ఈ ‘దీవెనలు’ బడుగుల వెలుగుదివ్వెలు

27 Feb, 2020 00:10 IST|Sakshi

బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ఉన్నతి కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా తీసుకొస్తున్న అమ్మ ఒడి, పూర్తి ఫీజులు–విద్యాదీవెన–జగనన్న వసతి దీవెన వంటి పథకాలు తాడిత, పీడిత, అణగారిన కులాల్లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతాయి. అనుభవజ్ఞులు, తలలు పండిన మేధావులకు, రాజకీయవేత్తలకు, సిద్ధాంతకర్తలకు, సంఘసంస్కర్తలకు, ఉద్యమకారులకు, ప్రజాసంఘాలకు రాని ఈ ఆలోచన చిన్న వయసులోనే వైఎస్‌ జగన్‌కు రావడం విశేషం. ఎవరి ఊహలకు అందని విధంగా ఈ స్కీములను ప్రవేశపెట్టారు. భావితరాలకు దుఃఖానికి తావులేని, ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలకు తావులేని సమాజాన్ని నిర్మించే పథకాలివి. ప్రజలను శాశ్వతంగా అభివృద్ధి చేస్తూ తమ కాళ్లపై తాము నిలబడే విధంగా ముందుచూపుతో ఈ పథకాలను ప్రవేశపెట్టడం చరిత్రాత్మకం.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మొన్న ప్రారంభించిన జగనన్న వసతి దీవెన–విద్యాదీవెన, అంతకు ముందు ప్రకటించిన అమ్మ ఒడి పథకం బలహీన వర్గాల ప్రజల జీవితాలకు కాంతి రేఖలు–వెలుగు దివ్వెలు. చదువుల విప్లవం. ఈ పథకాల ద్వారా దశాబ్దకాలంలో అణగారిన కులాల్లో సమూలమైన మార్పు జరుగుతుంది. సమగ్రమైన అభివృద్ధి జరుగుతుంది. తాడిత, పీడిత, అణగారిన కులాల్లో ఇది ఒక విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతుంది. పదేళ్ల తర్వాత ఏపీలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో గుణాత్మకమైన మార్పులు జరుగుతాయి. ఈ స్కీమ్‌ పెట్టడంతో ప్రతి పేదవారు పాఠశాల విద్యతో పాటు ఉన్నత విద్యను చదువుకునే ప్రోత్సాహం లభించింది. కూలీ–నాలీ చేసుకునే కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చది వించే అవకాశం కలిగింది. చదువు విలువ తెలియని కుటుంబాల వారు కూడా ఈ డబ్బు వస్తుందనే ఆశతో తమ పిల్లలను తప్పనిసరిగా చదివించడానికి ముందుకు వస్తారు.

దేశంలో, ప్రపంచంలో ఎక్కడ కూడా లేని పథకాలు ఇవి. ఎవరి ఆలోచనలకు అందని  పథకాలు ఇవి. రాజకీయాలకతీతంగా ఈ పథకాల అమలును ప్రతిపక్షాలు కూడా ప్రశంసించాలి. ఈ స్కీములు పెట్టడం సీఎం వైఎస్‌ జగన్‌ సాహసోపేతమైన చర్య. ఈ స్కీము వలన డాక్టర్‌ అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే కలలుగన్న జ్ఞాన సమాజం వస్తుంది. ఈ స్కీము పెట్టి ముఖ్యమంత్రి జీవితం చరితార్థం అయ్యింది. తండ్రిని మించిన తనయుడుగా చరిత్రలో నిలిచిపోతారు. అనుభవజ్ఞులు, తలలు పండిన మేధావులకు, రాజకీయవేత్తలకు, సిద్ధాంతకర్తలకు, సంఘసంస్కర్తలకు, ఉద్యమకారులకు, ప్రజాసంఘాలకు రాని ఈ ఆలోచన చిన్న వయసులోనే వైఎస్‌ జగన్‌కు రావడం విశేషం. ఈ పథకాలు పెట్టాలని ఏ రాజకీయ పార్టీ డిమాండ్‌ చేయలేదు, ఏ ప్రజాసంఘం ఉద్యమాలు చేయలేదు. ఎవరి ఊహలకు అందని విధంగా ఈ స్కీమును ప్రవేశపెట్టారు. భావితరాలకు దుఃఖానికి తావులేని, ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలకు తావులేని సమాజాన్ని నిర్మిస్తుంది.

