వివేకానంద స్ఫూర్తి చెరగనిది

12 Jan, 2019 01:33 IST|Sakshi
స్వామి వివేకానంద

హిందూ సంస్కృతి విస్తృతార్థంలో విశ్వవ్యాప్తి కావడానికి, సంకుచిత పరిమితులు దాటి సమస్త ప్రపంచ ఆమోదం పొందటానికి కారణమైన మహనీయుడు స్వామి వివేకానంద జయంతి నేడు. మొదటిసారిగా హిందూమతం ఒక మతం కాదని, అది జీవన సంస్కృతీ విధానమని యావత్‌ ప్రపంచానికి తెలిపిన విశిష్టమూర్తి ఆయన. 1863 డిసెంబర్‌ 12న కోల్‌కతాలో విశ్వనాథ్‌ దత్తా, భువనేశ్వరీదేవి వంశాంకురంగా జన్మిం చిన నరేంద్రుడు తర్వాత రామకృష్ణ పరమహంస గురునిర్దేశంలో వివేకానందుడిగా తనను తాను నిర్దేశించుకున్నారు.

తారీఖులు, దస్తావేజుల ప్రస్తావనకు పోకుండా వివేకానందుడు అందించిన  సందేశం, సంకల్పం, ఆధ్యాత్మిక పథాన్ని రేఖామాత్రంగా స్పృశించుకునే ప్రయత్నం చేస్తే మొదట మనందరికీ తట్టేది.. అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో తోటి మానవులను ప్రియమైన సోదరసోదరీ మణులారా అని సంబోధించి మానవతా వాదాన్ని, మానవ హితాన్ని పాశ్చాత్యులకు ఆయన రుచి చూపించిన ఘటన మాత్రమే. ఆనాటి నుంచి ఆయన జీవితం సమస్తం సందేశాత్మకమే. ఆదర్శాత్మకమే. ఆచరణాత్మకమే. దేశభక్తే కాదు.. సంస్కృతి, సనాతనత్వం, సంప్రదాయం, నిబద్ధత, కార్యోన్ముఖం. బోధలు, ప్రబోధలు, పట్టుదల, అంకితభావం, సామాజిక దృష్టి, ఐక్యతా భావం, విలువలు, విశ్వసనీయత ఇలా.. ఏ కోణంలో చూసినా, ఆయనకు ఆయనే సాటి.

స్వామి వివేకానంద జీవితం యావత్తూ సమస్త మానవాళికి ఓ సందేశమే, ఓ ప్రేరణాత్మకమే. 1893లో ప్రపంచ సర్వమత సమ్మేళనంలో భారతదేశాన్ని, హిందూమతాన్ని ఉద్దేశించి వివేకానందుడు చేసిన ప్రసంగం భారత యువతపైనే కాకుండా పాశ్చాత్య ప్రపంచంపై కూడా మహత్తర ప్రభావం కలిగించింది. అందుకే వివేకానందుని జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాం. జాతిని ఉద్దీప్తం చేయడానికి యువతకు ఉక్కునరాలు కావాలని ప్రేరేపించిన వివేకానందుడి స్ఫూర్తి నేటికీ అవసరమే.

(నేడు స్వామి వివేకానంద జయంతి)
రమాప్రసాద్‌ ఆదిభట్ల,
విశాఖపట్నం ‘ 93480 06669

మరిన్ని వార్తలు