ఘనవిజయాలు, గుణపాఠాలు

26 May, 2019 00:54 IST|Sakshi

త్రికాలమ్‌

సుమారు దశాబ్దకాలం దేశంలో మరే ఇతర  రాజకీయ నాయకుడూ ఎరగని వేధింపులూ, వ్యక్తిత్వహననం, ఆర్థిక విధ్వంసం, భౌతిక దాడులూ ఎదుర్కొన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సకల ప్రతికూల పరిస్థితులనూ అధిగమించి ఎన్నికలలో అఖండ విజయం సాధించి అధి కార పగ్గాలు చేపట్టబోతున్నారు. మొత్తం 175 స్థానాలు కలిగిన అసెం బ్లీలో 151 స్థానాలు గెలుచుకోవడం, మొత్తం 25 లోక్‌సభ స్థానాలలో 22 కైవసం చేసుకోవడం, 50 శాతానికిపైగా ఓట్లు సంపాదించడం మునుపెన్నడూ ఎరగని అసాధారణ పరిణామం. 1971లో ఇందిరా గాంధీ కానీ, 1983, 1994లో ఎన్‌టి రామారావు కానీ, 1984లో రాజీవ్‌ గాంధీ కానీ ఇంతటి ఘనవిజయం సాధించలేదు. అధికారం నిలబెట్టు కునేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబునాయుడు చేయని ప్రయత్నం లేదు.

వేయని ఎత్తుగడ లేదు. పన్నని పన్నాగం లేదు. నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాలు ప్రజలనూ, వారి యోగక్షేమాలనూ పట్టించుకోకుండా ఎన్నికల ముందు పసుపూ– కుంకుమా అంటూ ప్రజాధనాన్ని మహిళలకు చెల్లించడం ద్వారా ఓట్లు దండుకోవచ్చునన్న తంత్రం ఫలించలేదు. పోలింగ్‌కు వారం రోజుల ముందుగా మహిళలకూ, రైతులకూ నగదు చేతిలో పడే విధంగా ప్రణాళిక రచించినా ఫలితం లేకపోయింది. తాను ఒక్క పిలుపు ఇస్తే మహిళలందరూ కదిలి పోలింగ్‌ కేంద్రా లకు వెళ్ళి తెల్లవారుజాముదాకా క్యూలలో నిలబడి తన పార్టీకి ఓటు వేశారంటూ ఢిల్లీలో, అమరావతిలో చంద్రబాబు పదేపదే చెప్పిన విషయం కేవలం భ్రమాజ నిత, స్వానురాగపూరిత కాల్పనిక కథనమేనని ఓట్ల లెక్కింపులో తేటతెల్లమై పోయింది. ప్రజాసామ్య వ్యవస్థకు ప్రజలే రక్షకులనే మాట అక్షర సత్యమని నిరూపించిన అరుదైన సందర్భం ఇది. 

అందరికీ గుణపాఠాలు 
ఎన్నికలలో విజేతలకూ, పరాజితులకూ గుణపాఠాలు ఉంటాయి. పరాజ యాన్ని అర్థం చేసుకోవడం ఎంత అవసరమో విజయంపై అవగాహనా అంతే ప్రధానం. ఓటమి కారణాలను విశ్లేషించుకొని, తప్పులు దిద్దుకొని, ముందడుగు వేసేవారికి రాజకీయాలలో మనుగడ ఉంటుంది. విజయాలకు తోడ్పడిన కార ణాలు గ్రహించి, ప్రత్యర్థుల పరాజయానికి దారి తీసిన అంశాలనూ అధ్యయనం చేసి అవగాహన చేసుకున్న నాయకులకు వచ్చే అయిదేళ్ళలో మందుపాతరల పైన కాలు పెట్టకుండా సురక్షితంగా, లాఘవంగా ఎట్లా నడవాలో బోధపడు తుంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ఘనవిజయం సాధిస్తుందని చెప్పడానికి సర్వేలు అక్కర లేదు. ఎగ్జిట్‌పోల్స్‌ అంతకన్నా అవసరం లేదు.