ఈ జగనన్న విద్యా వసతి దీవెన పథకం కింద 11 లక్షల 87 వేల మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేల నుండి 20 వేల వరకు స్కాలర్‌ షిప్‌ లభిస్తుంది. ఈ పథకం కింద రూ. 2300 కోట్ల వ్యయం అవుతుంది. అలాగే జగనన్న విద్యా దీవెన కింద కాలేజీ కోర్సులు చదివే విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరుచేసే పథకం కింద రూ.3,700 కోట్లు ఖర్చవుతాయి. గతంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పూర్తి ఫీజుల స్కీము పెడితే 2012లో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో అనేక షరతులతో నీరుగార్చారు. ఇప్పుడు  ఆ పథకాన్ని పునరుద్ధరించడంతో బలహీన వర్గాల పిల్లలు ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ, డిగ్రీ తదితర ఉన్నత విద్యా కోర్సులు చదివే అవకాశం కలిగింది. అలాగే అమ్మ ఒడి పథకం కింద 42 లక్షల మంది తల్లుల ఖాతాలలో 82 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 15 వేల చొప్పున రూ. 6,400 కోట్లు ఇప్పటికే జమ కావడం ప్రారంభమయ్యింది.

మొత్తం ఈ పథకాలకు రూ.12,400 కోట్లు ఖర్చవుతాయి. ఇంత భారీ మొత్తంతో దేశంలో, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రీ ఈ పథకాలను ప్రవేశపెట్ట లేదు. చివరగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇలాంటి స్కీములు లేవు. ప్రత్యేకంగా ఈ స్కీము వలన లబ్ధి పొందేది 95% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే. ఈ పథకాల వ్యయాన్ని ఖర్చు కోణంలో చూడరాదు. ఇవి పెట్టుబడి పథకాలు. ఈ పథకాల వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజాభివృద్ధిలో పెద్ద ఎత్తున ప్రభావం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇంకా విప్లవాత్మకమైన మార్పులుంటాయి. ఒకసారి ఒక కుటుంబంలో ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ, తదితర కాలేజీ కోర్సులు చదివితే ఆ కుటుంబం శాశ్వతంగా, సమగ్రంగా, అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, లేదా ఐటీ కంపెనీలో ఉద్యోగం వస్తుంది లేదా ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం వస్తుంది లేదా స్వయం ఉపాధి పథకాలు, పరిశ్రమలు, కంపెనీలు పెట్టుకొని, అలాగే కాంట్రాక్టులు చేపట్టి అభివృద్ధి చెందుతారు. అలాగే ఇంజనీరింగ్, ఇతర పీజీ కోర్సులు, మెడిసిన్‌ చదివేవారు, విదేశాలకు వెళ్లి ఉద్యోగం లేదా ఉపాధి పొందుతున్నారు. దీని మూలంగా దేశానికి, విదేశ మారక ద్రవ్యం లభిస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి చేయూతనిస్తుంది.

ఇక ప్రభుత్వ కోణంలో చూస్తే, ఒకసారి ఒక కుటుంబం ఉన్నత చదువులు చదివితే, ఆ కుటుంబం ప్రభుత్వ రాయితీల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండదు. ఆదాయం పెరగడం మూలంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముఖ్యంగా సబ్సిడీ బియ్యం, వృద్ధాప్య పింఛన్లు, గృహ నిర్మాణ పథకంపై ప్రభుత్వ భారం తగ్గిపోతుంది. పదేళ్ల కాలంలో 40 శాతం, మరో పదేళ్ల కాలంలో మరో 50 శాతం మొత్తం 20 ఏళ్ల కాలంలో 90% సబ్సిడీ పథకం కింద లబ్ధి పొందేవారు, అభివృద్ధి పథకాల కింద లబ్ధి పొందేవారు అభివృద్ధి చెంది పెన్షన్‌ పథకం, సబ్సిడీ పథకాలు వద్దనే స్థాయికి ఈ కుటుంబాలు ఎదిగిపోతాయి. వీటిపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్న బడ్జెట్‌లో 90 శాతం బడ్జెట్‌ తగ్గిపోతుంది.

అంతేకాదు ఈ విద్యా పథకాల భారం కూడా 20 ఏళ్ల తర్వాత ఉండదు. దీనిపై పెట్టే బడ్జెట్‌ భారం తగ్గిపోతుంది. ఒక తరంపై ఖర్చుపెడితే రెండవ తరంకు ఈ విద్యా పథకం స్కీముల అవసరం ఉండదు. చదువు మూలంగా అనేక కుటుంబాలు అభివృద్ధి చెంది, అధిక ఆదా యం పెరుగుతుంది. ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ ఇతర ఉన్నత విద్యా కోర్సులు చదివే వారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ సబ్సిడీ స్కీములు,  ఇతర విద్యాస్కీములు పొందేవారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది. కాబట్టి పేదరికం అనే అర్హత ఉండదు. ఇక రెండవ తరం నుంచి సబ్సిడీ పథకాలు, విద్యా పథకాల అవసరముండదు. వీటిపై పెట్టే వేల కోట్ల బడ్జెట్‌ ఇతర పథకాలకు మళ్ళించవచ్చు.

