ్యక్తీకరించే విధానం వంటి వాటిలో తేడా ఉంటుంది. కనుక ప్రతి దానికి పోటీ పెట్టటం కుదరదు. ఈ సంగతిని అర్థం చేసుకుంటే వ్యక్తుల మధ్య సంబంధాలు భద్రంగా ఉంటాయి.
– డాక్టర్‌ ఎన్‌. అనంతలక్ష్మి

మరిన్ని వార్తలు