పద్నాలుగు మాసాలు 3,648 కిలోమీటర్ల పొడవునా సాగిన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా జగన్‌ ప్రసంగించిన లెక్కకు మించిన సభలకు హాజరైన లక్షలాది జనం ఆత్మ ఘోష ఆలకించినవారికీ, వారి మొహాలలో కనిపించిన ఆవేదననూ, ఉద్వేగాన్నీ, ఆశనూ, ఉత్సాహాన్నీ గమనించినవారికీ ఎన్నికల ఫలితాలు ఊహించుకోవడం కష్టం కానేకాదు.  ఆంధ్రప్రదేశ్‌లో 33 లోక్‌సభ సభ్యులను  గెలిపించి ఢిల్లీకి పంపించి యూపీఏ–2కి వెన్నుదన్నుగా నిలిచిన వైఎస్‌ కుటుంబాన్ని అవమా నించాలని స్వార్థరాజకీయుల చాడీలు విని నిర్ణయించుకున్న సోనియాగాం«ధీకీ, రాహుల్‌గాంధీకీ నిష్కృతి ఉండదని 2014, 2019 ఎన్నికలు నిరూపించాయి. వారు తమ తప్పు తెలుసుకున్న దాఖలా లేదు. వారితో కలసి కుట్ర చేసినవారికీ, దానిని అమలు చేసినవారికీ ప్రజలు తగిన పాఠం చెప్పారు.

జాతీయ స్థాయిలో వెలువడిన ఎన్నికల ఫలితాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఫలి తాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికీ, జనసామాన్య మనోగతానికీ నిదర్శనమై నిలి చాయి. 2014లో ఐదు లక్షల ఓట్ల వ్యత్యాసంతో విజయం సాధించి, అధికార పగ్గాలు చేతపట్టిన చంద్రబాబు గెలుపును అపార్థం చేసుకున్నారు. సమాజంలోని సకల వర్గాలకు లెక్క లేనన్ని వాగ్దానాలు చేసిన ఎన్నికల ప్రణాళికను పక్కన పెట్టారు. తన సొంత అజెండాను భుజానికి ఎత్తుకున్నారు. కొత్త రాజధాని అమరావతిని అక్రమ వ్యాపారానికి అందివచ్చిన అవకాశంగా పరిగణించారు. సింగపూర్‌ అన్నారు. అస్థానా అన్నారు. ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన అయిదు నగరాలలో ఒకటిగా అమరావతిని నిర్మిస్తామన్నారు.

ఈ మాటలు చెబుతూనే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా అస్మదీయుల చేత రాజధాని ప్రాంతంలో వందల ఎకరాల భూములు కొనిపించారు. డిజైన్ల పేరుమీద వందల కోట్ల రూపాయలు వెచ్చించారు. పదవీకాలం ముగిసే నాటికి అమరావతిలో శాశ్వత ప్రాతిపదికపైన ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. తాత్కాలిక సచివాలయ, శాసన సభ భవనాలకు భూమి ఉచితంగా ఇచ్చి చదరపుటడుగుకు రూ. 11 వేలు కాంట్రాక్టర్లకు చెల్లించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతను కేంద్రం నుంచి అడిగి తీసుకొని మరీ తలకెత్తుకున్నారు.  వ్యయం అంచనాను 16 వేల కోట్ల నుంచి 64 వేల కోట్లకు పెంచివేసి, కాంట్రాక్టర్లతో లాలూచీ పడి, అవినీతికి లాకులు ఎత్తేశారనే ఆరో పణలకు అవకాశం ఇచ్చారు.

ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ సందర్శించినప్పుడు పోలవరం టీడీపీకి ఏటీఎంలాగా పని చేస్తోందంటూ చమత్కరించే వరకూ వ్యవహారం వెళ్ళింది. ఎర్త్‌ అండ్‌ రాక్‌ డామ్‌ నిర్మాణం ఆరంభం కాలేదు. కాఫర్‌ డ్యాం సైతం నత్తనడక నడుస్తోంది. ఈ మహా నిర్మాణం ప్రజలకు చూపించడంకోసం వందల కోట్ల  ప్రజాధనం తగలేశారు. అనవసరమైన పట్టిసీమ వంటి ఎత్తిపోతల పథ కాల ఖర్చు అదనం. ఎత్తిపోతల పథకంతో గోదావరి, కృష్ణా నదులను అను సంధానం చేసినట్టూ, కృష్ణా డెల్టాకు గోదావరి నీరు పారించినట్టూ సంబరాలు చేసుకున్నారు. 

బెడిసికొట్టిన వ్యూహాలు
ప్రతిపక్ష నాయకుడిని పరాభవించడం, లక్ష కోట్లు కాజేశారంటూ అదే పనిగా అసత్యారోపణలు చేయడం, అసెంబ్లీని అపహాస్యం చేయడం వంటి అకృ త్యాలతో ప్రతిపక్షం అసెంబ్లీకి రాకుండా ప్రజల మధ్యకు వెళ్ళాలని నిర్ణయిం చుకునే వరకూ వేధించారు. ఎన్నికల తంత్రం బెడిసికొట్టింది. మోదీతో, కేసీఆర్‌తో తాగాదా పెట్టుకోవడం, కేంద్రంలో ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తెచ్చేందుకు లక్నో, కోల్‌కతా, బెంగళూరు నగరాలకు పిలవని పేరంటం వెళ్ళి నానాయాతనా పడటం వికటించింది. నేలవిడిచి సాము చేయడాన్ని ప్రజలు మెచ్చలేదు.

