నేరస్తుల చెరలో ‘న్యాయ’ శాస్త్రం

6 Mar, 2020 00:31 IST|Sakshi

విశ్లేషణ

లా కళాశాలల్లో క్రిమినల్‌ లా, ప్రొసీజర్‌ గురించి పాఠాలు చెబుతూ ఉంటాం. తరగతి గదిలో చెప్పేదానికి, కోర్టుల్లో జరిగేదానికి తేడాలు ఉంటా యని నవ్వుకుంటూ ఉంటారు. తీవ్ర నేరం జరిగితే ప్రథమ సమాచార నివేదిక నమోదు చేయడం అనేది మొదటి దశ. ఇదే లేకపోతే అసలు దర్యాప్తులు నేర విచారణలు ఉండవు. శిక్ష సంగతి తలెత్తదు. బీజేపీ నాయకుల మీద ఎఫ్‌ఐఆర్‌ చేసే విధిని ధైర్యంగా నిర్వర్తించే పోలీసు అధికారులు ఈ దేశంలో లేరా? అది జరగాలనే న్యాయవాదులు, న్యాయమూర్తులన్నా ఉన్నారా? ఈ అన్యాయం భరించలేక హర్షమందర్‌ అనే మానవహక్కులవాది డిల్లీ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. ఎఫ్‌ ఐ ఆర్‌ నమోదు చేయాలని హైకోర్టు మెట్లెక్కవలసి రావడమే పెద్ద విషాదం. ముఖ్యమైన మూడు కొత్త పాఠాలు ఇవి.

1. నేరం జరిగితే మొదటి సమాచార నివేదిక పేరుతో కేసు నమోదు చేయాలని తరగతి గదిలో చెబుతాం. సోలిసిటర్‌ జనరల్‌ గారి కొత్తపాఠం:  తగిన వాతావరణం ఏర్పడి పరి స్థితులు అనుకూలంగా ఉంటే తప్ప నేరం జరి గినా ఎఫ్‌ ఐ ఆర్‌ నమోదు చేయడానికి వీల్లేదని సోలిసిటర్‌ జనరల్‌ వాదించారు.

2. ఒకవేళ ఎక్స్‌ అనే వ్యక్తిపై నేరారోపణ వస్తే అతని మీద ఫిర్యాదు రూపంలో ఎఫ్‌ ఐ ఆర్‌ నమోదు చేయాలన్నది క్రిమినల్‌ లా పాఠం. సోలిసిటర్‌ జనరల్‌ గారి కొత్తపాఠం: ఎక్స్‌ మీద ఎఫ్‌ ఐ ఆర్‌ నమోదు చేయాలంటే ఏబీసీడీ నుంచి జడ్‌ దాకా అందరిమీదా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. లేకపోతే లేదు. 

3. న్యాయం కోరే వ్యక్తి ఎవరైనా సరే అతని దరఖాస్తులో నిజం ఉంటే న్యాయస్థానం విచారణకు స్వీకరిస్తుందని తరగతి గదిలో చెప్పే పాఠం. కొత్తగా ప్రధాన న్యాయమూర్తి గారి ప్రవచనం: న్యాయం చేయాలని కోరే వ్యక్తికి న్యాయవ్యవస్థమీద విశ్వాసం ఉందని రుజువు అయితేనే ఆయన దరఖాస్తు విచారణ చేయాలి. 

హింసాద్వేషాలు వెదజల్లే ప్రసంగాలు నినాదాలు చేసిన మంత్రిగారు అనురాగ్‌ థాకూర్, కపిల్‌ మిశ్రా, పర్వేశ్‌ వర్మ, అభయ్‌ వర్మలపైన ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేస్తారో లేదో ఒకరోజులో తెలియజేయండి అని డిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మురళీధర్‌ బెంచ్‌ హర్షమందర్‌ కేసు విచారణలో సూచించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించడం కుదరదు. ఎందుకంటే ప్రాథమికంగా నేరం జరిగిన ఆధారాలుంటే నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం పోలీసులకే ఉంది.

కనుక ఆలోచించి రేపు సాయంత్రంలోగా చెప్పండి అని మాత్రమే జస్టిస్‌ మురళీధర్‌ అన్నారు. అంతే, న్యాయశాఖ ఆగమేఘాలమీద అర్థరాత్రి బదిలీ ఉత్తర్వులు తయారు చేసింది. జస్టిస్‌ మురళీధర్‌ను పంజాబ్‌ హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతితో సంతకం చేయించి మరీ ప్రకటించింది ఫిబ్రవరి 12నే సుప్రీంకోర్టు కొలీజియం మురళీధర్‌ బదిలీ ప్రతిపాదనను ఆమోదించింది కనుక అని చెప్పింది. మురళీధర్‌ బదిలీకి కొలీజియం ఇంతవరకు కారణాలు తెలియజేయలేదు. మరునాడు ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జడ్జిగారి ధర్మాసనం ఆ కేసును నెల వాయిదా వేసింది. 

బీజేపీ నాయకుల హింసాద్వేష ప్రసంగాలమీద కేసులు త్వరగా వినాలని, ఢిల్లీ హైకోర్టు అంత సుదీర్ఘ వాయిదా వేయడం తగదని సుప్రీంకోర్టు మార్చి 4న మరో కేసులో చెప్పడం కారు చీకటిలో చిరు కాంతిరేఖ. కానీ, ఇందులో కూడా తిరకాసు ఉంది. అదేమంటే ఒక ప్రసంగం చేస్తూ హర్షమందర్‌ తనకు న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం లేదన్నారని పోలీసుశాఖ ఒక అఫిడవిట్‌ వేసింది. కోపిం చిన సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగారు ముందీ సంగతి తేల్చండి తరువాతే అసలు కేసు వింటాం అన్నారు. కానీ, పిటిషనర్‌కు విశ్వాసం ఉన్నా లేకపోయినా న్యాయవ్యవస్థ మీద రాజ్యాంగం మీద న్యాయమూర్తులకు విశ్వాసం ఉంది గనుక కేసు వినవలసి ఉంటుంది కదా?

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌ 
madabhushi.sridhar@gmail.com

 

మరిన్ని వార్తలు