పటేల్‌ చాటున పండిట్‌జీపై నింద

13 Feb, 2018 04:13 IST|Sakshi
గాంధీజీతో నెహ్రూ, పటేల్‌ సమాలోచన (ఫైల్‌ ఫొటో)

రెండో మాట

మోదీ తలపెట్టిన మరొక ప్రచారం– ‘పదిహేను కాంగ్రెస్‌ కమిటీలలో పన్నెండు ప్రధాని అభ్యర్థిత్వానికి పటేల్‌కు ఓటు వేయడం’. ఆధారాలేమిటో చెప్పకుండానే ఆయన ఈ వాదనను ముందుకు తెచ్చారు. అంటే పటేల్‌కు మెజారిటీ ఉన్నా, ఆయన్ను పక్కన పెట్టారన్నది మోదీ ఆరోపణ. కానీ గాంధీజీని గాడ్సే పొట్టన పెట్టుకున్న తరువాత కూడా నెహ్రూ, పటేల్‌ పొరపొచ్చాలు లేకుండానే సాగారు. 565 స్వదేశీ సంస్థానాలను ఇండియన్‌ యూనియన్‌లో అంతర్భాగం చేసేదాకా ఆ ఇరువురు కూడా సంయుక్తంగా శ్రమించినవారే!

‘స్వాతంత్య్రం వచ్చాక ఆనాటికి ఉన్న పదిహేను కాంగ్రెస్‌ కమిటీలలో పన్నెండు సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ను ప్రధానిని చేయాలంటూ ఓటు వేశాయి. కానీ పటేల్‌ను పక్కన పెట్టి పండిట్‌ నెహ్రూకు పగ్గాలు కట్టబెట్టిన విషయాన్ని మరువరాదు. పటేల్‌ ప్రధాని అయి ఉంటే కశ్మీర్‌ సమస్య ఉండేది కాదు. రాజకీయ స్వలాభం కోసమే కాంగ్రెస్‌ దేశాన్ని ముక్కలు చేసింది.’ – ప్రధాని నరేంద్ర మోదీ (5–2–2018 నాటి పార్లమెంట్‌ ప్రసంగం నుంచి)

‘తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ రాటు తేలిన, అపార అనుభవం కలిగిన స్వాతంత్య్ర సమరయోధుడు. దేశ మహా నాయకులలో ఒకరు. దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నీ, స్వతంత్ర న్యాయ వ్యవస్థనీ, సచేతనమైన పత్రికా వ్యవస్థనూ ప్రసాదించిన నేత నెహ్రూ.’ – మోదీ మంత్రిమండలిలో హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (2015 నవంబర్‌లో సింగ్‌ చేసిన ఈ ప్రసంగం వీడియోను 9–2–18న రాహుల్‌ విడుదల చేశారు)

పార్లమెంట్‌ సహా, వివిధ వేదికల నుంచి నరేంద్ర మోదీ ఇటీవల పండిట్‌ నెహ్రూ మీద చేస్తున్న ఆరోపణలు, వ్యాఖ్యానాలు గుడ్డొచ్చి పిల్లను వెక్కిరిం చిన రీతిలోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే గుడ్డెద్దు చేలో పడిన చందంగా ఉంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ‘దేశాభ్యుదయం’ కంటే; కాంగ్రెస్‌నూ, ఆ పార్టీ పూర్వ నాయకులనూ, వారితో పాటు కొందరు స్వాతంత్య్ర యోధులనూ ఆడిపోసుకోవడం బీజేపీ–పరివార్‌ ప్రధానికి పరిపాటైంది.