తమను వంచించడం, తక్కువగా అంచనా వేయడం, డబ్బుకు అమ్ముడుపోయేవాళ్ళుగా పరిగణించడం ప్రజలకు నచ్చలేదు.  కడచిన పదేళ్ళుగా జగన్‌ ప్రజలలోనే, ప్రజలతోనే ఉన్నారు. ఓదార్పు యాత్ర, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు ఉద్యమంలో భాగంగా సభలూ, సమావేశాలూ, పాదయాత్ర, రెండు సార్వత్రిక ఎన్నికలలో విస్తృత ప్రచారంతో ప్రజల సమక్షంలోనే ఎక్కువ కాలం గడిచిపోయింది. పాదయాత్రలో దాదాపు కోటి మందిని కలుసుకొని వారి బాధలు విన్నారు. ఇచ్చిన మాట తప్పరనీ, నవ రత్నాలను నిజాయితీగా అమలు చేస్తారనే విశ్వాసంతో ప్రజలు ఓట్లు కుమ్మ రించారు.

దేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించిన రాజకీయ నాయకుడు జగన్‌ ఒక్కరే. తన పార్టీ గుర్తుపైన గెలిచిన 23 మంది ఎంఎల్‌ఏలనూ, ముగ్గురు ఎంపీలనూ చంద్రబాబు కొనుగోలు చేసినప్పటికీ తన పార్టీలో చేరదలచినవారి చేత ఉన్న పదవులకు రాజీనామా చేయించిన నైతికత జగన్‌ది. శనివారం లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడిగా ఏక గ్రీవంగా ఎన్నికైన తర్వాత హైదరాబాద్‌లో గవర్నర్‌ని కలిసిన జగన్‌ రాజ్‌భవన్‌ నుంచి నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) నివాసం ప్రగతిభవన్‌కు వెళ్ళారు. జగన్‌ను కేసీఆర్‌ ఆలింగనం చేసుకొని కుటుంబ సమేతంగా స్వాగతం చెప్పారు.

ఎన్నికల ముందు వాతావరణం, ఎన్నికల ప్రచారంలో ధోరణి తాజా పరిస్థితికి పూర్తి భిన్నం. మోదీనీ, కేసీఆర్‌నీ నిశితంగా విమర్శించడం,వారిని జగన్‌తో జతకట్టడం, ముగ్గురూ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కుట్రపన్నుతున్నా రంటూ అర్థంలేని ఆరోపణలతో ధ్వజమెత్తడం ద్వారా చంద్రబాబు విధ్వం సకరమైన పాత్ర పోషించారు. కేంద్రంతో తగవు పెట్టుకోవడం విజ్ఞత కాదని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్‌ చెబుతూ ఉండే వారు. తన బాధ్యత తమిళనాడు ప్రయోజనాలు సాధించడం మాత్రమే కానీ దేశాన్ని ఉద్ధరించడం కాదని అంటూ ఉండేవారు. ఇందుకు భిన్నంగా చంద్రబాబు నరేంద్ర మోదీని వ్యతిరేకిస్తున్న నాయకులలో ప్రథముడని పేరు తెచ్చుకునేందుకు అవసరానికి మించి గర్జించారు.
 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ తెలుగువారి అభ్యున్నతికి సమష్టిగా కృషి చేయడం కంటే కావలసింది ఏముంటుంది?  అదే విధంగా ఈ  రోజు జగన్‌ ఢిల్లీ వెళ్ళి మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా మోదీని కలుసుకోనున్నారు. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్ర సహాయం అత్యవసరం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలన్నా కేంద్రంతో సయోధ్య అనివార్యం. ఇది నిర్మాణాత్మకమైన ధోరణి. విజయాన్ని సవ్యంగా అర్థం చేసుకొని, జనరంజకమైన, పరిశుభ్రమైన పరిపాలన అందిస్తే, సంక్షేమం, అభివృద్ధి రెండు చక్రాలుగా ప్రగతిరథాన్ని వేగంగా నడిపిస్తే జగన్‌ ఆపేక్షిస్తున్న విధంగానే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొని ప్రజల ప్రశంసలు అందుకుంటారు. 

టీఆర్‌ఎస్‌ వెనకంజ
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ఆశించినన్ని లోక్‌సభ స్థానాలు గెలుచు కోలేకపోయింది. మొత్తం 17 స్థానాలలో తొమ్మిదింటిని మాత్రమే టీఆర్‌ఎస్‌ గెలుచుకున్నది. నాలుగు బీజేపీకీ, మూడు కాంగ్రెస్‌కూ దక్కాయి. చేవెళ్ళలో కాంగ్రెస్‌ స్వల్ప వ్యత్యాసంతో ఓడిపోయింది. 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ఘనవిజయాన్ని కేసీఆర్‌ అర్థం చేసుకోవడంలో పొరబడి ఉంటారు. చంద్రబాబు పాదమహిమను పరిగణనలోకి తీసుకున్నట్టు లేరు. ఆయన ఖమ్మంలో, హైదరాబాద్‌లో అడుగుపెట్టకపోతే  టీఆర్‌ఎస్‌కి అన్ని అసెంబ్లీ సీట్లు దక్కేవి కావు. కాంగ్రెస్‌ అంతగా దెబ్బతినేది కాదు.  మాజీ మంత్రి హరీష్‌రావును పక్కన పెట్టారనే అభిప్రాయం కూడా కార్యకర్తలకు ఒకింత నిరుత్సాహం కలిగించి ఉండవచ్చు.

ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్‌లు అనూహ్య విజయాలు సాధించాయి. అసెంబ్లీ ఎన్నికలనాటి పరాజయ పరాభవం నుంచి కాంగ్రెస్, బీజేపీలు కొంతమేరకు కోలుకున్నాయి. అదీ ఒకందుకు మంచిదే అని చెప్పే వేలుగాడి కథ చిన్నతనంలో విన్నాం. కిషన్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో అంబర్‌పేటలో గెలిచి ఉంటే శాసనసభ్యుడిగానే ఉండేవారు. అప్పుడు ఓడి పోయారు కనుక ఇప్పుడు సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసే అవకాశం వచ్చింది. మోదీ మంత్రిమండలిలో ఆయనకు స్థానం లభించినా ఆశ్చర్యం లేదు. రేవంత్‌రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయి లోక్‌సభ ఎన్నికలలో గెలిచారు. కరీంనగర్‌ సంజయ్, ఖమ్మం నామా నాగేశ్వరరావూ, ఆది లాబాద్‌ సోయం బాబూరావు కూడా అదే బాపతు. రాజకీయ దురంధరుడైన  కేసీఆర్‌కు పరిస్థితులను సమీక్షించుకొని సకాలంలో సరైన చర్యలు సత్వరంగా తీసుకునే వివేకం, సామర్థ్యం ఉన్నాయి. 

ప్రభంజనమంతా వింధ్యకు ఆవలే
మోదీ–అమిత్‌షా యుద్ధకౌశలం తిరుగులేనిది. కులసమీకరణాలూ, మత రాజ కీయాలూ సమపాళ్ళలో మేళవించి ఎన్నికల విజయాలు సాధించడంలో వారు ఉద్దండులు. అయినప్పటికీ, వింధ్యకు ఆవలే అశ్వం ఆగిపోయింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు మోదీ సమ్మోహనాస్త్రాన్ని వమ్ము చేశాయి. ఉత్తరాదిలో విజయభేరి మరోసారి మోగించడానికి రెండు కారణాలు దోహదం చేశాయి. ఒకటి, మతం ప్రాతిపదికగా హిందువులను ఏకం చేసి తమ పక్షాన నిలుపుకోవడంలో బీజేపీ సఫలమైంది. మోదీని మహానాయకుడిగా అభివర్ణిస్తూ ఆయనకు దేశంలో ప్రత్యామ్నాయం లేదనే అభిప్రాయం ప్రోదిచేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల తరహాలో భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నికలు జరిగాయి.

వ్యవసాయ సంక్షోభాన్నీ, నిరుద్యోగాన్నీ ఇతివృత్తాలుగా వినియోగించుకొని దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ ఉద్యమం నిర్మించి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ప్రతిపక్షాలన్నీ ఏదో ఒక నాయకుడు లేదా నాయకురాలిని ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకొని ఉంటే, ప్రతిపక్ష కూటమి తరఫున ఒక నియోజకవర్గంలో ఒకేఒక అభ్యర్థి నిలబడి ఉంటే ఫలితాలు ఎట్లా ఉండేవో తెలియదు. ఇప్పుడు ఏమని అనుకున్నా ఏమి లాభం? మరో ఐదేళ్ళు మోదీ పాలన సాగుతుంది. మతసామరస్యానికీ, దేశ సమగ్రతకు విఘాతం కలగ కుండా ఆర్థికాభివృద్ధికి  దోహదం చేసే విధంగా ఎన్‌డీఏ పరిపాలన కొత్త పుంతలు తొక్కుతుందని ఆశిద్దాం. 

కె. రామచంద్రమూర్తి

మరిన్ని వార్తలు