మార్కెట్లో ‘సంక్షేమ’ డబ్బు

1 Mar, 2020 02:06 IST|Sakshi

ఆర్థిక మాంద్యం భయపెడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లోకి ‘సంక్షేమ’ డబ్బు వచ్చింది. పేద, మధ్య తరగతి వర్గాల చేతుల్లోకి చేరిన ప్రభుత్వ డబ్బు తిరిగి మార్కెట్లో తిరుగుతోంది. ప్రస్తుతం ఈ డబ్బే రాష్ట్ర మార్కెట్‌ను ఆదుకుందని స్పష్టంగా చెప్పొచ్చు. ఇది కళ్ళకు కనిపించే వాస్తవం. ఉపాధి పనులు కొరవడుతూ, ఉద్యోగ అవకాశాలు కనుమరుగవుతున్న కీలకమైన దశలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ‘సంక్షేమ’ పథకాల పేరుతో లబ్ధిదారులకు డబ్బులు అందజేసింది. ‘అమ్మఒడి’, ‘రైతుబంధు’, ‘వాహనమిత్ర’ తాజాగా ‘వసతి దీవెన’ వంటి పథకాల డబ్బు లబ్ధిదారుల చేతుల్లో నుంచి కుటుంబ అవసరాల రూపంలో మార్కెట్లోకి చేరుకుంది. ఈ డబ్బే మార్కెట్లో ఒకరి చేతుల్లో నుంచి మరొకరి చేతుల్లోకి మారుతుంది. ఈ డబ్బే లబ్ధిదారుల కుటుంబాల్లో వెలుగు తీసుకురావడమే కాక ప్రస్తుతం ఏపీ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించిందనేది అక్షర సత్యం.

గత ఐదేళ్ళుగా అవి నీతి రూపంలో కొందరు అనకొండలనే వరించిన ‘లక్ష్మీదేవి’, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ద్వారా ఇప్పుడు పేద, మధ్య తరగతి వర్గాలను వరించింది. ఈ వర్గాల వద్దకు చేరుకున్న ‘సంక్షేమ డబ్బు’ వారి కుటుంబ అవసరాలు తీరుస్తూనే ఆర్థిక వ్యవస్థకూ జీవం పోయడం ఆరోగ్యకర పరిణామమనే చెప్పాలి. అమ్మఒడి పథకం ద్వారా రూ. 15 వేలు తల్లుల బ్యాంకు అకౌంట్లలో జమచేసింది ఏపీ ప్రభుత్వం. రైతు భరోసా పథకం ద్వారా రూ. 7,500 విడతల వారీగా అందజేశారు. కేంద్ర ప్రభుత్వం మరో రూ. 6 వేలు సహాయం అందించింది. ఇక వాహనమిత్ర పథకం ద్వారా ఆటోవాలాలకు రూ. 10 వేలు జమచేశారు. ఇంకా సామాజిక భద్రత కింద పింఛన్లు, జూనియర్‌ న్యాయవాదులకు రూ. 5 వేలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పలు పథకాలకు డబ్బులు లబ్ధిదారులు అందుకుంటున్నారు. ప్రతీ ఏటా 30 వేల కోట్ల రూపాయలు కేవలం ఒక్క సంక్షేమ పథకాలకే అవసరముంటుందని ప్రభుత్వ ఆర్థికశాఖ లెక్కల అంచనా.

అంటే ఐదేళ్ళలో రూ. 1.50 లక్షల కోట్లు లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేయాల్సి ఉంది. అవినీతి అనకొండల వద్ద నల్లడబ్బుగా మూలిగేకన్నా ఇలా సంక్షేమ పథకాల డబ్బు మార్కెట్లోకి రావడం ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే మొత్తం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేకపోవచ్చు. కానీ గత ఐదేళ్ళుగా వ్యాపారాలు నడవక, రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైన నేపథ్యంలో సంక్షేమ పథకాల డబ్బు మార్కెట్‌కు ఊపిరిపోసింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో రాష్ట్ర మార్కెట్‌కు పేద, మధ్య తరగతి వర్గాల డబ్బు ఉపయోగపడుతుండటం, రొటేషన్‌కు ఆసరాగా ఆదుకోవడం శుభపరిణామమే.
వై. శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్టు, విజయవాడ ‘ 87902 30395 

మరిన్ని వార్తలు