దత్తుడు గార్లెండ్స్‌ బాబ్జీ

29 Feb, 2020 00:16 IST|Sakshi

‘దత్తుడు గార్లెండ్స్‌ బాబ్జీ, బాబ్జీ గార్లెండ్స్‌ దత్తుడు’– అంటూ నానుడిలాంటి వాడుక ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారంలో ఉండేది. పెద్ద బస్తీల్లో, చిన్న నగరాల్లో చిన్న చిన్న కూటములుం టాయ్‌. వారు తమ వృత్తి వ్యాపారాల్లో కొండచిలువల్లా పెరిగిన వారై ఉంటారు. వాళ్లకి కీర్తిని కొనుక్కోవడానికి లెక్కలు చూపని చిల్లర ఉంటుంది. వారి వారి శక్త్వానుసారం అప్పుడప్పుడు సవాపావో, సవాశేరో కీర్తిని కొను క్కుని దండతో ఇంటికి వెళ్తుంటారు. దండోరా వేయించుకుంటారు. ఈ కూటమి వాళ్లకి వినసొంపైన పదవులుంటాయ్‌. అవి అజాగళస్తనాల్లాంటివి– ఇదేమరి అక్కర్లేని సొల్లు కబుర్లంటే– మొన్న ట్రంప్‌ టూర్‌ ప్రసంగాల్లాగా. ట్రంప్‌ మోదీని, మోదీని ట్రంప్‌ అడుగడుగునా దండించుకున్నారు. నగర సంకీర్తన వలె పలుచోట్ల పరస్పరం భజించుకున్నారు. ఆ పొగడ్తలకి ఇద్దరి పళ్లు పులిసిపోయి ఉంటాయ్‌. ట్రంప్‌ గాంధీ పేరు ఎత్తలేదు, మోదీ తాజ్‌మహల్‌ గుమ్మం ఎక్కలేదు.

చెల్లుకు చెల్లు ఏ అమెరికా ప్రెసిడెంటు వచ్చినా ఏవుండదు కడుపు నిండేది– మా మేనత్త పెళ్లిళ్లకి వెళ్లినట్టే! ఆ వైనం చెబుతా. ఆవిడ ఆస్తిపరురాలు. బాధ్యతలు లేవు. పెద్దతనంలో కూడా జుత్తూడక, మాట చెడక నిండుగా ఉండేది. ఒంటినిండా నగలుండేవి. వొంకుల వడ్డాణం, కాసులపేరు, ఓ చేతికి కట్టె వంకీ, ఇంకో చేతికి నాగవత్తు ఇంకా చాలినన్ని బంగారు గాజులు ఉండేవి. ముక్కుకి ఎర్రరాయి నత్తు, తలతిప్పితే అరచెయ్యంత చేమంతిబిళ్ల, అసలు సిసలు కంజీవరం పట్టు చీరెలో ఆవిడ పందిట్లో తిరుగుతుంటే దేవుడి రథం కదుల్తున్నట్టుండేది. పెళ్లికి వస్తే హీనపక్షం మూడు రోజులుండేది. పట్టు చీరెలన్నీ ప్రదర్శించేదాకా ఉండేది. ఆ రోజుల్లో అరడజనుంటే మహాగొప్ప. ఆవిడ దీవెనలు మాత్రం ఉదారంగా ఇచ్చేసి, పెళ్లివాళ్లు పెద్దరికంగా పెట్టేవి స్వీకరించి వెళ్లేది. 

అమెరికా ప్రెసిడెంటు తెల్లఏనుగు లాంటి విమానం గురించి, మందీమార్బలం గురించి, జరగాల్సిన మర్యాదల గురించి ఎన్నో కథలు వింటూనే ఉన్నాం. ఒబామా పెంపుడు కుక్కతో సహా వచ్చాడు. అత్తగారు కూడా వచ్చింది. అసలావిడ కోసమే వచ్చారని అనుకున్నారు. తాజ్‌మహల్‌ చూడాలని మదర్‌ ఇన్‌ లా అడిగిందట. అది మన దేశ పౌరులు చేసుకున్న అదృష్టం. అయినా ఎప్పుడూ అదేం దరిద్రమో తెలియదు. ఏ అమెరికా ప్రెసిడెంటు వస్తున్నాడన్నా కోట్లకు కోట్లు ధారపోసి అతి మర్యాదలు చేయడం మనకు అలవాటే. కరువులో అధిక మాసం అంటే ఇదే. అప్పుడెప్పుడో ఇవాంకా వస్తేనే భాగ్యనగరానికి రంగులు వేశాం. దానికి రిటన్‌ గిఫ్ట్‌గా కేసీఆర్‌ని పిలిచి ట్రంప్‌ షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు.

నవ్వుతూ ఆరుసార్లు చెయ్యి ఊపాడు. జగన్‌కి పిలుపు లేదు. ఇహ దానిమీద ఆయనంటే గిట్టని మీడియా కావల్సినన్ని కథనాలు అల్లింది. నా చిన్నప్పుడు ఐసన్‌హోవర్‌ రష్యానించి వస్తుంటే నెహ్రూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు ట్రంప్‌ స్వాగతానికి మోదీ కనీసం కొన్ని వందల కోట్లు ఖర్చుచేసి ఉంటారు. శివరాత్రి నుంచి శివతాండవంలా నడిచింది. మోదీకి కూడా పూనకం వస్తుందని అర్థమైంది. ఆ దేశం గొప్ప దేశమే కావచ్చు. మనదీ గొప్ప దేశమే. అంతమాత్రంచేత దాని పాలకులంతా గొప్పవారు కానక్కర్లేదు. మన దేశాన్ని ఎందరు నికృష్టులు పాలించలేదు. పద్ధతులు పాటించవచ్చుగానీ మరీ అతి అవసరం లేదు.

సబర్మతి ఆశ్రమంలో ఎన్నో రకాలు ఎంతో వ్యయంతో, శ్రమతో చేయించిన ఉపాహారాలను ట్రంప్‌ ముట్టనే లేదు. దారిలో ప్రాకృతిక వాతావరణంలో పచ్చని చెట్టుకింద కావాల్సినన్ని మాంసాహారాలు వండి వడ్డించాల్సింది. ట్రంప్‌ రాబోతున్న ఎన్నికల దృష్ట్యా వచ్చాడని అందరికీ తెలుసు. మోదీ గాంధీల రాష్ట్రం తనకి బాసటగా ఉంటుందని ట్రంప్‌ ఆశ. సువీ అంటే రోకలిపోటని తెలియందెవరికి. ఆయన మళ్లీ త్వరలోనే వస్తారు. మళ్లీ పొగడ్తలుంటాయ్‌ కాకపోతే కొత్తవి. కానీ మహాశయా! ఈసారి తప్పనిసరిగా జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించండి. తెలుగువారు కూడా మీ జాతకం తేల్చగలవారే. ఎందుకైనా మంచిది చంద్రబాబుని కూడా పిలవండి. ఆయనగానీ ఒక్క వీల వేస్తే......
వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు

>
మరిన్ని వార్తలు