పాలకులు ప్రతి ఒక్కరూ ఏ పథకం పెడితే ఓట్లు వస్తాయనే ఆశతో జనాకర్షక పథకాలు పెడతారు. అంతేకాని దీర్ఘకాలంలో సమాజాభివృద్ధి ఎలా జరుగుతుంది అని ఆలోచించరు. పెన్షన్లు, సబ్సిడీ రుణాలు, కలర్‌ టీవీలు, ఇతర పథకాలు పెట్టి ఎప్పుడూ ప్రభుత్వంపై ఆధారపడే యాచకులను చేస్తారు. కానీ జగన్‌ పథకాల ద్వారా ప్రజలను శాశ్వతంగా అభివృద్ధి చేస్తూ తమ కాళ్లపై తాము నిలబడే విధంగా ముందుచూపు–విజన్‌లో ఈ పథకాలను ప్రవేశపెట్టడం చరిత్రాత్మకం. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీల సమగ్ర అభివృద్ధికి, సాధికారతకు అనేక స్కీములు పెట్టారు. ముఖ్యంగా నామినేటెడ్‌ పదవులలో 50 శాతం కోటా కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేశారు. అలాగే కాంట్రాక్ట్‌ వర్క్‌లలో 50 శాతం కోటా ఇచ్చి, పారిశ్రామిక పాలసీలలో 50 శాతం కోటా కల్పించి, ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేశారు. ఈ స్కీములతో ఈ వర్గాలు కాంట్రాక్టర్లుగా, పరిశ్రమ అధిపతులుగా ఎదుగుతారు.. ఇంతవరకూ ఈ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రెండు శాతం ప్రాతి నిధ్యం కూడా  లేదు. ఇప్పుడు 50 శాతం ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఇదొక గొప్ప మలుపు.

దివంగత వైఎస్సార్‌ పేద పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలని ఫీజు రీయింబర్స్‌మెంట్, కాలేజీ హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు పెడితే, కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి అంతకుమించి ఎవరి అంచనాలకు అందనంతగా అమ్మ ఒడి, పూర్తి ఫీజులు–విద్యాదీవెన– జగనన్న వసతి దీవెన పథకాలతో చరిత్ర సృష్టించారు. భవిష్యత్తులో ఇలాంటి పథకాలను ఏ రాష్ట్రం పెట్టినా,  దేశం పెట్టినా జగన్‌ వారికి మార్గదర్శకుడుగా ఉంటారు. ఇవే కాక అనేక స్కీములు పెట్టారు. అన్నిరకాల పెన్షన్లు భారీగా పెంచారు, సబ్సిడీ పథకం కింద సన్న బియ్యం ఇస్తామన్నారు, లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేశారు, విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ 20 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో కట్టుబట్టలతో వెళ్ళింది.

కేంద్ర సహాయం కూడా అంతంతే. పైగా బాగా ఆదాయాన్నిచ్చే ఎక్సైజ్‌ శాఖలో పాక్షికంగా మద్యపాన నిషేధం విధించడంతో వేల కోట్ల ఆదాయం తగ్గింది. ఇన్ని ప్రతికూల పరిస్థితులలో ఇన్ని విప్లవాత్మకమైన రూ. వేల కోట్ల  ఖర్చు అయ్యే స్కీములు అమలు చేయడం  ఒక్క జగన్‌కే  సాధ్యం. విద్య ఒక్కటే మానవ వికాసానికి మార్గం. విద్య ద్వారానే బడుగు వర్గాలకు సాంఘిక సమానత్వం–సామాజిక న్యాయం దక్కుతుంది 10 నుంచి 20 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ భారతదేశంలోనే శక్తివంతమైన రాష్ట్రంగా రూపొందుతుంది. అజ్ఞానం, అంధకారం, అమాయకత్వం నుంచి ప్రజలను విముక్తి చేసి ఒక విజ్ఞానవంతమైన, శాస్త్రీయ జ్ఞానంతో కూడిన సమాజాన్ని నిర్మాణం చేయగలం.  
వ్యాసకర్త: ఆర్‌.కృష్ణయ్య, జాతీయ బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షులు, మొబైల్‌ : 90000 09164 

మరిన్ని వార్తలు