మోదీ పూసిన మలాము

9 Aug, 2019 01:22 IST|Sakshi

రాజ్యాంగం (జమ్మూకశ్మీర్‌కు వర్తింపు) ఉత్తర్వు 2019 అనే పేరుతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఒక ఉత్తర్వు జారీ చేశారు. అది గెజిట్‌లో ప్రచురించి దాని ప్రతిని అమిత్‌ షా పార్లమెంటులో ప్రకటించి తర్వాత తీర్మానంగా మార్చి ఓటింగ్‌కు పెట్టారు. పార్లమెంటు ఆమోదించిన తరువాత కేంద్ర మంత్రి మండలి.. రాష్ట్రపతి చేత ఉత్తర్వు సంతకం చేయించిందని అనుకోవాలా? లదాఖ్‌ను జమ్మూకశ్మీర్‌ నుంచి విడదీసి రెండింటినీ విడివిడిగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించే జమ్మూకశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు 2019 రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. జమ్మూకశ్మీర్‌కు ఇక గవర్నర్‌ ఉండరు. కేంద్ర హోంమంత్రికి నివేదించే కింది ఉద్యోగిగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఉంటారు. కశ్మీర్‌ సీఎం కన్నా శ్రీనగర్‌ మేయర్‌కు ఎక్కువ అధికారాలుంటాయి. ఆర్టికల్‌ 370 రాజ్యాంగం 21వ భాగంలోని అనేక ప్రత్యేక తాత్కాలిక నియమాలలో ఒకటి. దీన్ని అనుసరించి 1954 ఆర్డర్‌ ద్వారా రాష్ట్రపతి ఆర్టికల్‌ 35ఎ చేర్చారు.

ఇది రాజ్యాంగం ప్రధానభాగంలో కనిపించదు. చివరన అనుబంధం1లో ఉంటుంది. జమ్మూకశ్మీర్‌ శాశ్వత నివాసులెవరు, వారి ప్రత్యేక హక్కులు అధికారాలు ఏమిటి అని ఇది వివరిస్తుంది. 35ఏని రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చకుండా 370 దారిలో చేర్చడం తప్పు అని వాదిస్తూ ఒక పిటిషన్‌ ఇంకా విచారణలో ఉంది.  ఆర్టికల్‌ 370 తాత్కాలిక నియమం. దీన్ని మార్చాలన్నా, తొలగించాలన్నా, కొనసాగించాలన్నా అధికారం జమ్మూకశ్మీర్‌ రాజ్యాంగ నిర్ణాయకసభకు మాత్రమే ఉంది. రాజ్యాంగసభ తమకోసం రాజ్యాంగం రూపొందించి, ఆమోదించి, 370 కొనసాగించాలని నిర్ణయించి, అందులో మార్పులు చేయాలంటే రాజ్యాంగసభ సిఫార్సు అవసరమని నిర్ధారించి రాజ్యాంగ సభను రద్దు చేసింది. జనాభిప్రాయసేకరణ చేసి అందుకు అనుగుణంగా శాశ్వత నియమం చేసేందుకుగాను 370ని తాత్కాలికం అన్నారని రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం. ఈ 370 ఒక మోసమని, ఈ తాత్కాలిక నియమం తొలగించాలని కుమారి విజయలక్ష్మి ఝా 2017లో ఢిల్లీ హైకోర్టులో యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసును కొట్టివేశారు.(https://indiankanoon.org/doc   /153910827/). 

