దూరదృష్టి

5 Jan, 2019 00:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అక్షర తూణీరం

‘‘దేశమంటే మట్టికాదోయ్‌! దేశమంటే వోటర్లోయ్‌’’ అని గురజాడని మార్చి రాసుకోవాలంటూ పార్క్‌ బెంచీ మీద కూర్చున్న ఓ పెద్దాయన ప్రారంభించాడు. మాట తీరులో వుపన్యాస ధోరణి కనిపిస్తోంది. చేతికర్రకి మించిన పెద్దరికం కనిపిస్తోంది. ముఖం నిండా కట్టుడివి పెట్టుడివి కనిపిస్తున్నా ఆయనలో ఆత్మవిశ్వాసం ఏమాత్రం సడల్లేదు. ‘‘ఎందుకన్నానంటే, మనం నాలుగేళ్లుగా చూస్తున్నాం. ఎన్నికలు, గెలిచే మాయోపాయాలు, ఎన్నికలు పండించుకోడానికి కావల్సిన ఎరువు పోగేసుకోడం మీడియాల్ని కట్టుకోవడం, కుల సమీకరణాలను జాగ్రత్త చేసుకోడం, వ్యూహరచనలతోబాటు మేనిఫెస్టో రచనలు వీటితోనే నేతలకు పొద్దు గడిచి పోతోంది’’. పెద్దాయన తీవ్ర కంఠంతో వక్కాణిస్తుంటే, తలపండిన నలుగురు చుట్టూ కూర్చుని ఔనన్నట్టు తలలూపుతున్నారు. ఒకరిద్దరికి వాటంతటవే తలలూగుతున్నాయి.

‘‘ఆలికి అన్నం పెట్టడం వూరికి వుపకారమా చెప్పండి. ఎక్కడో చిన్న రోడ్డువేస్తే అత్యవసరమైన చిన్న వంతెన కడితే, కూలిపోడానికి సిద్ధంగా వున్న పాఠశాల భవనానికి కాసిని పూతలు పెడితే నేతలు బోలెడు సందడి చేస్తున్నారు. అన్నిరకాల మాధ్యమాల్లోనూ యిక ఆ వార్తలే వూదరగొట్టి వదుల్తున్నారు’’. ప్రసంగానికి స్పందన బావుంది. మరి ఎందుకు ఆపుతాడు? సాయంత్రం యింకా దోమల మేళ, చలివేళ కాలేదేమో ఆయన ధోరణి నిరాఘాటంగా సాగుతోంది. మునుపు ఒక పార్టీ అంటే కొంతమంది నాయకులు అందులో వుండేవారు. ఇప్పుడు ‘‘పార్టీ’’ అంటే ‘‘ఏకో నారాయణ’’! ఒక్కడే వుంటాడు. ఆయనే మాట్లాడతాడు. ఆయనే విని ఆనందిస్తాడు. ఆయనే నిర్ణయాలు తీసుకుంటాడు. అందరూ చచ్చినట్టు ఆమోదిస్తారు. తెలంగాణలో కేసీఆర్‌ అయినా, ఏపీలో చంద్రబాబు అయినా, ఢిల్లీలో మోదీ అయినా యిదే వరస.

నాలుగేళ్లనాడు మోదీ వస్తున్నాడు...యింకేవుంది పొడిచేస్తాడని అంతా కలలు కన్నారు. ఆఖరికి మహావ్యవస్థలన్నిటినీ పొడిచేసి వదిలేశాడంటున్నారు. ఆయన చాలా అద్భుతాలు చేశానని డోలక్‌ వాయించి మరీ అరుస్తున్నాడు. ప్రజలకు ఏ ఒక్క అద్భుతం ద్యోతకం కావడం లేదు. ఈ నిరాశామయ వాతావరణం యిట్లా వుండగా, ఒకర్నొకరు నోటికొచ్చిన విధంగా దూషించుకోడం, వాటినీ వీటినీ పొద్దస్తమానం వింటూ కూర్చోడం రోతగా లేదూ...’’ పెద్దాయన స్వరం గద్గదమైంది. నెహ్రూల పాలన అడుగంటడానికి యిదిగో అదిగో అని యాభై ఏళ్లు పట్టింది. న.మో. గ్రాఫ్‌ పడిపోడానికి యాభై నెలలే ఎక్కువైంది. తపస్సంతా పదే పదే వృథా చేసుకున్న విశ్వామిత్రుడిలా మోదీ మిగిలిపోనున్నాడని నాకు అనుమానంగా వుంది. విశ్వామిత్రుడు భ్రష్టుపట్టిన వైనాలు చెప్పండని శ్రోతలు అభ్యర్థించారు.

ఇవ్వాళ పొద్దులేదు. మరో రోజు చెప్పుకుందామని పెద్దాయన సమాధాన పరిచాడు. మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ ఒకర్నొకరు ఎందుకు వుతికి ఆరేసుకుంటున్నారో మనకి అర్థం కాదు. అయితే అదంతా రాజకీయమేనని మాత్రం అస్పష్టంగా స్పష్టం అవుతోంది. చంద్రబాబు జన్మ నక్షత్రంలో చిన్న దోషం వుందిట! అందుకని అప్పట్నించి అంటే పదవి సంగ్రహించినప్పట్నించి, యిప్పటిదాకా ఆయన ఏది తలపెట్టినా నీలాపనిందలైపోతున్నాయిట! ఇట్లాగని నాకో జ్యోతిషవేత్త చెప్పారు. ‘‘అయితే దానికేం విరుగుడు లేదా’’ అని ఒక శ్రోత వుత్కంఠతో అడిగాడు. పెద్దాయన ప్రశాంతంగా నవ్వి, ‘‘లేకేం వుంది. చాలా పెద్ద పండితులు విరుగుడు చేస్తామని వచ్చారట. అయితే ఆ క్రతువు చేయడానికి పన్నెండు గంటలు పడుతుంది. చాలా దీక్షగా వుండాలి.

ఆ కాసేపు పదవి తీసి పక్కన పెట్టన్నారు. అబ్బో! పన్నెండు గంటలా, ఇంకా తక్కువలో కుదర్దా అన్నాడాయన. ఏవుంది, పన్నెండు మందితో పన్నెండు కుండాల్లో పన్నెండుమంది రుత్విక్కులతో చేయిస్తే గంటచాలు అనగానే అయితే ఇరవై నలుగుర్ని రప్పించండన్నారట చంద్రబాబు. లేదండీ యీ క్రతువు తెల్సినవారు పన్నెండుగురే వున్నారని చెప్పార్ట. ఆయన నిట్టూర్చి అయితే వద్దులెండి(మనసులో రిస్కెందుకు అనుకుని) నేనీ విధంగానే ముందుకు పోతానన్నారట!’’ అని ముగించి లేచాడు.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు