ట్రంప్‌ రాకతో ఒరిగిందేంటి?

28 Feb, 2020 00:21 IST|Sakshi

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్‌ మొదటిసారి పర్యటించిన నేపథ్యంలో ఇంటా బయటా భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రంప్‌ పర్యటనలో సానుకూల చర్చలు జరిగి, హెచ్‌1బి వీసాల జారీ నిబంధనలు, పాల, పౌల్ట్రీ ఉత్పత్తులకు అనుమతులు, డబ్లు్య.టి.ఓ. అత్యంత అనుకూల దేశాల లిస్టు నుంచి భారత్‌ తొలగింపు, అభివృద్ధి చెందుతున్న భారత దేశాన్ని కుట్రపూరితంగా అభివృద్ధి చెందిన 20 దేశాల లిస్టులో చేర్చటం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం పాకిస్తాన్‌పై స్పష్టమైన వైఖరి తదితర అంశాలపై స్పష్టత వస్తుందని ఆశించాము.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం మరొక ముఖ్యమైన అంశం. కానీ, పర్యటనలో ఈ కీలక అంశాలపై  ఏమాత్రం దృష్టిసారించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ ప్రయోజనాలు మరిచి, ఆద్యంతం డొనాల్డ్‌ ట్రంప్‌ మరియు వారి కుటుంబ సభ్యుల సేవలో తరించారు. ఈ విషయాలను ఉటంకిస్తూ, అంతర్జాతీయ మీడియా ట్రంప్‌ భారత పర్యటనను తూర్పారబట్టింది.

ఇక ట్రంప్‌ పర్యటన లోతుల్లోకి వెలితే, మోదీ దాదాపు రూ.100 కోట్లు ఖర్చు పెట్టి గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధి అనే బూటకపు ప్రచారం చాటున ఉన్న మకిలిని ట్రంప్‌ గారికి కనబడకుండా గోడ కట్టి, తద్వారా దేశ ప్రజల కళ్ళు తెరిపించారు. గుజరాత్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజల డబ్బు ఖర్చు చేసి జనాన్ని తరలించి స్టేడియం నింపారు. మొదటి రోజు పూర్తిగా పొగడ్తలకు కేటాయించారు. మోదీ పొగడ్తలతో ట్రంప్‌ను ఆకాశానికి ఎత్తగా, ట్రంప్‌ ఇంకో అడుగు ముందుకేసి మోదీ దేశభక్తికి, ఆయన చాయ్‌ అమ్మినట్టు జరుగుతున్న అబద్ధపు ప్రచారానికి ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇస్తూ పోయారు. ఇక గాంధీ నడయాడిన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్, విజిటర్‌ రిజిస్టర్‌లో మన జాతిపిత మహాత్మా గాంధీ పేరును కూడా ప్రస్తావించకుండా, మోదీని పొగడడం చూస్తే సబర్మతి ఆశ్రమం యొక్క ఔన్నత్యం ట్రంప్‌ గారికి తెలియదు, కేవలం ఫొటోలకు పోజులు ఇవ్వటానికి సందర్శించారని అర్థమవుతుంది. 

నాడు–నేడు ఎప్పుడైనా అమెరికా దృష్టిలో భారత్‌ కేవలం వాళ్ళ ఉత్పత్తులు, రక్షణ పరికరాలు అమ్ముకునే పోటెన్షియల్‌ మార్కెట్‌ మాత్రమే. అమెరికా జాతీయ సంపదకు ప్రవాస భారతీ యులు కూడా ఎంతో  దోహదపడుతున్నారు. ఈ ఏడాది 2020 చివర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నాయి. అక్కడ సుమారు 40 లక్షల మంది ప్రవాస భారతీయులున్నారు. కిందటి ఎన్నికల్లో  కేవలం 16% మాత్రమే ట్రంప్‌కు అనుకూలంగా ఓటు వేసినట్టు కొన్ని సర్వేలు తేల్చడంతో, రాబోయే ఎన్నికలును దృష్టిలో ఉంచుకుని డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ పర్యటనకు వచ్చారు. ఒక రోజంతా ట్రంప్‌ ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పటికి, అక్కడి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కలిసే అవకాశం ఇవ్వకపోవటం, రాష్ట్రపతి విందుకు కూడా పిలువకపోవటం మోదీ ప్రభుత్వం యొక్క వివక్ష.

ఒకవేళ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉండివుంటే ఆ ముఖ్యమంత్రిని పిలిచేవారే కదా! ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ల్లో అక్కడి ముఖ్యమంత్రులకు అవకాశం ఇచ్చిన మోదీ కేజ్రీవాల్‌కు ఇవ్వకపోవడం గమనిం చాలి. తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కరచాలనంతో సరిపెట్టుకోగా, ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానం పంపకపోవటం భారతీయ జనతా పార్టీ వివక్షకు తార్కాణం. మోదీ వ్యక్తిపూజ కోసం వెచ్చించిన సమయాన్ని కుదించి, కొత్తగా ఏర్పడిన తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న సానుకూల అంశాలను వివరించాల్సింది. నిత్యం భారతీయత గురించి ప్రవచించే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు, ట్రంప్‌ పర్యటనలో భారత దేశ విదేశాంగ విధానం, దౌత్య నియమాల పరిధిని దాటి దేశ ప్రతిష్టను దిగజార్చారు. ఒక స్టేట్‌ గెస్ట్‌కు ఇవ్వవలసిన ప్రాధాన్యం కంటే అతిగా చేయడం ప్రధాని కుర్చీ ప్రభను పెంచదు. మోదీ, మన దేశ ఎజెండా పక్కకు పెట్టి, వ్యక్తిగత ఇమేజ్‌ పెంచుకోవడానికి పరిమితమైనారు. మోదీ తన వ్యక్తిగత సంబంధ బాంధవ్యాల కోసం వెంపర్లాడి, భారతదేశ ప్రజల ఆత్మగౌరవం ట్రంప్‌ వద్ద తాకట్టుపెట్టిన తీరు బాధాకరం.
వ్యాసకర్త: కొనగాల మహేష్‌, జాతీయ సభ్యులు, ఏఐసీసీ, మొబైల్‌ : 98667 76999 

మరిన్ని వార్తలు