వయసుకి చిన్నమ్మ.. మనసుకి పెద్దమ్మ

8 Aug, 2019 01:32 IST|Sakshi

భారతీయత నిండుదనానికి ఆమె చిరునామా. భారతీయుల స్వప్నానికి ప్రతిబింబం. సాటి లేని వాగ్ధాటి ఆమె సొంతం. ఇంగ్లీష్, హిందీల్లో అనర్గళంగా ప్రసంగిస్తూ... చెప్పాలనుకున్న విష యాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పడంలో అందివేసిన చేయి. ఏపనైనా అలవోకగా చేసే ధైర్యం, తెగువ ఆమె సొంతం. రాజకీయంగా... అనితర సాధ్యమైన ప్రయాణాన్ని సాగించారు. ఒక స్త్రీగా, ఇల్లాలిగా, రాజకీయనాయకురాలిగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా సంపూర్ణ మహిళగా ఖ్యాతి పొందారు. ఆమె మరెవరో కాదు భారత వీరనారి, ద గ్రేట్‌ లెజెండ్‌ సుష్మ స్వరాజ్‌.  పుట్టి పెరిగింది ఉత్తరాదిలోనైనా... దక్షిణాదిలో కూడా ఆమె సుపరిచితురాలే.

పార్టీ అధినేతలకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో ఆమె పాపులర్‌ అయ్యారు. పార్టీలోనైనా, ప్రభుత్వంలోనైనా తన మార్క్‌ ఉండాల్సిందే. హర్యానాలో విద్యా భ్యాసం చేసిన సుష్మ 20 ఏళ్లకే న్యాయవాదిగా కెరీర్‌ ప్రారంభించారు. జయప్రకాష్‌ నారాయణ ‘సంపూర్ణ విప్లవం’లో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ తర్వాత బీజేపీలో చేరి అంచ లంచెలుగా ఎదిగారు. అతి కొద్ది కాలంలోనే బీజేపీ జాతీయ నాయకురాలి స్థాయికి చేరుకున్నారు. 25 ఏళ్లకే అంబాలా కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది 27 ఏళ్లకే హర్యానా జనతా పార్టీ అధ్యక్షురాలిగా ఎంపికై ఔరా అన్పించుకున్నారు. నాలుగుసార్లు లోక్‌ సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎన్నిక య్యారు.

1999లో బళ్లారి నుంచి లోక్‌ సభకు పోటీ చేసి సోనియాకు సవాల్‌ విసిరి.. దేశమంతా తనవైపు చూసేలా ప్రచారం సాగించారు.  ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా సంచలనం సృష్టించారు. వాజ్‌పేయి హయాంలో  కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు.  సమాచార శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టి అప్పుడే వస్తున్న ఎలక్ట్రానిక్‌ మీడియాకు కొత్త ఒరవడి తీసుకొచ్చారు. 1996లో వాజ్‌పేయీ ప్రభుత్వం కేవలం 13 రోజులపాటు కొనసాగిన సమయంలో సుష్మ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా ఉంటూ లోక్‌సభలో జరిగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 15వ లోక్‌ సభలో ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ సుష్మ కీలక బాధ్యత నిర్వర్తించారు. 2008, 2010లో ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డులు పొందారు. ఇక 2014లో ప్రధాని నరేంద్ర మోదీ కేబి నెట్‌లో కీలక విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సుష్మ ఆ శాఖకు ముందెన్నడూ లేని గుర్తింపు తీసుకొచ్చారు. గల్ఫ్‌ దేశాల్లో భారతీయులు చిక్కుకున్నప్పుడు వారిని సురక్షితంగా దేశానికి తరలించడానికి చేసిన కృషి అనన్య సామాన్యమైంది. కల్లోల దేశాల్లో ప్రజల్ని రక్షించేందుకు తాను నేరుగా ఆయా దేశాల రాయ బార కార్యాలయాలతో చర్చలు జరిపేవారు.  

పార్లమెంట్‌ లో సుష్మ చేసే ప్రసంగాలకు ఆ  పార్టీ, ఈ పార్టీ అని కాకుండా అందరూ జేజేలు పలికేవారు. భాషపై పట్టు, వాక్చాతుర్యంతో ఎవరినైనా ఆమె ఇట్టే కట్టిపడేసేవారు. విదేశాంగ మంత్రిగా ఉంటున్న సమయంలో వచ్చిన ఆనారోగ్యం సుష్మను ఊపిరి సలుపుకోనివ్వలేదు. అందువల్లే గత ఎన్నికల్లో పోటీకి కూడా దూరంగా ఉన్నారు. అయితే ఆర్టికల్‌ 370 రద్దు తన జీవిత కాలంలోనే చూడాల్సిన ఘట్టంగా, చనిపోయే ముందు చేసిన ట్వీట్‌ భారతదేశాన్ని కన్నీరు పెట్టించింది. సుష్మ చనిపోయారన్న నిజాన్ని భారతీయులెవరూ జీర్ణించుకోలేకోపోయారు. సంతాప సందేశాల్లో ప్రపంచదేశాధినేతలు కన్నీటి పర్యంతమయ్యారంటే విదేశాంగ విధానంపై సుష్మ వేసిన ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. విదేశాంగ విధానానికి గానీ, బీజేపీ పార్టీకి గానీ సుష్మ స్వరాజ్‌ ముందు, సుష్మ స్వరాజ్‌ తర్వాత అని చెప్పాల్సిందే. ఎందుకంటే అలాంటి నేత మరొకరు ఉండరు. ఉండబోరు. ఆ ఘనత ఒక్క సుష్మకు మాత్రమే దక్కుతుంది.

పురిఘళ్ల రఘురామ్: బీజేపీ సమన్వయకర్త,
ఈ–మెయిల్‌ : raghuram.bjp@gmail.com

మరిన్ని వార్తలు