అందరితో పాటు కాంగ్రెస్‌
భారత జాతీయ కాంగ్రెస్‌లో ఎన్ని తప్పులు కనిపించినా, అది దేశ స్వాతంత్య్రం కోసం గాంధీజీ నాయకత్వంలో పనిచేసిన అగ్రగామి దళం. గాంధీ నాయకత్వంలో ఒక్కతాటిపైకి వచ్చి కడదాకా పనిచేసిన వారు నెహ్రూ, పటేల్‌. ఉద్యమ నిర్వహణ, ఉధృతి సమయాలలో నాయకులలో అభిప్రాయభేదాలు సహజం. వీటిని మాత్రమే ఆసరా చేసుకుని, కాంగ్రెస్‌ దేశాన్ని ముక్కలు చేసిందనీ, అందుకే కాంగ్రెస్‌ నుంచి భారత్‌కు విముక్తి కల్పించాలనీ మోదీ అనడంలో ఔచిత్యం లేదు. పైగా గాంధీజీయే కోరుకున్నారనీ, ఆయన మాటనే తాను ఉటంకించాననీ, ఇది కొత్త మాటేమీ కాదనీ ఆయన సమర్థించుకోజూస్తున్నారు. జాతీయ కాంగ్రెస్‌ అగ్రదళంగా భారత్‌ స్వాతంత్య్రం సాధించింది. కానీ విభిన్న సిద్ధాంతాలకు, పాయలకు చెందిన పక్షాలు కూడా తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాయి. అందుకే తొలినాటి స్వతంత్ర భారతదేశానికి ఆ శక్తులన్నింటితో కూడిన జాతీయ ప్రభుత్వం ఏర్పాటు కావాలని గాంధీజీ అభిలషించిన సంగతిని మోదీ విస్మరించడమూ సరికాదు. ఇలాంటి దృష్టితో పాటు, కాంగ్రెస్‌ నిర్వహించిన చరిత్రాత్మక పాత్రకు గుర్తింపుగా, ఆ సంస్థ నేతృత్వంలోనే ఒక ఉమ్మడి పాలనా వ్యవస్థ ఆవిర్భవించాలని గాంధీజీ ఆశించారు. అంతేగానీ, మోదీ వక్రీకరించినట్టు కాంగ్రెస్‌ నుంచి భారత్‌కు విముక్తి కలగాలన్న వ్యతిరేక భావన గాంధీ ఉద్దేశం కాదు.

గాంధీజీయే కాదు, ఆనాటి నేతలు, మేధావులు ఊహించని మరొక పరి ణామం ఉంది. అలనాటి కాంగ్రెస్, కాంగ్రెస్‌–యూపీఏల హయాములలోనే గాంధీజీ ఆశయాలకు తూట్లు పడినాయి. గాంధీజీ హత్యానంతరం కొత్త వేషంతో, హిందూరాష్ట్ర బ్యానర్లతో దూసుకొచ్చి, కాలక్రమేణా ఢిల్లీ అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ–ఆరెస్సెస్‌–పరివార్‌ కూడా గాంధీ ఆశయాలకు భంగం వాటిల్ల చేసినదే. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తికి భిన్నంగా, తరువాత రాసుకున్న రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా పాలనా వ్యవస్థను ఆ రెండు పార్టీలూ, వాటి కూటములూ కూడా మార్చేశాయి. ‘బహుజన హితాయ’ అన్న హితోక్తిని ‘బడావర్గాల హితాయ’గా వికృతం చేశాయి. మోదీ తలపెట్టిన మరొక ప్రచారం– ‘పదిహేను కాంగ్రెస్‌ కమిటీలలో పన్నెండు ప్రధాని అభ్యర్థిత్వానికి పటేల్‌కు ఓటు వేయడం’. ఆధారాలేమిటో చెప్పకుండానే ఆయన ఈ వాదనను ముందుకు తెచ్చారు. అంటే పటేల్‌కు మెజారిటీ ఉన్నా, ఆయన్ను పక్కన పెట్టారన్నది మోదీ ఆరోపణ. కానీ గాంధీజీని ఆరెస్సెస్‌–హిందూ మహాసభ కార్యకర్త గాడ్సే పొట్టన పెట్టుకున్న తరువాత కూడా నెహ్రూ, పటేల్‌ పొరపొచ్చాలు లేకుండానే సాగారు. 565 స్వదేశీ సంస్థానాలను రద్దు చేసి ఇండియన్‌ యూనియన్‌లో అంతర్భాగం చేసేదాకా ఆ ఇరువురు కూడా సంయుక్తంగా శ్రమించినవారే! మోదీ అర్ధంతరంగా వచ్చి ఈ చరిత్రను తుడిచివేద్దామనుకుంటే చెల్లదు. ‘నెహ్రూ కోసం పటేల్‌ను కాదని పక్కన పెట్టా ర’న్న మోదీ చెబుతున్న వ్యాఖ్య ఎవరో చేసింది కాదు. గాంధీ జయంతికి ఇండోర్‌లో జరిగిన బహిరంగ సభలో సర్దార్‌ పటేల్‌ స్వయంగా చెప్పిందే: ‘మాకు నాయకుడు పండిట్‌ నెహ్రూ. గాంధీజీ నెహ్రూను తన వారసుడిగా ప్రకటించారు. బాపు సైనికదళంగా ఆయన ఆదేశాన్ని పాటించడం మా ధర్మం. ఆ భావంతో గాంధీజీ ఆదేశాన్ని ఎవరు మనఃపూర్వకంగా పాటించరో వారంతా దేవుడి ముందు పాపం చేసిన వారవుతారు. నేను బాపూ సైనికుణ్ణి’ (ఇండోర్‌: 2.10.1950 : ప్యారెలాల్‌ ‘మహాత్మా: ది లాస్ట్‌ ఫేజ్‌’) అన్నారాయన.

