మహిళా నాయకత్వం చెల్లని చోటు

5 Mar, 2020 00:26 IST|Sakshi

విశ్లేషణ

సైన్యంలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు ఇప్పటికీ తమ పాత కాలపు భావాలకు గట్టిగా అంటిపెట్టుకుని ఉంటున్నారు. అందుకే సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్, నాయకత్వ స్థానాలు పొందటం అనేది చాలా ప్రాధాన్యత కల విషయం. ఇప్పటికీ సైన్యంలో మహిళలకు నాయకత్వ పాత్రలను కల్పించడం లేదు. నా సమర్థత కారణంగా కాకుండా నా జెండర్‌ కారణంగా నా పురుషాధికారి కంటే నేను తక్కువగా గుర్తింపు పొందడం అంటే ఈ అసలు సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదనే అర్థం. నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలో 1971 యుద్ధంలో భారతసైన్యం పోరాడింది. ఈ సైన్యానికే కులం, మతం ప్రాతిపదికలను తోసిపుచ్చిన చరిత్ర ఉంది. ఒక అధికారి కులం, మతం అనేవి అప్రాధాన్యమైనప్పుడు, వారి జెండర్‌ మాత్రం ఎల్లప్పుడూ ప్రశ్నార్థకంగా ఎందుకు మారుతోంది?

సైనికుడు అనగానే మన మనసులో మెదిలే పరిభాష ఒక్కటే. ప్రతిష్ట, మన్నన, సమగ్రత. ఒక వ్యవస్థగా సైన్యం తన సర్వీసును స్వార్థానికి అతీతంగా ఉంచుతూ సాహసానికి అత్యంత విలువనిచ్చి కాపాడుకుంటుంది. అయితే సైన్యంలోని మహిళలను నాయకత్వంలోకి తీసుకునే సమస్య వచ్చేసరికి ఈ ప్రతిష్ట, గౌరవం, సాహసం అనే పదాలన్నీ పక్కకు జారుకుం టాయి. ఇక్కడే విషపూరితమైన పురుషత్వ భావన బుసలుకొడుతూ తన వికార ముఖాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శించుకుంటుంది.

ఏ ఇతర ప్రభుత్వ విభాగంలాగే సైన్యం కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సమాజానికి ప్రతిబింబం మాత్రమే. కాబట్టి సమాజంలో జరుగుతున్నట్లే సైన్యంలో కూడా సామాజిక సంస్కరణ తప్పదు. అలాగే సమాజ పురోగమనం కోసం సైన్యంలోనూ మార్పులు చేయక తప్పదు. కానీ నూటికి నూరుశాతం పురుషులతో కూడిన ఉన్నత సైన్యాధికార వర్గం దృక్పథాన్ని చూస్తే తమతో కలిసి పోరాడుతున్న మహిళా కామ్రేడ్లకు సమానత్వం అనే అంశం విషయంలో తలుపులు మూసుకోవడమే కనిపిస్తుంది. మహిళాధికారుల పట్ల ముల్లు గుచ్చుకునేలా లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజ్‌ కడ్యాన్‌ చేసే వ్యాఖ్యలకు పునాది ఇక్కడే ఉంది.

మొదటగా, సైన్యంలోకి మహిళలను చేర్చుకోవడంపై ఇప్పుడు ఎలాంటి వాదనలు తలెత్తడం లేదు. ఎందుకంటే భారత సైన్యంలోకి 26 ఏళ్ల క్రితమే మహిళలు ప్రవేశించారు. అభ్యంతరాలు ఏవైనా ఉంటే వాటిని మనం దాటుకుని ముందుకెళ్లాం. మరి సైన్యంలో మహిళాధికారుల అజమాయిషీని జవాన్లు ఆమోదించరనే ప్రశ్న ఎక్కడినుంచి వస్తోంది? ఈ జవాన్లే రెండు దశాబ్దాలుగా సైనిక మహిళలను ఆమోదిస్తూ వస్తున్నారు. కాబట్టి మహిళలకు కూడా శాశ్వత కమిషన్‌ ఉండాలన్న అంశాన్ని వారు ఎందుకు వ్యతిరేకిస్తారు?

సైన్యంలో మహిళల ప్రవేశాన్ని సామాజిక ప్రయోగం కోసం  జరుగుతున్న ప్రయోగశాల వంటిదని ఎవరైనా వర్ణిస్తే, 1990లలో మాత్రమే అంటే సైన్యంలోకి మహిళలు ప్రవేశించినకాలంలో అయితే  అది అర్థవంతంగా ఉండేది. ఆ ప్రయోగం ఇప్పటికే పూర్తయిందని, ఆచరణలో కూడా అది సానుకూల ఫలితాలతో విజయవంతమైందని జనరల్‌ కడ్యాన్‌ గుర్తించాల్సి ఉంది మరి. కాబట్టి మహిళలు మగవారికంటే తగ్గు స్థానాల్లోనే ఉండాలని లేక కొన్ని రంగాల్లోనే సమానులుగా నిలవవచ్చుననే ఆలోచన ఉన్నవారికే సైనిక రంగంలో నాయకత్వ స్థానాల్లో మహిళలకు అవకాశం కల్పించాలనేది సమస్యాత్మకంగా ఉండవచ్చు. మహిళలను కాస్త ఉన్నత స్థానంలో చేర్చడాన్ని అంగీకరించడం అంటే తేనె గూడును కదల్చడం లాంటిదే. అంటే ఇక్కడ సమస్య అల్లా జవాన్‌ మనస్తత్వంలో లేదు. మిలిటరీలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారి మెదళ్లలోనే ఇది దాగి ఉంది. 

