ఏకపక్షానికి ‘ఎదురుగాలి’

5 Jan, 2019 00:24 IST|Sakshi

జాతి హితం

పన్నెండు నెలలు.. కేవలం పన్నెండు నెలలు భారత రాజకీయ చరిత్రనే తిరగరాశాయి. ఈ ఏడాది వేసవిలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో నిజమైన పోటీని మనం చూడబోతున్నాం. 2017లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరాటంతో నరేంద్రమోదీ, అమిత్‌షా ద్వయాన్ని కలవరపర్చిన రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌కు కొత్త ఊపిరి పోశారు.మూడు కీలకమైన హిందీ ప్రాబల్య రాష్ట్రాల్లో బీజేపీని చావు దెబ్బ తీయడం ద్వారా మోదీ, షా వ్యూహాలకు రాహుల్‌ తొలి సవాలు విసిరారు. బీజేపీ రూపంలో ఏకధ్రువ పాలన తప్పదన్న పరిస్థితిని మార్చి రెండో ధ్రువంగా కాంగ్రెస్‌ను నిలిపిన రాహుల్‌ 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఏమాత్రం ఢీకొనగలరనేది అసలు ప్రశ్న.

చాలామంది రాజకీయ విశ్లేషకులు 2017 శీతాకాలం వరకు మూడు అంశాలలో ఏకాభిప్రాయంతో ఉండేవారు: అవేమిటంటే, నరేంద్ర మోదీ రెండో దఫా అధికారంలోకి రావడం ఖాయం; రాహుల్‌ గాంధీకి, ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీకి తుది పతనం తప్పదు; ఇందిరాగాంధీ హయాం ముగిసిన చాలాకాలం తర్వాత భారత్‌ సుదీర్ఘకాలం పాటు ఏక పార్టీ పాలన, ఏకధ్రువ పాలన వైపుగా నడుస్తోంది. ఈ మూడు అంశాలకు దన్నుగా, ఉత్తరప్రదేశ్‌లో పొందిన భారీ విజయంతో దేశంలోని 21 రాష్ట్రాలు బీజేపీ ఏలుబడిలోకి వచ్చాయి. మోదీ ప్రభుత్వ పాలనలో మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లోనూ, 2019లో జరిగే అతిపెద్ద పరీక్షలోనూ సంభవించనున్న ఫలితాలకు తగిన భూమికను ఇవి నిర్దేశించినట్లే కనిపించింది.  
 
అయితే 2017 డిసెంబర్‌ మధ్యనాటికి పరిస్థితిలో ఏదో మార్పు వచ్చింది. అవును.. గుజరాత్‌లో వరుసగా ఆరోసారి కూడా బీజేపీ గణనీయ విజయం సాధించింది. కానీ ఎవరూ ఊహించని విధంగా తీవ్రమైన పోటీ నెలకొంది. నరేంద్రమోదీ, అమిత్‌ షాలు తమ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రదర్శించిన ఆందోళనలు గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించాయి కూడా.  గుజరాత్‌ ఎన్నికలు జరిగిన కొద్ది కాలంలోనే జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని అటు విజయమూ, ఇటు ఉపశమనమూ కలగలిసిన భంగిమతో కన్నీళ్లు కార్చారు కూడా. ఆ సన్నివేశం గుజరాత్‌ ఎన్నికలు ఎంత పోటాపోటీగా జరిగాయో తేల్చి చెప్పింది. దీంతో మోదీషా రాజకీయాల్లో ఇది మౌలిక మార్పును తీసుకొస్తుందని అప్పట్లే రాజకీయ వ్యాఖ్యాతలు రాశారు కూడా.

అంతవరకు అభివృద్ధి, ఉద్యోగాల కల్పన గురించి ఆలోచించకుండా వీరు హిందుత్వ, కరడుగట్టిన జాతీయవాదం, సంక్షేమవాదం, అవినీతిని నిర్మూలించే భారీ స్థాయి ప్రచారంలో తలమునకలై ఉండేవారు. అలాంటి సమయంలో సరైన పిలుపునే ఇచ్చామని మేం ఒకరకంగా సంతృప్తి చెందాం కూడా.  అయితే గుజరాత్‌ ఎన్నికలు ఏమంత ముఖ్యమైన మార్పుగా కనిపించలేదు. కానీ దాని ప్రభావాన్ని అంచనా వేయడంలో రాజకీయ వ్యాఖ్యాతలుగా మేం విఫలమయ్యాం. భారత రాజకీయాలు తదుపరి 12 నెలల్లో దాని ఏకధ్రువ పరిస్థితిని కోల్పోనున్నాయన్న విషయాన్ని 2017 డిసెంబర్‌18న ఎవరూ పెద్దగా ఊహించలేకపోయారు. కానీ ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది.