కశ్మీర్‌ విభజనానంతర సమస్య
పటేల్‌నే ప్రధానమంత్రిగా ప్రకటించి ఉంటే కశ్మీర్‌ సమస్యే ఉత్పన్నమయ్యేది కాదని కూడా మోదీ భాష్యం చెప్పారు. తన విధానాలతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడల్లా మోదీ వారి దృష్టి నుంచి మళ్లించేందుకు ఇలాంటి ‘దారి మళ్లింపు’ ప్రకటనలు చేస్తూంటారు. కశ్మీర్‌ సమస్య విభజనానంతర భారతంలో సంస్థానాల విలీనీకరణతో ముడిపడిన సమస్య. హిందువులు మెజారిటీగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేస్తున్నప్పుడు ముస్లింలు మెజారిటీగా ఉన్న సంస్థానాలను పాకిస్తాన్‌లో కలపాలా, లేదా భారత యూనియన్‌లోనే ఉంచాలా అన్న సమస్య ఉత్పన్నమయింది. ఆ సమయంలో హిందువులు మెజారిటీగా ఉన్న జునాఘడ్, హైదరాబాద్‌లను భారత యూనియన్‌లో విలీనం కావడానికి పాకిస్తాన్‌ ఒప్పుకుంటే, కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు ఇచ్చేయడానికి హోంమంత్రి పటేల్‌ ఒప్పుదలయ్యారు డిస్ట్రక్షన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌: ఏజీ నూరాని పే: 160 (2013). జునాఘడ్, హైదరాబాద్‌లు భారత యూనియన్‌లో విలీనమైనా ముస్లిం మెజారిటీతో ఉన్న కశ్మీర్‌ ఎటూ కాకుండానే ఉండిపోయింది. 70 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య సమస్యగానే మిగిలి ఉంది. తన ఈ ప్రతిపాదనను పాకిస్తాన్‌ ‘దురదృష్టవశాత్తు’ ఆమోదించలేదనీ, ఫలితంగా జునాఘడ్, హైదరాబాద్, కశ్మీర్‌లనే గాక, తూర్పు పాకిస్తాన్‌ను కూడా కోల్పోయిందని పటేల్‌ అన్నారు.

మోదీ భావిస్తున్నట్టు పటేల్‌ ప్రధాని అయినా, కశ్మీర్‌ కాష్టం తొలిగేది కాదు. కశ్మీర్‌ ప్రజల బాధలు అనంతం. బ్రిటిష్‌ అధికారులు రకరకాల సంధుల ద్వారా (లాహోర్‌–అమృత్‌సర్‌ సంధి 1846 మార్చి 9–11) బ్రిటిష్‌ సామంత ప్రాంతంగా ఏలుతూ ఉన్న గులాబ్‌సింగ్‌ను, సిక్కులను మోసగించి ఒకటిన్నర కోట్ల రూపాయలకు ఈస్టిండియా కంపెనీకి ధారాదత్తం చేశారు. అమృత్‌సర్‌ సంధి ద్వారానే బ్రిటిష్‌ వాళ్లు బియాస్, సింధు నదుల మధ్య కశ్మీర్, హజారా ప్రాంతాలనూ అమ్మేశారు. వారానికి రూ. 75 లక్షల పరి హారం చూపించి కులూ, మనాలీ ప్రాంతాలను కూడా కంపెనీ స్వాహా చేసింది. అలా బ్రిటిష్‌ కుట్రల ద్వారా ఏర్పడిందే జమ్మూ–కశ్మీర్‌. గాంధీజీ (1947 ఆగస్టు) శ్రీనగర్‌లో పర్యటించిన తర్వాత ఒక చారిత్రిక సత్యాన్ని ప్రకటించారు: ‘‘నా పర్యటనానుభవంలో తేలింది– కశ్మీర్‌–జమ్మూలలో కశ్మీరీల మనోవాంఛ మాత్రమే అంతిమ శాసనంగా ఉండాలని చెప్పడానికి నేను సంకోచించడం లేదు. ఈ వాస్తవాన్ని ప్రస్తుత హిందూ మహారాజూ, మహారాణీ కూడా గుర్తించి, అంగీకరించారు. అమృత్‌సర్‌ సంధి అనేది కశ్మీర్‌ను అమ్మేసిన విక్రయ దస్తావేజు...’’. అలాగే, తాను హత్యకు గురి కావడానికి నెల ముందు ఢిల్లీలో ప్రార్థనా సమావేశంలో (1947 నవంబర్‌ 27న) గాంధీజీ మాట్లాడుతూ జమ్మూలోని హిందూ మైనారిటీ ప్రభుత్వ పాలనలో పెద్ద ఎత్తున అత్యాచారాలు జరగడానికి కారణం ఎవరో కాదు, మహారాజా హరిసింగ్‌ను బాధ్యుడిగా ప్రకటించారు (1947 డిసెంబర్‌ 25). అంతేగాదు, గాంధీజీ తన ఆరోపణను విశదీకరించే క్రమంలో ‘‘మహారాజా హరిసింగ్‌ తానిక ఎంత మాత్రమూ కశ్మీర్‌ పాలకుడ్ని కాననీ, కశ్మీర్‌ నిజమైన పాలకులు కశ్మీర్‌ ముస్లిం ప్రజలేనని వారికి నచ్చిన పద్ధతిలో కశ్మీర్‌ను పరిపాలించుకోవచ్చుననీ తనకు తానై హరిసింగ్‌ ప్రకటించాలని’’ 1947 డిసెంబర్‌ 25న గాంధీజీ అభిప్రాయపడ్డారని చరిత్రకారుడు, రాజ్యాంగ నిపుణుడు నూరానీ తన గ్రంథంలో నమోదు చేశారు.