రాజ్యాంగంలో తాత్కాలికం అని రాసి ఉన్నప్పటికీ 370 తాత్కాలికం కాదని ఏప్రిల్‌ 2018లో సుప్రీంకోర్టు మరో కేసులో చెప్పింది. 2017లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కేసు (https:// indiankanoon.org/doc/105489743/) వింటూ సుప్రీంకోర్టు జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు చారిత్రక కారణాలు ఆధారమని సమర్థించింది. ఎస్‌బీఐ కేసులో  సుప్రీం కోర్టు మన రాజ్యాంగం ఫెడరల్‌ రాజ్యాంగమనీ, కశ్మీర్‌కు ప్రత్యేక హోదా అవసరమనీ, 370 తాత్కాలికం కాదనీ మళ్లీ చెప్పింది. 369 ఆర్టికల్‌కు అయిదేళ్ల కాలపరిమితి ఉంది. 370లో అదేమీ లేదు. జమ్మూకశ్మీర్‌ రాజ్యాంగసభ ఆమోదం లేకుండా 370ని తొలగించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. పార్లమెంటుకు, రాష్ట్రపతికి 370(2) తాత్కాలిక నియమాల కింద లభించిన అధికారాలు జమ్మూకశ్మీర్‌ రాజ్యాంగసభ తుది ఆమోదంపైనే కొనసాగుతాయని 1959లో ప్రేమ్‌నాథ్‌ కౌల్‌ కేసులో అయిదుగురు జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాసనం  (https://indiankanoon.org/doc-/816126/) నిర్ణయించింది. జమ్మూకశ్మీర్‌ రాజ్యాంగసభ రద్దయిన తరువాత కూడా 370 కొనసాగుతుందని, అది ఎన్నడూ నిలిచిపోదని అయిదుగురు జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాసనం వివరించింది.  ఏ ట్రీటీలో (ఒప్పందం), అక్సెసన్‌ డీడ్‌లో, కోర్టు తీర్పులో, చట్టంలో, నియమాల్లో, ఆచారంలో, వాడుకలో ఏమున్నా తమ ఉత్తర్వు మాత్రమే చెల్లుతుందని ఆగస్టు 5 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులో పేర్కొన్నట్టు హోంమంత్రి పార్లమెంటు ఆమోదించిన తీర్మానంలో పేర్కొన్నారు. అంతకుముందు 370ని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కూడా దారుణంగా దుర్వినియోగం చేశాయి.

రాజ్యాంగంలోని కేంద్ర అధికారాల జాబితాలోని 97 ఎంట్రీలలో 94 జమ్మూకశ్మీర్‌కు వర్తింపచేశాయి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు. 395 అధికరణాలలో 260 వర్తిస్తాయి. 12 షెడ్యూళ్లలో 7 వర్తిస్తాయి. జమ్మూకశ్మీర్‌ రాజ్యాంగంలో అనేకానేక సవరణలు చేసింది కేంద్రం. అన్నింటికీ మించి రాష్ట్రపతి పాలన విధించే 356 నిబంధన కూడ జమ్మూకశ్మీర్‌కు వర్తింపచేశారు. గవర్నర్‌ను శాసనసభ ఎంపిక చేయాలన్న రాష్ట్ర రాజ్యాంగ నియమాన్ని నీరుగార్చి గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించాలన్న నియమాన్ని కూడా చాలా నిశ్శబ్దంగా అందరి ఆమోదంతో మార్చేశారు.  నెహ్రూ పాలనలో 1954 ప్రెసిడెన్సియల్‌ ఆర్డర్‌ ద్వారా దాదాపు మొత్తం రాజ్యాంగాన్ని, కొన్ని వివాదాస్పద సవరణ చట్టాలతో సహా జమ్మూ కశ్మీర్‌కు వర్తింపచేశారు.

మిగిలిన అడుగూబొడుగూ నియమాలేవైనా ఉంటే మోదీ సర్కార్‌ వాటిని కూడా విస్తరించింది. ఇద్దరు ప్రధానులూ ఘోరాలు చేశారా, ఒకరిది ఘోర తప్పిదమా, మరొకరిది చరిత్రాత్మక విజయమా, ఎవరిదేది? ఎక్కువ రాజ్యాంగ నియమాలను కశ్మీర్‌కు వర్తింపచేసిన ప్రధాని ఎవరు అనే క్విజ్‌ పెడితే మోదీ గెలుస్తారా? షా నిలుస్తారా? మహావక్త, మంచి ప్రధానిగా పేరుతెచ్చుకున్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కశ్మీరియత్, ఇన్సానియత్, జమ్హూరియత్‌ ద్వారా కశ్మీర్‌తో స్నేహ సౌహార్ద సంబంధాలు పెంచుకోవాలన్నారు. మరి నెహ్రూనే కాదు వాజ్‌పేయి కూడా ఘోరతప్పిదం చేసినట్టేనా?


వ్యాసకర్త: మాడభూషి శ్రీదర్‌, బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌, madabhushi.sridhar@gmail.com

మరిన్ని వార్తలు