ఒక టీవీ చానల్‌ కార్యక్రమంలో ఆ చానల్‌ యాంకర్‌ నవికా కుమార్‌కు, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌కి మధ్య జరిగిన సంవాదం మన రాజకీయాలు ఎంత ఏకధ్రువ స్వభావాన్ని సంతరించుకున్నాయో స్పష్టంగా తెలిపింది. కర్ణాటక ఎన్నికలో అధికారం చేజిక్కించుకోవడానికి తగిన సంఖ్యను సాధించలేకపోతే, బీజేపీ ఏం చేయగలదని ఆ టీవీ యాంకర్‌ ప్రశ్నించారు. దానికి పాలక పార్టీలో అత్యంత శక్తిమంతుడైన రామ్‌ మాధవ్, ‘అయితే ఏంటి, మాకు అమిత్‌ షా ఉన్నారు’ అని సమాధానమిచ్చారు. అది సొంత డబ్బా మాత్రం కాదు. బీజేపీకి తగినన్ని స్థానాలు రాకపోతే గెలిచిన మిగిలిన పార్టీల సభ్యులను బీజేపీలోకి ఆకర్షిస్తాం అనే ధీమాను రామ్‌ మాధవ్‌ వ్యాఖ్య వ్యక్తం చేసింది.

గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు సాధించిన అతి పెద్ద పార్టీగా బరిలో నిలబడలేకపోయినప్పటికీ, మేఘాలయాలో మైనారిటీలో ఉన్నప్పటికీ బీజేపీ ఆ రాష్ట్రాల్లో అధికారం సాధించగలిగింది. సీట్లు ముఖ్యం కాదని, తనకు పోటీయే లేదని బీజేపీ ఇక్కడ నిరూపించుకుంది. అది అమిత్‌షా వ్యూహంతో గెల్చుకున్న అధికారమని రామ్‌ మాధవ్‌ సూచించారు.  కానీ తొలిసారిగా కర్ణాటక అసెంబ్లీ ఫలితాలతో ఈ పరిస్థితిలో మార్పువచ్చింది. అతిచిన్న పొత్తుదారుకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థిని నివ్వెరపర్చింది. దీంతో నూతన రాజకీయాలకు నాంది ఏర్పడింది. బీజేపీని అధికారంలోంచి తప్పించాలని బలంగా కోరుకుంటున్న పార్టీలన్నీ పొత్తుకు అంగీకరించే ధోరణి పెరిగింది. దానికోసం ఎలాంటి మూల్యాన్ని చెల్లించడానికైనా ఈ పార్టీలు ఇప్పుడు సిద్ధపడిపోయారు. ఇది నిజంగానే అమిత్‌ షా రాజకీయాలకు సవాల్‌ విసిరింది.  

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం బీజేపీ ఎన్ని పన్నాగాలూ పన్నినప్పటికీ, ఎన్ని కుయుక్తులు అల్లినప్పటికీ, అతిపెద్ద పార్టీగా నంబర్ల గేమ్‌ను ఆడినప్పటికీ అధికారాన్ని కైవసం చేసుకోలేకపోయింది. తొలిసారిగా, మోదీ, షాలు ఓటమి ఎరుగని, పరాజయం తెలీని మహా వ్యూహకర్తలు కాదని కర్ణాటక నిరూపించింది. వ్యూహాత్మకంగా బీజేపీని ఓడించగల సమయస్ఫూర్తిని కాంగ్రెస్‌ ప్రదర్శించింది. పైగా, మోదీ కేంద్రంగా నడిచే ఎన్నికల ప్రచార పోరాటంలో మోదీ తొలిసారిగా విఫలమయ్యారు. బీజేపీకి దన్నుగా నిలిచే అధికార వనరులూ, ఏజెన్సీలు కర్ణాటకలో ఎమ్మెల్యేలను గెల్చుకోవడంలో పరాజయం పొందాయి. ప్రధానంగా సుప్రీంకోర్టు బీజేపీ ఎత్తుగడలకు అడ్డుకట్ట వేసింది.

గుజరాత్‌లో అహ్మద్‌ పటేల్‌ను రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కాకుండా చూడాలని మోదీ, షా ద్వయం చేసిన ప్రయత్నాలకు తొలి సంస్థాగత వైఫల్యం సంభవించిన సంవత్సరం తర్పాత బీజేపీని అధికారం నుంచి తప్పించగలమని, ఉనికి కాపాడుకోవడమే కాదు. గెలుపు కూడా సాధించగలమనే నమ్మకాన్ని కర్ణాటక ఫలితాలు స్పష్టం చేశాయి.  సరిగ్గా ఇదే హిందీ ప్రాబల్య ప్రాంతాల్లో తదుపరి జరిగిన ఎన్నికలకు ఒక విభిన్న పొందికను నిర్దేశించింది. మోదీని ఓడించవచ్చని కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు ఇప్పుడు నమ్మసాగాయి. 2017 డిసెంబర్‌మధ్యనాటికి కలలో కూడా ఇలాంటి స్థైర్యం వాటికి ఉండేది కాదు. 2018 డిసెంబర్‌ మధ్య నాటికి అధికారం తమకు చేరువలో ఉందని తొలిసారిగా కాంగ్రెస్‌తో సహా ప్రతిఫక్షాలకు విశ్వాసం కలిగింది.  అందుకే 2017 డిసెంబర్‌ నుంచి 2018 డిసెంబర్‌ మధ్య కాలం అత్యంత ముఖ్యమైన రాజకీయ సంవత్సరంగా మనం పిలుస్తున్నాం.  

మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌ ఫలితాలు ప్రకటితమైన మధ్యాహ్నమే, మోదీ ప్రవచిస్తూ వచ్చిన కాంగ్రెస్‌ విముక్త భారత్‌ భావన కథ ముగిసిపోయిందని వ్యాఖ్యాతలుగా చెప్పాం. ఇటీవల ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ కూడా పరోక్షంగా ఈ వాస్తవాన్ని గుర్తించారు. కాంగ్రెస్‌ ముక్త్‌ అనే తన భావనకు అర్థం కాంగ్రెస్‌ పార్టీని నిర్మూలించాలని కాదని, దాని భావజాలం, ఆలోచనలు ఉనికిలో లేకుండా పోవాలన్నది తన అభిమతమని మోదీ తొలిసారిగా నిర్వచనమిచ్చారు. కాంగ్రెస్‌ అలోచనలు అంటే కులతత్వం, వంశపారంపర్య రాజకీయాలు, అప్రజాస్వామికమైన, బంధుప్రీతితో కూడిన రాజకీయాలు మాత్రమేనని మోదీ వివరణ ఇచ్చారు.

ఇప్పుడు రాహుల్‌ గాంధీ బరిలో ముందుకురావడం, ఉత్తరప్రదేశ్‌లో కుల ప్రాతిపదిక పార్టీలైన సమాజ్‌వాదీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీలు కూటమి బీజేపీకి హెచ్చరికలు పంపడం, మోదీపై అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగటం వంటి పరిణామాలు బీజేపీకి అడ్డం తిరిగాయి. కాంగ్రెస్‌ ఆలోచనలు నశించాలి అనే మోదీ నిర్వచనం సరైందే అనుకుందాం. కానీ 2010 తర్వాత తొలిసారిగా కాంగ్రెస్‌ తనను తాను శక్తివంతమైన పార్టీగా మార్చుకుని ముందుకొచ్చింది. భారతీయ రాజకీయాల్లో గత మూడేళ్ల తర్వాత ఏర్పడిన రెండో ఏక ధ్రువపార్టీగా కాంగ్రెస్‌ అవతరించింది.   అయితే మోదీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో దుర్భల స్థితిలో ఉన్నారని చెప్పడానికి మీకు కాస్త దమ్ముండాలి మరి.

ఆయన వ్యక్తిగత ప్రజాదరణ, తన శ్రోతలతో తానేర్పర్చుకున్న అనుసంధానం, ఆకర్షణ శక్తి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. మనం ముందే చెప్పుకున్నట్లుగా భారతదేశంలో మెజారిటీని కలిగివున్న ఒక బలమైన నాయకుడిని ఇంతవరకూ ఏ పోటీదారు ఓడించలేకపోయారు. అలాంటి బలమైన నాయకుడు లేక నాయకురాలు (1977లో ఇందిరాగాంధీ లాగా) తనను తాను ఓడించుకోవలసిందే. ఇలా జరగాలంటే తప్పనిసరిగా మూడు పరిణామాలు సంభవించాల్సి ఉంది. ఆ బలమైన నాయకుడు తనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసేంత స్థాయిలో ప్రజాదరణ కోల్పోవాలి. తమలోని విభేదాలను, ఆకాంక్షలను, దురాశలను పక్కనబెట్టి ఆ బలమైన నాయకుడికి వ్యతిరేకంగా విభిన్న రాజకీయ శక్తులు పొత్తు కుదుర్చుకుని అతడి ఓటమికి ప్రాతిపదికను ఏర్పర్చుకోవాలి.

కాబోయే ప్రధాని స్థాయిని ప్రకటించుకోనప్పటికీ ఇలాంటి రాజకీయ శక్తులను ఒక చోటికి చేర్చగలిగిన సమున్నత వ్యక్తిత్వం ఉన్న వారు ముందుకు రావాలి. 1977లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జయప్రకాష్‌ నారాయణ్‌ ఇలాంటి పాత్రనే పోషించారు. 1989లో రాజీవ్‌ గాంధీకి వ్యతిరేకంగా వీపీ సింగ్‌ ఇలాంటి పాత్రనే పోషించారు.  ఒక సంవత్సరం క్రితం వెలిసిపోతున్న రాజవంశానికి ప్రతినిధిగా ఉన్న స్థితినుంచి రాహుల్‌ గాంధీ ఇప్పుడు రెండో ఏకధ్రువ స్థితికి కాంగ్రెస్‌ను అమాంతంగా తీసుకొచ్చారు. 2019 కోసం రాజకీయ క్రీడ ఇప్పుడు సిద్ధంగా ఉంది. ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటుకు కూడా హాజరుకాకుండా తన రాజకీయ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం వెనకున్న బలీయమైన కారణం ఇదే మరి. 

- శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

మరిన్ని వార్తలు