మహిళలను జిల్లా న్యాయమూర్తులుగా, పోలీసు అధికారిణులుగా గుర్తించి వారి ఆదేశాలను పాటించడాన్ని ఆమోదిస్తున్న ఈ సమాజం నుంచే జవాన్లు పుట్టుకొచ్చారు. మన సమాజంలో అందరూ ఒకేలా ఆలోచిస్తూ ఉండినట్లయితే మనందరం గతంలోలాగా కేవలం అగ్రకులం పాలనకు కట్టుబడి ఉండేవాళ్లం. సాధారణంగా గ్రామీణ భారతంలో కుల విభజన ఉంది కానీ సమానత్వాన్ని ఎత్తిపట్టే బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా శ్రామిక వర్గాలన్నింటిలోనూ కొండప్రాంతాల్లోని మహిళలే అత్యంత కాయకష్టం చేసేవారుగా ఉంటున్నారని దాదాపు అన్ని అధ్యయనాలూ మనకు చెబుతున్నాయి.
అయితే తన అభిప్రాయాలు సైన్యంలోని పురుషులు, మహిళల సాధారణ అభిప్రాయాలకే ప్రాతినిధ్యం వహిస్తున్నాయని లెఫ్టినెంట్‌ జనరల్‌ కడ్యాన్‌ చెబుతున్నట్లయితే దాన్ని విధాయకంగానే చూడాల్సి ఉంది. కానీ, సైన్యంలోని పురుషులందరూ జెండర్‌ పరమైన దురభిమానులు కాదు.

అదే నిజమైతే, భారతీయ వాయుసేనలో మహిళలు పోరాటరంగంలో విధుల్లోకి చేరగలగడం చాలా కష్టమైన పని అయ్యేది. మా తోటి అధికారులు ప్రధానంగా పురుషులనుంచి భారీ మద్దతు పొందడం వల్లే మేం ఆ యుద్ధంలో గెలుపొందగలిగామన్నది వాస్తవం. అయితే సైన్యంలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు ఇప్పటికీ తమ పాత కాలపు భావాలకు గట్టిగా అంటిపెట్టుకుని ఉంటున్నారు. అందుకే సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్, నాయకత్వ స్థానాలు పొందటం అనేది చాలా ప్రాధాన్యతగల విషయం. ఇప్పటికీ సైన్యంలో మహిళలకు నాయకత్వ పాత్రలను కల్పించడం లేదు. ఈ విషయంలో సైన్యాన్ని సంస్కరించాలనే దృష్టి లోపిస్తూనే ఉంది.

గత 26 సంవత్సరాలుగా సైన్యంలోని ముదివగ్గులు మహిళలను అణిచిపెట్టడానికి ఇదేరకమైన వాదనలు చేస్తుండటంపై ఎవరైనా సరే ఆలోచించాల్సి ఉంది. అయితే ప్రతిసారీ పాత గాయం కొత్తగా మన అనుభవంలోకి వస్తూంటుంది. నా సమర్థత కారణంగా కాకుండా నా జెండర్‌ కారణంగా నా పురుషాధికారి కంటే నేను తక్కువగా గుర్తింపు పొందడం అంటే ఈ అసలు సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదనే అర్థం. ఒక శాస్త్రీయపరమైన లేక తార్కిక భూమిక కలిగిన హేతువు అనేదే లేకుండా భారత సైన్యం ఈ అంశంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాన్ని ఇంత బాహాటంగా ఉల్లంఘించడమే ఆశ్చర్యకరం.

మన రాజ్యాంగం ఎత్తిపట్టిన ఆదర్శాల కంటే భారత సైన్యం అతీతమైందన్న పూర్వ నిర్ధారణ నుంచి ఇలాంటి వాదనలు వస్తున్నాయి. పితృస్వామిక, కులస్వభావం కలిగిన భారత సమాజ క్షేత్ర వాస్తవాల పట్ల మన రాజ్యాంగ నిర్మాతలు పూర్తి అప్రమత్తతతోనే వ్యవహరించారు. ఆ క్షేత్ర వాస్తవాలను గుర్తించినప్పటికీ సమానత్వం, స్వేచ్ఛ, స్వతంత్ర భారత్‌ ఆదర్శాన్నే వారు ఎంపిక చేసుకున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అద్భుతంగా రాశారు: ‘‘రాజ్యాంగ నీతి అనేది సహజ మనోభావం కాదు. దాన్ని రూపొందించాల్సి ఉంది. మన ప్రజలు ఆ నీతిని ఇంకా తెలుసుకోవాల్సి ఉందని మనం తప్పక గుర్తించాలి. భారతీయ ప్రజాస్వామ్యం అనేది సారాంశంలో అప్రజాస్వామికంగా ఉంటున్న భారత గడ్డపై బయటకు నిండుగా బట్టలు కట్టుకోవడం లాంటిదే’’.

మన సైన్యంలోని ఉన్నతాధికారుల పేలవమైన వాదనలనే అంబేడ్కర్‌ కానీ, రాజ్యాంగ సభ కానీ పంచుకుని ఉన్నట్లయితే ఏం జరిగి వుండేదో ఊహించుకోండి మరి. అలాంటి స్థానభ్రంశ స్థితిలో జీవించాలని ఎవరైనా కోరుకుంటారా? హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టంపై వ్యతిరేకత, వాటికి ఇటీవలి సవరణలు, వీటితోపాటు ట్రిపుల్‌ తలాక్, శబరిమల తీర్పులపై తీవ్ర ఘర్షణలు వంటి వాటి నేపథ్యంలో రాజ్యాంగ నీతిని ఆనాడు మనపై బలవంతంగా రుద్ది ఉంటే అది ఎన్నటికీ ప్రజారంజకమై ఉండదు.

ఇప్పుడు భారత సైన్యం... ఢిల్లీ హైకోర్టు, వింగ్‌ కమాండర్‌ అనుపమ జోషీ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పుకు మరింతగా కట్టుబడి ఉండాలి, ఎయిర్‌ ఇండియా వర్సెస్‌ నర్గేష్‌ మిర్జాసేట్‌ కేసులో.. ఎయిర్‌ ఇండియాలో మహిళా ఫ్లైట్‌ అటెం డెంట్ల ఉద్యోగ నిబంధనల్లో లైంగిక వివక్షను కోర్టు తోసిపుచ్చింది. సైన్యం అంతర్గత విధానాలను కెలకడానికి సంబంధించి కోర్టు అప్రమత్తత పాటించినప్పటికీ, అప్పటికే వారు తమ విధానాలను సమీక్షించుకోవడంపై దృష్టి పెట్టారు. నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ నేతృ త్వంలో 1971 యుద్ధంలో భారతసైన్యం పోరాడింది. ఈ సైన్యానికే కులం, మతం ప్రాతిపదికలను తోసిపుచ్చిన చరిత్ర ఉంది. ఒక అధి కారి కులం, మతం అనేవి అప్రాధాన్యమైనప్పుడు, వారి జెండర్‌ మాత్రం ఎల్లప్పుడూ ప్రశ్నార్థకంగా ఎందుకు మారుతోంది?  సైన్యంలో మహిళలను మాత్రమే కింది స్థాయిల్లోనే ఎందుకు ఉంచేస్తున్నారు?

జనరల్‌ కడ్యాన్‌ చెప్పిన అంశాల్లో మరొకటి ఏమిటంటే, సైన్యంలో పురుష అధికారులు అనుసరిస్తున్న అత్యంత కఠినమైన శిక్షణా వ్యవస్థను స్త్రీలు తట్టుకోలేరు అన్నదే. సర్, ముందుగా మహిళలను పోటీపడనివ్వండి. మీ ప్రమాణాల్లో నెగ్గినవారినే అర్హులుగా ప్రకటించండి. శిక్షణలో వారు తమ్ముతాము నిరూపించుకోనివ్వండి. వారు సైనిక శిక్షణా వ్యవస్థను తట్టుకుంటే మంచిదే. లేకుంటే అదేమంత చెడ్డ విషయంకాదు. వారు ఏదైనా అడ్డతోవలను చూపించమని అడిగితే ఆ ఐచ్ఛికాన్ని వారికి అసలు ఇవ్వవద్దు. పురుషులు పాల్గొనే అదే క్రీడా క్షేత్రంలో మహిళలనూ పోటీ పడనివ్వండి. వారికి రాయితీలు ఇవ్వవద్దు కానీ నాయకత్వం వహించేందుకు అవకాశం ఇవ్వండి చాలు. మరోసారి చెబుతున్నాను. వారి జెండర్‌ కారణంగా కాకుండా వారి సమర్థత ప్రాతిపదికనే వారిపై తీర్పు చెప్పండి సర్‌. అప్పుడు నేను నా కేసును వెనక్కు తీసుకుంటాను.

అనుపమా జోషి
(ది వైర్‌ సౌజన్యంతో)
వ్యాసకర్త రిటైర్డ్‌ వింగ్‌ కమాండర్, భారతీయ వాయుసేన


 

మరిన్ని వార్తలు