నా కన్నీళ్ళే నా సాహిత్యం..!

6 Jul, 2018 01:18 IST|Sakshi
కొలకలూరి ఇనాక్‌ (ఫైల్‌ ఫోటో)

ఎస్‌.కె. యూనివర్సిటీ తెలుగు విభాగంలో 1983–85 మధ్య పాఠాలు చెప్పిన ప్రొఫెసర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టులో నిష్ణాతులు. వీరిలో నాకు అత్యంత ఇష్టమైన వాళ్లలో ఒకరు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, మరొకరు కొలకలూరి ఇనాక్‌ సార్లు. రచనా పథంలో ఇద్దరివీ రెండు వేర్వేరు దార్లు. కానీ వీరిద్దరూ సమాజ రచయితలు. అభ్యుదయ రహదార్లు. మా ఇనాక్‌సారు మాట్లాడుతుంటే ఆధునిక వచన కావ్యాన్ని వింటున్నట్లుగా ఉండేది. ఆయన వచనం అద్భుతం. ఆయన రాసినా, మాట్లాడినా, చదివినా ఆలోచనాత్మకంగా ఉంటుంది.

ఆయన పాఠం చెబుతున్నప్పుడు ధారాళంగా వచనాన్ని ప్రయోగించి పిల్లల్ని సమ్మోహనులుగా చేసేవారు. ‘మునివాహనుడు’ అన్న నాటకం దగ్గర్నుంచి ‘ఊరబావి’ క«థల వరకు ఆయన రచనలు జీవితం నుంచి వచ్చినవి. అట్టడుగు కులాలపై, అందునా కింది కులాలైన మాల, మాదిగల పట్ల అగ్రవర్ణ దురహంకారాలు, అంటరానితనాలు, అవమానాలు, ఆధిపత్యాలు, వెలివేతల నుంచి, వెలివాడల నుంచి నడుచుకుంటూ తెలుగు సాహిత్య విశ్వపీఠం మీదకు వచ్చారు. అట్టడుగు వర్గాల జీవితం ఎన్ని బాధలు పెడు తుందో ఆ బాధలన్నింటిని అనుభవించి కొలకలూరి ఒక క«థగా, కవి తగా, పద్యంగా, పాటగా, నాటకంగా రచనలయ్యారు. అగ్రవర్ణ ఆధిపత్యంపై కొలకలూరి ఎక్కుపెట్టిన సాహిత్య మహాస్త్రమే ‘ఊరబావి’. 

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌గా ఎంతో కాలం పనిచేశారు. తిరుపతి ఎస్‌.వి.యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ, పద్మశ్రీ లాంటివి ఎన్నో అవార్డులు పొందారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో దళిత బహుజన ప్రతిఘటనకు సంబంధించిన తొలి సాహిత్య ఆనవాళ్లు ఇనాక్‌ సాహిత్యంలో ఉన్నాయి. అప్పటి వరకు వచ్చిన సాహిత్యంలో దళిత జీవిత చిత్రణ మాత్రమే చేశారు. ‘ఊరబావి’ కథలో దళిత ప్రతిఘటనను చెప్పిన తొలిదళిత సాహితీవేత్త ఇనాక్‌. ‘ఊరబావి’ క«థలన్నీ ప్రతిఘటనా ప్రతి రూపాలుగా నిలుస్తాయి. ఆ ప్రతిఘటనాస్వరాన్ని తర్వాత దళిత సాహిత్యం అందిపుచ్చుకుంది. 

ఇనాక్‌ 1954లో ‘ఉత్తరం’ అన్న దళిత కథతో రచనా రంగంలోకి ప్రవేశించారు. 1969లో ‘ఊరబావి’ క«థలు రాశారు.  ‘నా కన్నీళ్లే నా సాహిత్యం’ అని చెప్పుకున్న ఇనాక్‌ ‘ఈ సమాజం భయం పునాదిపై నిర్మించబడింది. దీన్ని కూల్చివేసి భయంలేని సమాజాన్ని నిర్మించుకోవాలి’ అని చెబుతారు. ఇప్పటికి ఇనాక్‌ 96 పుస్తకాలు, 300 క«థలు రాశారు. దళితులు, గిరిజనులు, బహుజనులు, ముస్లిం మైనార్టీలు, సమాజంలో సగభాగమైన మహిళల చుట్టూతా ఇనాక్‌ రచనలు నిండి ఉంటాయి. ఈయన రచనల్లో ఆధిపత్య శక్తులపై నేరుగా దాడులు చేసినట్లుగా ఉండదు. బహుజనుల విజయం కోరతాడు. వీళ్లు గెలవాలంటారు. ఇనాక్‌ ఏ రచనలో కూడా పీడిత వర్గాలు ఓడిపోవటం చెప్పడు.

దళిత, బహుజన, గిరిజన, మైనార్టీలు ఓటమిలో కూడా తలెత్తుకొని తిరుగగలిగే ధైర్యాన్నిస్తూ సాహిత్యసృష్టి చేశారు. 64 ఏళ్ల క్రితం తొలికథ ‘ఉత్తరం’లో ఇనాక్‌ కన్నీళ్లతో సమాజాన్ని చూశారు. ఇపుడు ఆ కన్నీళ్లు ఆరి పోయి చూసే క్రొత్త సమాజం రాబోతుంది. ఇపుడు దళిత, బహుజన, గిరిజన, మైనార్టీ, మహిళా సాహిత్యంలో ఒక్క ఇనాక్‌ లేడు. వందల మంది ఇనాక్‌లున్నారు. ఇది పెద్దమార్పు. ఇనాక్‌ ఆధునిక ఆది దళిత బహుజన ప్రతిఘటనా స్వరం. ఆయన బహుజన పక్షంవైపు స్పష్టంగా నిలబడి సాహిత్య విమర్శచేశారు. కథలు రాశారు. కవిత్వం రాశారు. తన కన్నీళ్లనే తన కావ్యాలుగా ఆవిష్కరించిన దళిత బహుజన సాహిత్యశిఖరం కొలకలూరి ఇనాక్‌. ఇనాక్‌సారూ, నువ్వు నూరేళ్లూ జీవించూ..

(కొలకలూరి ఇనాక్‌ 80వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని త్యాగరాయగానసభలో ఈ నెల 6 నుంచి 12 వరకు రోజూ సాయంత్రం 6 గంటలకు సాహితీ సప్తాహం సందర్భంగా)
జూలూరు గౌరీశంకర్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు ‘ 94401 69896
 

మరిన్ని వార్తలు