నిజాం సంస్థానం విలీనంలోనూ...
హైదరాబాద్‌ సంస్థాన విమోచనకు పటేల్‌ ‘ఆపరేషన్‌ పోలో’ పేరిట ప్రారంభించిన సైనిక చర్య సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంధానకర్తగా పనిచేసిన కె. ఎం. మున్షీ పటేల్‌ కనుసన్నల్లో ఉన్నవారే. నాటి హైదరాబాద్‌ స్టేట్‌లో పటేల్‌ పంపిన యూనియన్‌ సైన్యం ప్రారంభించిన సైనిక చర్యల్లో ఘటిల్లిన పరిణామాల గురించి, ఆ గందరగోళాన్ని అవకాశంగా తీసుకుని మున్షీ హైదరాబాద్‌లోని బొల్లారం కేంద్రంగా ‘ఉండంతలు కొండంతలు’గా చిత్రించి నివేదికలు పంపడానికి కారణం, వాటిని పటేల్‌ నమ్మడానికి మూలం–మున్షీ, పటేల్‌ పూర్వరంగం ఆరెస్సెస్‌తో ఉన్న సంబంధాలేనని, పటేల్‌ మెతకతనానికి ఇదే కారణమని నూరానీ (అదే గ్రంథం: పే. 179) రాశాడు. గాంధీజీ హత్యకు ఆరెస్సెస్‌పైన నిషేధం విధించినా, క్రమంగా ఒత్తిళ్ల ఫలితంగా రద్దు చేసింది కూడా పటేల్‌ అని విస్మరించరాదు. పటేల్‌ను గాంధీ దేశ ప్రధానిని చేయకపోయినా, పటేల్‌ ఉప ప్రధానిగానే ఉన్నా హైదరాబాద్‌ విమోచన సందర్భంగా క్షేత్ర స్థాయిలో జరిగిన అనేక దుర్ఘనలపై విచారించిన కాంగ్రెస్‌ ప్రతినిధులు పద్మజానాయుడు (సరోజినీ నాయుడు కూతురు), ఖాజీ మహ్మద్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌లు సమర్పించిన నివేదికలను పరిశీలించవలసిం దిగా ప్రధాని నెహ్రూ కోరినా, పటేల్‌ తోసి పుచ్చడమూ ఆనాడొక సంచలనంగా మారింది. ప్రధానమంత్రి కాకపోయినా నెహ్రూ క్యాబినెట్‌లో పటేల్‌ ‘ప్రధాని’గానే చెలామణి అవుతూ ప్రజల దృష్టికి రాని ‘బేఖాతరు’తనాన్ని చెలాయించుకుంటూనే వచ్చారని గమనించాలి. పైగా, గాంధీజీ హత్యానంతరం దేశ వ్యాప్తంగా ఆరెస్సెస్‌ వారు ఆనందంతో స్వీట్లు పంచడంతో ప్రతిపక్షాలు మరింత రెచ్చిపోయిన సందర్భంగా ఆరెస్సెస్‌పైన నిషేధం విధించక తప్పలేదని కూడా ఆరెస్సెస్‌ నేత గోల్వాల్కర్‌కు రాసిన లేఖలో పటేల్‌ (11.9.1948) హెచ్చరించవలసి వచ్చింది. ఈ లేఖ ఉద్దేశం ఆరెస్సెస్‌లో పునరాలోచన కోసం, హృదయ పరివర్తన కోసమేనని పటేల్‌ రాయడం గమనార్హం. మోదీ ఎంత ప్రయత్నించినా చారిత్రక ఆధారాలను మూసివేయలేరు, నిజాల్ని దాచలేరు.


- ఏబీకే ప్రసాద్‌

సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

>
మరిన్ని వార్తలు